S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానసిక బలానికి సంకేతం - మారుతి

నేటి తరం మానసిక సమస్యలతో కృంగిపోవడానికి కారణం మానసిక బలాన్ని పెంపొందించే విద్య లభించక పోవటం వల్లనే. నేటి తరానికి జీవితంలో ధనార్జనకు తోడ్పడే విద్యతోపాటూ జీవితాన్ని సమర్థంగా, సమృద్ధిగా, సంపూర్ణంగా, ఆనందంగా అనుభవించేందుకు అవసరమైన మానసిక శక్తినీ, ఆధ్యాత్మిక శక్తినీ అందించాలి. మన సారస్వతంలో నిక్షిప్తమైన జ్ఞానరాశిని మహాత్ముల జీవిత గాథలు, బోధల ద్వారా యువతకి అందించగలిగితే జీవితంలో ఎదురయ్యే సమస్యలను వారు సమర్థంగా ఎదుర్కొనగలుగుతారు.
మనం ఒక్కసారి ఆంజనేయుని జీవితాన్ని పరిశీలించినట్లయితే నిరాశ, అవిశ్వాసం, ఆత్మన్యూనత, ఆత్మహత్య ల్లాంటి మానసిక సమస్యలను ఆయన అధిగమించిన విధానం మనకు స్ఫూర్తినిస్తుంది.
ముందుగా ఆంజనేయుడు విద్యను అభ్యసించేందుకు పడిన శ్రమను తెలుసుకుంటేనే మన కష్టాలన్నీ కరిగిపోతాయి. మనలో అపరిమితమైన పట్టుదల పెరుగుతుంది. ఆంజనేయుడు మనందరిలాగ ఫ్యాన్ కింద కూర్చునో, ఏసీ గదుల్లో కూర్చొనో విద్యను అభ్యసించలేదు. హనుమంతుడు విద్యను అభ్యసించడానికి సూర్యభగవానుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడు సూర్యుడు హనుమంతుడితో ‘ఒకచోట కూర్చొని పాఠాలు చెప్పడం నాకు సాధ్యం కాదు. నేను రథం మీద వెళుతూ పాఠాలు చెపుతాను. నువ్వు సిద్ధమేనా?’ అని ప్రశ్నిస్తాడు. అందుకు హనుమంతుడు అంగీకరిస్తాడు. మనం తరగతి గదిలో కూర్చొని వింటేనే పాఠాలు ఎంతవరకు మనస్సుకు ఎక్కుతాయో తెలియదు. అలాంటిది సూర్యుని వేగవంతమైన గమనంతో సరిసమానంగా పయనిస్తూ పాఠాలు వినడం ఎంత కష్టమో ఊహించవచ్చు. అంతేకాక అత్యంత సూర్యతాపాన్ని భరిస్తూ, శిష్యుడు గురువుకి తన వెనుక భాగం చూపించడం అగౌరవం కాబట్టి అతడికి అభిముఖంగా వెనుకకు వెళుతూ వేదాలను అభ్యసించాడు. అంత శ్రమించి సకల శాస్త్రాలను అభ్యసించాడు. కాబట్టే శ్రీరాముణ్ణి ప్రథమ దర్శనంలోనే తన వినయ విధేయతలతో, వాక్చాత్యుర్యంతో, పాండిత్యంతో మెప్పించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.
హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైనప్పుడు తన సామర్థ్యంపై తనకు గల విశ్వాసం ఏమిటో నిరూపించాడు. సముద్ర లంఘనలో మైనాకుడు, సురస, సింహికలు అవాంతరాలు కల్పించినప్పుడు భయపడి వెనుదిరిగిపోకుండా తన బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని లంకలో ప్రవేశించాడు. అలాగే లంకలో సుందర భవనాలను, రత్నఖచిత అంతఃపురాలను, రావణాసురుని వైభోగాలను తిలకించి ‘అయ్యో! నేను వనాలలో సంచరిస్తూ ఫలాలు తిని బ్రతికేవాడిని, రావణుడి వైభవంతో పోల్చుకుంటే నేను ఎందుకూ పనికిరాని వాడిని’ అని ఆత్మన్యూనతకు గురికాలేదు. రావణ సభలో ఎంతోమంది రాక్షసులు చుట్టుముట్టి ఉన్నప్పటికీ రావణుడితో ధైర్యంగా మాట్లాడిన ధీరుడు హనుమంతుడు. రాక్షసులు తన తోకకు నిప్పంటించి నగర వీధుల్లో ఊరేగించడాన్ని హనుమంతుడు అవమానంగా భావించి కృంగిపోలేదు. దాన్ని ఓ అవకాశంగా వినియోగించుకొని లంకను సర్వనాశనం చేశాడు.
చివరగా హనుమంతుడు ఎన్నో అవరోధాలను అధిగమించి, ఎంతో ప్రయాసపడి లంకలో ప్రవేశించాడు. సీతమ్మ కోసం లంకంతా గాలించాడు. కానీ సీతమ్మ జాడ తెలియలేదు. అప్పుడు హనుమంతుడు నిరాశకు లోనై సీతమ్మ జాడ కనుగొనలేని ఈ నా జన్మ ఎందుకని ఆత్మహత్య చేసుకోవాలనే క్షణిక ఉద్వేగానికి లోనయ్యాడు.
ఆయన మానసిక స్థైర్యాన్నీ, బుద్ధిబలాన్నీ పరీక్షించేవి ఇలాంటి క్లిష్ట పరిస్థితులే! హనుమంతుడు ‘బుద్ధిమతాం వరిష్ఠమ్ - బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు’ కాబట్టి వెంటనే అతడి మనస్సులో ‘వినాశే బహావో దోషా జీవన్ భద్రాణి పశ్యతి’ - ఆత్మహత్య చేసుకుంటే అన్నీ దోషాలే, కానీ జీవించి ఉన్నట్లయితే ఎన్నో శుభాలను చూడవచ్చు’ అని తలచి, నిరాశ నుండి బయటపడ్డాడు. సీతానే్వషణను తిరిగి ప్రారంభించి సఫలీకృతుడయ్యాడు. హనుమ ఇచ్చిన ఈ మహామంత్రాన్ని నిత్యం మననం చేసుకోగలిగితే క్షణికోద్వేగం నుండి బయటపడి, బలహీనతలను జయించ గలుగుతాం. ‘బలమే జీవనం, బలహీనతే మరణం’ అన్న వివేకానందుని స్ఫూర్తి కూడా ఇదే!

-శృంగవరపు రచన 99591 81330