S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ నలుగురు

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ....
*
నల్లత్రాచులాంటి పొడవాటి వాలుజడ వేసుకుని, నగిషీ చెక్కిన టేకు నిలువుటద్దంలోకి ఒకటికి రెండుసార్లు చూసుకుంది శోభ. లేత మట్టిరంగు బెంగాలీ తాంత్ కాటన్ చీర సరిగ్గానే కట్టుకున్నా, మరోసారి ఒళ్ళు, నడుము కనపడలేదు కదా అని మళ్ళీ చూసుకుంది. జీవితంలో మొట్టమొదటి ఉద్యోగంలో మొదటి రోజంటే అంతే కదా! తను పట్టించుకోపోయినా, అద్దం ఎప్పుడూ నిజమే చెబుతుంది. పసిమి ఛాయ, తీర్చిదిద్దిన రూపురేఖలు ఆమె సొంతం. ఆడవాళ్ళు ఆమెను చూసినా, ఆమె అందం చూసి మైమరచిపోవాల్సిందే!
కారు తీయకుండా ఆటోలో ప్రభుత్వాఫీసుకి వెళ్ళింది. ‘‘రండి.. రండి శోభగారూ.. ఆల్ ది బెస్ట్ టు యూ’’ అని పలకరించాడు ప్రసాద్.
అతను తన ఆఫీసులో సూపర్నెంట్. ఆ పలకరింపుకి ఆశ్చర్యపోయింది శోభ. తన మనోభావాలని బయటపడనీయకుండా థాంక్స్ చెప్పి, తన సీట్ వద్దకు వెళ్ళి కూర్చుంది. టైపు చెయ్యాల్సిన ఉత్తరాలేవో అక్కడ పెట్టి ఉన్నాయి. వాటిని తీసుకుని టైపు చేసి, ప్రింటు తీసి, సరిచూసుకుని ప్రసాద్‌కి పంపించింది. కొంతసేపటికి ప్రసాద్ వచ్చి ‘‘అరే! మీరు ఒక్క తప్పు కూడా లేకుండా టైపు చేసేశారే! కంగ్రాట్స్..’’ అంటూ కరచాలనం కోసం చేయి చాచాడు. శోభ చూసిన తీక్షణమైన చూపుకి ఇది పురాణ కాలమైతే అతను బూడిదైపోయుండేవాడు. కానీ ఇది కలికాలం. అందుకే చేయి వెనక్కు తీసినా చూపులు వెకిలిగా ఉన్నాయి. ఇంతలో ప్యూనువచ్చి ‘‘అమ్మా! మిమ్మల్ని ఆఫీసర్‌గారు రమ్మంటున్నారు’’ అనడంతో ఊపిరి పీల్చుకుని వెంటనే లేచి అటు వెళ్ళింది. తలుపుతట్టి లోపలికి వెళ్ళడంతోనే కార్తీక్ లేచి నిలుచున్నాడు. ఇది ఆమెకు మరొక షాక్. చేతులు జోడించి ‘‘నమస్తే మేడమ్.. రండి కూర్చోండి’’ అని ఆమె కూర్చున్నాక తను కూర్చున్నాడు. ఆమెకు కొబ్బరినీళ్ళు, తనకి కాఫీ చెప్పి ‘‘నా మొదటి పోస్టింగ్ వసంత్ సార్ కింద అయ్యింది మేడమ్. మీకు తెలియనది కాదు. నేను బాచిలర్‌గా ఉన్నప్పుడు ఇంటి తిండికి దూరవౌతానని, రోజూ రుచికరమైన భోజనం పెట్టిన అన్నపూర్ణ మీరు. నాకు పెళ్ళయ్యి ఊరు వచ్చినప్పుడు తిన్నగా మీ ఇంటికే వచ్చాం. మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అని వౌనం వహించాడు. ఆమె కూడా వౌనం పాటించింది. కొద్దిసేపట్లో ఆవిరి వస్తున్న కాఫీ కప్పు, తియ్యటి కొబ్బరి నీళ్లున్న గ్లాసు టేబుల్ మీదకు వచ్చాయి. అవి సేవిస్తుండగా ‘‘మీరు హాయిగా ఉద్యోగం చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేనున్నానని మరిచిపోకండి’’ అని ముగించాడు. ‘‘్థంక్ యూ సార్’’ అని చేతులు జోడించి లేచింది శోభ. ‘‘నో.. మేడమ్. ఐయామ్ కార్తీక్. వసంత్ సార్ జూనియర్’’ అని అతనూ లేచి చేతులు జోడించాడు. సీట్‌కి వచ్చి, ఆమె మనసుని కుదుటపరుచుకోవడానికి ప్రయత్నించింది. అప్రయత్నంగా ఆ ఆలోచనలు ఆమెను గతంలోకి తీసుకెళ్ళాయి.
***
శోభ ఇంటర్ చదువుతూండగా స్నేహితురాలు జలజ పెళ్ళిలో చలాకీగా పనులు చేస్తూ కనిపించిన ఆమెను పెళ్ళికొడుకు స్నేహితులు వసంత్ చూసి ఇష్టపడి మనసు పారేసుకున్నాడు. వాళ్ళ పెద్దవాళ్ళతో శోభ తల్లిదండ్రులతో మాట్లాడించాడు కూడా. అతను ప్రభుత్వంలో కట్టడాల ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మంచి పేరున్న కుటుంబానికి చెందినవాడు. కోరి వచ్చిన సంబంధాన్ని కాలదన్నకూడదని శోభని ఒప్పించి ఆర్భాటంగా పెళ్ళి చేశారు ఆమె పెద్దలు. మగపెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిసెప్షన్‌లో వసంత్ ఆఫీసులో పనిచేసే ప్రసాద్ మొదలైనవాళ్ళు వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరికీ సరిగ్గా మర్యాదలు జరిగేటట్టు చూసుకున్నారు. అప్పుడప్పుడు ఏవో ఆఫీసు పనుల నిమిత్తం ఇంటికి వస్తే తనని తలెతె్తైనా చూడకుండా ‘నమస్కారం.. మేడమ్’ అనో, ‘నమస్కారం అమ్మగారూ’ అనో పిలిచేవారు. ఎండను పడి వచ్చిన వారికి మజ్జిగిస్తే ఆమెను అన్నపూర్ణాదేవితో పోల్చేవారు. శోభ తండ్రి మోతుబరి రైతు. అయినా బాగా చదువుకున్నవాడు. మంచివాడు. తన గుమ్మంలోకి పేదవాళ్ళొచ్చినా, గొప్పవాళ్ళొచ్చినా ఆకలి, దాహం తీర్చడం లాంటి కనీసపు మర్యాదలు చేయడమనేది వాళ్ళింట్లో ఆనవాయితీగా పెట్టాడు. అదే ఆమె కొనసాగించింది. ప్రసాద్ వంటి వాళ్ళు తనను పొగిడితే, ఆఫీసు రాజకీయాల గురించి అవగాహన లేని ఆమె పాపం ఇంతకు ముందున్న ఆఫీసర్ల భార్యలు కనీసపు మర్యాదలేని వాళ్ళు కాబోలుననుకునేది.
చదువుకి దూరమైనందుకు ఆమె బాధపడకుండా, వసంత్ ఆమె చేత ప్రైవేటుగా బీఏ కట్టించాడు. తనకి చాలా ఇష్టమైన కంప్యూటర్ కొని, ఆమెకు దాని వాడకం గురించి చెప్పి అమెరికాలో ఉన్న తన అక్కతో యాహూ మెసెంజర్‌లో ఛాట్ చేయడం నేర్పించాడు. త్వరలోనే వదినా మరదళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా ఛాట్ చేసుకునేవారు. కంప్యూటర్ ఒక వ్యసనం లాంటిది. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి తన వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి అప్లికేషన్లు వాడడం నేర్చుకుంది. ఇంట్లో జమ ఖర్చులు ఎక్సెల్‌లో వ్రాయడం మొదలుపెట్టింది.
కొన్నాళ్ళకి ప్రభుత్వం వారు రెండు కొండలు కలిపేందుకు ఒక వంతెన తలపెట్టారు. నిజాయితీపరుడని వసంత్‌ని నిర్మాణ స్థలానికి బదిలీ చేశారు. కొత్తగా నియమింపబడ్డ కుర్ర ఇంజనీర్ కార్తీక్‌ని వసంత్ కింద తర్ఫీదు పొందడానికి అక్కడికి ప్రభుత్వం వారు పంపారు. అది మారుమూల ప్రదేశం అవడం వల్ల స్థానికులు ఆఫీసర్లతో దూరం పాటించడం వల్ల కార్తీక్ అప్పటికి బ్రహ్మచారి అవడం వల్ల ఖాళీ సమయం వాళ్ళిద్దరితోనే గడిపేవాడు. పెద్ద మనసుండే దంపతులు గనుక వాళ్ళు అతన్ని చేయి కాల్చుకోవద్దని సలహా ఇచ్చి, వాళ్ళతో పాటే భోజనాదులు చేయమన్నారు.
త్వరలో దంపతులకి పదోన్నతి వచ్చింది. వాళ్ళబ్బాయికి శశాంక్ అని పేరు పెట్టే సంబరాన్ని ఘనంగా జరుపుకున్నారు. అప్పుడు కార్తీక్, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
తను శశాంక్‌తో తిరిగివచ్చే సమయానికి కార్తీక్‌కి అపురూపతో పెళ్ళయ్యింది. నలుగురూ కలిసిమెలిసి పనులు చేసుకునేవారు.
సంతోషంగా సాగిపోయే వాళ్ళ జీవితాల మీద ఎవరి దుష్ట దృష్టి పడిందో ఏమో వసంత్ అర్ధాంతరంగా మరణించాడు. కార్తీక్‌తో కలిసి వంతెన పనిని తనిఖీ చేస్తూండగా, సిమెంట్ సరిగ్గా సెట్ అవని ఒకచోట కాలుమోపి, ఆ సిమెంట్ విరిగిపోతే అతను కాలుజారి లోయలో పడిపోయాడు. ఇదంతా కార్తీక్ కళ్ళ ముందరే రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. తనని ఓదార్చే శక్తి ఎవరికీ లేకపోయింది. మొదట పుట్టింటికి వెళ్ళింది. పెద్దవాళ్ళు పెళ్ళి ప్రసక్తి తెచ్చేసరికి అలిగి శశాంక్‌తో సహా అత్తింటికి వెళ్ళిపోయింది తను. ఈ కష్టకాలంలో కార్తీక్, అపురూప తనతో రోజూ మాట్లాడుతూ ఉండేవారు.
ఓ ఏడాదికి కార్తీక్‌కి వాళ్ళుండే ఊరు బదిలీ అయ్యింది. ఆమె ఎప్పుడూ వసంత్ ఆలోచనల్లోనే ఉండడం వల్ల మానసికంగా కృంగిపోవచ్చనే భయంతో అతను ఆమెకు ఒక సలహా ఇచ్చాడు. వాళ్ళ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీగా ఉందని, కారుణ్య నియామకం ద్వారా తను దానికి దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పాడు. తను ఒప్పుకోలేదు. ఇదివరలో ఇది వసంత్ పనిచేసిన ఆఫీసనీ, సహోద్యోగులందరూ తనకి తెలిసినవారని, పైగా ఆ ఆఫీసు తన అధీనంలోనే ఉంటుంది గనుక భయపడాల్సింది లేదని చెప్పి అతనే అత్తమామల్ని ఒప్పించాడు. వాళ్ళు కోడలు మేలుకోరే వాళ్ళు గనుక వాళ్ళు ఆమెను ఒప్పించారు. శశాంక్ ఇప్పుడు ప్లే స్కూల్‌కి వెళ్తున్నాడు గనుక వాడికి తాతయ్య, నాన్నమ్మల దగ్గర చేరిక ఉంది గనుక వాడి పెంపకానికి లోటేమీ రాబోదని ఆమెతో వాళ్ళు చెప్పారు. ఇంటికి వచ్చిన తరువాత తను అంత సమయాన్నీ పిల్లాడితో గడపొచ్చని చెప్పి ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు.
ఒక్కసారి కూడా ఆఫీసుకి వెళ్ళనక్కర లేకుండా కార్తీక్ ఇంటికి వచ్చి తీసుకోవలసిన సంతకాలు తీసుకునేవాడు, చేయవలసిన ధృవీకరణలు సంబంధిత అధికారులని ఇంటికి తెచ్చి చేయించాడు. ఒకరోజు మరో ఆఫీసులో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష జరిగింది. తనకి ఉండే పరిజ్ఞానానికి సరిపడే స్థాయి పరీక్ష కానేకాదు. చాలా సుళువుగా ఉత్తీర్ణురాలయ్యి, తన భర్త ఒకప్పడు అధికారిగా పనిచేసిన ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరింది.
***
‘‘అమ్మగారూ.. రెండు రోజుల్లో హెడ్ ఆఫీసు నుండి పెద్ద దొరగారు వస్తున్నారంట. అందుకని బుక్‌లెట్ తయారుచేయాలంట. సూపర్నెంటుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు’’ అని ప్యూన్ మహేష్ అన్న మాటలకి వర్తమానంలోకి వచ్చింది శోభ. ‘‘సరే’’ అని నోట్‌బుక్ తీసుకుని బయలుదేరబోతుండగా ‘‘అమ్మగారూ.. ఒక్క సిన్న ఇసయం. అయ్యగారు ఈ ఆఫీసులో ఉన్న కాలంలో మా నాన్న ఇక్కడ ఇదే ఉద్యోగంలో ఉండేవాడు. హఠాత్తుగా గుండెపోటొచ్చి సచ్చిపోతే ఒక పైసా లంచం లేకుండా దగ్గరుండి నాకీ ఉద్యోగం ఇప్పించారు. మా కుటుంబమంతా రెండు పూటలా బోంసేత్తన్నామంటే అది అయ్యగారి సలవే. ఆ మేలు మేమీ జన్మలో మరసిపోలేం అమ్మగారూ’’ అని ముగించాడు మహేష్. ‘‘అయ్యగారు ఆయన డ్యూటీ చేశారంతే’’ అని ప్రసాద్ సీట్ దగ్గరికి వెళ్ళింది.
‘‘శోభగారూ.. ఇదిగో ఈ ఫార్మాట్‌లో బుక్లెట్ తయారుచేయాలి. దానికి సంబంధించిన డేటా ఈ కాగితాల్లో ఉంది’’ అని పని పురమాయించాడు ప్రసాద్. శోభ కాగితాలు తీసుకుని వెళ్ళబోతుంటే ‘‘ ఈ రోజు సాయంత్రంలోగా రెడీ కావాలని ఇంజనీర్‌గారు చెప్పారు’’ అన్నాడు. ఆమె జవాబివ్వకుండా తన సీటు దగ్గరకి వచ్చింది.
ప్రసాద్ ప్రవర్తన ఆమెకు పొద్దుటినుండి వింతగానే ఉంది. ఇదివరలో అంత అణిగి మణిగి అతి మర్యాద చూపించినవాడు తనని పేరు పెట్టి పిలుస్తున్నాడు! పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తే మనుషుల తీరులో మార్పుంటుందని సరిపెట్టుకోవచ్చు. పైగా ఇప్పుడు అతను తనకి బాస్. తన కింది వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే తప్పు లేదనుకోవచ్చు. కానీ అతను తనతో చేయి కలపబోయాడు! దానికి ఏ పేరు పెట్టాలి? ఏం చెప్పి సరిపెట్టుకోవాలి?
ఇలాంటి ఆలోచనలతో సమయం వృథా చేయడం ఎందుకని ముందు పని చూసుకుంది. ఆ ఫార్మాట్‌ని ఇంకా మెరుగుపరిచి, ఐదున్నరకి పని పూర్తిచేసింది. తనిచ్చిన ఫార్మాట్ మార్చినందుకు తప్పులెన్నబోయిన ప్రసాద్, ఆమె చేసిన మార్పుల్లోని సౌలభ్యాన్ని అర్థం చేసుకుని ఏమీ అనలేదు.
హెడ్ ఆఫీసు నుండి వచ్చిన ఆఫీసర్ ఫార్మాట్‌లోని మార్పులను గమనించి, అందరి ఎదురుగుండా ప్రసాద్‌ని మెచ్చుకుని, వెయ్యి రూపాయల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. అన్ని ఆఫీసులలోనూ ఇదే ఫార్మాట్ అమలు చేయిస్తారని కూడా సూచించారు. అంటే శోభ చేసిన మార్పులు తను చేసినట్టుగా గొప్ప కొట్టుకున్నాడన్నమాట! పుండు మీద కారం జల్లినట్లు, మిగతా సహోద్యోగులు ‘‘ ఎంతైనా పోటీ పరీక్షలో ఎంపికైన ఉద్యోగుల స్థాయే వేరు. వీళ్ళ వల్లే మన విధానాలు మెరుగుపడేది’’ అని మెచ్చుకుంటూంటే ఆమె స్పందించలేదు. తన భర్తే లేనప్పుడు ఈ పొగడ్తలు తనకి అవసరం లేదనుకుంది.
***
ఒకరోజు ప్రసాద్ ఆఫీసు సమయం గడవడానికి పావు గంట ఉందనగా గంటసేపు పట్టే టైపింగ్ పని అప్పచెప్పాడు. ‘‘రేపు పొద్దున్న త్వరగా వచ్చి పూర్తిచేస్తానండీ’’ అని ఆమె అంటే, ‘‘ ఇది అర్జెంటు. ఇప్పుడే కావాలి’’ అని పట్టుబట్టాడు. మిగతా సహోద్యోగులు అంతా ఇంటికి వెళ్ళిపోతుంటే, తను మాత్రం ఆ సమాచారాన్ని హెడ్ ఆఫీసుకి అందించడానికి ఉండిపోయాడు. ప్రసాద్ టీ పట్టుకు రమ్మంటే ‘‘ ఆఫీసు తరువాత పనిచేసినందుకు నాకు ఓవర్ టైం ఇవ్వరు కదయ్యా! అందుకని టీ కావలిస్తే మీరే వెళ్ళి తాగి రండి. మీరెప్పుడెళ్తే అప్పుడు ఆఫీసుకి తాళం పెట్టుకుని ఇంటికి పోతా’’ అని జవాబిచ్చాడు మహేష్. ‘‘ఇదివరకు తాళం చెవులు మాకిచ్చి ఇంటికి పోయేవాడు ఇప్పుడు రూల్సు మాట్లాడుతున్నాడు’’ అని గొణుక్కున్నాడు ప్రసాద్. ఆమెకు గండం గడిచింది.
ఆమె గమనించినదేమంటే.. కార్తీక్ బ్యాంకుకి వెళ్ళినప్పుడే ప్రసాద్‌కి ఈ అర్జెంటు పనులు పడుతున్నాయి. కానీ మహేష్ పుణ్యమా అని ఎలాగో నెగ్గుకు వస్తోంది. పోనీ ఉద్యోగం మానేస్తేనో? నో.. తనంత పిరికిది కాదు. లేకపోతే ఈ విషయం కార్తీక్‌తో చెప్పేస్తేనో? తను ధైర్యంగా ఎదుర్కోగలిగినంత వరకూ ఎందుకు అతణ్ణి శ్రమ పెట్టడం, అనుకుంది.
***
కొన్నాళ్ళకి ఆఫీసులో మరో కారుణ్య నియామకం జరిగింది. ఓ ఇరవయ్యేళ్ళ యువకుడు గుమస్తాగా చేరాడు. అతని పేరు గోవింద్. వాళ్ళ నాన్నగారు పోయి ఏడేళ్ళయ్యిందట పాపం! కారుణ్య నియామకానికి వయస్సు వచ్చాక మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడితేగాని ఉద్యోగం దొరకలేదట! వాళ్ళమ్మగారి కుటుంబ పింఛనుకి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిందట!
శోభ మళ్ళీ ఆలోచనలో పడింది. తను కుటుంబ పింఛను కోసం గాని, కారుణ్య నియామకం కోసం గాని కష్టపడలేదు. దానిక్కారణం తనకు ఒక ఉన్నతోద్యోగి మద్దతుండడమే! అందరికీ ఇలాగే జరుగుతుందని ఎంత భ్రమ పడింది!
***
ఒకరోజు యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయి ప్రసాద్ కోసం వచ్చినట్టు శోభ గమనించింది. ఆమె వాలకం చూస్తే పేద పిల్ల అని తెలుస్తోంది. ఆ రోజున అతను సెలవు పెట్టాడు. ప్రసాద్ తనకన్నా తక్కువ స్థాయిలో ఉండే ఆడవాళ్ళని చూసే విధానం తెలుసు గనుక ఆ అమ్మాయిని తన సీటు దగ్గరకు తీసుకెళ్ళి విషయం కనుక్కుంది. వచ్చిన అమ్మాయి పేరు నిర్మల. మర్యాదగా పలకరించిన శోభతో తన గోడు చెప్పుకుంది. విధవరాలైన ఆమె తల్లి ఆ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసి, మూడేళ్ళ క్రితం పోయిందట. నియామకపు పరీక్ష కూడా పాస్ అయ్యిందట. అయినా దానికి కావలసిన ఆమ్యామ్యా ఇవ్వలేకపోవడం వల్ల ఆమె నియామకపు ఫైలు కదల్లేదట. పోనీ.. వేరే ఆధారం లేని కూతురిగా కుటుంబ పింఛనిమ్మని కోరిత కారుణ్య నియామకం ఎలాగూ జరుగుతుంది కదా అని ప్రసాద్ మాట దాటేశాడట. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఈ మధ్యనే అతను ఆమెకు ఒక ప్రత్యామ్నాయం సూచించాడట. గోవాకి తనతో మూడు రోజులు వెళ్తే తన నియామకం జరిగేటట్టు చూస్తానన్నాడట. ‘‘అమ్మా! మా అమ్మకి ఒంట్లో బాగా లేనప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి ఆవిడ డబ్బులు సరిపోయాయి. మా అమ్మ తోటి పనిచేసినా, ననే్నదే చదివించి గొప్పదాన్ని చేద్దామనుకుంది. ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదవడం కూడా మాబోటోళ్ళకి స్తోమతుకి మించిన పనే కదమ్మా! నా చదువు కోసం చేసిన అప్పులు అలాగే ఉన్నాయి. నేను చదువు ఆపేసినా వాటిని తీర్చలేను. అందరికీ చులకనైపోయాను. దాని బదులు ఈయనకి తలొగ్గి ఉద్యోగం సంపాయించుకుంటే అప్పులైనా తీరుతాయి గదా! నేను మళ్ళీ రేపు వస్తానమ్మా!’’ అని కళ్ళు తుడుచుకుంటూ లేవబోయింది. ఈ నియామకాలలో జాప్యాన్ని సమీక్షించిన హెడ్ ఆఫీసు వాళ్ళు కారణాలడిగారన్న విషయం శోభకి తెలుసు. బలవంతులు నిస్సహాయులని ఇలా కూడా దోపిడీ చేయజూస్తారా అని షాక్ అయ్యిందామె. ఇటువంటివి సినిమాల్లో చూపిస్తే ఎక్కడో జరుగుతాయనుకుంది. తన కళ్ళెదురుగా జరుగుతుంటే ఊరికే ఉండలేకపోయింది.
తనకి సాయం చేసిన కార్తీక్, మహేష్‌లు తన భర్తకి ఋణపడి ఉన్నారన్న భావనతో చేశారు. బహుశః ఆ ఋణమే లేకపోతే తను ఈ కారుణ్య నియామకానికి దరఖాస్తు పెట్టేదా? తన తల్లిదండ్రులు, అత్తమామలు గొప్పింటివారు కాకపోతే తనకి ఈ నియామకమే జీవనాధారమయ్యేది కదా! అప్పుడు పెద్ద మనుషుల సహాయం లేనప్పుడు ప్రభుత్వపు సదుద్దేశాలను దుర్వినియోగపరచే ప్రసాద్ లాంటి దుర్మార్గుల పాలపడవలసిందే కదా! లేదు, ఇలా జరగడానికి వీల్లేదు! న్యాయం కోసం తను ఇప్పుడైనా పోరాడకపోతే తను దుర్మార్గులను పరోక్షంగా సమర్థించినట్టవుతుంది కదా!
వెళ్ళబోతున్న నిర్మలని ఆపి, కార్తీక్ దగ్గరకి తీసుకువెళ్ళి విషయం బయట పెట్టించింది. స్వతహాగా మంచివాడైన కార్తీక్ వెంటనే నిర్మల నియామకం కావించి, ప్రసాద్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాడు. ప్రాథమిక దర్యాప్తులో అతను శోభతో ప్రవర్తించిన తీరు బయటపడింది. ఆ విషయం విశాఖ మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆంతరంగిక ఫిర్యాదుల కమిటీ పరిశీలించింది. అభ్యుదయ భావాలున్న శోభ అత్తమామలు ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. మహేష్, నిర్మలల సాక్ష్యాల వల్ల ప్రసాద్‌ని ఉద్యోగం నుండి తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది.
ప్రసాద్‌పై రెండో అభియోగం లంచగొండితనం. నిర్మల సాక్ష్యం ఒక్కటే దీన్ని నిరూపించగలదా, అన్న అనుమానం వ్యక్తమైన తరుణంలో గోవింద్ ముందుకొచ్చాడు. లంచం పుచ్చుకోవడం ఎంత పెద్ద నేరమో, ఇవ్వడం కూడా అంతే! ఇప్పుడు ప్రభుత్వోద్యోగి కనుక అతను క్రమశిక్షణా చర్యలకి అర్హుడవుతాడు. ఎంతో కష్టపడి ఇన్నాళ్ళకి సంపాదించుకున్న ఉద్యోగం పుటుక్కుమని ఊడిపోతుంది. అందువలన శోభ అతణ్ణి వారించబోయింది. అప్పుడతను ‘‘మేడమ్! నాలాంటి వాళ్ళని ఎందరినో దుర్మార్గుల బారి నుండి రక్షించడానికి కంకణం కట్టుకున్నారు మీరు. నా స్వార్థం కోసం ఈ మహత్తర కార్యానికి దూరంగా ఉండలేను’’ అని జవాబిచ్చాడు. ఇంక చెప్పేదేముంది? రెండో అభియోగం కూడా నిరూపించబడింది.
ప్రసాద్ ఉద్యోగం ఊడింది. గోవింద్ ప్రసాద్ పీడింపుకి గురై, గత్యంతరం లేక లంచమిచ్చాడని, అతనిప్పుడు అవినీతిని బయటపెట్టడంలో సహకరించాడు కనుక అతణ్ణి క్షమించడమైందని పై అధికారులు నిర్ణయించారు.
ఆ ఆఫీసులో ఏళ్ళ తరబడి వేళ్ళు విస్తరించిన అవినీతిని ఆ నలుగురు కారుణ్య నియామక ఉద్యోగస్థులు ఆపగలిగారు!

-- డా. చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి 94451 84363