S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోతిపిల్ల మంచితనం -- సిసింద్రీ

దండకారణ్య ప్రాంతంలోని ఓ దట్టమైన అడవి. ఆ అడవికి రాజు అతిబలుడు అనే ఏనుగు. ఎంతోకాలంగా అది ఆ అడవిలో ఎదురులేకుండా పాలన చేస్తూ ఉంది. మిగతా జంతువులన్నీ కూడా దాని మాటలకు ఎదురుచెప్పకుండా గౌరవంగా మెలిగేవి. చుట్టుపక్కల అడవి రాజ్యాలతో కూడా చక్కటి సంబంధాలు కలిగి ఉండేది. దానితో పక్క అడవిలోని జంతువులు ఈ అడవిలోకి, ఈ అడవిలోని జంతువులు పక్క అడవిలోకి స్వేచ్ఛగా వెళ్లొచ్చేవి.
అప్పుడప్పుడూ అడవి మధ్యలోని పెద్ద ఊడలమర్రి కింద జంతువులతో సభ నిర్వహించి, వాటి సమస్యలను విని, దానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చేది.
అలా ఒకరోజు తన రాజ్యంలోని జంతువులతో ఊడలమర్రి కింద సమావేశం జరుగుతూ ఉంది.
ఒక ప్రత్యేక వేదికపై ఏనుగు రాజు ఆసీనురాలైంది. పక్కన చిన్న వేదికలపై మంత్రులు ఎలుగుబంటి, అడవి దున్న కూర్చున్నాయి. మిగతా జంతువులన్నీ ఎదురుగా నేలపై కూర్చున్నాయి. సభ మొదలైంది. జంతువుల గురించి ఏనుగు మాట్లాడుతూండగా పక్క రాజ్యం నుండి తన చుట్టాలింటికి వచ్చిన కోతి మర్రి ఊడలు పట్టుకుని ఊయలూగుతూ ఉంది. ఎదురుగా ఉన్న జంతువులు ఏనుగు మాటలను వినకుండా కోతి విన్యాసాలను చూస్తూ ఉన్నాయి. తన మాటలు వినకుండా కోతిని చూడటం గమనించింది ఏనుగు. కోపంతో ఊగిపోయింది. కోతిపిల్లను బంధించమని రక్షక భటులైన తోడేళ్లకు చెప్పింది. అవి గెంతుతున్న కోతిని తెచ్చి ఏనుగు ముందుంచాయి.
‘అసలే కోతిచేష్టలు. ఆపై పిల్ల కోతి. పైగా పరాయి రాజ్యంలోది. వదిలేయండి’ అని మంత్రులు చెప్పినా ఏనుగుకు కోపం తగ్గలేదు.
‘వారం రోజులు మర్రిచెట్టుకు కట్టేసి ఆ తర్వాత వదిలేయండి. ఈలోగా దానికి ఆహారం ఇవ్వకండి. నేను ఇక్కడ ఉంటే అది నాముందే ఊయల ఊగుతుందా..!’ అని ఘీంకరించింది.
భటులు దానిని వారం రోజులు నిర్బంధించి వదిలేశారు.
కొంతకాలం తర్వాత ఏనుగు రాజు పని మీద పొరుగు రాజ్యం వెళ్లి తిరిగి వస్తూ ఒక పాడుబడిన గోతిలోకి జారిపోయింది. పైకి రావడానికి ఎంతగానో ప్రయత్నం చేసింది. కాని గట్టుపైకి రాలేకపోయింది. ఎంతగానో అరిచింది. దేనికీ దాని అరుపులు వినరాలేదు. రెండు రోజుల తర్వాత అటు వెళుతూ వున్న కోతి చూసింది.
‘అయ్యో రాజుగారా... ఎంత కష్టం వచ్చింది...’ అంటూ తొంగిచూసింది.
‘నువ్వు ఆ రోజు మర్రి ఊడలు పట్టుకొని ఊగిన కోతిపిల్లవు కదా..?’ అంది గుర్తు పట్టిన ఏనుగు.
‘అవును రాజుగారూ నేనే! వారం రోజులు తిండిలేక అల్లాడిపోయాను. నువ్వూ ఒక వారం రోజులుండు తర్వాత అందరికీ చెప్తాను..’ అంటూ కిచకిచలాడింది.
‘అమ్మో అన్ని రోజులు ఇలా వుండలేను. ఏదో మార్గం ద్వారా నన్ను బయటకు తీయండి. మిగతా వాటిని పిలువు’ అంది.
‘అందరూ ఎందుకు మా కోతి జాతే నన్ను బయటకు తీస్తుంది...’ అని తన మిత్రులందరినీ పిలిచింది.
అవన్నీ చుట్టుపక్కల గుట్టల మీది రాళ్లు మోసుకువచ్చి ఒక్కొక్క దానిని గుంటలోకి జారవేశాయి. కొంతసేపటికి గుంట పూడిపోగా ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుతూ ఏనుగు గోతిలోంచి బయటకు వచ్చింది.
ఈలోగా తమ రాజును వెతుక్కుంటూ వచ్చిన జంతువులు కోతుల తెలివికి అభినందించాయి.
‘ఈ కోతిపిల్ల ఒఠ్ఠి అల్లరి పిల్లని అనుకున్నాం. అల్లరిలోనే కాదు బుద్ధిబలంలోనూ తానే మాత్రం తీసిపోనని అనిపించింది. మన రాజుగారిని చక్కటి ఉపాయం ద్వారా బయటకు తీసింది’ అని మంత్రి మెచ్చుకున్నాడు.
గతంలో తాను శిక్షించినా అది మనసులో పెట్టుకోక ఆపద సమయంలో తన ప్రాణాలు కాపాడిన కోతిపిల్ల మంచితనానికి కృతజ్ఞతలు చెప్పింది ఏనుగు. అప్పటి నుండి జంతువుల సహజ గుణాలతో అవి చేసే అల్లరికి ఆనందపడటం నేర్చుకుంది ఏనుగు.

ప్రముఖ శాస్తవ్రేత్తలు

సలీమ్ అలీ
సలీమ్ అలీ పూర్తి పేరు సలీమ్ మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ. 1896 నవంబర్ 12న జన్మించాడు. సలీమ్ బంధువులలో చాలామందికి వేటకు వెళ్లే అలవాటు ఉంది. సలీమ్‌కు పది సంవత్సరాల వయసులో తన మేనమామతో కలిసి ముంబయి శివారు ప్రాంతాలకు వేటకు వెళ్లాడు. మేనమామ ఒక తుపాకీ తీసుకుని ఆకాశంలో హాయిగా సంచరించే పక్షులను కాల్చి పడగొడుతున్నాడు. అది చూసిన సలీమ్ తన గుండెని పట్టుకుని ఎవరో నలుపుతున్నట్లుగా విలవిలలాడిపోయాడు. ఆ చిన్నారి మనసు తట్టుకోలేక పోయింది.
మేనమామను వారించి, నేల వాలిన పక్షులకు సపర్యలు చేపట్టారు. మేనల్లుడి ఆసక్తిని గమనించి, మామ అతనిని మర్నాడు ముంబయి నేచురల్ హిస్టరీ సొసైటీ సెక్రటరీ అయిన మిల్లర్డ్‌కి పరిచయం చేశాడు. అంత చిన్నపిల్లవాడు పక్షుల గురించి తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని తెలిసి మిల్లర్డ్ సంతోషంగా అతణ్ని శిష్యుడిగా చేర్చుకున్నాడు.
ఆనాటి నుంచీ దాదాపు ప్రతిరోజూ అక్కడికి వెళ్లి పంజరాల్లోని పక్షులను పరీక్షిస్తూ వాటి ఆహారపు టలవాట్లు, ఐకమత్యం, జీవన విధానం గమనిస్తుండేవాడు. వాటితో ఉన్నంతసేపూ తిండి కూడా మరచిపోయి, గంటలు గంటలు గడిపేవాడు.
సలీమ్ సోదరుడు బర్మాలో వ్యాపారం చేసే నిమిత్తం బయల్దేరుతూ తనకు సహాయంగా ఉంటాడని సలీమ్‌ని కూడా తీసుకెళ్లాడు. సలీమ్ అక్కడ కూడా తోటల్లో, అడవుల్లో తిరుగుతూ, పక్షులను పట్టుకుని పంజరాల్లో పెంచుతూ వాటిని అధ్యయనం చేయటంలో మునిగిపోయాడు.
తిరిగి ముంబయి వచ్చి సొసైటీ మ్యూజియంలో గైడ్‌గా చేరాడు. ముఖ్యంగా పక్షులకు సంబంధించిన విషయాలను సందర్శకులకు చక్కగా వివరించడం యాజమాన్యానికి ఎంతో ఆనందం కలిగించింది. వారి సహాయ సహకారాలతో జర్మనీ వెళ్లి పక్షులపై పరిశోధనలు చేసే శాస్తవ్రేత్తలను కలిసి అనేక విషయాలు తెలుసుకుని తిరిగి ఇండియా వచ్చాడు.
కిహిమ్ అనే ప్రాంతంలో చిన్న ఇల్లు కట్టుకుని తన పక్షి సంపదను పెంపొందించుకుంటూ వాటిపై పరీక్షలు, పరిశోధనలు చేస్తూ 1930లో తన పరిశోధనా సారాంశాన్ని ప్రచురించాడు. ‘ది పాల్ ఆఫ్ స్ఫారో’ అనే పుస్తకాన్ని రాశాడు.
విదేశాలకు చెందిన ప్రసిద్ధ ఆర్నితాలజిస్టుల చేత ప్రశంసలందుకున్న పక్షి జాతి పితామహుడిగా పేరు తెచ్చుకున్న సలీమ్ ఆలీని భారత ప్రభుత్వం అనేక బిరుదులు, రాజ్యసభ సభ్యత్వంతోనూ గౌరవించింది. ‘మనుషులు పక్షుల నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది’ అని చెప్పే మానవతావాది కారుణ్యవాది అయిన సలీమ్ అలీ 1987 జూన్ 20న తన అంతిమ శ్వాస విడిచాడు. పక్షి జాతి మిత్రుడు ఎవరంటే సలీమ్ అలీ పేరే చెప్పటం విశేషం.

-పి.వి.రమణకుమార్

---------------------

విలువ -- స్ఫూర్తి

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

సునేత్ర తండ్రి తన భార్యతో చెప్పాడు.
‘ఈ ఆర్టికల్ చదివావా? దీని రచయిత అర్ధరూపాయి బిళ్లలని తీసేయాలని, దాంతో ఏమీ కొనలేమని రాసాడు’
‘చదివాను. కానీ అర్ధరూపాయిలు ఇప్పటికే సర్క్యులేషన్ లోంచి తగ్గిపోయాయి. నా చేతికి వచ్చిన వాటిని ఓ సీసాలో పడేస్తున్నాను’ సునేత్ర తల్లి చెప్పింది.
మర్నాడు సునేత్ర స్కూల్ నించి వచ్చాక తల్లిదండ్రులతో చెప్పింది.
‘్భకంప బాధితుల సహాయార్థం మా టీచర్ అందర్నీ డబ్బు తీసుకురమ్మంది. కేవలం అర్ధరూపాయి బిళ్లలే తేవాలని చెప్పింది.
తల్లి అర్ధరూపాయి బిళ్లలున్న సీసాని ఇచ్చాక నవ్వుతూ చెప్పింది.
‘నిన్న అర్ధరూపాయి బిళ్లలని విత్‌డ్రా చేయాలని రాసిన రచయితకి వీటి విలువ కానీ, భూకంప బాధితుల అవసరాలు కానీ తెలీవు అనుకుంటా’
‘వీటిని బేంక్‌లో ఇచ్చి మా టీచర్ నోట్లు తీసుకుంటానంది’
‘ఈ అర్ధరూపాయిలు వదిలినందుకు నాకు సంతోషంగా ఉంది’ తల్లి చెప్పింది.
‘వెదికితే నీకు మరికొన్ని కనిపించవచ్చు’ తండ్రి నవ్వుతూ చెప్పాడు.
ఇంట్లో అలమర్లు, ఇతర చోట్ల వెదికితే సునేత్రకి మరికొన్ని అర్ధరూపాయి బిళ్లలు కనిపించాయి. వారం తర్వాత సునేత్ర స్కూల్ నించి వచ్చి తల్లితో ఆనందంగా చెప్పింది.
‘బేంక్ వాళ్లకి మేము చందాలుగా ఇచ్చిన అర్ధరూపాయి బిళ్లలని చూస్తే మూడు వందల పనె్నండు రూపాయలు వచ్చాయని టీచర్ చెప్పింది’
‘ప్రతీ అర్ధరూపాయికి విలువ ఉన్నా, లేదనే మనం అనుకుంటాం. ఒకప్పుడు నయాపైసాకి కూడా ఇలాగే విలువ లేదనుకునేవాళ్లం. ఇలాగే మరికొన్నింటిని కూడా మనం విలువ లేదనుకుంటాం’ తండ్రి చెప్పాడు.
‘మరి కొన్నా?’ సునేత్ర ప్రశ్నించింది.
‘అవును. ముఖ్యంగా మనుషులు. ప్రతీ మనిషికి ప్రత్యేక విలువ ఉంటుంది’
‘నిజమే. మరుగుజ్జుకి కూడా విలువ ఉంటుంది. నిన్న చూసిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మరుగుజ్జు బాగా నవ్వించాడు’ సునేత్ర చెప్పింది.
‘ఈ ప్రపంచంలో విలువ లేనిదంటూ ఏమీ లేదు. ఒక్క నీటి చుక్క విలువ లేదనుకుంటాం కానీ, అవి అనేకం కలిస్తేనే మన గ్లాస్ నిండి దాహం తీరుతుంది. ఒక్క మేకు లేదా బోల్ట్ లేదా రబ్బర్ బేండ్‌కి విలువ లేదని పారేస్తాం. కానీ అవసరానికి అవే ఆదుకుంటాయి’ తండ్రి బోధించాడు.

-కైపు ఆదిశేషారెడ్డి