S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యార్థి ప్రకాశం

ప్రకాశం పంతులుగారి జీవితమే ఒక అద్భుతం. అనేకమైన సాహస ఘట్టాలతో చిత్ర విచిత్ర మలుపులతో కూడినది. ఆయన సహజగుణాలైన ధైర్యం, సాహసం, నిర్లక్షణ చిన్నతనం నుంచే కనపడ్డాయి. చాలాసార్లు ప్రాణాపాయ స్థితులలో అదృశ్య హస్తం ఆయన వెంట ఉండి కాపాడింది. దానినే విధి, కాలం , అదృష్టం, దైవ నిర్ణయం అంటారేమో.

ప్రకాశంగారికి ఓనమాలు ఒంగోలుకు దగ్గరలోని వల్లూరులో దిద్దించబడ్డాయి. వారి తాత ముత్తాతలు వల్లూరులో నివాసముండేవారు. ఆ రోజులలో వెంకటప్పయ్యగా వీధిబడి వల్లూరులో నడుపుతూ ఉండేవారు. ఆయనంటే అందరకీ భయం. ఎందుకంటే ఆయన పాఠం ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణతో చెప్పేవాడు కానీ సరిగా చదవకపోతే అంతకంటె ఎంతో కఠినంగా శిక్షలు వేసేవాడు. తొడపాశం పెట్టడం ఆయన ప్రత్యేకత. బాల ప్రకాశానికి చాలాసార్లు తొడపాశం పెట్టాడట. ప్రకాశంగారిని కాళ్లు చేతులు కట్టేసి బడిలో పడేసినా, తప్పించుకొని ఇంటికి చేరేవాడట మన అల్లరి ప్రకాశం. విచిత్రమేమిటంటే, అంతటి వెంకటప్పయ్య ఊరు మొత్తాన్ని హడలుకొట్టిన మాస్టారు మన ప్రకాశంగారితో అష్టకష్టాలు పడ్డాడు. తన ఐదవ ఆరవ ఏట ఆ పంతులుగారు వేసిన గట్టి పునాదే తనను ఇంతటివాడిని చేసింది అని తన ‘నా జీవిత యాత్ర’ స్వీయ చరిత్రలో రాసుకున్నారు ప్రకాశంగారు.
ప్రకాశంగారి తండ్రిగారు చనిపోవడంతో అమ్మ సుబ్బమ్మ అష్టకష్టాలు పడి, కటిక పేదరికం అనుభవించారు. సుబ్బమ్మగారు తన సోదరుల ఇళ్లల్లో ఉండటానికి అభిమానం అడ్డొచ్చి, బంధువులు, స్నేహితులు వారించినా గుండె నిబ్బరంతో చిన్నపిల్లలను తీసుకొని ఒంగోలు పట్టణానికి చేరింది. భర్త ఆశయం - పిల్లలకు ఇంగ్లీష్ చదువులు. పెద్ద చదువులు చెప్పించడం. ఆ మహాతల్లి తనకు సహజంగా వచ్చిన కమ్మని వంట చేయడాన్ని తన ఉపాధిగా ఎంచుకొని, కోర్టు సెంటర్‌లో కోర్టుకు ఎదురుగా ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ‘పూటకూళ్లు’ నిర్వహించింది. ఆ రోజులలో ఈ వృత్తిని అంత మర్యాదగా, పరువుగల వృత్తిగా చూసేవారు కాదు ప్రజలు. కాని ఆ ఇల్లాలి కష్టాలు, పట్టుదల, స్వాభిమానం, మంచితనం, అన్నింటికంటే మించి కమ్మటి వంట, ఆప్యాయతతో నిండిన వడ్డన ఆ చుట్టుపక్కల జనాల గౌరవ మర్యాదలను వశం చేసుకోగలిగింది.
ఒంగోలులో మునుసబు కోర్టు ఎదురుగా చేరడం ప్రకాశం జీవితంలో మరో చిత్రమైన కాదు చారిత్రాత్మక మలుపు అనవచ్చు. రోజూ చిన్న ప్రకాశం కోర్టులో లాయర్లు నల్లని పొడవైన కోట్లు వేసుకొని ఠీవిగా నడవడం చూసి తను కూడా పెద్దయిన తరువాత ప్లీడరు కావాలన్న కోరిక తన మనసులో నాటుకుపోయింది. ఆ కోర్కెను తీర్చడానికి కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తూ, పట్టుదలతో, దక్షత దీక్షలతో ‘లా’ చదివి ప్లీడరై ఆంధ్ర దేశానికే కాక భారతావని అగ్రగణ్యులకు నిలిచాడు. ఆ తల్లి పరవశించిపోయింది. ‘ఆంధ్ర కేసరి’ లాంటి ఆణిముత్యాన్ని భరతమాతకు అందించిన ఘనత తల్లి సుబ్బమ్మగారిదే.
ఈ కవిత చాలు ప్రకాశం జీవితానికి నిలువుటద్దం అనడానికి. ఆయన ప్రతిష్ఠను ఆవిష్కరించడానికి.
పుట్టు పేద పట్టుదలతో
గుండెదిటువే పెట్టుబడిగా
పెరిగి పెరిగి పెద్దల పెద్దయై
మహేంద్ర భోగాలను భరించి
మహాంధ్ర నాయక మణియై
దేశదాస్య విమోచన యజ్ఞంలో
తన సర్వస్వం ఆహుతి గావించి
భారత స్వాతంత్య్ర మహాసమరంలో
ఆంధ్రుల నొక్కతాటిపై నడిపించిన
ఆంధ్ర కేసరి ప్రకాశం.
-నా జీవిత యాత్ర
అల్లరిలో అగ్రతాంబూలం ప్రకాశంకే ఇవ్వాలి. క్లాసు పిల్లల దగ్గర నుండి పుస్తకాలు లాక్కొని చింపేసేవాడు. పలకలు పగలగొట్టేవాడు. ఒకసారి తన పుస్తకాన్ని వేరే విద్యార్థి చింపేస్తే పుస్తకం లేకుండా బడికి వచ్చిన ప్రకాశాన్ని టీచర్ శిక్షించడానికి బెత్తం తీసి చేయి చాపమన్నాడు. ప్రకాశం ‘మాస్టారూ నాకా పుస్తకంతో పనిలేదు. దాంట్లో పాఠాలు నాకు కంఠస్థం’ అన్నాడు.
వెంటనే ఆ టీచర్ కోపంతో ‘్ఫలానా పద్యం చెప్పరా?’ అని గర్జించాడు. ప్రకాశం ఆ పద్యాన్ని తు.చ తప్పకుండా అప్పజెప్పేసరికి ఆశ్చర్యచకితుడై ప్రకాశం ప్రశంసించాడు. తరువాతి కాలంలో ఆయన గురువైనందుకు గర్వపడ్డాడా మాస్టారు. అంతటి చురుకుదనం, చదువు మీద శ్రద్ధ ఉంది ప్రకాశానికి. ఎంత అల్లరిచిల్లరిగా తిరిగినా, తగాదాలలో ఇరుక్కు పోయినా, పోలీసు కేసులలో, క్రిమినల్ కేసులలో ఇరుక్కున్నా చక్కగా చిక్కగా రాముడు మంచి బాలుడులా ఉండేవాడు. తన పట్టుదలకి, తల్లి సుబ్బమ్మగారి ప్రేమానురాగాలకి, ప్రకాశం మీద నమ్మకానికి పరాకాష్ట ఈ చారిత్రాత్మక స్కూల్ ఫీజు సంఘటన. మిడిల్ స్కూల్ ఫీజు ఆ రోజులలో మూడు రూపాయలు. అవి కూడా లేని బీద పరిస్థితి. తన మామగారి దగ్గర దొరుకుతాయేమోనని రాత్రికి రాత్రి ఒంగోలు నుంచి అద్దంకికి కాలినడకన వెళ్లాడు. 13-14 ఏళ్ల వయసులో. ఫీజు దొరకలేదు. మళ్లీ 20 మైళ్లు నడుచుకుంటూ ఒంగోలు వచ్చి తల్లిగారితో చెప్పాడు. ఆయన చదువుకోవాలనే తపస్సు ఆపాటిది. అమ్మ మనసు తల్లడిల్లింది. తన దగ్గర ఉన్న ఒకే ఒక పెళ్లినాటి పట్టుచీర తాకట్టు పెట్టి మూడు రూపాయల ఫీజు కట్టింది ఆ మహాతల్లి. ఇది ఆంధ్రకేసరికి దైవిక ప్రేరణ. బారిస్టర్ చదవడానికి మొదటి మెట్టు.
పంతులుగారి జీవితంలో మరో అద్భుత సంఘటన. తన ఆజన్మాంతం రుణపడవలసిన మరువలేని మలుపు. మరో మాటలో చెప్పాలంటే ‘కలిసొచ్చిన అదృష్టం’. ఒంగోలులో చదువుకుంటున్న రోజులలో ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు ‘కేసరి’కి గురువు, తండ్రి, శ్రేయోభిలాషి. అన్నీ తానై నిలిచిన స్కూలు మాస్టారు. ప్రకాశాన్ని రాజమండ్రికి తీసుకెళ్లి, పెంచి చదువు చెప్పించి, నాటకాలు వేయించి రాతిని మలిచి రాజమండ్రి రత్నాన్ని ‘కోహినూరు వజ్రం’గా తయారుచేసిన మహామనిషి పరిచయం. ఇది వాస్తవ దూరం కాదు అని ప్రకాశం జీవిత సంగ్రామం తెలిసిన వారు నమ్మక తప్పదు.
మరో అదృశ్య దీవెన ప్రకాశాన్ని తాకింది. ఆయన స్వతంత్ర వ్యక్తిత్వానికి, చిన్నతనంలోనే పునాదులు పడ్డాయి. మెట్రిక్యులేషన్ పాస్ అయిన తరువాత, బంధుమిత్రుల ప్రోద్బలం వలన, అమ్మగారి కష్టాలను తీర్చడానికి గాను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమాస్తా పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సర్ట్ఫికెట్ కూడా జత చేశాడు. మరి ఎందుకో ఆ రిజిస్ట్రార్ ప్రకాశంగారు దస్తూరి, తెలివితేటలు పరీక్షించడానికి తన వద్దకు ఒకసారి రమ్మని రాశాడు. ప్రకాశంగారి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఇలా రమ్మని పిలవడం, తనని పరీక్షించడం తన గౌరవానికి భంగమనిపించింది. నా సర్ట్ఫికెటే నా ప్రతిభకు తార్కాణమై ఉంటే మళ్లీ ఈయన ప్రశ్న, అనుమానం ఏమిటి? అని ‘నీ ఉద్యోగం నాకు అక్కర్లేదు పొండి’ అని జవాబు రాశాడు. మరి నిజమే గదా దైవ నిర్ణయం మరోలా ఉంటే ప్రకాశం పంతులుగారు జీవితాంతం గుమాస్తాగిరి చేయడం అసంభవం. ఎంతటి ఆత్మాభిమానం. తెలుగువారి పౌరుషము.
మరో సందర్భంలో మాట పట్టింపుతో, తోటి లాయరు పిరికితనానికి, తన కేసు ఓడిపోవడంతో తోకతొక్కిన త్రాచుపాములా ఎగిరిపడ్డాడు ప్రకాశం. తానే బారిస్టర్ చదవాలనుకున్నాడు. సంకల్పించాడు. ప్రయాణమైనాడు. లండన్ చేరాడు. ఆ సంఘటన ఆంధ్రకేసరి రాజకీయ జీవితానికి నాంది. ‘లా’ చదువుతున్న రోజులలో మునుపెన్నడూ జరగని, కనీవినీ ఎరుగని రీతిలో ప్రకాశం ప్రతిఘటించారు. ఆ రోజులలో అందరికంటే చిన్న విద్యార్థి బారు విందులలో ఒక చిన్న ఉపన్యాసమిచ్చి ‘పొగ త్రాగడానికి’ మాస్టర్ అనుమతి తీసుకోవాలి. ప్రకాశం వంతు వచ్చేటప్పటికి ‘సిగరెట్ తాగడానికి ఇలాంటి ఉపన్యాసం నేనివ్వను’ అని నిక్కచ్చిగా చెప్పి కూర్చున్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ప్రొఫెసర్లు ప్రకాశాన్ని తమ ఛాంబర్‌కు పిలిచి ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదని ప్రశంసించారు కూడా.
ప్రకాశంగారు నియమ నిష్ఠలతో బారిస్టర్ చదివి, భారతదేశానికి వచ్చారు. ఆ రోజులలోనే ఆంధ్రకేసరికి మహాత్ముడు గాంధీతో, నౌరోజీతో, పటేల్ లాంటి రాజకీయ మేధావులతో, దేశ విదేశాల నాయకులతో పరిచయం ఏర్పడటం, కొందరితో కలిసి భారత స్వాతంత్య్ర సమరానికి గాను కలిసి పని చేయడం జరిగింది. ముఖ్యమైన పత్రికలలో, జర్నలిజంతో అనుబంధం పెంచుకున్నారు. కొన్ని సందర్భాలలో క్రియాశీలక పాత్ర వహించారు.
మూడు రూపాయలు కూడా కట్టలేని ప్రకాశం, లండన్ చదువు చదివి లాయర్‌గా, లక్షలు ఆర్జించారు. దేశ విదేశాలలో కూడా కేసులు వాదించారు. మద్రాస్‌లో నగర సంపన్నులలో అగ్రతాంబూలం ప్రకాశానిదే.

--టంగుటూరి శ్రీరాం 9951417344