S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘బుర్రుఫిట్ట’ పొయెట్రీ!

‘రేపు వస్తుంది అబ్బాయ్.. గ్యారంటీ.. అన్నాడు జాలిగా ఇంకా అక్కడే నిలబడ్డామని - చూసి.
-కట్టలు విప్పిన ఐదు నిమిషాల్లో సగం దినపత్రికలు ఎగరేసుకు పోయేవాళ్లు. మా ఇల్లు స్టేషన్‌కి దగ్గరే. నిరాశ చెందిన మొహాలతో ఈలోగా హిగ్గిణ్బాదం షాప్ దాకా వెళ్లి - మేగజైన్లన్నీ ఓసారి తడిమేసి.. ఇంటికి కాళ్లీడ్చుకుంటూ పోయేవాళ్లం నేనూ తమ్ముడూ. పత్రిక మీద కన్నా ప్రభ మీద మోజు. అందులో జంతువుల మధ్యమధ్య బొమ్మలతో కూడా సీరియల్ వచ్చేది. ఎక్కువ పేజీలు కూడా వుండేవి.
స్టేషన్‌లోకి పోడానికి మాకు ప్లాట్‌ఫాం టికెట్ అక్కరలేదు. అణావో బేడో ఖరీదు - కాబోలు తెలియదు. ఓ ఎక్సర్‌సైజు పుస్తకం ఇలా చుట్ట చుట్టి, నిక్కర్ జేబులో పెట్టేసుకుంటే, ఇక స్టూడెంటే! జేబు మీద చెయ్యి వేసి ‘ఇస్టూడెంట్’ అని తల ఎగురవేస్తే చాలు.. చాలామంది టిక్కెట్ బాబాయిలు మా పేట వాళ్లేగా.. ఇక ఫ్రెండ్స్ అంతా బొగ్గులైన్ (లోకో రైల్వే క్వార్టర్స్) వాళ్లే.
‘పాపాయి’కి మహాబలుని సాహస యాత్రలు అని సీరియల్ ఒకటి ఫుల్‌నేమ్‌తో రాసేవాణ్ణి పోస్ట్‌లో - వచ్చేది ఆ పత్రిక. దీని కాపీ ఒకటి మద్రాసులోని కనె్న మేరీ సెంట్రల్ లైబ్రరీలో 1961లో చూశాను.. అదే పత్రికలో సగం పేరుతో మరో కథ కూడా పడేదీ...
పోస్ట్‌మాన్ పదకొండు గంటలకి వస్తాడు ఓ మైలున్నర దూరం ఎదురెళ్లేవాళ్లం. బజార్లో మోగనున్న కిల్లీ కొట్టు తాడుకు కొత్త పత్రిక ఏదైనా వేలాడిందా? వాడు (ఎడిటర్ గారు) చచ్చేడే. చిరునామా నోట్ చేసేసుకుని - ఇంటికి పరుగు. కథా గేయం, జనరల్ నాలెడ్జ్, బొమ్మ - మీకు తెల్సా?.. చెప్పుకోండి చూద్దాం.. లేదా ‘కావాలోయ్ కావాలి’.
ముక్కుకి పుడక/ పాపకి నడక/ తాతకి పడక../ ఇట్ల కావల్సినన్ని ‘కావాలోయ్.. కావాలి’ సిరీస్.
ఏదో ఒకటి రాయడం ఎర్రడబ్బా (పోస్ట్ బాక్స్)లో తోసేయ్యడం. మా తమ్ముడు అప్పుడే నాకు పీఆర్‌వో - పోస్ట్‌మేన్ ఉత్తరాలన్నీ తెచ్చుకుని - మధ్యలో ఇంకా తెరవకుండా కట్టేసి ఉన్న పెద్ద షాపు అరుగు మీద వొలకబోసి - లెటర్స్ సార్ట్ చేసుకునేవాడు - అక్కడ కాసేవాళ్లం. తిరిగి వచ్చినవి నలిగిపోకుండా అందుకుని - మర్నాడే మరో పత్రికకి డబ్బాలో పడెయ్యడమే. ‘చిత్రగుప్త’కి కార్డు కథలు ఎన్ని రాసెనో? ఏ పత్రికయినా, అందులో పిల్లల శీర్షిక ఉందా? గేయాలు, చిట్కాలు, జోకులు, మీకు తెలుసా? వేస్తున్నాడా? లేదు కదా? అదే ముఖ్యం - ‘చిత్రగుప్త’లో కార్డు కథలు పడేవి. ఎన్జీ ఆచార్య దాని ఎడిటర్. అదొక్కటే కార్టూన్లు వేసే పక్ష పత్రిక - సారీ! పొలిటికల్ కార్టూన్లు వేసే ‘్ఢంకా’ కూడా వుండేది.
* * *
ఈ సందర్భంలో మరీ పాత సంగతి ఒకటి జ్ఞాపకం వస్తోంది. నా రచన మొట్టమొదటిసారి బాల పత్రికలో పడ్డది. రివ్వున పరిగెత్తి ఇంట్లోకి దూసుకుని వచ్చాను - అమ్మ మురిసిపోయింది. కానీ, మామయ్య పెద్ద అని ఒకడు ఉన్నాడుగా.. ‘రెండో తరగతి పుస్తకంలో నుంచి ఎత్తి రాసేడే అమ్మారుూ నీ కొడుకు..’ అన్నాడు. ఇహీ మన్నాడు, నన్ను కొంటెగా చూసి పెద్ద డిస్కవరీ చేసినట్లు. నాకు ఏడుపే వచ్చింది. మా అమ్మకేమీ తెలియదు. ‘తప్పు నాన్నా.. అందులోకి నీది మా నాన్నగారి పేరు కూడానూ’ అన్నది. అన్నా నీ అనురాగం టైపు అమ్మ.
పోయానక్కడ నుంచి చీమల పుట్టలాగా మొహం పెట్టి.. సాయంకాలం ఏడు గంటల వేళ నాన్నగారు వచ్చారు. చదివారు - అమ్మ కాఫీ కప్పుతో నిలబడ్డది ‘చూశావా?’ అన్నారు. బెడ్‌లైట్ కాంతిలో కూడా మీసాల చాటు తృప్తి.. నవ్వు రూపంలో.
‘గొప్పే’ అన్నది అమ్మాయి (మా అమ్మ)
చెప్పేరు నాన్నగారు.. చదివి పెడుతూ అమ్మకి..
‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట చిర్రుమన్నది/ అత్త తెచ్చిన కొత్త లంగా తొడగ నన్నది/ బుర్రు పిట్ట బుర్రు పిట్ట కస్సుమన్నది/ అమ్మ చెప్పిన అంట్ల గినె్నలు తోమనన్నది/ మామ చెప్పిన బియ్యం రాళ్లు ఏరనన్నది/ బుర్రుపిట్ట బుర్రుపిట్ట చిర్రుమన్నది/ పలకాబలపం పెట్టి అన్న తోటి బళ్లోకి వెళ్తానన్నదీ/ బుర్రూ...
అదీ వాడి పొయెట్రీ.. వాడు చెల్లిని చదివించమని చెబుతున్నాడే కొండా - అన్నారు గర్వంగా.
మా చెల్లి అనసూయ చంటిదప్పుడు. పిటీ.. ఏమిటీ అంటే దాన్ని పెద్దగా చదివించలేక పోయాము ఆనక.
పెద్దయ్యాక ఈ క్లిప్పింగ్ చూసి - చిన్నప్పుడు కూడా మంచి ఆలోచనలే నావి పోనీలే.. అనుకున్నాను. లేకపోతే మామయ్యకి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చేది - కాపీ కొట్టినందుకు (నేను ఫోర్త్ ఆనర్స్‌లో ఉన్నప్పుడే మా పెద్ద చెల్లికి పెళ్లి అయిపోయింది.)
స్కూలులో మిత్ర పత్రిక ‘రాయడం’ మొదలు!
ఆంధ్ర సర్వస్వంలో - వివిధ పత్రికల సంపాదకుల బొమ్మలు - చిన్నచిన్న పరిచయాలు వేశారు. అవి అడపాతడపా చూసేవాణ్ణి. నార్ల బొమ్మ ఇలా సైడు పోజులో వుండేది - విదేశీ వ్యవహారాల్లో దిట్ట అని క్రింద వ్యాఖ్య. నిజమే అయుంటుంది.. ఆయన హయాంలో ఆంధ్రప్రభలో మూడో పేజీ అంతా విదేశీ వార్తలే వేసేవారు.
చిత్రపు నారాయణమూర్తి గారి పేరు చల్లా జగన్నాథరావు గారి పేరు ఇంకా ఖాసా సుబ్బారావుగారు.. ఇలా ఆనాటి పెద్ద ఎడిటర్లు నాకు ఇష్టం. నాకెందరో రచయితలూ - కొ.కు.. ఆరుద్ర ఇష్టం.. స్వతంత్రకి.. ఇంగ్లిష్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఖాసా ఎడిటర్. మా ‘మిత్ర’కి ఖాసా వ్యాసం ఆధారంగా సంపాదకీయం రాశాను.

*
(ఇంకా బోలెడుంది)

వీరాజీ.. 92900 99512 veeraji.columnist@gmail.com