S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతిఫలం (కథ)

పూర్వం ఉజ్జయినీ రాజ్యాన్ని ఉజ్వల వర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా ఏ కష్టమూ లేకుండా చూసేవాడు. రాజ్యంలో ఎక్కడా అక్రమాలూ, అన్యాయాలూ వంటివి లేక ప్రజలు సుఖజీవనం సాగించేవారు. ఉజ్వల వర్మ అంటే గిట్టని వారూ, ఆయన న్యాయపాలన వలన నష్టపోతున్న వారూ కొందరు రాజద్రోహులు కుట్రలు పన్నసాగారు.
క్రూరమృగాలు పల్లె ప్రాంత ప్రజలను బాధిస్తున్నాయనే మాట వేగుల ద్వారా విని, ఒకరోజున ఉజ్వల వర్మ వేట నిమిత్తం అడవులకు బయల్దేరాడు. అదే సమయంలో మాటు వేసి ఉన్న రాజద్రోహులు పరాయి రాజులకు వర్తమానం అందించి మహారాజును కాటు వేయాలని పథకం రూపొందించారు. మహారాజు వెంట వెళ్లిన ఒకరిద్దరికి డబ్బు ఆశ చూపి లోబరచుకుని రాజుని వొంటరిగా వదిలేయమని ప్రోత్సహించారు. ఆ పథకం గురించీ చూచాయగా విన్న ఒక రాజభక్తుడైన సేవకుడు ఉజ్వల వర్మకు విషయం తెలియచేసి తాను ఆయనకు తోడుగా వెంటనంటి వెళ్లాడు.
ఇద్దరూ గుర్రాలను వదిలేసి దట్టమైన అడవిలో ప్రవేశించి, దాహంగా ఉండటాన అడవి మధ్యగా పారుతున్న నర్మదా నదిలో దాహం తీర్చుకుందామని ఆగారు. ఉజ్వల వర్మ కత్తి పక్కన పెట్టి నీరు త్రాగబోగా నదిలో నీటి వాలుకు కొట్టుకుపోతూ ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటున్న ఒక సాలెపురుగును చూశాడు. ప్రాణ రక్షణే ధ్యేయంగాగల ఉజ్వల వర్మ వెంటనే తన కత్తిని నీటివాలుకు అడ్డంగా పెట్టి సాలెపురుగు దాని మీదకు ఎక్కేలాగా సాయం అందించి, గట్టు మీదకు వదిలాడు. సాలెపురుగు గట్టు మీదకు చేరి కొంతసేద తీరి ‘మహారాజా! కేవలం ప్రజలనే కాక అతి చిన్న జీవినైన నన్నూ కాపాడిన నీ గొప్ప మనసుకు అభివాదాలు’ అని ధన్యవాదాలు చెప్పుకుంది.
ఉజ్వల వర్మ, సేవకుడు నీరు తాగి దూరం నుంచీ రథాల శబ్దాలు విని, వెంటనే అపాయం పసికట్టి పక్కనే ఉన్న ఒక కొండ గుహలో దాక్కున్నారు. సాలీడు అది గమనించి ఉజ్వల వర్మకు ఏదో అపాయం సంభవించబోతోందని భావించి, వెంటనే ఆ గుహ ముఖ ద్వారానికి అక్కడున్న తన వర్గం వారి నంతా కూడగట్టి ఒక వల అల్లింది. కొద్ది నిమిషాల్లోనే దట్టమైన సాలెగూడు ఏర్పడి అక్కడ ఒక ముఖ ద్వారం ఉన్నట్లే తెలీకుండా ఉంది.
కొద్దిసేపటికి అక్కడికి రథాల మీద, గుర్రాల మీదా సైన్యం వచ్చింది. చుట్టూ పరికించి ఎక్కడా ఉజ్వల వర్మ ఆచూకీ కానక ‘తమను తప్పుదారి మళ్లించిన వారిపై కినుకతో, వారినే మట్టుపెట్టాలని ఆగ్రహంగా ఏదేదో మాట్లాడుకుని వెళ్లిపోయారు.
రెండు రోజులైనా ఉజ్వల వర్మ తిరిగి రానందున మహామంత్రి రాజభక్తులైన కొందరితో అడవంతా గాలిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి రాజుకు, తనకు మాత్రమే తెలిసిన ఒక ఈల సూచనగా వేశాడు. రాజభక్తుడైన సేవకుడు ముందు గుహ ముఖద్వారం వద్దకు వచ్చి చూశాక మహారాజు తిరిగి ప్రతి ఈల వేయగా మహామంత్రి గుహకున్న సాలెగూడు కత్తితో తొలగించి లోనికి ఈల వేశాడు. ఉజ్వల వర్మ మహారాజు బయటకి వచ్చాడు.
గుహ ముఖద్వారం పైనున్న సాలీడును చూసి ‘ఓ! తంతువాయమా! నీ సహాయం మరువలేనిది. చిన్న ప్రాణివైనా మహా చురుగ్గా ఆలోచించి గూడు అల్లి, నా ప్రాణం కాచావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను’ అన్నాడు.
‘మహారాజా! ఇంత చిన్న ప్రాణినైన నన్ను చూసి నా ప్రాణం కాచిన మీ మనస్సు గొప్పది. మీ వంటివారు పది కాలాలపాటు జీవించి ప్రజలకు సుఖపాలన అందించాలి’ అంది.
‘ఓ నేతపురుగా! నీ సాయానికి ప్రతిగా ఈ రోజు నుంచీ నా రథ ద్వజానికి నీ చిత్రాన్ని ఉంచుకుంటాను. అంతకంటే నేను నీకు చేసే ప్రతి సాయమేమీ లేదు. చిరాయువుగా జీవించు’ అని ధన్యవాదాలు చెప్పుకుని రాజ్యానికి బయల్దేరాడు ఉజ్వల వర్మ పరివారంతో.
నీతి: ఏ జీవికైనా సాయం చేస్తే ప్రతిఫలం తప్పక అందుతుంది. కరుణామయుడైన భగవంతుడు మన ప్రతిచర్యనూ గమనిస్తూనే ఉంటాడు.

-ఆదూరి హైమావతి