S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముఖాముఖి

ఆ రోజు ఆదివారం. ఆ సాయంత్రం అయిదు గంటలకు ఆదర్శనగర్‌లోని ఆంధ్ర కేసరి పార్కులో ‘అపూర్వార్థ చతుర విన్యాస ప్రౌఢోక్తి’, ‘వక్రోక్త్యుద్ఘాటనా చక్రవర్తి’ ‘విచిత్రార్థ ప్రవచన పంచానన’ ఇత్యాది బిరుదాంకితులైన జంధ్యాల శాస్ర్తీగారు ‘్భషలో తమాషాలు’ అనే అంశం గురించి ఉపన్యసించబోతున్నారని తెలిసి జనం తండోప తండాలుగా పార్కుకు చేరుకున్నారు. వివిధ వృత్తుల వాళ్లు, వ్యావృత్తుల వాళ్లు, భిన్నభిన్న వ్యాపకాల వాళ్లు, పత్రికల ప్రాపకాల వాళ్లు, వైద్యులు, వకీళ్లు, భాషా ప్రేమికులు, భాషాడంబర కాముకులు - అబ్బో ఒక వర్గమా? ఒక పక్షమా? అష్టాదశ విద్యలవాళ్లు, అరవై నాలుగు కళల వాళ్లు - అందరూ అయిదు గంటలకు అరగంట ముందుగానే ఆ బహిరంగోపన్యాస స్థలికి చేరుకున్నారు.
జనం అలవాటుపడ్డ ఆనవాయితీ ప్రకారంగానే అరవై నిమిషాలు ఆలస్యంగానే ఉపన్యాస సభ మొదలైంది. ఆహ్వాన వచనాలు, అధ్యక్షుల వారి తొలి పలుకులు, పరిచయకర్తల పరిపాటి పలుకులు అన్నీ పూర్తయినాయి.
అటుపైన జంధ్యాల శాస్ర్తీగారు శాలువా సవరించుకుంటూ లేచి నిల్చుని ‘నమస్కారం.. నమస్కారం చేయాలంటే సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఉంటే నా నమస్కారం మీకు అందుతుంది. లేకపోతే అందదు’ అన్నారు. జనానికి బుర్ర తిరిగిపోయింది. శాస్ర్తీగారి ఆంతర్యం, ఆ మాటల అంతరార్థం ఏమిటో చాలామందికి బోధపడలేదు.
‘ఇంతకీ ఆయన అన్న సంస్కారం అనేది నమస్కారం చేసేవాడికి ఉండాలా, చేయించుకునేవాడికి ఉండాల్రా?’ అని అడిగాడు జనంలో ఒకతను తన పక్కనున్న వ్యక్తితో చిన్నగా, సన్నగా.
‘ఏయ్ గమ్మునుండ్రా! జంధ్యాల శాస్ర్తీగారంతటి పండితుడు అంత తేలిగ్గా అందరికీ అర్థం అయ్యేట్టు మాట్లాడతాడటరా? జాగ్రత్తగా విను. క్రమంగా ఆ మూసలో పడిపోతే నీకే అర్థం అవుతుంది’ అంటూ సున్నితంగా విసుక్కన్నాడు ఇవతలి వ్యక్తి.
మళ్లీ శాస్ర్తీగారు అందుకున్నారు.
‘ఈ రోజు నేను ఇక్కడ ఉపన్యాసం ఇవ్వటానికి రాలేదు. మీలో రకరకాల జీవన మార్గాల వారున్నారు. ఎవరైనా సరే ఏదైనా ఒక పదానికి అర్థం అడగండి. దానికి నేను అన్వయం చెప్తాను. నేను చెప్పే అర్థాన్వయం తీరిగ్గా ఇంటికెళ్లి ఆలోచించుకోండి. మీమీ లోకానుభవాలను బట్టి మీకు మీకే మీరు అడిగిన పదాలకు సమన్వయం కుదురుతుంది’ అన్నారు.
ఇదేదో కొత్తగా, బాగానే ఉందనుకున్నారు జనం.
ముందుగా ఒక కుహనా ఉద్యమ కార్యకర్త లేచి అడిగాడు ‘త్యాగధనులు అంటే ఏమిటండీ?’ అని.
శాస్ర్తీగారు ఠక్కున వక్కాణించారు - ‘త్యాగధనులు అంటే ఇతరులు త్యాగం చేసిన ధనము కలవారు’ అని. ఆ కుహనా ఉద్యమ కార్యకర్త కుక్కిన పేనులా కూర్చుండిపోయాడు.
(మిగతా 12వ పేజీలో)

ముఖాముఖి (5వ పేజీ తరువాయ)
తరువాత గడ్డాలు, మీసాలు పెరిగి ఉన్న ఒకాయన లేచి అడిగాడు ‘కర్మయోగి అంటే ఏమిటి శాస్ర్తీగారూ?’ అని. శాస్ర్తీగారు ఏ మాత్రమూ తడుముకోకుండా ‘ప్రతి పనిని ఇది నా ఖర్మ అనుకుంటూ చేసుకుంటూ పోయేవాడు’ అని అన్నారు. ఎందుకో మరి ఆ అడిగిన వ్యక్తి ఏడవలేక నవ్వు మొహం పెట్టాడు.
తరువాత ఒక యువకుడు లేచి అడిగాడు ‘జ్ఞాన వృద్ధుడు అంటే ఏమిటి సార్?’ అని.
‘జ్ఞ’ అంటే తెలివి. ‘న’ అంటే లేని ముసలాయన’ అని వివరించారు జంధ్యాల శాస్ర్తీగారు.
ఆ యువకుడు ఉబ్బిపోయాడు. అక్కడికేదో తమతరం గొప్ప విజ్ఞానవంతమైనది అన్న బ్రాంది (భ్రాంతి) లోకంలో తూగిపోతూ, తూలిపోతూ, ఊగిపోతూ.
ఆ వెంటనే ఒక సాఫ్ట్‌వేర్ విద్యార్థి లేచి ‘టెక్కు’దృక్కులతో, ‘నిక్కు’ లుక్కులతో అడిగాడు ‘సాఫ్ట్‌వేర్ విద్యార్థి అంటే సార్?’ అని.
శాస్ర్తీగారు ఈసారి చాలా తాపీగా సమాధానమిచ్చారు - ‘సాఫ్ట్‌వేర్ విద్య ప్లస్ అర్థి. అర్థము అంటే డబ్బు, ప్రయోజనము. వాటి కోసమే - అంటే - డాలర్ల కోసమే చదువుకునేవాడు’ అని. ఆ అడిగినతను చిరాగ్గా బయటకు వెళ్లిపోయాడు సభ వంక కొరకొర చూస్తూ.
‘మానవుడు అంటే?’ ఒక సైన్స్ ప్రొఫెసర్‌గారు అడిగారు. ‘మనలేనివాడు మానవుడు - విజ్ఞాన శాస్త్రం వేయి వెర్రితలలు వేయటం వలన’ అంటూ జంధ్యాల శాస్ర్తీగారు ఏ మాత్రపు జంజాటానికి, జంకుకు లోను కాకుండా జవాబిచ్చారు. ఖంగుతిన్న ప్రొఫెసర్ గారి మొహం కందగడ్డయిపోయింది.
‘దానవుడు అంటే?’ ఒక ఆంత్రపాలజిస్ట్ ప్రశ్న. ‘దాపులోని భావి మానవుడు’ అన్నారు శాస్ర్తీగారు. ‘కాదంటారా’ అని ఆంత్రొపాలజిస్ట్‌ను ఎదురుప్రశ్న వేస్తున్నట్టు చూస్తూ. ఆంత్రొపాలజిస్టు అయోమయంలో పడిపోయి, ఆలోచిస్తూ కొంచెం తిక్కమొహం, కించిత్తు బిక్కమొహం పెట్టాడు.
క్రికెట్‌లో బౌలర్ విసరబోయే బాల్ కోసం ఎదురుచూస్తున్న బ్యాట్స్‌మన్‌లాగా ఒక సూపర్ మార్కెట్ మేనేజర్ వైపు చూశారు శాస్ర్తీగారు. అప్పుడు అతడు లేచి ‘్ధరవరలు అంటే ఏమిటి మాస్టారూ?’ అని అడిగాడు. ‘రవరవల ధరలు’ అన్నారు ఒక అష్టావధాని పోజులో జంధ్యాల శాస్ర్తీగారు. ‘సార్! మా హోల్‌సేల్ డీలర్లు..’ అంటూ ఏదో చెప్పబోయాడు సూపర్‌మార్కెట్ మేనేజర్. ‘మీ హోల్‌సేల్ డీలర్స్ కాదు. ఫ్రాడ్‌సేల్ దళారీల గురించి ఆలోచించండి’ అంటూ శాస్ర్తీగారు ముందుకు సాగిపోయారు జనం వైపు చూస్తూ ‘నెక్స్ట్’ అంటూ. సూపర్ మార్కెట్ మేనేజర్ ప్రక్కనే అప్పటివరకు కూర్చుని ఉన్న ఒకతను లేచి తల దించుకొని వెళ్లిపోయాడు ఎందుకోమరి.
ఇంతలో అధ్యక్ష స్థానంలో ఉన్న వి.ఐ.పి. గారికి ఎక్కడి నుంచో ఒక సెల్‌ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న వి.ఐ.పి. గారు ఫోన్ ఆఫ్ చేసి ‘కొద్ది నిమిషాల్లో ఈ సభా వేదికకు ప్రఖ్యాత చలనచిత్ర నటి అల్పాంబరి గారు వస్తున్నారు’ అని ప్రకటించారు.
జన సమూహం తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు జరిగింది. రెండు మూడు నిమిషాల్లో సినిమా నటి అల్పాంబరి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వయ్యారాల నడకలతో వచ్చి సభావేదికను ‘అలంకరించింది.’
ఆమెను ఒక ప్రశ్న అడగమన్నారు కొందరు జనంలోంచి. ‘మాస్టారూ! వాటీజ్ సంసారం అంటే అండీ? ప్లీజ్ టెల్లండీ’ అంటూ నంగి నంగిగా తెలుగు అనేదే తనకు సరిగా రానట్టుగా అడిగింది తెచ్చిపెట్టుకున్న మెలికలు తిరిగిపోతూ.
శాస్ర్తీగారికి కంపరం వేసింది అల్పాంబరి బాడీ లాంగ్వేజ్, భాషా సాంకర్యాలను చూసి.
‘సం’ - అంటే - కొంత మాత్రమే సారంగలది కనుక సంసారం అంటారమ్మా’ అన్నారు ఏదో నర్మగర్భంగా శాస్ర్తీగారు. ఆ సమాధానమేమీ అల్పాంబరి మనసుకు పట్టలేదు. అసలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించనూ లేదు - వీడియోగ్రఫీకి పోజులిస్తూ చూస్తూ ఉండటమే సరిపోయింది ఆ ‘నటి’కి.
తరువాత, వివాహితుడైన ఒక సంస్కృత విద్యార్థి అడిగాడు. ‘మహానసం’ అంటే ఏమిటండీ?’ అని. మహానసం అంటే వంట ఇల్లు సంస్కృతంలో. దానికి శాస్ర్తీగారు ‘ఇల్లాలు తన మొగుడి సమక్షాన మహా నస పెడుతూ వంట చేసుకుంటూ పోయే పాకశాల’ అని జవాబిచ్చారు. ఆ వివాహిత విద్యార్థికి వెంటనే చండిక లాంటి తన భార్య గుర్తుకు వచ్చి శాస్ర్తీగారి సమాధానం సబబే ననిపించింది. కానీ ఎందుకో దిగులు మొగం పెట్టాడు. ఇంటికెళ్లాక తన భార్యకు శాస్ర్తీగారు చెప్పిన సమన్వయార్థం చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో అని.
తరువాత ఒక రాజకీయ నాయకుని ప్రశ్న ‘నమస్కారం అంటే?’ ‘పార్టీ అభ్యర్థి యొక్క నక్క వినయపు నమస్కారం’ అని అంటూ ఉపన్యాసకుల వారు వ్యంగ్యపు చురక అంటించారు. అడిగినతని ముఖంలో నెత్తురు చుక్కలేదు.
ఇలా ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు, జవాబులు చాలా సందడి చేశాయి.
‘గృహస్థుడు అంటే?’ ఒక గృహస్థు ప్రశ్న.
‘గృహమందు ఉండేవాడు - భార్య ముందు స్తబ్ధుగా’ శాస్ర్తీగారి జవాబు.
‘కొంగు బంగారం?’ ఒక సుందరాంగి సందేహం.
‘ఒక స్ర్తి తాను తన కొంగున కట్టుకున్న ఒక బంగారు వర్తకపు భర్త’ శాస్ర్తీగారి సమాధానం.
‘త్రికరణములు అంటే?’ ఒక తాత్త్విక అధ్యయనపరుని అనుమానం.
‘మనో (మనీ=డబ్బు), వాక్కు (నోరు పెట్టుకు బతికే లక్షణం), కాయం (శారీరక బలం చూపించటం (దాష్టికం)’ అంటూ ఆధునిక లోకపు పోకడతోడి వివరణ ఇచ్చారు శాస్ర్తీగారు.
ఇంతలో అధ్యక్షుల వారు లేచి ‘అయ్యా సభాజనులారా! సభా సమయం మించిపోతోంది. ఒక రెండు మూడు నిమిషాల్లో ఈ సమావేశం సమాప్తం కాబోతోంది. మన జంధ్యాల శాస్ర్తీగారు మరో సమావేశానికి వెళ్లాల్సి ఉంది. కనుక ఇంకో ముగ్గురు నలుగురికి మాత్రమే ప్రశ్నావకాశాలు ఇస్తున్నాం. ఆ తరువాత ఇంకా ఏమైనా మిగిలిపోతే మా ‘అపార్థాలు - అన్వయాలు’ మాసపత్రికకు రాసి పంపండి. వాటికి పత్రికా ముఖంగా శాస్ర్తీగారు జవాబులిస్తారు’ అని ప్రకటించారు.
తరువాతి ఆ చివరి ప్రశ్నలు, జవాబులు ఇలా సాగిపోయాయి.
‘పురుషార్థములు?’ ఒక జిజ్ఞాసువు ప్రశ్న.
‘పురుషుడికి కావలసినవి, అతడు అర్థించేవి నాలుగు. అవి 1.ఆపద్ధర్మం 2.ఏదో విధంగానైనా అర్థం (డబ్బు) సంపాదించటం. 3.తన కోరిక ప్రతిదీ తీరటం. 4.మోక్షం- అంటే - చట్టాల నుంచి విడుపు’ అంటూ జంధ్యాల వారు సందేహ నివృత్తి చేశారు.
‘్ధర్మ యుద్ధం అంటే?’ ఒక పాకిస్తానీ యుద్ధవార్తల విలేఖరి కోరిన వివరణ.
‘ఎవరికి వారు ధర్మం తమ పక్షాననే ఉంది అనుకుంటూ చేసే యుద్ధం’ - అదీ శాస్ర్తీగారి స్పష్టీకరణ ఎంతో లౌక్యంగా. ‘పుత్రుడు అంటే సార్?’ - ఒక నడివయస్కుని ప్రశ్న. ‘తల్లిదండ్రులను పలకరించేవారు లేరు అనే నరకం నుంచి తప్పించి వృద్ధాశ్రమంలో చేర్చేవాడు’ అంటూ మరి నీవెలాంటి పుత్రుడవో అన్నట్టు ఆ ప్రాశ్నికుని వైపు చూశారు శాస్ర్తీగారు. ప్రశ్న అడిగినతను వికారం మొహం పెట్టాడు.
ఆ వెంటనే తన ముఖాముఖీ సభను ముగించారు శాస్ర్తీగారు ‘నమస్కారం’ అని పెద్ద గొంతుతో అంటూ. ఆ మాటకు మళ్లీ జనంలో గందరగోళం.
‘మళ్లీ ఈ నమస్కార పదపు తికమక ఏమిటి? ఎవరికి ఎవరి నమస్కారం? ఆ సంస్కారం ఉండాల్సిందీ, ఉన్నదీ చెప్పేవాడికా, వినేవాడికా? అనే కన్ఫ్యూషన్, విచికిత్సలతో జనాల అంతరంగాలు గింగరాలు తిరిగిపోయాయి. వాళ్ల ఆలోచనా మథన తరంగాల ఆటుపోట్లతోను, పార్కు నుంచి తిరిగి వస్తున్న అప్పటి అశేష జనవాహిని తోపుళ్లు, తొక్కిసలాటలతోను ఆ సభ రసాభాస అయింది’ అని జంధ్యాల శాస్తన్న్రా, ఆ సభా నిర్వాహకులన్నా గిట్టని, పడని కొన్ని పత్రికలు రాసి పారేశాయి.
***
కాకులు కావుకావుమన్నాయి. శాస్ర్తీగారి కల శీతల ప్రభాత పవనాలలో కలిసిపోయింది.
‘ఏమిటో! అంతా ఒక తీయని చేదుకల’ అనుకున్నారు జంధ్యాల శాస్ర్తీగారు.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290