S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏది ముందు?

కొంతమంది, తాము చెప్పదలుచుకున్న సంగతిని గురించి గంటసేపు వివరిస్తారు. అయినా చివరకు ఎక్కడి వారు అక్కడే మిగిలిపోతారు. కొందరు అనుభవసారాన్ని పిండి, ఒక్క వాక్యంలో చెప్పి ఊరుకుంటారు. అప్పుడు శ్రోత ఆలోచనలో పడిపోతాడు. ఆలోచనలో పడిన మనిషి, ఆ విషయం గురించి, మరెన్నో విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎన్నో తెలుసుకుంటాడు. మిగతా వారికి వివరిస్తాడు. మేమంతా ‘క్లుప్తంగా విశదీకరిస్తారు’ అంటూ జోక్ వేసుకునేవాళ్లం. అది జోకు కాదని, గొప్ప ఛాలెంజ్ అని తరువాత అర్థమయింది.
వేరువేరు భాషల మీద, వాటిలో రచనల పట్ల ఆసక్తి కారణంగా చదవడం అన్న కార్యక్రమం, ఏదో మామూలుగా గాక కొంచెం గవేషణ, అనే్వషణ పద్ధతిలో సాగింది నా విషయంలో. కన్నడ సర్వజ్ఞ, తమిళ తిరువళ్లువర్, మరాఠీ తుక్కారాకుల రచనలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పంచి ఇచ్చాయి. జీవితం అందించిన అనుభవాలను, ప్రపంచం ముందుంచిన అవగాహనలను ఈ మహానుభావులు తక్కువ మాటలలో ఒక్కచోట చేర్చి చెప్పారు. ఈ రచనలు తెలుగులో నిజానికి ఏనాడో వచ్చి ఉండాలి. తిరుక్కురళ్‌లోని కొంత భాగం మాత్రం పద్యరూపంలో దొరికింది. సర్వజ్ఞుని గురించి మనవారు పట్టించుకోలేదు. మిత్రులు గంగిశెట్టి లక్ష్మినారాయణ రాసిన చిన్న పుస్తకం తప్ప ఈ మహానుభావుని గురించి తెలుగులో సమాచారం నాకు కనిపించలేదు. తుకా అభంగుల సంగతి గురించి కూడా అంతే!
వేమన పద్యాలు మిగతా భాషలలోకి అందినయా అని ప్రశ్న పుడుతుంది. నిఘంటువును కూర్పించిన బ్రౌన్‌దొర వేమనను ఆంగ్లంలోకి రాశాడు. ఆ పుస్తకం ఏదో రూపంలో దొరుకుతుంది. నాకు దొరికింది కూడా. కానీ అందులో తెలుగు మూలం ఉండదు. పది, పదిహేను పద్యాలకు అనువాదం, వ్యాఖ్యానం రాసి నా బ్లాకు లోకాభిరామం - బ్లాగ్‌స్పాట్‌లో పెడితే, ఎంత మంది చదివారో? మొత్తం పద్యాలకు ఇలా వ్యాఖ్యానం రాయమని చెప్పిన వారున్నారు. కానీ, ఒక్కడిని. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏది ముందు? ఏది తరువాత అన్నది సమస్య అయింది.
‘కోటి విద్యలలోకి మేటి (మేడి, వ్యవసాయం) విద్య మేలు’ అన్న సర్వజ్ఞుని త్రిపదల గురించి తెలుగు పాఠకులు ఎంతమందికి తెలుసు? పక్క రాష్ట్రం వాడయిన సర్వజ్ఞుని పద్యాలు ఇనే్నళ్లు, ఇన్నాళ్లు అయినా తెలుగులో రాలేదు. వస్తే ఎక్కడున్నాయి? ఇవి నా ప్రశ్నలు. ఇందులో మనం చేయగలిగింది ఏమయినా ఉందా? అన్నది మరో ప్రశ్న. మళ్లీ ఏది ముందు? ఏది తరువాత అని తేల్చుకోవలసిన పరిస్థితి.
వేమన, తిరువళ్లువర్, సర్వజ్ఞ లాంటి వారు తమ అవగాహనలను సులభమయిన రూపంలో ప్రపంచానికి అందించి గతించారు. సంత్ తుకారాంజీ మహారాజ్ రచనలు అంత సూటిగా సాగవు. ఉన్నట్టుండి వాటిలో మార్మికత ఎదురవుతుంది. మామూలు చదువరికి అందులో లోతు అందదు. ఇక్కడా అదే సమస్య. తుకా రచనల ఆంగ్లానువాదాలు దొరికాయి. ఇప్పటివి కావు. ఎప్పుడో వెనకట వేసినవి. కానీ, అనువాదం ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోబూనితే, ఎక్కడో ఏదో తప్పిపోయిందన్న భావం మిగిలింది. నాకు మరాఠీ రచనలను ఎవరు వివరించి చెప్పాలి? ఎవరో దొరకక పోరు. కానీ, అది ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది. ఈ జన్మకు చేయవలసిన పనులు ఇన్ని ఉంటే, మిగిలిన కొన్ని సంవత్సరాలు నిత్యం పోరాటం సాగించినా అనుకున్నవి కొన్నయినా నావల్లనయ్యేనా? వాటిలో ఏది ముందు, ఏది ఆ తరువాత?
ఇప్పటికే, అర్థం చేసుకుని, చెయ్యి చేసుకోవలసిన పనులు కుప్పలుగా పేరుకుని ఉంటే, ఆ మధ్యన, నిజానికి చాలా ఏళ్ల కిందటే ఒక ఖలిల్ జిబ్రాన్ ఎదురయ్యి అదరగొట్టాడు.
ఒక పుస్తకం, ఒక రచన, వాటిలోని మాటలను మరిచిపోగలిగితే, అది నా దృష్టిలో మామూలు రచన. కొన్ని రచనలు, వాటి తీరు, కొన్ని మాటలు మనిషిని వెంటాడతాయి. గుర్తుకు వచ్చిన నాడు నిద్ర రాకుండా చేస్తాయి. ఖలిల్ జిబ్రాన్ అంతకన్నా లోతయిన ప్రభావంగల మాటలు రాశాడు. ఆయన నవలలు రాయలేదు. రాసిన కొన్ని రచనలను కథానికలు అనవచ్చునేమో? జిబ్రాన్ ముఖ్యంగా రాసినవి, తన సంస్కృతిలో భాగంగా విన్న మాటలు, పారబుల్స్ అనే కథలు. ఈ రకం కథలు అన్ని సంస్కృతులలోనూ ఉంటాయి. కానీ ఈ రచయిత వాటిని చెప్పిన తీరు సాటిలేనిది.
ఖలిల్ జిబ్రాన్ గురించి నా మాటలు విన్న నా కొడుకు, ‘జిబ్రాన్ సర్వస్వం’ పుస్తకం కొని నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను వాండరర్, శాండ్ అండ్ ఫోమ్ అనే రచనలను తెలుగు చేశాను. మొదటి రచనను నా వెబ్‌సైట్‌లో పెట్టాను. ఈ పని జరిగి ఏళ్లయింది. నా అనువాదాన్ని చాలామంది చదివారు. కథ అక్కడ ఆగి ఉంది. ఆ మధ్యన కవిమిత్రులు ముకుంద రామారావు ‘నేను ఖలిల్ జిబ్రాన్‌ను అనువదించాను’ అన్నారు. కాళన్న అనే కాళోజీ నారాయణరావు ‘ప్రాఫెట్’ అనే జిబ్రాన్ మొదటి రచనను అనువదించారని తెలుసు. అది కొంత వివాదాలకు కూడా దారి తీసింది. రామారావుగారి మాటలతో నా దృష్టి మళ్లీ జిబ్రాన్ వేపు మళ్లింది. అనువాదాలు చేసి పుస్తకాలుగా వేయాలని మాత్రం ఆలోచన రాలేదు.
జిబ్రాన్ పుస్తకాలు చిన్నవి. మొత్తం పనె్నండు మాత్రమే ఉంటాయి. వాటిలో మొదటిది ప్రాఫెట్. కవితా ధోరణిలో నడుస్తుంది. రెండు, మూడు, సంఖ్య గల పుస్తకాలను నేను తెలుగులో రాశాను. నాలుగు, అయిదు కూడా కథలే. అవి కథానికలు కావు. కొన్నింటిని కథలు అనడానికి కూడా లేదు. నిజానికి మూడవ పుస్తకం ఇసుక-నురుగులో ఉండేది సూక్తుల వంటి మాటలు. వాటిని సూక్తులు అంటే, కనీసం నాకు, నచ్చదు! ఒకటి, మూడు రచనలను ఎవరో అనువదించారని, ఖలిల్ జిబ్రాన్‌ను తీవ్రంగా అభిమానించే ఒక పెద్దాయన వాటిని అచ్చువేయిస్తున్నారని తెలిసింది. సహజంగానే కంప్యూటర్‌లో దాగి ఉన్న, నా అనువాదాల ప్రసక్తి వచ్చింది. మూడవ పుస్తకం వేస్తామని వాళ్లే అన్నారు. నా అనువాదం నచ్చిందన్న మాటను చెప్పకుండా చెప్పినట్టున్నారు. ఇంకేముంది? కోతికి కొబ్బరికాయ దొరికింది. నాలుగవ పుస్తకం చూస్తుండగా తెలుగులోకి మారింది! ఒక రచయిత, ఆయన రచనలు నిన్ను ఎంతగా ప్రభావితం చేశాడనడానికి, ఈ, ఆరాధనా భావం ఆధారమని నా అభిప్రాయం!
జిబ్రాన్ మాటలు ఒక వేమన పద్యం వలె, ఒక కురళ్ సూక్తి వలె సూటిగా ఉండవు. మొదటి చూపులో అవి మామూలుగానే కనపడతాయి. కానీ వాటిలో ఒక లోతు ఎదురవుతుంది. తనను తాను పిచ్చిమనిషినని చెప్పుకోవడం జిబ్రాన్‌కు చేతనయింది. ఆ ప్రభావం నా మీద ఉంటే, ఆ సంగతి మిగతా వారు చెప్పాలి. నేను నిరుద్యోగిగా, గుర్తింపులేని పిచ్చి బతుకు సాగిస్తున్నాను. ‘నేను పిచ్చివాడిని. కాని, ఆ సంగతి నాకు తెలుసు. అదే నా బలం, బలహీనత’ అనడం నాకు చాలాకాలంగా అలవాటుగా మారింది. జిబ్రాన్ రచనలలో నేను ఇటీవల తెలుగు చేసిన నాలుగవ పుస్తకం శీర్షిక ‘పిచ్చి మనిషి’. జిబ్రాన్ ఆత్మాశ్రయంగా అంటే, ‘నేను’ అంటూ పిచ్చి మనిషి గురించి చెపుతాడు. నా పిచ్చి అంత బలంగా, అంత లోతుగా, మార్మికంగా లేదని నాకు సంపూర్తిగా తెలుసు! ఈ ప్రపంచంలో జిబ్రాన్ వంటి వారు ఎవరూ ఉండరు. ఉండబోరు. ఉండకూడదు కూడా!
‘పిచ్చిమనిషిని’ అభిమానించే పిచ్చివాళ్లు మాత్రం ఉండవచ్చు గదా!
**

- కె.బి. గోపాలం