S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కడలి ఒడిలో కదలాడే నగరాలు!

**మానవ మేధస్సు అపారం..
ఎదిగిన పరిజ్ఞానం..
ఎన్నో దారుల్ని పరచుకుంటూ
ముందుకు సాగుతున్నాడు నేటి మనిషి..
సాంకేతికాక్షరాల మదింపు..
‘డిజిటల్’లో, ‘అనలాగ్’ల్లో పరికరాల సూచికల్తో
భద్రతను అంచనా వేసుకుంటున్నాడు..
భూభాగం పూర్తిగా ఖాళీ అయిందని అనుకున్నాడో..
భూమిపై నివసించాలంటే బోర్ కొట్టిందో కానీ..
సముద్రంపై నివసించాలని వాంఛిస్తున్నాడు..
ఇలా ఎందుకు? భూమిపై ఎందుకు ఉండాలనుకోవడం లేదు?
---------------------------------------

సముద్రంపై ఎలా నివసించగలడు? ఇలా ఆలోచించినకొద్దీ ఇలాంటి ప్రశ్నలు ఎన్నో.. వాటన్నింటికీ మనిషి అవసరం, అందుబాటులోని పరిజ్ఞానమే కారణం. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న జనాభాకు భూమిపై తలదాచుకోవడానికి సరిపడా చోటు దొరకడం లేదు. అందుకని సరికొత్త ప్రదేశాల్లో ఆవాసాల నిర్మాణానికి శాస్తవ్రేత్తలు అనేక ఏళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రునిపై నివాసానికి పరిశోధనలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. అలాగే సముద్ర జలాలపై నగరాల్ని నిర్మించడానికి కూడా చాలా రోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది వినడానికి వింతగానూ, అసాధ్యంగానూ ఉన్నా.. ఇది సాధ్యమే.. అంటూ నొక్కి వక్కాణిస్తున్నారు అనేకమంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, నిర్మాణరంగ నిపుణులు.
తాపం కారణంగా పెరిగిన సముద్ర మట్టం వల్ల తీరం తరగిపోయినప్పుడు, వరదల వల్ల నేల జలమయం అయినప్పుడు, అగ్నిపర్వతాల వల్ల, భూకంపాల వల్ల నేల చిన్నాభిన్నమైపోయినప్పుడు భూభాగం తగ్గిపోతుంది. విస్తీర్ణత తక్కువగా ఉన్న కొన్ని దేశాల్లో ప్రకృతి విలయతాండవం వల్ల భూభాగం తగ్గిపోవడం నిజంగా గడ్డు సమస్యే! కాబట్టి భూమి విస్తీర్ణం తక్కువగా ఉన్న కొన్ని దేశాల్లో నీటిలోనో, ఆకాశంలోనే ఇళ్ళు, ఊళ్ళు కట్టుకుని నేల లేని వెలితి తీర్చుకోవాలన్న ఆలోచన ఎంతకాలంగానో అందరిలో ఉంది.
భూమిపై ఇళ్లూ, ఊళ్లూ ఉంటాయి. కానీ వాటిని సముద్రంపై నిర్మిస్తే పెరుగుతున్న జనాభా అవసరాల్ని తీర్చేందుకు బాగుంటుందని శాస్తవ్రేత్తలు, నిర్మాణరంగ నిపుణులు చెప్పిన సరికొత్త ఆలోచన ఇది. దీనికి ఆచరణ రూపం ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. లోతు తక్కువగా ఉన్న సముద్రపు నీటిపై నగరాల్ని నిర్మించే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రపంచంలోనే నీటిపై తేలే మొట్టమొదటి నగరం పసిఫిక్ మహాసముద్రం తహిటీ ద్వీపం వద్ద త్వరలో నిర్మాణం కానుంది. ఈ మేరకు ఫ్రెంచ్ పొలినేషియా ప్రభుత్వం అమెరికాకు చెందిన నిర్మాణ సంస్థ ‘సీస్టేడింగ్ ఇన్‌స్టిట్యూట్’తో గత ఏడాది జనవరి 7న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఆ సంస్థ బ్లూ ఫ్రాంటీర్స్ అనే ఒక నిర్మాణ కంపెనీని ఏర్పాటుచేసి నీటిపై తేలియాడే ద్వీపపు ప్రాజెక్టు పనుల్ని ఇప్పటికే ప్రారంభించింది. ఈ నగరాన్ని 2020కల్లా తీర్చిదిద్దనున్నారట. మొదటగా 300 గృహాలను, 2050 నాటికి లక్షల గృహాలను ఈ తేలియాడే నగరంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా ప్రారంభించిన గృహాల్లో నివసించడానికి దాదాపు వెయ్యిమంది సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే ఇది అంత చవకైనది కాదు. ఒక్కో మాడ్యూల్ నిర్మాణానికి కోటిన్నర డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పనులు చేపట్టడానికి అనువుగా తీరంలోని వంద ఎకరాల భూభాగాన్ని ఈ సంస్థకు ఫ్రెంచ్ పాలినేషియా ప్రభుత్వం కేటాయించింది. ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు.. ఇలా దాదాపు డజనుకు పైగా నిర్మాణాల్ని 2020కల్లా పూర్తిచేస్తామని సీస్టెడింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ జో క్విర్క్ చెప్పారు. వీటి నిర్మాణానికి వెదురుకర్రలు, కొబ్బరిపీచు, కర్రలు, రీసైకిల్ చేసిన లోహం, ప్లాస్టిక్‌ను వినియోగిస్తారట!
సముద్ర మట్టం పెరగడంతో ఫ్రెంచ్ పొలినేషియాలో దాదాపు 118 ద్వీపాల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ముందుకు వచ్చింది. పొలినేషియా ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ఈ ‘తేలియాడే నగరం’ కీలకపాత్ర వహిస్తుందని సీస్టేడింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాడాల్స్ హెన్‌కెన్ చెప్పారు.
ముందుగా జపాన్‌లో..
విస్తీర్ణం తక్కువై, జనాభా ఎక్కువైన జపాన్‌లో నీటిపై తేలే నగరాల నిర్మాణాల గురించి ఎంతకాలంగా ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన బుర్జ్‌ఖలీపా భవనం కన్నా ఎతె్తైన భవనాన్ని నిర్మించాలని జపాన్‌కి చెందిన కొందరు శాస్తవ్రేత్తలు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు ప్రయత్నిస్తున్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్‌ను దృష్టిలో ఉంచుకుని పర్యావరణాన్ని రక్షించేందుకు ‘కార్బన్‌న్యూట్రల్’ నగరాలను నిర్మించాలని జపాన్ శాస్తవ్రేత్తలు నిర్ణయించుకున్నారు. దీనికి ‘గ్రీన్ ఫ్లోట్ కానె్సప్ట్’ అని పేరు కూడా పెట్టేశారు. ఓ పొడవైన తామరతూడు కొసలో వికసించే అరవిందంలా, ఓ పొడవాటి స్తంభంపై విశాలమైన నగరాన్ని నిర్మించాలని వారు ఎప్పటి నుంచో తహతహలాడుతున్నారు. దానికి ‘ఆకాశ నగరం’ (సిటీ ఇన్ ద స్కై) అని నామకరణం కూడా చేశారు. ఆ స్తంభం ఓ విశాలమైన వేదికపై ‘తామరాకు’లా నీటిపై తేలే ఓ విశాలమైన పడవపై నిలబడుతుందట. ఆ విశాలమైన వేదిక వ్యాసం మూడు కిలోమీటర్లు. ఈ ఆకాశ నగరంలో దాదాపు 30,000 మంది నివసించగలరని అంచనా. అంత ఎత్తున నివసించడానికి ఇష్టపడని వారికి తామరాకు అడుగు వేదికపై నివాసాలు ఉంటాయి. ఇక్కడ దాదాపు 10,000 మంది దాకా నివసించగలరట. ఈ వింత నగరపు నిర్మాణంలో అతి తేలికైన మిశ్రమలోహాలు వాడనున్నట్టు, దీన్ని నిర్మించడానికి పూనుకున్న జపాన్ నిర్మాణ సంస్థ షిమిజు చెబుతోంది. ఆకాశ నగరం నీటిపై తేలేదే కానీ కదలకుండా నిశ్చలంగా ఉంటుందట!
కదలకుండా నీటిపై తేలే నగరమే కాకుండా నీటిపై తేలుతూ, కదిలే ఓడలాంటి నగర నిర్మాణానికి సన్నాహం జరుగుతోంది జపాన్‌లో. ఆ ఓడ పేరు ‘స్వేచ్ఛ’. ఇరవై ఐదు అంతస్థుల ఎత్తులో భవనాలు వరుసగా మైలు పొడవున ఉంటే ఎలా ఉంటుందో ఆ ఓడ అలా ఉంటుంది. 1.317 మీటర్ల పొడవు, 221 మీటర్ల వెడల్పు, 103 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ఓడ ముందు ఇతర నౌకలు మరుగుజ్జుల్లా కనిపిస్తాయి. గాలి చొరబడని పెద్దపెద్ద స్టీలు పెట్టెలతో ఈ ఓడ పునాదిని నిర్మిస్తారు. పునాది పూర్తయిన మూడేళ్లలో ‘ఓడ’ పూర్తవుతుందని ఈ నిర్మాణానికి పూనుకున్న మొదటివ్యక్తి నార్మన్ నిక్సన్ అంటున్నారు. అంత పెద్ద నిర్మాణం నీటిపై కదలాలంటే చాలా శక్తి కావాలి. పెద్ద పెద్ద డీజిల్ ఇంజిన్లు దాదాపు వంద వరకు అవసరం అవుతాయి. ఒక్కో ఇంజిన్‌కు దాదాపు మూడువేల హార్స్ పవర్ అంత బలం ఉండాలని ఈ ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. ఒక్క మెగా ఇంజిన్‌కు మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన మొత్తం ఓడ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఆకాశానికి అంటుతుందని వేరే చెప్పక్కర్లేదు కదూ.. అయినా ఫర్లేదు, ప్రిస్టేజియస్‌గా నిర్మిస్తున్న ఈ నిర్మాణంలో ఇళ్లను కొనుక్కునే అదృష్టవంతుల నుంచి వసూలు చేయవచ్చని ఆ ప్రాజెక్ట్ అధికారుల ధీమా.. ఎందుకంటే ఈ సుందర సముద్ర నగరంలో ఒక్కో ఫ్లాట్ ఖరీదు దాదాపు పదకొండు మిలియన్ల డాలర్లు మరి! ఇందులో సౌకర్యాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. భూమిపై ఓ ఆధునిక నగరంలో ఉండే సౌకర్యాలన్నీ ఈ తేలే నగరంలో ఉంటాయట! స్కూళ్ళు, షాపింగ్ మాళ్ళు ఉంటాయి. నగర పై భాగంలో చిన్న విమానాలు దిగేందుకు వీలుగా ఓ కిలోమీటరు పొడవున్న రన్‌వే కూడా ఉంటుంది. చిన్న చిన్న పడవలు నిలుపుకోవడానికి ‘రేవు’ లాంటి సౌకర్యం కూడా ఉంటుంది. ఇంకా 200 ఎకరాల్లో ఆటస్థలాలు కూడా ఉంటాయట. ఈ అందమైన నగరంలో జీవించేవాళ్ళు ప్రత్యేకించి పన్ను కట్టవలసిన అవసరం లేదు. అయితే ఈ తేలే ‘స్వేచ్ఛ’ నగరం నెమ్మదిగా ప్రయాణిస్తూ రెండేళ్ళకి ఓసారి లోకమంతా చుట్టి వస్తుందట. మార్గమధ్యంలో వివిధ దేశాల రేవుల్లో కొంతకాలం పాటు ఆగుతుంది. అయితే ఈ నౌక ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాన్ని స్వేచ్ఛానౌక వాసులందరూ పాటించాల్సి వస్తుంది. ‘స్వేచ్ఛ’ నగరంలో పర్యావరణం ఎలాంటి దుప్ప్రభావం చూపని విధంగా, ఓడ నుండి ఏ రకమైన వ్యర్థాలూ సముద్రంలోకి వెలువడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
వ్యర్థాలను ఓడలోనే దగ్ధం చేస్తారు. అందమైన నౌకానగరం ఎప్పుడు నిజమవుతుందో తెలియదు కానీ వర్తమాన కాలంలో మనిషి తలపెడుతున్న గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఇది ఒకటిగా మాత్రం పేరు పొందింది.
ప్రకృతి విపత్తుల్లో..
అందమైన నగరాల సంగతి సరే కానీ.. సముద్రుడికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో తెలియని పరిస్థితి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫర్వాలేదు కానీ కోపం వచ్చి ఏ సునామీనో సృష్టించాడనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే.. ‘అలాంటి పిచ్చి భయాలను పెట్టుకోబోకండి’ అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వారు నిర్మించే నివాసాలకు బయటివైపు నుంచి ఎలాస్టిక్ పొరలను ఏర్పాటుచేస్తారట! అవి సముద్ర మట్టానికి ముప్పయి అడుగుల ఎత్తులో ఉంటాయి కాబట్టి లోపలి అలలు వాటినేమీ చెయ్యవని వారు చెబుతున్నారు. తుపానులు, వర్షాల సమయంలో పిడుగుపాటు నుంచి ఇంటిని కాపాడటానికి లైట్నింగ్ కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ఆ బాధ కూడా ఈ నగరానికి ఉండదు. కాకపోతే ఇందులో నివసించాలంటే మాత్రం కాస్త గుండె ధైర్యం కావాలి సుమా.. కానీ ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఇంత దివ్యమైన ఆలోచన ఆచరణ రూపం దాల్చాలంటే ఆ మాత్రం సమయం తప్పనిసరి!
పాలినేషియాలో..
జపాన్‌లోలా కాకుండా పాలినేషియాలో 2020 నాటి కల్లా సముద్రజలాలపై నగరాల్ని నిర్మించే బృహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు. సముద్ర ఉపరితలంపై జనావాసాల్ని నిర్మించే ఈ ప్రాజెక్టును ‘సీస్టెడింగ్’ అని పిలుస్తారు. 2020 నాటికల్లా ఒక నమూనా నగరాన్ని అయినా పూర్తిగా అలలపై నిర్మించడానికి కొన్ని కంపెనీలు, నిర్మాణరంగ నిపుణులు, మేధావులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. వీరిని ‘ ఆక్వాప్రెన్యూర్స్’గా పిలుస్తున్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్న ‘సీస్టెడింగ్ ఇన్‌స్టిట్యూట్’ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తోంది. సముద్ర జలాలపై జనావాసాల నిర్మాణం సాధ్యమేనని రుజువు చేయడానికి సీస్టెడింగ్ ఇన్‌స్టిట్యూట్ దాదాపు పదేళ్ళుగా శ్రమిస్తోంది. ఎందుకంటే నీటిపై తేలే నగరాల్ని నిర్మించాలంటే ఇంజనీరింగ్ అద్భుతం చేయక తప్పదు. భూమిపై నిర్మించినంత సులువుగా అందులో నిర్మాణాలు చేపట్టడం సాధ్యం కాదు. కారణం సముద్రం ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుందో చెప్పలేం. అందుకని సముద్రం నిశ్చలంగా ఉండే చోట, లోతు తక్కువగా ఉన్న చోట నిర్మాణాలను చేయాలి. అక్కడ ముందుగా సముద్రపు నీటిపై ఇనుప కేబుల్స్ ఉపయోగించి బల్లకట్టులాంటి వాటిని ఏర్పాటు చేసుకుంటారు. దీనికోసం ఇనుప పిల్లర్లను లోతు తక్కువగా ఉండే ప్రాంతాతాల్లో (వీటిని కయ్య లేదా లాగూన్ అంటారు) దించుతారు. అందుకే బల్లకట్టు చాలా దృఢంగా ఉంటుంది. భవనాలు, రోడ్లు, ఇతరత్రా నిర్మాణాలకు కదిలే పునాదిలా బల్లకట్టు ఉంటుంది. తరువాత నగరం చుట్టూ భారీ అడ్డుగోడలాంటి నిర్మాణాలు చేస్తారు. దీన్ని భారీ అలలను సైతం తట్టుకునేలా నిర్మిస్తారు.
సముద్రంపై నిర్మించే ఏ నగరమైనా భీకరంగా ఎగిసిపడే అలలకు తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఒక్కోసారి కనీసం ఇరవై మీటర్ల ఎత్తువరకూ అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. తుపాన్లు అనేకరోజుల పాటు కొనసాగుతూ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకునేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. దానికి తోడు భూమిపై నిర్మించే భవనాల్లా ఇవి స్థిరంగా ఉండవు. కాలాలు మారుతున్న కొద్దీ, జనాభా మార్పులను అనుసరించి వాటిని ఎక్కడికైనా తరలించేలా ఉంటాయి.
మరెన్నో..
* ‘వాటర్ స్టూడియో’ యునెస్కోతో కలిసి సముద్రం ఒడ్డున ఉన్న మురికివాడల్లో పిల్లల కోసం నీటిపై తేలే చిన్న చిన్న పాఠశాలల నిర్మాణానికి కృషిచేస్తోంది. మునుపు ఈ స్టూడియో బంగ్లాదేశ్‌లో 70 వేల మంది పిల్లలకు విద్యను అందివ్వడానికి సౌర విద్యుత్‌తో పనిచేసే పడవ స్కూళ్లను ఏర్పాటు చేసింది.
* కృత్రిమ ద్వీపాలపై విలాసవంతమైన కాంప్లెక్సులతో కూడా ‘పామ్ జుమేరియా’ను దుబాయ్ సముద్ర తీరంలో నిర్మించిన సంగతి తెలిసిందే.
* సింగపూర్ నగరంలోని దాదాపు 25 శాతం ప్రాంతాన్ని సముద్రం ఒడ్డున పునరుద్ధరించిన భూభాగంపై నిర్మించారు.
* టోక్యో నగరంలో 20 శాతం ప్రాంతాన్ని సముద్రంపై నిర్మించిన కృత్రిమ ద్వీపాలపై తీర్చిదిద్దారు.
చైనాలో..
సముద్రంపై ప్రపంచంలోనే అతి పొడవైన వంతెనను నిర్మించి చైనా ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాధించింది. చైనా అంటేనే పెద్దపెద్ద భవంతులకు, భారీ ప్రాజెక్టులకు, వింతలు, విశేషాలకు పెట్టింది పేరు. చైనా నగరమైన ఝహాయిని హాంకాంగ్‌లోని మకావు దీవితో ఈ వంతెన కలుపుతుంది. మలుపులు తిరిగిన రహదారి క్రాసింగ్, సముద్ర జలాల్లో సొరంగం వంటి నిర్మాణాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగాలే.. 60 ఈఫిల్ టవర్లను నిర్మించడానికి ఉపయోగించేంత ఉక్కును ఈ ప్రాజెక్టులో ఉపయోగించారు. అంటే దాదాపు 4,20,000 టన్నుల ఉక్కును దీని నిర్మాణానికి వాడారు. దాదాపు 120 ఏళ్ల పాటు ఉపయోగపడేలా ఈ వంతెనను నిర్మించారు. సుమారు 10,000 మంది కార్మికులు నాలుగు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఈ వంతెనను నిర్మించారు. ‘కింగ్డౌ హవాయ్’గా వ్యవహరిస్తున్న ఈ వంతెన పొడవు దాదాపు 42. 4 కిలోమీటర్లు. చూడటానికి ఇంగ్లీషు అక్షరం ‘వై’ ఆకారంలో ఉన్న ఈ వంతెనను నిర్మించడానికి సుమారు 93 వేల కోట్లు ఖర్చయ్యాయి. ప్రయాణ సమయం 60 శాతం తగ్గడం వల్ల వాణిజ్య అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావించి ఈ వంతెనను నిర్మించారు.
*
============================================

అత్యద్భుతం.. రామసేతు నిర్మాణం

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన నేటి కాలంలో సముద్రంపై నిర్మాణాలు చేయడం గొప్ప ఇంజనీరింగ్ పనితనంగా భావిస్తున్నారు అందరూ. కానీ ఏడువేల సంవత్సరాల క్రితం.. ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలోనే రామసేతు నిర్మాణం జరిగింది. రామాయణం ఓ కల్పిత కథ అని.., రామసేతు నిర్మాణం సహజసిద్ధంగా ఏర్పడిందని.., శ్రీరామచంద్రుడు లంకకు సముద్రంపై వానరుల సాయంతో వారధి నిర్మించాడన్నది పుక్కిటి పురాణంగా చెబుతున్నవారి వాదనలకు కళ్లెం వేసింది ఓ సైన్స్ ఛానెల్. ‘రామసేతు’ ప్రకృతి పరంగా ఏర్పడింది కాదని మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఓ టెలివిజన్ సంస్థ స్పష్టం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానల్ దీనిపై అనేక పరిశోధనలు నిర్వహించింది. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ధనుష్కోటి ప్రాంతానికి, శ్రీలంకలోని మన్నార్ ప్రాంతానికి రాళ్లతో కూడిన నిర్మాణాన్ని ఏడు వేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఆ ఛానల్ తేల్చింది. లంకలో ఉన్న సీతమ్మను రావణుడి చెరనుండి విడిపించేందుకు శ్రీరాముడు రామేశ్వరం చేరి, అక్కడ నుంచి వానరుల శ్రమతో సేతు నిర్మాణం చేపట్టారు. అనంతరం లంకకు చేరుకొని, రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకువచ్చారు. దీనిపై అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానెల్ పరిశోధనలు చేపట్టింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం ఇది ప్రకృతి సిద్ధం కాదని మానవ నిర్మితంగా తేలిందని తెలిపింది. సముద్రంలోని ఇసుకపై రాతితో నిర్మాణాలు చేపట్టినట్లు పరిశోధనలో వెల్లడైంది. అయితే సాధారణ మానవులు ఇలాంటి నిర్మాణం చేపట్టలేరని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడటం విశేషం.
ఆ రాళ్ల వయసు ఏడు వేల సంవత్సరాలు ఉంటుందని వారు తమ పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఆ రాళ్ల కింద ఉన్న ఇసుక వయసు వేల ఏళ్లు అని, దీన్ని బట్టి ఈ నీటిపై తేలే రాళ్లను ఎక్కడినుంచో తీసుకువచ్చి, వాటితో వారధి నిర్మించి ఉండవచ్చని వారు అంటున్నారు. రావణుడి చెరనుండి సీతను విడిపించేందుకు, శ్రీరాముడు లంకకి, రామేశ్వరానికి మధ్య సముద్రంపై వారధి నిర్మించాడని హిందువుల నమ్మకం. ఇప్పటికీ ఈ వారధికి సంబంధించిన ఆనవాళ్లు సముద్రంలో ఉన్నాయి. ఈ వారధి సహజసిద్ధంగా ఏర్పడిందని ఇన్నాళ్ళూ శాస్తవ్రేత్తలు చెబుతూ వచ్చారు. అయితే శాస్తవ్రేత్తలు చేస్తున్న వాదన సరి కాదని, ఆ వారధి మానవ నిర్మితమే అని అమెరికాకు ఛానల్ నిరూపించింది.

***

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి