S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం - 22

‘చూడండి... డ్రగ్స్ కేసులు రెండు రకాలు. ఆ మనిషి డ్రగ్స్ స్వంతానికి వాడుతున్నాడా? ఇతరులకు కూడా అందిస్తున్నాడా? అన్న దాని మీద కేసు తీవ్రత ఆధారపడి ఉంటుంది. కేవలం స్వంత వాడకానికి డ్రగ్స్ దగ్గర ఉంచుకుంటే, అతనికి ఉన్న సోషల్ స్టేటస్‌నిబట్టి, చేసిన తప్పు మొదటిసారిగా భావించి బెయిల్ దొరకవచ్చు. కానీ.. ఈ కేసులో పోలీసులు చెప్తున్న వివరాలను బట్టి అభిమన్యు దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ దొరికాయని తెలుస్తోంది. నా అనుభవంలో అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడిన వ్యక్తికి బెయిల్ దొరకటం అసంభవం...’
తరువాత ఫోన్ లైన్లోకి ఆ రోజు రిలీజవుతున్న సినిమా తీసిన నిర్మాత వచ్చాడు.
‘అభిమన్యు అరెస్ట్ వలన మీ సినిమా విజయావకాశాలు దెబ్బతింటాయంటారా?’ అడిగాడు యాంకర్.
‘మా సినిమా కథ మీద ఆధారపడింది తప్ప ఏ ఒక్కరి మీదో ఆధారపడి లేదు. ఆ మాటకొస్తే, అభిమనే్య కాదు మరే హీరో ఈ సినిమాలో నటించినా హిట్ అయ్యేదే!...’ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చెప్తున్నాడు.
మొత్తానికి ఆ రోజంతా టీవీ ఛానళ్లలో ఇదే వార్త.
కోర్టులో అభిమన్యుకి బెయిల్ రాలేదు. పైగా అతను ఇప్పుడప్పుడే జైలు నుండి బయటపడే అవకాశాలు లేవని అనుభవజ్ఞులయిన లాయర్లు చెప్తున్నారు.
టాలీవుడ్ చాలా చిన్న ప్రపంచం.
ఆ సాయంత్రానికి అభిమన్యు ఫ్యూచర్ డిసైడ్ చెయ్యబడింది. అతనితో తమ తదుపరి సినిమాలు తీద్దామని ఎవరికయినా ఆలోచన ఉంటే, వారు వేరే హీరోల వేటలో పడ్డారు.
కోర్టు జడ్జిమెంట్ రావటానికి పది సంవత్సరాలు పట్టవచ్చు. కానీ, టాలీవుడ్ మాత్రం అభిమన్యు మీద తన జడ్జిమెంట్ చెప్పేసింది.
మరొక నెల రోజుల తరువాత డిఎస్పీ శ్రీనివాస్ ఎస్పీగా ప్రమోట్ అయ్యాడు. అయితే అది మీడియాలో రాదగ్గ వార్త కాదు కాబట్టి ఎక్కడా ఎవరికీ తెలియలేదు.
* * *
నా రెండవ టార్గెట్ సంతోష్. ఇప్పుడు నా దృష్టి అతని మీద పెట్టాను. అతని గురించిన పూర్తి వివరాలు సేకరించటం మొదలుపెట్టాను.
ఏ ముహూర్తాన వసంతరావ్ గారు అతనికి వసంతం సినిమా బాధ్యతలు అప్పజెప్పారో కానీ, అప్పటి నుండి అతని జీవితమే మారిపోయింది.
ఆ సినిమా అంత హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దాని విజయం వలన అందరికంటే బాగుపడింది సంతోషే! వెనువెంటనే అతనికి పెద్ద హీరోల నుండి ఆఫర్లు వచ్చాయి.
పెద్ద హీరోతో, భారీ బడ్జెట్‌తో తీసిన తరువాత సినిమా కూడా హిట్ అయింది. అంతే! ఇక అవకాశాల వెల్లువ మొదలయింది.
అలాంటి సమయంలో అతనికి పరిచయం అయ్యాడు స్వామి. అప్పటికి స్వామి అంటే ఎవరో కూడా సంతోష్‌కి తెలియదు. కానీ... అతను సంతోష్ ముందు ఉంచిన ప్రపోజల్ మాత్రం బంగారు గుడ్లు పెట్టే బాతును ఊరికినే ఇస్తానన్నట్లు ఉంది.
స్వామి ఒక ఫ్యాక్షనిస్టుకి నమ్మినబంటు. ఆ ఫ్యాక్షనిస్టు రకరకాల అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ప్రభుత్వానికి తెలియకుండా ఎక్కడెక్కడ దాయాలా అని ఇబ్బంది పడుతున్నాడు.
‘మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత ఖర్చు పెట్టి అయినా సినిమా తియ్యండి. నిర్మాతగా నా పేరు వద్దు. మీ పేరే వేసుకోండి. నేను అగినపుడు నా డబ్బు తిరిగి ఇవ్వండి. చాలు!...’ అని తన ప్రతిపాదన వివరించాడు స్వామి.
‘సినిమా తియ్యటమన్నది అన్నిటికంటే పెద్ద జూదం. అందులో ఎప్పుడో తప్ప లాభాలు రావు. ఆశపడి మీ దగ్గర డబ్బు తీసుకుని సినిమా తీసి, అది ఆడకపోతే నేను మీకు డబ్బు ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలి?’
నవ్వాడు స్వామి. ‘నేను నిన్ను నమ్ముతాను. నష్టం వచ్చిందని నన్ను నమ్మిస్తే చాలు. నష్టపోయిన డబ్బు తిరిగి ఇవ్వనవసరం లేదు. ఒకటే కండిషన్ - నమ్మకద్రోహం చెయ్యకుండా ఉంటే చాలు...’
చాలాసేపు ఆలోచించిన సంతోష్, ‘దీనివల్ల మీకేమిటి లాభం?’ అని అడిగాడు.
‘మా బాస్ దగ్గర వందల కోట్లు ఇలాంటి డబ్బు మూలుగుతోంది. దాన్ని సర్క్యులేషన్లో పెట్టటమే మా ధ్యేయం’
‘సరే!... అయితే అగ్రిమెంట్ రాసుకుందామా?’ ఒక నిర్ణయానికి వచ్చిన సంతోష్ అన్నాడు.
‘అక్కర్లేదు. నేను మనిషిని నమ్ముతాను. మాటను నమ్ముతాను. మనిషి మాట తప్పితే ఆయుధాన్ని నమ్ముతాను. నాకు అగ్రిమెంట్ అవసరం లేదు. ఎప్పుడు ఎంత డబ్బు కావాలో కబురు చెయ్యి, పంపిస్తాను..’ అంటూ లేచి వెళ్లిపోయాడు.
అప్పటి నుండి సంతోష్ దశ తిరిగింది. ఒకటొకటిగా తన స్వంత బ్యానర్ మీద సినిమాలు మొదలుపెట్టాడు. కొన్ని హిట్ అయినయ్! కొన్ని యావరేజ్‌గా పోయాయి. మొత్తానికి అతను అతి తక్కువ సమయంలో పెద్ద నిర్మాతగా సెటిల్ అయ్యాడు.
అతని మీద అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని అనేక రూమర్లు పుట్టాయి. చాలాసార్లు అతని మీద ఐ.టి. దాడులు కూడా జరిగాయి. అయినా ఏమీ రుజువు కాలేదు.
ఈలోపు స్వామికీ, అతని బాస్‌కీ మధ్య గొడవలు వచ్చాయి. స్వామి తన బాస్‌కే ఎదురుతిరిగి అతన్ని చంపేశాడు. దానితో ఒకపక్క ఫ్యాక్షనిస్టు మనుషులూ, మరొక పక్క పోలీసులూ స్వామి కోసం గాలిస్తున్నారు. స్వామి అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయాడు.
ఇక్కడ కొసమెరుపేమిటంటే ఇదంతా జరిగింది నా నియోజకవర్గంలోనే! ఆ ఫ్యాక్షనిస్టు కబంధ హస్తాల నుండి బయటపడ్డ సామాన్య ప్రజలు సంతోషించినా, అతని అనుచరుడు స్వామి దొరక్కపోవటం వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆనోటా, ఈనోటా స్వామికి అండదండలు ఇచ్చేది సంతోష్ అనే మాట నా చెవిన పడింది.
అప్పటికే స్వామి బృందం బలవంతంగా ఆక్రమించుకున్న ఆస్తులను ఒకటొకటిగా అసలు బాధితులకు ఇప్పించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. కానీ, ఏ పని చేయాలన్నా స్వామి దొరక్కపోవటం అడ్డంకిగా మారుతోంది.
ఇంతలో నాకు స్వామి గురించిన ఒక రహస్య సమాచారం రామభద్రం ద్వారా తెలిసింది. వెంటనే ఎస్.పి. శ్రీనివాస్‌ని పిలిపించాను. స్వామి, సంతోష్ మధ్య సంబంధాల గురించి నాకు తెలిసిన రహస్యం చెప్పాను.
అతను ఎగిరి గంతేశాడు. స్వామిని పట్టుకోగలగటం అంటే ఎంత హై ప్రొఫైల్ విషయమో అతనికి బాగా తెలుసు. అప్పటి నుండి సంతోష్ ఫోన్ ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్‌లో పెట్టారు.
ఎన్ని రోజులు ఎదురుచూసినా ఏ విధమయిన బ్రేక్ థ్రూ లభించలేదని పోలీసులు నిరాశ పడుతున్న సమయంలో నాకు రామభద్రం ద్వారా మరో వార్త తెలిసింది. సంతోష్, స్వామి మధ్య మాటల కోసం ఒక ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ ఉంది. దాన్ని వారు వేరే పనులకు వాడరు. ఆ నెంబర్ కూడా పోలీసులకు నేనే అందించాను. ఆ ఫోన్ కూడా పోలీసుల నిఘాలోకి వచ్చింది.
అనుకున్నట్లే ఒక రోజు స్వామి సంతోష్‌కి ఫోన్ చేశాడు. వారి మధ్య జరిగిన సంభాషణ శ్రీనివాస్ నాకు తరువాత వినిపించాడు. పోలీసులు ఎంత పక్కాగా నా ప్లాన్ అమలు చేశారో కూడా అతనే కళ్లకు కట్టినట్లు వివరించాడు.
‘ఏం కావాలి?’ సంతోష్ గొంతు భయంభయంగా వినిపిస్తోంది.
‘డబ్బు’
‘ఎంత?’
‘ప్రస్తుతానికి పాతిక లక్షలు’
‘ఇలా ప్రతిసారీ డబ్బు పంపటం ఎంత కష్టమో నీకు తెలియటంలేదు...’
‘ఇస్తున్నది ఎవరి డబ్బో ఆలోచించుకుని మాట్లాడు. అది నా డబ్బు. నాకేదో మేలు చేస్తున్నట్లు మాట్లాడకు. నాకు చిరాకేస్తుంది’
‘సరే! ఎక్కడకు తెమ్మంటావ్?’
స్వామి చెప్పాడు.
ఆ రాత్రి స్వామి, సంతోష్ కలుసుకుంటారనుకున్న ప్రదేశంలో మాటువేసి ఉన్నారు పోలీసులు.
అనుకున్న సమయానికంటే ముందే వచ్చాడు సంతోష్. తన కారు రోడ్డు పక్కన పార్క్ చేసి సిగరెట్ తాగుతూ స్వామి కోసం ఎదురుచూస్తున్నాడు.
అయితే స్వామి ఎంతకీ రాలేదు.
తాము అక్కడ ఉన్నట్లు ఒకవేళ స్వామికి తెలిసిపోయిందా అని అనుమానం వచ్చింది శ్రీనివాస్‌కి.
అయితే అతని అనుమానాలు పటాపంచలు చేస్తూ రెండు గంటలు ఆలస్యంగా వచ్చాడు స్వామి. అతను తెచ్చిన కారు రోడ్డుకు మరోవైపు ఆగింది. అతను కారులో నుండి దిగలేదు.
సంతోష్ రోడ్డుకు అటువైపు ఆగిన కారు దగ్గరకు వెళ్లి కిటికీలో నుండి లోపలకు చూస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. కొన్ని క్షణాల తరువాత సంతోష్ చేతిలోని బ్రీఫ్‌కేస్ స్వామికి అందించాడు. సమయం మించి పోతోందని పోలీసులకు అర్థమైంది. ఎటాక్ స్టార్ట్ చెయ్యమని సిగ్నల్ ఇచ్చాడు శ్రీనివాస్.
అంతే!... ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిండిపోయింది. ‘స్వామీ! లొంగిపో...’ అంటూ ముందుకు దూకాడు శ్రీనివాస్.
నిశే్చష్టుడయిన సంతోష్ స్థాణువులా నిలబడిపోయాడు. స్వామి మాత్రం వెంటనే తేరుకుని, ‘డ్రైవర్! పోనియ్!...’ అంటూ జేబులో నుండి రివాల్వర్ తీశాడు.
కీచుమన్న శబ్దంతో కారు ముందుకు దూకింది. స్వామి కిటికీలో నుండి చేయి బయటకు పెట్టి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరుపుతున్నాడు.
ఇలా జరగవచ్చని శ్రీనివాస్ ముందే ఊహించాడు. అందుకే రోడ్డు చివర పల్లంలో అటు, ఇటూ కూడా పోలీసులను ఉంచాడు.
వారంతా ఒక్కసారిగా లేచి కారు మీద కాల్పులు మొదలుపెట్టారు.
స్వామి కారు టైరు ఒక బుల్లెట్ తగలడంతో పేలిపోయింది. అదుపు తప్పిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పల్లంలోకి జారిపోయింది.
పోలీసులందరూ పరుగెడుతూ పడిపోయిన కారును చుట్టుముట్టారు. దెబ్బలతో స్పృహ తప్పిన స్వామిని కారు బయటకు తీసి సంకెళ్లు వేసి పోలీసు వ్యానులో పడుకోబెట్టారు.
అప్పుడు కానీ ఎవరికీ సంతోష్ గుర్తుకు రాలేదు. అతని కోసం వెతికిన పోలీసులకు రోడ్డు మధ్యలో పడిపోయి ఉన్న అతని శరీరం కనిపించింది. బుల్లెట్ అతని తల్లో నుండి దూసుకుపోయి ఉంది.
పెద్ద సంచలనం సృష్టించింది ఈ వార్త.
ఒకపక్క ఎన్నో రోజుల నుండి ఎంత వెతికినా దొరకని స్వామి పట్టుబడటం, మరొక పక్క అతనికి సహాయం చేస్తున్న సంతోష్ మరణించటం అనే రెండు వార్తలతో మీడియా పండుగ చేసుకుంది.
‘సంతోష్ చనిపోయింది పోలీసుల బుల్లెట్ల వలన కాదు, స్వామి పేల్చిన రివాల్వర్ వలన. ఆ విషయం ఫోరెన్సిక్ రిపోర్టుల్లో కూడా కన్ఫర్మ్ అయింది...’ శ్రీనివాస్ టివిలో చెప్తున్న మాటలు వింటూ విసుగ్గా టీవీ కట్టేశాను.
నాకు సంతోష్ చనిపోవటం ఇష్టం లేదు. అతను చేసిన తప్పులకు చావుతో సులభమయిన పరిష్కారం దొరకటం నాకు ఇష్టం లేదు.
జరిగిందేదో జరిగింది. ఇక మిగిలింది చంద్రం. అతని విషయం కూడా తేల్చేస్తే నా ధ్యేయం నెరవేరినట్లవుతుంది. ఆ పని పూర్తి అయ్యే వరకు విశ్రాంతి తీసుకోబుద్ధి కావటంలేదు నాకు.

ప్రస్తుతం
‘ఇంకెన్ని రౌండ్లున్నాయి ఓబులేశూ?’ అడిగాడు అశోక్.
‘ఆఖరి రౌండ్ లెక్కింపు జరుగుతుందయ్యా...’
‘ఇప్పటివరకు మన మెజారిటీ ఎంత?’
‘చాలా తక్కువయ్యా! వందలోపే!!’
‘ఎక్కడ దెబ్బతిన్నామంటావ్? ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇన్ని మోసాలు చేసి కూడా ఇంకా గెలిచే పరిస్థితిలో లేకపోయాక ఇక మనమెందుకూ...’
‘కేవలం డబ్బు ఖర్చు చేసి ప్రజాభిప్రాయాన్ని మార్చలేమయ్యా!’
‘ఇంకొక మాట చెప్పు. నువ్వెవరు గెలుస్తారనుకుంటున్నావ్?’
‘మీరే గెలుస్తారనుకుంటున్నానయ్యా... మీరు గెలవాలని దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను’
‘ఎందుకు?’
‘మా అబ్బాయి మీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. నేను చిన్నతనం నుండి మీ పొలాలు కౌలుకు చేస్తున్నాను. మీరు బాగుంటేనే కదయ్యా, మేము బాగుండేది...’
‘ఒకవేళ వసుంధర గెలిచిందనుకో... అప్పుడేం చేస్తావ్?’
కాసేపు ఆలోచించాడు ఓబులేశు. ‘అదీ మంచిదేనయ్యా! మా జాతి మొత్తం బాగుపడుద్దనుకుంటానయ్యా...’

చంద్రం
నేను ఈ రోజు ఇంత గొప్ప పరిస్థితుల్లో ఉంటానని ఎవరూ ఊహించి ఉండరు. ఎవరిదాకానో ఎందుకు నేనే ఊహించలేదు.
సినిమా బడ్జెట్ తారుమారయి డబ్బు సమస్య ఏర్పడటంతో నటుడ్ని అయిన నేను, ఆ సినిమా హిట్ అవటంతో వెనుతిరిగి చూసుకోలేదు. నాలో ఎవరికి ఏ గొప్పదనం కనిపించిందో... అభిమన్యు కంటే నన్ను పొగడ్తల్తో ముంచెత్తారు. ఆకాశానికి ఎత్తేశారు. అవకాశాల మీద అవకాశాలు ఇచ్చారు.
అయితే ఒకటే బాధ మనసును నమిలేస్తున్నట్లుండేది. మాతోపాటు హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన వసుంధర ట్రయల్ షూట్ తరువాత గమ్మత్తుగా మాయమై పోవటం వెనుక రహస్యం ఇప్పటికీ అర్థంకాలేదు.
ఆ రోజు ట్రయల్ షూట్ సంతృప్తికరంగా ముగిసిందన్న ఆనందం అందరిలో తొణికిసలాడుతోంది. అందరం అభిమన్యు ఇస్తానన్న ట్రీట్ తీసుకోవటానికి అతని ఫార్మ్‌హౌస్‌కి చేరుకున్నాం.
వసుంధర కూడా మాతోపాటే వచ్చింది. ఆమె స్వతహాగా బిడియస్తురాలు. కొత్తవారితో త్వరగా కలవదు. కెమెరా ముందు పని అయిపోగానే ఒక మూలకి వెళ్లి కూర్చునేది. ఆమెను ఆ బిడియం నుండి దూరం చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ రాబట్టుకోవచ్చనేది సంతోష్ ఐడియానే! అందుకే మమ్మల్నిద్దరినీ ఆమెతో చనువుగా ఉండమని సలహా ఇచ్చాడు సంతోష్.
ఆమెతో క్లోజ్‌గా మూవ్ అవటానికి నేను కూడా మొదటిసారి వేషం వేస్తున్న నటుడినే కాబట్టి, ఆ బాధ్యత అభిమన్యు తీసుకున్నాడు. అలా అని మరీ ఓవర్ చెయ్యకుండా ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించసాగాడు అభిమన్యు. మరి వసుంధర దీన్ని ఎలా అర్థం చేసుకుందో నాకు తెలియదు.
ఫార్మ్‌హౌస్‌కు వచ్చిందన్న మాటేగానీ, వచ్చిన దగ్గర నుండి పొద్దుపోయింది, వెళ్లిపోతాను అనటం మొదలుపెట్టింది వసుంధర.
కూల్‌డ్రింక్ తాగి వెళ్లమన్న అభిమన్యు మాట కాదనలేక ఆగింది వసుంధర.
అభిమన్యు తెచ్చిన కూల్‌డ్రింక్ మొదట తాగింది వసుంధరే! ఆ తరువాత మేము తాగాం. మరి అందులో అభిమన్యు ఏమి కలిపాడో తెలియదుగానీ... అందరికీ ఒక రకమయిన మత్తు ఆవహించసాగింది. శరీరం తేలికయినట్లు అనిపిస్తోంది. ఆపకుండా నవ్వు వస్తోంది.
వసుంధర తన స్థితికి తానే భయపడి బయటకు వెళ్లటానికి గేటు వరకు వెళ్లింది.
ఇంట్లోకి వెళ్లిన అభిమన్యు ఇంకా బయటకు రాలేదు.
ఆమె ఆ స్థితిలో హాస్టల్‌కి ఎలా వెళ్లగలదని సంతోష్, నేనూ అనుకున్నాం. ఆమెని వారించే ప్రయత్నంలో ఆమె వెనుకే నడవబోయాం. అయితే మా శరీరం కూడా మా ఆధీనంలో లేదు. అప్పుడప్పుడూ మందు కొట్టినా మరీ ఇంత వశం తప్పటం ఎప్పుడూ లేదు. తడబడుతూ ఆమె వెనుక నడుస్తున్న మమ్మల్ని చూసి వసుంధర ఏమనుకుందో తెలియదు కానీ మరింత వేగంగా గేటు బయటకు వెళ్లిపోయింది.
హఠాత్తుగా వచ్చిన కారు ఆమెను గుద్దిందనే అనుకున్నాం. మేము కారు దగ్గరకు నడిచేటప్పటికే ఎవరో కారులో నుండి దిగటం, కింద పడిన వసుంధరని లేపి కారులో ఎక్కించుకోవటం, ఆమెని హాస్పిటల్‌కి తీసుకు వెళ్తున్నామని చెప్పి వెళ్లిపోవటం జరిగింది.
ఆ తరువాత వసుంధర మరి ఎవరికీ కనపడలేదు.
మాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. పోలీసు రిపోర్టు ఇద్దామా అంటే... అటు తిరిగి ఇటు తిరిగి ఆమె అదృశ్యానికి మమ్మల్ని బాధ్యుల్ని చేస్తారేమో అనే భయం వెంటాడింది.
చాలారోజులు ఆమె వస్తుందేమో అని ఎదురుచూశాము. ఆమెని వెతకటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నించాము. అయినా ఆమె దొరకలేదు. ఎన్నిసార్లు ఆమె ఫోన్‌కి రింగ్ చేసినా స్విచ్ ఆఫ్ అన్న మెసేజ్ వచ్చింది. ఒకపక్క సినిమా త్వరగా మొదలుపెట్టాలన్న సుబ్బరాజు ఒత్తిడి ఎక్కువయింది. ఒక మనిషి కోసం ఎదురుచూస్తూ సినిమా షూటింగ్ ఆపుకోలేరు కాబట్టి మరొక నటిని వెతుక్కోక తప్పలేదు. అప్పుడు కనిపించింది పరిమళ. ఆమె కూడా వసుంధరలానే సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆమెని తీసుకుని సంతోష్ దగ్గరకు వెళ్లాను. ఆమె సంతోష్‌కి కూడా నచ్చింది. ఆమెతో సినిమా ప్రారంభించాము. షూటింగ్ పూర్తయినన్ని రోజులే కాదు, తరువాత కూడా సంతోష్, అభిమన్యు నాకు ఎప్పుడు కలిసినా మా మధ్య వసుంధర గురించిన చర్చ తప్పక వచ్చేది. ఆమె ఉంటే సినిమా ఇంకెంత బాగా వచ్చేదో అని అనుకునేవాళ్లం.

మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002