S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సైకో కిల్లర్

ఆఫీస్ నించి ఇంటికి వెళ్తూంటే నోయల్‌కి ఆ హత్య గురించి తెలిసింది. కేమ్లాట్ కోర్ట్ పక్కనించి కారు పోనిస్తూంటే, ఓ ఇంటి బయట ఆగి ఉన్న నాలుగు పోలీస్ వేన్‌లు, ఒక తెల్లటి అంబులెన్స్ కనిపించాయి. ఆకుపచ్చ లాన్ నిండా జనం. దాంట్లోనే గేబీ ఉంటుంది. అతను అనేకసార్లు ఆ ఇంట్లోకి వెళ్లాడు. ఐతే పగలు అంతా చూస్తూండగా కాదు.
నోయల్ వెంటనే కారుని ఆపి దిగి అటు వైపు నడిచాడు. గేబీ ఇంటి తలుపు బార్లా తెరిచి ఉంది. బయట నిలబడ్డ పోలీస్ ఉద్యోగి జనం లోపలికి రాకుండా చూస్తున్నాడు. లోపలికి వెళ్లడం మంచిది కాదనుకుని జనంలోకి వెళ్లి నోయల్ ఒకర్ని ప్రశ్నించాడు.
‘ఏమైంది?’
‘హత్య’
నోయల్‌కి వెంటనే కాళ్లలోంచి వణుకు పుట్టింది.
‘ఎవరిని చంపారు?’ అడిగాడు.
‘ఓ యువతిని. ఆమె పేరు మర్చెంట్ అనుకుంటాను’
గేబ్రెయిల్ మర్చెంట్! తన గేబీ!
అతనిలోని భయం ద్విగుణీకృతం అయింది. తనలో ఉదయించే వేల ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవాలని అనుకున్నాడు. కాని పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ‘నన్ను లోపలికి రానివ్వండి. మరణించిన మహిళ ప్రేమికుల్లో ఒకర్ని’ అని ఎలా చెప్పగలడు? అనేక సార్లు స్పోర్ట్స్ కారులో ఒక యువకుడు గేబీని ఎక్కించుకోవడం, దింపడం నోయల్ చూశాడు. పోలీసులకి అతని గురించి చెప్పాలి. బహుశా అతనే ఆమెని చంపి ఉంటాడు. అతన్ని, అతని కారుని వర్ణించాలి. కాని అవేం చేయలేకపోయాడు. గేబ్రియల్ మర్చెంట్ హత్య చేయబడితే, ఆమె ప్రేమికులందరూ అనుమానింప బడతారు. తను నిర్దోషి అయినా, తన పేరు అందులోకి లాగబడడం నోయల్‌కి ఇష్టంలేదు.
‘ఆమె అందగత్తెట!’ పక్కనున్న వ్యక్తి చెప్పాడు.
‘అవును’ నోయెల్ యథాలాపంగా చెప్పాడు.
‘ఆమె మీకు తెలుసా?’
దానికి జవాబు చెప్పలేదు.
‘మీకామె తెలుసా?’ మళ్లీ అతను ప్రశ్నించాడు.
‘తెలుసు’ చెప్పాడు.
‘చూశారా?’
‘చూశాను’
‘అందంగా ఉంటుందా?’ అతను మళ్లీ ప్రశ్నించాడు.
‘అది చూసేవాళ్లని బట్టి ఉంటుంది.’ నోయల్ అతన్నించి దూరంగా నడిచాడు.
అతను మఫ్టీలోని పోలీసై ఉండచ్చు. లేదా పోలీస్ ఇన్‌ఫార్మర్ లేక పత్రికా విలేఖరి అయుండచ్చు. నోయల్ తన కారు దగ్గరికి వెళ్లి, ఎక్కి పోనించాడు. ఆమె మరణం వల్ల బాధ కంటే అతనికి భయమే ఎక్కువ కలిగింది.
అతను తన ఇంటి ముందు కారు ఆపి దిగాడు. పక్కనే తన భార్య లియోనా కారు కనపడక పోవడంతో, ఆమె ఆఫీస్ నించి ఇంకా రాలేదు అనుకున్నాడు.
అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఒక పెగ్ బోర్బన్ సోడా కలుపుకుని తాగాడు. తర్వాత జాకెట్, టై విప్పి, బెడ్‌రూంలోకి వెళ్లి వాటిని తగిలించి కిటికీ దగ్గరికి నడిచాడు.
గేబీ ఇంటి వెనక లాన్‌లో నిలబడ్డ పోలీసులని చూస్తేనే ఆ ఇంట్లో ఏదో జరిగిందని తెలుస్తోంది. బహుశా ఎవరూ లోపలికి వెళ్లకుండా ఓ పోలీస్ ఆమె ఇంటి వెనక తలుపు దగ్గర కాపలాగా నిలబడ్డాడు. అక్కడ జనం కనపడలేదు. మొదటిసారి తను గేబీని ఆ కిటికీ ముందు నిలబడే చూశాడు. ఆమె క్రితం వేసవిలో ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ కిటికీకి, గేబీ ఇంటి వెనక తలుపుకి మధ్య దూరం సుమారు రెండు వందల అడుగులు ఉంటుంది.
గేబీ తరచూ బికినీ వేసుకుని ఇంటి లాన్‌లో ఎండలో పడుకుంటుంది. ఎంతో అందంగా ఉండే ఆమెని మే, జూన్ నెలల్లో అనేకసార్లు చూశాడు. గేబీ బికినీలో బయటికి వచ్చే సమయానికి లియోనా ఇంట్లో ఉండకపోవడంతో అది సాధ్యమైంది. ఆమెని ఇంకాస్త స్పష్టంగా చూడాలని బైనాక్యులర్స్ కూడా కొన్నాడు. తన భార్య లియోనా ఎన్నడూ చూడని బ్రీఫ్‌కేస్‌లో దాన్ని దాచాడు. జూన్ నెలాఖరుకల్లా గేబీ చర్మం ఏనుగు దంతం రంగు నించి స్వల్పంగా గోధుమరంగులోకి మారింది.
జూలైలో నోయల్ గేబీ ప్రేమికుడయ్యాడు. అలా అవడం కష్టం కాలేదు. తేలికా కాలేదు. ఓ రోజు ఆమె కారు చెడిపోతే డౌన్ టౌన్‌కి లిఫ్ట్ ఇచ్చాడు. ఆమె పనిచేసే ఆఫీస్‌కి ఏదో పనున్నట్లుగా వెళ్లి, మరోసారి మాట్లాడాడు. ఆ సాయంత్రం ఓ ఖరీదైన బార్‌లో కలిసి కాక్‌టెయిల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రాత్రులు కలిసి భోంచేశారు. చాలామంది అమెరికన్ యువతలా పడక గదికి ఇదే దారి. అదంతా గోప్యంగా జరిగింది.
అతని ఉద్యోగంలో కొన్నిసార్లు రాత్రిళ్లు కూడా క్లయింట్స్‌ని కలుస్తూ, మీటింగ్స్‌కి హాజరవుతూ గడపాల్సి రావడంతో రాత్రి తొమ్మిది దాకా ఇంటికి రాకపోవడం లియోనాకి అలవాటే. మునుపటికన్నా అతను ఇంటికి సమయానికి రావడం తగ్గింది. సెక్రటరీగా పనిచేసే లియోనా జీతం నోయల్ జీతంతో సమానం.

అందువల్ల బిజినెస్ విమన్స్ క్లబ్‌లో సభ్యురాలై బ్రిడ్జ్ ఆడుతూ ఉంటుంది. దాంతో గేబీ దగ్గరికి వారంలో రెండు సాయంత్రాలు వెళ్లి గడిపి రావడం నోయల్‌కి సమస్య కాలేదు.
గేబీ విడాకుల తర్వాత భర్త కోసం చూడడం లేదు. అందగత్తె కాబట్టి ఆమెకి మగ స్నేహితులు చాలామంది దొరుకుతున్నారు. వారిలోని ఎవరు ఆమెని చంపారు?
సాయంత్రం ఆరుంపావైంది. లియోనా ఇంకా ఇంటికి రాలేదు. గేబీ ఎలా మరణించింది? గొంతు నులమబడా? రివాల్వర్‌తో కాల్చా? కత్తితో పొడిచా? ఆ అందమైన శరీరాన్ని ఎవరో శవంగా మార్చేశారు. ఇక మీదట రహస్యంగా గడిపే ఎక్సయిట్‌మెంట్, ఆనందం తనకి లభించవు. ఆ హంతకుడి మీద నోయల్‌కి కోపం వచ్చింది.
ఇంటి తలుపు తాళం తీస్తున్న చప్పుడు విని చివాలున వెనక్కి తిరిగాడు. తను ఆ కిటికీ లోంచి చూడడం తన భార్య గమనించకూడదు. వెంటనే వేగంగా లివింగ్ రూంలోకి చేరుకున్నాడు. పాలిపోయిన మొహంతో ఆమె భయంగా చెప్పింది.
‘పక్క వీధిలో ఎవరో అమ్మాయి హత్యచేయబడింది’
లియోనా పడక గదిలోకి వెళ్లి, ఇందాక నోయల్ చూసిన కిటికీలోంచి గేబీ ఇంటివైపు చూస్తూ చెప్పింది.
‘ఆమె పేరు గేబ్రియల్. అలాంటిదేదో’
నోయల్ మాట్లాడలేదు. ఆమె పేరు చెప్పడం మూర్ఖత్వం అనుకున్నాడు.
‘అది ఎవరో పిచ్చివాడి పనట. కత్తితో శవాన్ని ఛిద్రం చేశాట్ట’
ఆమె శరీరంతో బాగా పరిచయం గల నోయల్‌కి ఆ మాటలు బాధని కలిగించాయి.
‘సెక్స్ మేనియాక్ అయి ఉంటాడు. ఆమె అక్కడ సన్ బేతింగ్ చేసేది. మీరెప్పుడైనా చూశారా?’ లియోనా వెనక్కి తిరిగి నర్త వైపు చూస్తూ ప్రశ్నించింది.
‘సెక్సీగా కనిపించే ఓ అమ్మాయిని అనేకసార్లు చూశాను. ప్రతీ అపార్ట్‌మెంట్ కిటికీ లోంచి అనేక మంది మగాళ్లు ఆమెని చూసి ఉంటారు’
‘కత్తితో పొడిచారు. సెక్స్ మేనియాక్! మన చుట్టుపక్కల ఓ సెక్స్ మేనియాక్ ఉన్నాడు’ గుసగుసలాడుతున్నట్లుగా చెప్పింది.
లియోనా ఆ రాత్రి కిటికీ తలుపులకి బోల్ట్ పెట్టి వెనీషియల్ బ్లైండ్స్‌ని మూసేసింది. తలుపులకి అడ్డంగా కుర్చీలు జరిపింది. గేబీని హత్య చేసిన సెక్స్ మేనియాక్ ఇంకొకరి మీద కూడా దాడి చేస్తాడా? లియోనాకి అలాంటి ప్రమాదం ఉందా? ఉండదనుకున్నాడు. పిచ్చివాళ్లు అందమైన అమ్మాయిలకే ప్రాధాన్యత ఇస్తారు. చాలాకాలం తర్వాత వారిద్దరూ డబుల్ బెడ్‌లో పక్కపక్కనే పడుకున్నారు.
‘నాకు చాలా భయంగా ఉంది నోయల్’ ఆమె భయంగా చెప్పింది.
అదే మాట కేమ్లెట్ కోర్ట్‌లోని అనేక మంది భార్యలు తమ భర్తలతో చెప్పారు.
* * *
గేబీ శవాన్ని మేక్సెన్ అనే గేబీ ఏకైక ఆడ స్నేహితురాలు కనుగొందని మర్నాడు నోయల్‌కి దినపత్రిక ద్వారా తెలిసింది. గేబీ ఇంట్లోంచి టీవీ శబ్దం విని ఆమె తలుపు మీద తట్టింది. జవాబు లేకపోవడంతో తోస్తే తెరచుకుంది. గదంతా రక్తం. నగ్న శరీరం. పడక గది, లివింగ్ రూం మధ్య గేబీ శవం కనిపించింది. మగవాళ్లు ఉపయోగించే మంగలి కత్తి శవం పక్కన కనిపించింది. కేమ్లెట్ కోర్ట్‌లోని ఆడవాళ్లు భయంతో వణికిపోతున్నారు. భర్తలు ఆఫీసుల నించి సరాసరి ఇళ్లకే వస్తున్నారు.
ఇరుగు పొరుగు ఒకరికొకరు తారసపడితే గేబీ హత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె ప్రియుల్లో అది ఎవరి పనో అయుండచ్చు. అసూయతో గొంతు కోస్తే సరిపోదా? ఎందుకు పిచ్చివాడిలా శవాన్ని అట్లా కోసేశాడు? ఆమె ప్రేమికుడు కాకపోవచ్చు. స్విమ్మింగ్ పూల్ పక్కన లాన్‌లో ఆమె సన్ బేతింగ్ శరీరాన్ని చూసిన కొత్తవాళ్ల పనైనా అయుండచ్చు. ఇది కేమ్లెట్‌లోని ఓ మగాడి పనే అయితే, తమ మధ్య ఓ సైకో హంతకుడు ఉన్నట్లే అని అంతా భయపడసాగారు. పోలీసులు అక్కడికి వచ్చి పోతున్నారు. గేబ్రియల్ అపార్ట్‌మెంట్‌కి తాళం వేసి బయట పోలీసు కాపలా ఉన్నాడు. మఫ్టీలో పోలీసులు తిరుగుతున్నారని నోయల్‌కి ఎవరో చెప్పారు. అనేక మంది పత్రికా విలేకరులు కూడా ఇరుగుపొరుగుని ప్రశ్నిస్తున్నారు.
* * *
మర్నాడు ఉదయం లెఫ్ట్‌నెంట్ కేబ్రిక్ నోయల్ ఇంటికి వచ్చాడు.
‘నేను లోపలికి రావచ్చా? మీ భార్య ఇంట్లో ఉందా?’ ప్రశ్నించాడు.
‘రండి. లేదు. ఆఫీస్‌కి వెళ్లింది’
‘ఆమెని నేను తర్వాత ప్రశ్నిస్తాను. మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చాను’
‘ప్రశ్నలా?’
‘అవును. గేబ్రియల్ హత్య గురిచి. ఆమెతో మీకు పరిచయం ఉందా?’
నోయల్ తను అలాంటి ప్రశ్నని ఎదుర్కోవాలని భయపడుతున్నాడు. దానికి ఓ డజను సమాధానాలు ఆలోచించాడు. కానీ ఏదీ తృప్తికరంగా అనిపించలేదు.
‘నేను అందరిలాగే ఆమెని దూరం నించి బయట అనేకసార్లు చూశాను’
‘నేను మీ అపార్ట్‌మెంట్ చూడచ్చా?’ లెఫ్ట్‌నెంట్ అడిగాడు.
‘వెదుకుతారా?’
‘మీ ఇంట్లోంచి గేబ్రియల్ అపార్ట్‌మెంట్‌ని చూద్దామని మాత్రమే’
అతన్ని తమ పడక గదిలోకి తీసుకెళ్లి కిటికీ కరెక్టన్‌ని తెరిచాడు.
‘ఇక్కడి నించి బాగా కనపడుతుంది. ఆమె సన్ బేతింగ్ చేసేదిటగా?’
నోయల్ జవాబు చెప్పలేదు.
‘మీరు ఆమెని ఇక్కడి నించే చూసారనుకుంటాను?’
‘అవును’
‘మీరు ఆమె హత్య వివరాలు పేపర్లో చదివారా?’
‘చదివాను’
‘మంగళవారం మధ్యాహ్నం దాకా ఆమె శవం కనుగొనబడకపోయినా సోమవారం సాయంత్రం ఆ హత్య జరిగిందని మా నమ్మకం. రాత్రి తొమ్మిది నించి పదకొండులోపు అని డాక్టర్ చెప్తున్నాడు. ఎవరూ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించలేదు. కాబట్టి హంతకుడు ఆమెకి బాగా పరిచయస్థుడై ఉండాలి. డోర్‌బెల్ కొట్టి ఉంటాడు. మీరు కానీ, మీ భార్యకానీ సోమవారం రాత్రి వెనక తలుపులోంచి ఎవరైనా లోపలికి వెళ్లడం చూశారా అని అడగడానికి వచ్చాను’
‘ఆ సమయంలో నేనిక్కడ లేను. ఒంటి గంటకో, ఒకటిన్నరకో వచ్చాను. నిన్న రాత్రి సేల్స్ మీటింగ్‌లో డిన్నర్ తీసుకున్నాక, ఇద్దరు మిత్రులతో కలిసి డ్రింక్స్ తీసుకున్నాను’
‘మీరు చూడలేదు. పోనీ మీ భార్య చూసిందా?’
‘నాకు తెలీదు’
‘ఆ సమయంలో ఆమె ఇంట్లో ఉందా?’
‘ఆమె నాకు చెప్పలేదు. నేను డిన్నర్‌కి ఇంటికి రాకపోతే ఆమె ఏ రెస్ట్‌రెంట్‌కో వెళ్లి భోంచేస్తుంది. తిరిగి ఇంటికి ఎప్పుడు వచ్చిందో నేను అడగలేదు’
‘ఆమెకి ఏదైనా ప్రత్యేకంగా తోస్తే బహుశా చెప్పి ఉండేది. నా పరిశోధనలో చుట్టుపక్కల వాళ్లంతా సహకరిస్తున్నారు. వారంతా హంతకుడు త్వరగా దొరకాలని కోరుకుంటున్నారు. వైద్య పరీక్షలో ఆమె బలాత్కరింప బడలేదని తెలిసింది’
‘అంటే అది సెక్స్ మర్డర్ కాదంటారా?’
‘నేనా మాట అనలేదు. సెక్స్ మర్డర్స్‌లో అనేక రకాలు ఉన్నాయి. అది ప్రతీకార హత్య అని నా అభిప్రాయం’
‘ప్రతీకారమా?’
‘అసూయ చెందిన ఇంకో ప్రియుడు కావచ్చు. లేదా ఆమె తిరస్కరించిన వ్యక్తి అవచ్చు. ఆమె జీవితంలో ఎంతమంది మగాళ్లున్నారో నాకు ఇంకా తెలీదు. ఆమె ఇంటికి వచ్చిపోయే వారిని ఎవరినైనా మీరు గమనించారా? వారి వివరాలు సేకరిస్తున్నాం’
ఖరీదైన కారులో వచ్చే వ్యక్తి గురించి నోయల్ చెప్పలేదు. అతను ఇన్‌వాల్వ్ కాదల్చుకోలేదు.
‘నేను పెద్దగా గమనించలేదు’
‘్థంక్స్ మిస్టర్ నోయల్. నేను వస్తానని మీ భార్యకి చెప్పండి. భయపడద్దని చెప్పండి. మేం హంతకుడ్ని పట్టుకుంటాం. ఆమె ఇంట్లో చాలా వేలిముద్రలు దొరికాయి. వాటిలో కొన్ని కచ్చితంగా హంతకుడివై ఉంటాయి’
లెఫ్ట్‌నెంట్ వెళ్లాక నోయెల్ సోఫాలో కూలబడ్డాడు. వేలిముద్రలు? తను వాటి గురించి ఆలోచించలేదు. తన వేలిముద్రలు గేబీ ఇంటి నిండా ఉంటాయి. ఆ రోజంతా అతను తన వేలిముద్రల గురించే భయపడ్డాడు.
మర్నాడు దినపత్రికలో గేబీ ఇంట్లో ఓ ముఖ్యమైన వేలిముద్ర దొరికిందన్న వార్త వచ్చింది. అది హతురాలిది కాదు కాబట్టి హంతకుడిదని పోలీసులు భావిస్తున్నారు. హత్యాయుధం మీద రక్తంతో పడ్డ వేలి

ముద్ర అది.
ఆమె ఇంట్లోని ఇతర వేలిముద్రలని పోలీసులు పరిశోధించరని నోయెల్ భావించాడు. ప్రతీ వారింట్లో ఆ ఇంటికి వచ్చి వెళ్లే వారి వేలిముద్రలు అనేకం ఉంటాయి. కానీ పడక గదుల్లో? గేబీ హంతకుడి వేలిముద్ర దొరికింది. కాబట్టి దాన్ని ఎఫ్‌బిఐ ద్వారా చెక్ చేస్తున్నారని చదవడంతో అతనికి కొంత ఊరట లభించింది.
‘పోలీసులు ఆ పిచ్చివాడ్ని తప్పక పట్టుకుంటారు. అతని వేలిముద్ర కత్తి మీద దొరికింది’ లియోనా ఆ వార్తని నిలబడే చదివి చెప్పింది.
‘మంచిది. పోలీసులు వాడ్ని పట్టుకుంటారు. ఇక మనం హాయిగా ఉండచ్చు’
కొద్దిసేపటికి లెఫ్ట్‌నెంట్ కేబ్రిక్ వాళ్లింటికి మళ్లీ వచ్చాడు.
‘ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిదో మీరు కనుక్కున్నారా?’ నోయల్ అడిగాడు.
‘ఇంకా లేదు... మిసెస్ నోయెల్ సోమవారం రాత్రి మీరు ఇంట్లో ఎప్పటి నించి ఉన్నారు? గేబ్రియల్ ఇంట్లోకి ఎవరైనా వెళ్లడం కానీ, రావడం కానీ చూశారా?’
‘నేనా రాత్రి ఇంట్లో లేను. అర్ధరాత్రి దాటాక వచ్చాను. నేను కారుని ఆపి దిగి తలుపు దాకా వొంటరిగా నడిచి వచ్చాను. ఆ పిచ్చివాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఆ సమయంలో ఉన్నాడు’ ఆమె కంఠం భయంతో వణికింది.
‘కానీ అప్పటికి అతను వెళ్లిపోయి ఉంటాడు’
‘మీరింకా హంతకుడ్ని కనుక్కోలేదా?’
‘ఇంకా లేదు’
‘ఐతే ఏ మహిళకీ భద్రత లేదు’
‘నిజమే. ఏ మహిళకీ భద్రత ఉండదు. దేశంలో పిచ్చివాళ్లు ఎక్కువమంది ఉన్నారు. అతను మళ్లీ ఎవరినైనా చంపుతాడని నేను అనుకోను. అతను గేబ్రియల్‌ని పగతోనో, అసూయతోనో చంపి ఉంటాడు’
నోయల్ మళ్లీ ఖరీదైన కారు వ్యక్తి గురించి చెప్పాలనుకున్నాడు. కాని మళ్లీ వద్దనుకున్నాడు.
‘హంతకుడు ఆమె మీదకి వెనక నించి దాడి చేశాడు. ఆమె గెడ్డాన్ని వెనక నించి పట్టుకుని తలని బలంగా వెనక్కి వంచి, కుడిచేత్తో ఆమె గొంతుని తెక్కోసాడు. ఇక్కడ ఆడవాళ్లు భావిస్తున్నట్లు అది పిచ్చివాడి పనని నేను అనుకోవడం లేదు’
‘కాకపోతే శరీరాన్ని అలా ఎందుకు కోస్తాడు?’ లియోనా అడిగింది.
‘నేను పొరపడి ఉండచ్చు’
‘కత్తి మీద వేలిముద్ర మాటేమిటి?’ నోయల్ ప్రశ్నించాడు.
‘బహుశా హంతకుడు కావాలనే దాన్ని వదిలి ఉంటాడు. అందువల్ల కలిగే ప్రమాదం అతనికి థ్రిల్‌ని కలిగించచ్చు. లేదా ఏదో విని భయపడి దాన్ని వదిలేసి పారిపోయి ఉండచ్చు. హంతకుడు కేవలం గేబీనే చంపాలనుకున్నాడు. కాబట్టి ఆడవాళ్లెవరూ భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మీకేదైనా గుర్తొస్తే, నాకు ఫోన్‌చేసి చెప్పడం మర్చిపోకండి’
* * *
గేబ్రియల్‌ని చంపిన హంతకుడ్ని లెఫ్ట్‌నెంట్ పట్టుకోలేక పోయాడు. చివరికి ఆ కేస్‌ని మూసేశారు. గేబీ దూరమయ్యాక నోయల్‌లో ఉత్సాహం క్రమేపీ తగ్గిపోయింది. ఆఫీస్ పనిలో శ్రద్ధ తగ్గింది. వారి కస్టమర్స్ పోటీదారుల దగ్గరకి వెళ్లిపోయారు. అతని బాస్ పరోక్ష హెచ్చరికలు చేశాడు. నోయల్ మరో ప్రియురాలి కోసం ప్రయత్నించాడు. కానీ సఫలం కాలేదు.
అదే సమయంలో లియోనాకి ప్రమోషన్ వచ్చింది. నోయల్ కంపెనీ కారుని వెనక్కి తీసుకున్న వారానికే లియోనాకి డ్రైవర్‌గల కంపెనీ కార్‌ని అలాట్ చేశారు. కంపెనీ ఆమెకి ప్రత్యేకంగా ఏభై వేల డాలర్ల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇచ్చింది.
హంతకుడు మళ్లీ హత్య చేయకపోవడంతో లెఫ్ట్‌నెంట్ కేబ్రిక్ తన పగ లేదా అసూయ థియరీ నిజమని నమ్మాడు. లియోనా చాలా నెలలుగా భయపడేది జరిగింది. నోయల్ పొరుగూరులో రేజర్‌ని డబ్బిచ్చి కొన్నాడు. ఈసారి హంతకుడి వేలిముద్ర ఆ కత్తిమీద ఉండదు. మోడ్రన్ ఆపరెండీ ఈ ఒక్క విషయంలోనే మారుతుంది. ఎలిబీ ఒకటే అతని సమస్య. అది అంత తేలిక కాదు. ఒకే సమయంలో తన భార్య దగ్గర, ఓ కస్టమర్ దగ్గర ఎలా ఉండడం? డ్రింక్ పార్టీలోంచి కొద్దిసేపు మాయమైతే తాగి ఉన్నవారు గమనించరు. ‘నోయల్ రాత్రంతా ఇక్కడే ఉన్నాడ’ని చెప్తారు.
‘గురువారం రాత్రి నువు ఇంట్లోనే ఉంటావా?’ లియోనాని అడిగాడు.
‘ఎందుకు ఉండను? మీరు కనె్వన్షన్ పార్టీలో ఉంటే, నేనిక్కడ టి.వి చూస్తూంటాను’
గురువారం రాత్రిని ఎంపిక చేసుకున్నాడు. తన ఉద్యోగం ఊడేలోగానే ఆమెని చంపదల్చుకున్నాడు. లేదా తర్వాత తను ఆమెని ఇన్సూరెన్స్ కోసం చంపేసాడనే అనుమానం రావచ్చు. నిరుద్యోగికి ఏభై వేల డాలర్లు ఎక్కువ. ప్రస్తుతం తనకవి తక్కువ. తన ఉద్యోగం పోగానే లియోనా తన విషయంలో ఇంకాస్త మారుతుంది. గేబీ మరణించినప్పటి నించి భయం నెపంతో ఆమె ప్రతీ రాత్రి అతని పక్కనే నిద్రిస్తోంది. గేబీ పోయాక తన భార్యని ఇంకా తక్కువ ప్రేమిస్తున్నాడు. ఏభై వేల డాలర్లతో ఇంకో చోటికి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ జీవించచ్చు. కాబట్టి అందుకు గురువారం రాత్రిని ఎన్నుకున్నాడు. ఆ రాత్రి అతని ఆఫీస్ పార్టీ ఇస్తోంది.
* * *
గురువారం రాత్రి తనని పార్టీలో అంతా గుర్తించడానికి కరచాలనాలు చేశాడు. వాళ్ల వీపుల మీద కొట్టాడు. జోక్స్ చెప్పాడు. బాగా తాగినట్లు నటించినా మత్తెక్కకుండా తాగాడు. భోజనానంతరం సిగార్స్ వెలిగించి అంతా కబుర్లు చెప్పుకోసాగారు. లైట్లు ఆరిపోయి పరిశ్రమలోని కొత్త మార్పుల మీద నలభై ఐదు నిమిషాలు ప్రత్యేక సినిమా ఆరంభమైంది. నలభై ఐదు నిమిషాల సేపు నోయల్‌ని ఎవరూ పట్టించుకోరు.
లిఫ్ట్‌ని వాడలేదు. కారుని వీధిలో పార్క్ చేయడంతో పార్కింగ్ అటెండెంట్ అతన్ని గమనించలేదు. పనె్నండు నిమిషాల్లో కారులో ఇంటికి చేరుకున్నాడు. చలికి అంతా తలుపులు మూసుకుని ఇళ్లల్లోనే ఉన్నారు. ఇరుగు పొరుగు ఇళ్లకి ఎవరు వచ్చిపోతున్నారో చూడడంలేదు.
‘ఇదేమిటి? ఇంటికి త్వరగా వచ్చారేమిటి?’ తలుపు తీసిన లియోనా ఆశ్చర్యంగా అడిగింది.
‘పార్టీ బోర్‌గా ఉంది’
పడక గదిలోకి వెళ్లి దుస్తులు విప్పాడు. నగ్నంగా హాల్లోకి వచ్చి వెనక నించి ఎడం చేత్తో ఆమె గడ్డాన్ని పట్టుకున్నాడు. కుడి చేతిలో కత్తి.
‘నోయల్! ఏమిటిది?’ ఆమె ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
జవాబుగా కత్తిని ఉపయోగించాడు. బయటికి చిందిన నెత్తురు అతని మీద పడలేదు. అటుఇటు ఊగి ఆమె కిందకి జారిపోయింది. ఆమె రక్తసిక్తమైన చేత్తో బరువైన ఏష్ ట్రేని పట్టుకుంది. కానీ ఆమె దాన్ని ఉపయోగించకుండానే మరణించింది. గేబీ విషయంలో ఎలా జరిగిందో సరిగ్గా అలాగే జరిగిందని తృప్తి చెందాక చేతులు కడుక్కుని, రక్తం అంటిన గ్లవ్స్‌ని విప్పదీశాడు. రేజర్‌ని లియోనా నైటీకి వేలిముద్రలు లేకుండా తుడిచి పక్కనే పడేశాడు. స్నానం చేసి దుస్తులు తొడుక్కున్నాడు. ఎప్పటికన్నా శ్రద్ధగా ఒళ్లు తోముకున్నాడు. తలుపు తాళం వేసి బయటకి నడిచాడు.
ఎవరూ అతను కారెక్కి వెళ్లడాన్ని చూడలేదు. మళ్లీ పనె్నండు నిమిషాల తర్వాత కారుని అక్కడే ఆపి హోటల్లోకి నడిచాడు. అతను వెళ్లేసరికి సినిమా పూర్తవుతోంది. ఈసారి మామూలుగా తాగి ఇతరుల వీపు మీద కొట్టి, కరచాలనం చేసి జోక్స్ చెప్పాడు. ఆ సినిమా గురించి ఇతరులని ప్రశ్నించి అది దేని గురించో తెలుసుకున్నాడు. లెఫ్ట్‌నెంట్ కేబ్రిక్ తనని దాని గురించి ప్రశ్నిస్తాడని అతని నమ్మకం. ఎప్పటిలా కారులో ఇరవై నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడు. తలుపు తాళం తీసి లోపలికి వెళ్లి పోలీసులకి ఫోన్ చేసి షాక్‌ని అభినయిస్తూ ఫిర్యాదు చేశాడు.
* * *
హత్య చేయడం సాధారణమైన విషయం కాదు. అతను నిజంగా షాక్‌లో ఉన్నాడు. లెఫ్ట్‌నెంట్ కేబ్రిక్ సలహా ప్రకారం పరిశోధనకి ఇంటిని వారికి వదిలి నోయల్ ఆ రాత్రి హోటల్ గదిలో గడిపాడు.
మర్నాడు ఉదయం పదకొండుకి లెఫ్ట్‌నెంట్ అతని గది తలుపుని కొడితే కాని మెలకువ రాలేదు.
‘లియోనా ఊరికే భయపడలేదు. ఆ మేనియాక్ పనే కదా ఇది?’ నోయల్ ప్రశ్నించాడు.
‘అలా ఎందుకు అనుకుంటున్నారు?’ కేబ్రిక్ అడిగాడు.
‘నేనా రేజర్ని చూశాను’
‘ఈసారి దాని మీద వేలిముద్ర లేదు. కానీ కాఫీ టేబుల్ మీద, ఏష్ ట్రే మీద రక్తపు వేలిముద్రలు లభించాయి’
‘ఐతే హంతకుడు దొరికినట్లేనా?’
‘కాదు. అవి మీ భార్యవి. ఆశ్చర్యం ఏమిటంటే మీ భార్య వేలిముద్రలు, గేబ్రియల్‌ని చంపిన రేజర్ మీది వేలిముద్రలు ఒకటే’
నోయల్‌కి ప్రపంచం గిర్రున తిరిగినట్లయింది.
‘మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మిస్టర్ నోయల్. మీ భార్య గేబ్రియల్‌ని ఎందుకు చంపినట్లు? ఆమె గేబ్రియల్‌ని చంపితే ఇప్పుడామెని ఎవరు చంపినట్లు? మిస్టర్ నోయల్. నాకో థియరీ ఉంది...’
నోయల్ వినడం ఆపేశాడు.
‘లియోనా గేబీ గొంతుని ఎందుకు కోసినట్లు?’
జవాబు చెప్పడానికి అతనికి కారణం తోచలేదు. బహుశా తర్వాత తట్టచ్చు.

(సి బి గిల్‌ఫోర్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి