S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రేణుకా ప్రసాదం

ఐ.వి.రేణుకా ప్రసాద్‌గారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. నట్టువాంగానికి కూడా ఎంతో ప్రసిద్ధి. కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన డాన్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శనలిచ్చారు. వీరి జీవిత భాగస్వామి శే్వతగారు కూడా గొప్ప గాయని. భార్యాభర్తలిద్దరూ కళాసేవకే అంకితమయ్యారు.
ప్రస్థానం
జూలై 6, 1976న జన్మించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి పుట్టిన తేదీ కూడా ఇదే కావటం విశేషం. ప్రస్తుతం రేణుకా ప్రసాద్‌గారు హిమాయత్‌నగర్‌లో ఉంటున్నారు. ఆ వివరాలు చెబుతూ - మా చిన్నప్పుడు హైదరాబాద్ లాల్‌దర్వాజాలో ఉండేవాళ్లం. హనుమాన్ ఆలయం, ఫలక్‌నుమా పాలెస్‌కు వెళ్లే దారిలో. మా తాతగారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కె.సుదర్శనాచార్య గారు మిత్రులు. నాకు 11 సంవత్సరాలప్పుడు వారి వద్ద మృదంగం నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో మధ్యాహ్నం స్కూలుండేది. పొద్దున్న మృదంగం నేర్చుకునేవాడిని. తరువాత వారబ్బాయి కె.రాజగోపాలాచారి వద్ద కూడా నేర్చుకున్నాను. నేను ఆలిండియా రేడియోలో గ్రేడెడ్ ఆర్టిస్టుని. మృదంగంలో డిప్లొమా చేశాను - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి. మధురై టి.శ్రీనివాసన్‌గారు (శ్రీను కుట్టిమాయ) మద్రాసులో, వారి వద్దకు వెళ్లి సిద్ధాంతం, మృదంగం, లెక్కలు నేర్చుకున్నాను. ఆయన సప్తపది, శృతిలయలు వంటి సినిమాల్లో మృదంగం వాయించారు.
చిత్రానారాయణ్ బాలే ‘సప్తస్వర’కు మృదంగం జతులు రూపకల్పన చేశాను. అందులో ‘నంది’ అనే పదం హైలైట్ చేశాను.
ఆ ప్రదర్శనకు టి.శ్రీనివాసన్‌గారు చీఫ్ గెస్ట్. నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అప్పటి నుండి గాఢమైన అనుబంధం ఏర్పడింది.
డా.శ్రీమతి శోభానాయుడు గారి ‘నవరస నటభామిని’ బాలేకు జతులు రూపకల్పన చేశాను. ఆనంద శంకర్‌గారి ‘సింహ నందిని’కి జతులు కొరియోగ్రఫీ చేశాను. భిలాయ్, రాయ్‌పూర్, నాగపూర్, పూనె, ఔరంగాబాద్‌లో ఎన్నో నృత్య ప్రదర్శనలకి మృదంగం వాయించాను. నట్టువాంగం చేశాను.
రాయ్‌గఢ్ ఫెస్టివల్, పూనె ఫెస్టివల్, ఛత్తీస్‌గఢ్, ఎల్లోరా ఫెస్టివల్, కాళిదాస్ సమారోహ్, నాగ్‌పూర్, ఎలిఫెంటా ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్, ఝాన్సీ ఫెస్టివల్, బుద్ధా ఫెస్టివల్, బనానాస్ సంగీత నాటక అకాడెమీ వారి ప్రదర్శనలు, ఎడిన్‌బర్గ్ ఫెస్టివల్, స్పిప్‌మెకే ప్రదర్శనలు, నిషాగంధి ఫెస్టివల్, ఖజురహో, కోణార్క్, హైదరాబాద్, బాంబే, కూచిపూడి, మద్రాస్ (చెన్నై) ఇలా ఎన్నో ఫెస్టివల్స్‌లో ప్రదర్శనలిచ్చాను. నా జీవిత భాగస్వామి శే్వతతో ప్రదర్శనలివ్వడం ఒక మధురానుభూతి.
యుఎస్‌ఏ, బ్రెజిల్, పారిస్, స్విట్జర్లాండ్, సిరియా, కెనడా, హాంగ్‌కాంగ్, బంగ్లాదేశ్, రష్యా, ఎడిన్‌బర్గ్, ఆమ్‌స్టర్‌డామ్, పనామా, కోస్టారికా, హాండ్యూరస్, అర్జెంటీనా, మెక్సికో - ఇలా ఎన్నో విదేశాలలో ప్రదర్శనలిచ్చాను.
మృదంగం, నట్టువాంగం రెండూ గత 15 ఏళ్లుగా చేస్తున్నాను. పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్, పద్మశ్రీ డా.శోభానాయుడు, శ్రీమతి చిత్రానారాయణ్, జి.రతీశ్‌బాబు.. ఇలా ఎంతోమందితో కలిసి పని చేశాను. ఎన్నో బాలేలకు జతులు రూపకల్పన చేశాను. నా శ్రీమతి శే్వతతో కలిసి భామాకలాపం రెండు భాగాలుగా ఆడియో కేసెట్లు విడుదల చేశాం. ఇది ఆదిత్య మ్యూజిక్ వారు వెలువరించారు. ఎన్నో పాటలు నృత్య ప్రదర్శనలకు రికార్డు చేశాము. భరతనాట్యం -రెండు భాగాలుగా ఆడియో కేసెట్లు కూడా విడుదల చేశాము.
స్కాట్లండ్‌లో ఎడిన్‌బరోలో ఆనంద శంకర్ గారితో ప్రదర్శన, సింహనందిని కూచిపూడిలో నా నట్టువాంగం ప్రేక్షకులకు ఎంతో నచ్చి ‘ఆంకోర్’ అంటే మళ్లీ ఆ అంశాన్ని ప్రదర్శించమని అడిగారు. మనసుకు ఎంతో నచ్చిన స్మృతి ఇది. రాష్టప్రతి భవన్‌లో ఆనందశంకర్ గారితో అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం గారి ముందు ప్రదర్శించాను. ప్రతి ప్రదర్శన ఒక మధురానుభూతి.
ఏ కళాకారుడికైనా ఏ కళలోనైనా కొన్ని ఇబ్బందులు, అవరోధాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోగ్రామ్‌లు, ప్రదర్శనల్లో సీడీలు విరివిగా వాడటం మొదలయిన తర్వాత, ఆర్కెస్ట్రా వాద్య సహకారం ప్రదర్శనల్లో తక్కువైంది. ఇది మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే నా గురువులు ఆశీస్సులు నాతో ఎప్పుడూ ఉంటాయి. అందరు నర్తకీమణులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్ల ప్రదర్శనలు, శిష్యుల అరంగేట్రాలు, ప్రదర్శనలు, సీడీ రికార్డింగ్ అన్నిట్లో నాకు బాగా ప్రోత్సాహం లభించింది. అమ్మా నాన్న, అన్నదమ్ములు నాకు అండగా ఉన్నారు. నా కుటుంబ సహకారం కూడా ఎంతో ఉంది. అన్ని ప్రదర్శనల్లోనూ నా భార్య శే్వత సహాయం ఉండనే ఉంది.
మన కళలను కాపాడుకోవడంలో మన సంస్కృతి ముడిపడి ఉంది. దానికి ప్రభుత్వం, సమాజం, తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
*

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి