S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభ్యాసము కూసు విద్య

మనిషి ఎందుకు గుడికి వెళ్తాడు? మనసు బాగోలేక. మనసెందుకు బాగోలేదు? మాయదారి బ్రతుకు కాబట్టి. ఇది అనుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా అక్షరాలా నిజం. ‘మాయధారి’ వల్ల మాయదారుల్లో వాటి జల్తారుల్లో మనం ఈ లోకంలో ప్రవేశించాం. మనం మాత్రమే కాదు. కదిలీ కదలని ప్రతి ప్రాణీ అలా వచ్చి చేరిందే. కాకపోతే కాస్తో కూస్తో ఆలోచనా శక్తి వున్న ప్రాణి మాత్రం ఒకొక్కసారి ఆలోచిస్తూంటాడు. నేనెందుకిలా అవుతున్నాను? నాకెందుకు యిలా జరుగుతోందని అనుకోకుండా ఉండడు.
అన్నివైపులా ఎంతో అందంగా కనిపించే ‘‘మాయదారుల మర్మం’’ తెలియక తపిస్తూ మాయదారులు లేని మార్గం చూపించమని తనకంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడైన వాడి ముందు మోకరిల్లి మొఱపెట్టుకుంటూ మనశ్శాంతినీ, స్థైర్యాన్నీ పొందుతాడు. ఆ రోజు అంతా బాగానే ఉందనిపిస్తుంది. మళ్ళీ షరామామూలే.. యిలాంటి వాళ్ళను దేవుడు ‘‘ ఆర్తులు’’ అన్నాడు. ఆర్తులంటే ఆయనకు ప్రాణం. ఓ కంట కనిపెట్టేది వీళ్ళనే.. కానీ నిజమైన ఆర్తి కలిగినవాడే ఆయనకు చాలా దగ్గరౌతూంటాడు. అందుకే వెనకటి రోజుల్లో ఆరాధనాలయాలన్నీ ఆర్భాటాలకు కాస్త దూరంగానే వుండేవి. ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరి, అన్నీ మరిచిపోయి తృప్తిగా యిళ్ళకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆలయాల్లో ఆధ్యాత్మికతా వాతావరణం లోపించింది.
ఏ పురాణమో, హరికథో, ఎంతో శ్రద్ధగా వింటూండేవారు. ఆ రోజుల్లో ముఖ్యంగా దక్షిణాదిలో జరిగే ‘సంగీత కచేరీల వేదికలన్నీ’ దేవాలయాలే. మహావైద్యనాథ శివమ్, కోనేరి రాజపురం వైద్యనాథయ్యర్, మధురై పుష్పవనమయ్యర్, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ లాంటి మహా విద్వాంసులంతా దేవాలయాల్లోనే పాడారు. సంగీతానికి అవే కేంద్రంగా ఉండేవి. దేవాలయాలే వ్యాపార కేంద్రాలై ప్రసాద వితరణే ధ్యేయంగా ఉంటే యింక సంగీతానికే, సాహిత్యానికీ చోటెక్కడ?
తమిళనాడులోని తంజావూరు కృష్ణ భాగవతార్, తంజావూరు పంచాపకేశ భాగవతార్, పండిట్ లక్ష్మణాచార్, నరసింహభాగవతార్, కుప్పుస్వామి భాగవతార్ లాంటి దిగ్గజాల్లాంటివారు సంగీత జ్ఞానం బాగా వుండి, సంప్రదాయ సంగీతంలోని మాధుర్యంతో ఎంతో కమ్మగా పాడేవారు. వారి కథాకథనం, సంగీత రసికులు పరవశించి వినేవారు. ప్రతి కీర్తనకూ అర్థం చెబుతూ పాడేవారు. దేవాలయాల్లో జరిగే ప్రత్యేక ఉత్సవాలు ఒక ప్రత్యేక ఆకర్షణ.. అన్నీ సంగీత ప్రధానమే.. త్యాగరాజు మొట్టమొదటి శిష్యులైన ఉమయాల్పురం సుందర భాగవతార్, కృష్ణ భాగవతార్‌లు యిద్దరూ అన్నదమ్ములు.
ఎ.ఎం. చిన్నస్వామి మొదలియార్ అనే సంగీత రసికుని ఎదుట కొన్నిరోజుల పాటు కూర్చుని ఆర్తిగా పాడేవారట. త్యాగయ్యగారి కీర్తనలు మైమరచి ఈ కీర్తనలు వెలుగులోకి రావటానికి ఉమయాల్పురం సోదరులు, చిన్నస్వామి మొదలియార్ ముఖ్యకారకులు. ‘ఆదిభట్ల నారాయణదాసు’ హరికథా రంగంలో కీర్తి తెచ్చుకుని పితామహుడవ్వడానికి కారణం దక్షిణాది నుంచి వచ్చి విజయనగరంలో హరికథ చెప్పిన కుప్పుస్వామియే. ఆయనే దాసుగారికి ప్రేరణ. సమాజంలో సంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలన్నీ పెద్దలను చూసి అలవాటు చేసుకునేవే.. వీటికంటూ ఏవైనా గ్రంథాలంటూ వుండే వుండవచ్చు. ఆచరణలేని ఆశయాలెందుకు? ఉపన్యాసాలెందుకు? ఎవర్ని ఉద్ధరించేందుకు? లోకవ్యవహారమంతా పెద్దలను ఆదర్శంగా తీసుకుంటూనే నడుస్తుంది. అందుకే పెద్దలు కాస్త జాగ్రత్తగా నడవాలి. ఆదర్శంగా నిలవాలి. ప్రయోజనాపేక్ష పెరిగి, పరమార్థ్భాలాష కనుమరుగైతే పెద్దలమాట వినరు. మనిషికీ మనిషికీ శ్రుతి చెదురుతుంది. ఎడం పెరుగుతుంది. విలువలు పడిపోతాయి. సంగీతంలో ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ ఈ బాపతే.
ఒకప్పుడు ఈ గడ్డ మీద యోగులు, ఋషులు, తాత్త్వికులు, వేదాంత కోవిదులు, వైరాగ్య సంపన్నులు ద్భవించారు. సంగీత సద్గురువులు పుట్టి గురుపరంపరతో ఒక సంప్రదాయ మంటూ ఏర్పడింది. సంగీత మొక్కటే కాదు. ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో కూడా బోధించారు. చెప్పినదంతా విని ఆచరించారు. సంగీతం పాడి యిళ్ళు, స్థలాలూ సంపాదించకపోవచ్చు. వాటిమీద వారికి దృష్టిలేదు. దివ్యమైన సంగీతజ్ఞానం పుష్కలంగా సంపాదించారు. కీర్తి శరీరంతో అలా గుర్తుండిపోయారు. కర్ణాటక సంగీత రంగంలో విద్వాంసులకే విద్వాంసుడు అరియక్కుడి రామానుజయ్యంగార్‌కు ఆది గురువు ‘‘నామక్కళ్ నరసింహా అయ్యంగార్’’ కేదార గౌళరాగం పాడటంలో సిద్ధహస్తుడు. పల్లవి పాడటంలో బాగా పేరుంది. కేదారగౌళ నరసింహయ్యంగార్ అనే పిలిచేవారు. శ్రీరంగంలో ‘అరియక్కుడి’ ఈయన దగ్గర మూడేళ్ళు సంగీతం నేర్చుకున్నారు.
శ్రీరంగనాథస్వామి గుళ్ళో కూర్చుని తెల్లవారుఝామునే రెండు, మూడు గంటలపాటు సాధన చేసేవాడు. త్యాగయ్యగారి శిష్యుడైన మానాంబు చావిడి వెంకట సుబ్బయ్యర్ శిష్యుడే నరసింహయ్యంగార్. త్యాగరాజు దర్శనమైన మహానుభావుడు, మహాజ్ఞాని. అరియక్కుడి సంగీతరంగంలో ప్రవేశించటంతోనే మైక్రో ఫోన్ (మైక్) వాడకం ప్రారంభమయ్యిందంటారు. అంతవరకూ పాడిన మహావిద్వాంసులందరూ మైక్ లేకుండానే పాడగలిగిన ‘‘శారీర సౌష్టవం’’ కలిగినవారే.. ఆ తర్వాత రామనాథపురం శ్రీనివాసయ్యంగారి వద్దకు చేరిన ‘‘అరియక్కుడి’’ గాత్ర ధర్మాన్ని బాగా అవగాహన చేసుకున్నాడు. ఈయన్ని పూచి శ్రీనివాసయ్యంగార్ అనేవారు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు ఈ శ్రీనివాసయ్యంగార్. ఏడు, ఎనిమిది సంవత్సరాల పాటు గురుకులవాసం చేసి, రావలసిన సంగీతజ్ఞానమంతా సంపాదించాడు. ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధులైన మహా విద్వాంసులలో కాంచీపురం నైనాపిళ్ళై లెక్క ప్రధానంగా స్వరకల్పన పాడటంలో బహునేర్పరి.
మధురై పుష్పవనమయ్యర్ మెలోడి కింగ్. అసాధారణ మనోధర్మ సంగీతానికి మహారాజపురం విశ్వనాథయ్యర్ (సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గురువు, సంతానం తండ్రి). ఆ పాత మధురమైన సంగీతధారకు చెంబై వైద్యనాథ భాగవతార్ భావప్రధానమైన, రంజకమైన సంగీతానికి వీణ ధనమ్మాళ్‌ను ప్రముఖంగా కీర్తించేవారు. వీరందరిలో వున్న సుగుణాలన్నీ ఒక్క అరియక్కుడి రామానుజయ్యంగార్‌లోనే వినిపించటం విశేషంగా రసజ్ఞులు తీర్మానించారు.
ఆధునిక కర్ణాటక సంగీతకచేరీ పద్ధతి రూపొందించిన సంగీతశిల్పి అరియక్కుడి. సంగీతం వేద విద్యతో సమానమైన విద్య, వినయ, విధేయతలతో, భక్తితో గురుశుష్రూష చేస్తూ వినికిడి జ్ఞానంతో సంపాదించవలసిన విద్య, అభిరుచీ, ఆసక్తి, ప్రతిభలు మెండుగా వున్న యిక్కడ మన వాళ్ళు కొందరు ఒకటికి పదిసార్లు వినీ, వినీ సినిమా పాటల్ని రమ్యంగా పాడి పేరు తెచ్చుకుంటూ తృప్తి పడుతూంటే అక్కడ దక్షిణాదిలో కేవలం సంగీతం బాగా వినే రసజ్ఞులైన శ్రోతలు నిత్యం సంగీత కచేరీలు విన్న అనుభవంతో స్వయంగా పాడగలిగిన జ్ఞానాన్ని సొంతం చేసుకుంటున్నారు. వారికీ మనకూ యిదే తేడా..

--మల్లాది సూరిబాబు 90527 65490