S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోటితో మేటిచిత్రాలు!

మహాభారతంలో విలు విద్యా గురువు ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు ఇచ్చిన శిక్షణను దూరంగా చూస్తూ అన్ని రంగాల్లో తిరుగులేని పాటవాలను నేర్చుకున్న ఏకలవ్యుడి ప్రావీణ్యం ఎంత నిజమో.. ఎలాంటి గురుశిక్షణ లేకుండా తనకు తానుగా కొండంత ఎతె్తైన బొమ్మలను గోటితో గీయడంలో తిరుగులేని నైపుణ్యాన్ని సాధించి ఎన్నో విలువైన రికార్డులు స్వంతం చేసుకుంటున్నాడు బస్వరాజ్ రాజవౌళి.
*
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల మారుమూల పల్లెటూరు. ఈ గ్రామంలో సాధారణ కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రజక కులానికి చెందిన మల్లయ్య, బాలవ్వలకు ఐదుగురు సంతానం. నలుగురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఇందులో నాలుగో సంతానంగా జన్మించిన రాజవౌళి పాఠశాల విద్యను పాలమాకుల గ్రామంలో కొనసాగించాడు. ఏడవ తరగతి చదువుతున్న సమయంలో ఒక పత్రికలో రామక్రిష్ణ అనే నఖ చిత్రకారుడు గోటితో బొమ్మలు దించినట్లు వార్త ప్రచురితమైంది. అప్పటికే బొమ్మలు గీయడంపై అభిరుచి ఉన్న రాజవౌళిలో గోటితో బొమ్మలు ఎలా దించుతారో అన్న ఆలోచన ప్రేరేపించింది. చిన్న వయస్సు, ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో సిగరెట్ డబ్బాలనే తన ప్రయోగానికి వనరులుగా ఎంపిక చేసుకున్నాడు. సిగరెట్ డబ్బాలపై తన ఊహకు వచ్చిన బొమ్మలను గోటితో గీయడం అలవాటుగా పెట్టుకుని అధ్యాపకులు, తోటి విద్యార్థుల మన్ననలు అందుకుంటూ ముందుకు సాగాడు. ఎలక్ట్రానిక్ డిప్లొమా, టీటీసీ చదువులు పూర్తి చేసుకున్నాడు. భవిషత్తును తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతో 2002 సంవత్సరంలో విజిట్ పేరుతో టీవీ మెకానిక్‌గా పని చేసేందుకు దుబాయ్ వెళ్లాడు. మూడు సార్లు విజిట్ పేరుతో రెండేళ్ల పాటు దుబాయ్‌లో పనిచేసిన రాజవౌళికి వీసా లభించకపోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. దుబాయ్‌లో పని చేస్తున్న సమయంలో దివంగత దుబాయ్ రాజు ముక్తుంకు చెందిన చిత్రాన్ని గోటితో గీసాడు. అబ్బుర పడిన మహేష్ అనే ఇంజనీరు రాజవౌళి నఖ చిత్ర కళను మెచ్చుకుని వెయ్యి దరమ్స్ (12 వేలు ఇండియా కరెన్సీ)ని కానుకగా అందజేసి ప్రోత్సహించడం విశేషం. తనలోని ప్రతిభను తనకుతానుగా పెంచుకుంటూ ముందుకు వెళుతున్న రాజవౌళికి ప్రభుత్వ పరంగాకానీ, ఇతర స్వచ్ఛంద సంస్థలతోకానీ ఎలాంటి ఆర్థిక సహాయం లభించనప్పటికీ ఇప్పటి వరకు సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకుని వివిధ రకాల బొమ్మలను గోటితో గీసి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పకపోవడం, తాను చేసే టీవీ మెకానిక్ వృత్తిలో వచ్చే సంపాదనతోనే నఖ చిత్రాలకు అవసరమైన ముడి సరకులను సమకూర్చు కుంటున్నాడు. నఖ చిత్రాలను గీసేందుకు అవసరమైన పోస్టు కార్డులను పోస్ట్ఫాసులో కొనుగోలు చేసేందుకు రాజవౌళి వెళితే అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయిన సంఘటనలు లేకపోలేదు. పోస్టుకార్డుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయంగా డ్రాయింగ్ షీట్స్‌ను ఉపయోగించుకుంటున్నాడు. 2012 సంవత్సరంలో హైదరాబాద్‌లో గోటితో గీసిన 30 అడుగుల భారతమాత బొమ్మకు లిమ్కా బుక్, ఇండియా బుక్ రికార్డులు సాధించాడు. ఎలాగైనా గిన్నీస్ బుక్ రికార్డును సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాజవౌళి 35 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి చిత్రాన్ని గీయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతోనే చేపట్టాలనుకుంటున్నాడు. ఇప్పటికే తెలంగాణ తల్లి బొమ్మను గోటితో గీసి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా కానుకగా సమర్పించాడు. ఆ చిత్రాన్ని తన క్యాంపు కార్యాలయంలో కుర్చీ వెనకాల గోడకు అమర్చడం విశేషం. జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రు, అంబేద్కర్, ఇందిరాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, నరేంద్ర మోడి, కేసీఆర్, పక్షులు, జంతువులు, దేవతలకు సంబంధించి శంకరుడు, ఆంజనేయుడు, షిరిడీ సాయి, విష్ణుమూర్తి, అమ్మవారు ఇలా ఎవరి బొమ్మలనైనా గోటితో అలవోకగా గంటల వ్యవధిలో గీయడంలో తనకుతానే సాటిగా నిలుస్తున్నాడు. ఇంతటి ప్రతిభను కనబరుస్తున్న రాజవౌళి సాధించుకున్న రికార్డుల పత్రాలను బాహ్య ప్రపంచానికి ప్రదర్శించడానికి అంతగా ఇష్టపడడు. తనలోని కళా నైపుణ్యాన్ని ఇతరులకు నేర్పించాలన్న తాపత్రయంతో పట్టుదలతో టీటీసీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టాలని కలలు కన్నాడు. కానీ ఆ అదృష్టం కలుగకపోవడంతో నిరాశ చెందాడు. ఇలాంటి సున్నితమైన విద్య విద్యార్థులకు నేర్పించడం పాఠశాల స్థాయిలోనే సాధ్యపడుతుందంటున్నాడు. నేర్చుకున్న నఖ చిత్ర కళపై ఆవేదన ఎంతుందో ఆనందం అంతకంటే ఎక్కువగా ఉంటుందని రాజవౌళి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు గోటితో బొమ్మను గీయడంలో లీనమైపోతే బాధను మర్చిపోవచ్చని పేర్కొంటున్నాడు. తాను గీయబోయే బొమ్మను ముందుగా ఒక చార్ట్‌పై గ్రాఫ్ వేసుకుని ఎంత సైజు బొమ్మకు ఎన్ని పోస్టు కార్డులు అవసరమవుతాయో లెక్కించుకుని ఒక్కో కార్డుపై ఆయా భాగాలను గీస్తూ టేపుతో అతికిస్తాడు. అనంతరం కార్బన్ పేపర్‌పై గీసిన బొమ్మపై రుద్దితే అపురూపమైన బొమ్మ ఆవిష్కృతమవుతుంది. బొమ్మను గీయడానికి ముందు పావు అంగుళం గోటిని పెంచుకుంటాడు. బొమ్మను గీస్తున్న కొన్ని సందర్భాల్లో నొప్పి పెడితే నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటూ తన పని పూర్తి చేసుకుంటాడు. ఒక్కో సందర్భంలో గోరు మొత్తం ఊడిపోతుందంటాడు. నొప్పి పెట్టినప్పుడు గీయడం నిలిపివేస్తే బొమ్మపై ఏకాగ్రత కోల్పోతానని, అందుకే నొప్పి నివారణ మాత్రలు ఉపయోగించాల్సి వస్తోందని సమాధానం ఇస్తాడు. నఖ చిత్ర శిక్షణ ఇచ్చేందుకు ఒక అకాడమీని పెట్టాలని ఆలోచిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అడ్డుగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. గిన్నీస్ బుక్ రికార్డు సాధించాక స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభిస్తానని పేర్కొంటున్నాడు. నఖ చిత్ర కళాకారులు కనుమరుగవుతున్న నేటి సమాజంలో ఎలాంటి గురువు శిక్షణకానీ, నఖ చిత్రాభ్యాసం లేకుండా స్వతహాగా గొప్ప గొప్ప బొమ్మలు గోటితో గీసే స్థాయికి ఎదిగిన తెలంగాణ ఏకలవ్యుడిగా ఎదిగిన రాజవౌళి సేవలను భవిషత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం, స్వచ్ఛంద సహకారం అందిస్తే ఎంతో మంది నఖ చిత్రకారులు భవిష్యత్తులో పుట్టుకొస్తారని చెప్పడంలో సందేహం లేదు.
*
ఇండియా వరల్డ్ రికార్డు ప్రతినిధులతో అవార్డు అందుకుంటున్న రాజవౌళి

-తమ్మలి మురళీధర్ 9989507333