S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘స్వరాజ్య’మే సర్వస్వం

స్వాతంత్య్ర పోరాటం రోజుల్లో దేశభక్తి పతాక స్థాయిలో ప్రబలిపోతున్న తరుణంలో జాతీయోద్యమ నేతలు అనేక మంది తమ ఉద్యమానికి పత్రికలను ఆయుధాలుగా చేసుకున్నారు. ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించడానికి, వారిని చైతన్యవంతులను చేయడానికి ఈ పత్రికల మద్దతును ధారాళంగా ఉపయోగించుకున్నారు. మహాత్మాగాంధీ ‘ఇండియన్ ఒపీనియన్ ఇన్ సౌత్ ఆఫ్రికా’, సి.ఆర్.దాస్, మోతీలాల్ నెహ్రూ, బిపిన్ చంద్రపాల్ లాంటి జాతీయ నాయకులు హేమాహేమీలందరూ పత్రికలను నడిపారు. అయితే ఎవరి పంథా వారిది. అదే విధంగా 1920లలో మద్రాస్‌లో ‘ది హిందూ’ ‘మద్రాస్ మెయిల్’, అనిబిసెంట్ ‘న్యూ ఇండియా’ మరియు ‘జస్టిస్’ ఇలా ప్రధాన పేపర్లు ప్రచారంలో ఉండేవి. అయితే ఏ ఒక్క పత్రికా, ప్రభుత్వ అరాచకాలను కావలసిన స్థాయిలో ప్రచురించకపోయేవి. విప్లవ, విమర్శ అంశాలను ప్రజలకు చేరవేయడంలోనూ, స్వాతంత్య్ర పోరాటంలోని ముఖ్యమైన సంఘటనలను, ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఉన్నదున్నట్లు ప్రచురించే సాహసం చేసేవి కావని ప్రకాశంగారి కచ్చితాభిప్రాయం. ప్రకాశంగారికి రాజమండ్రి చైర్మన్‌గా ఉండగానే, తన మున్సిపాలిటీలో సుపరిపాలన చేస్తున్నప్పుడే కొన్ని ముఖ్య లక్ష్యాలు తనలో ఉద్భవించాయని చెప్పవచ్చు. అవి - నిరక్షరాస్యత, మూఢ నమ్మకాల నిర్మూలన. ఈ లక్ష్య సాధన కోసమే ఆంధ్రకేసరి ఆజన్మాంతం తన సర్వస్వాన్ని దేశ ప్రగతి కోసం ధారపోశాడు. మద్రాస్‌లో, రెవిన్యూ మంత్రిగా (ప్రీమియర్), ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల అభ్యుదయానికి నిరంతరం కృషి చేస్తూ వచ్చారు. అలాగే నిర్లక్ష్యం, అవినీతి, అశ్రద్ధ ఎవరిలోనైనా, ఎంతటి వారిలోనైనా కనపడ్తే సహించేవారు కాదు. బారిస్టర్‌గా మద్రాస్‌లో అపరిమితంగా సంపాదిస్తున్న రోజులలో ప్రకాశం గారు ‘మద్రాస్ లా టైమ్స్’ జర్నల్ ఒకదానిని కొని తనే ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఈ జర్నల్ ద్వారా దేశరక్షణ చట్టాలను, నిబంధనలను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. ప్రధానంగా ఇది న్యాయవాద వృత్తికి సంబంధించినదైనప్పటికి, న్యాయవాద హక్కుల సంరక్షణకూ, న్యాయమూర్తుల అశ్రద్ధ, అక్రమ వైఖరులను సరిదిద్దడానికి ఎంతగానో సహాయపడ్డది. ప్రకాశంగారి ‘లా’ టైమ్స్ (1912-21) న్యాయమూర్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వారికి సింహస్వప్నంగా నిలిచింది. ముఖ్యంగా ప్రకాశంగారి కేసుల్లో న్యాయమూర్తులు, తమతమ వైఖరిని మార్చుకున్న సందర్భాలు ఎనె్నన్నో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది అరుదైనది ఒక సంఘటన ఉంది.
ఒకసారి ప్రకాశంగారు ఒకే స్వభావంగల 50 కేసులు వాదించాల్సి వచ్చింది. అప్పుడు జస్టిస్ శివస్వామి అయ్యర్. ఆయన కేసును సరిగా వినకుండానే మొదటిరోజే వ్యతిరేక తీర్పును ఇచ్చారు. సరే ప్రకాశంగారు రెండో కేసు ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. ‘ఒకే స్వభావం కదా మళ్లీ అదే ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు’ అని కోపంగా అన్నారు అయ్యర్‌గారు. దానికి ప్రకాశంగారు ‘మిలార్డ్ నేను యాభై మంది దగ్గర ఫీజు తీసుకున్నాను. యాభైసార్లు వాదించవలసిన బాధ్యత నాకు ఉంది’ అన్నారు. అవును మరి ప్రకాశం అంటే ప్రకాశం. ఒకసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినడు. 15 రోజుల తరువాత జడ్జిగారే స్వయంగా ప్రకాశంగారిని పిలిపించుకొని ఆర్గ్యుమెంట్ తిరిగి చెప్పవలసిందిగా కోరి శ్రద్ధగా విని 50 కేసుల్లోనూ అనుకూల తీర్పును ఇచ్చి ‘హమ్మయ్య’ అనుకోవడం జరిగింది. ఈ సంఘటన హైకోర్టు చరిత్రలోనే ఇది వరకెన్నడూ జరగలేదని గొట్టిపాటి బ్రహ్మయ్యగారు ప్రకాశం గురించి రాశారు. అంటే ‘లా టైమ్స్’లో కూడా ప్రకాశంగారి సంపాదకీయం అంత నిర్భీతితో, నిర్మాణాత్మక విమర్శలతో కూడినదనడానికి నిదర్శనం.
గాంధీగారి పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాటంలో దూకడానికిగాను లక్షలు సంపాదించి పెడ్తున్న న్యాయవాద వృత్తి తృణప్రాయంగా విసర్జించిన సంఘటన ఆ రోజులలో చాలా గొప్పదైనదీ, ప్రాధాన్యతతో కూడినదీ కూడాను. ఎందుకంటే ప్రకాశంగారు అతి భీకరంగా, న్యాయవాద వృత్తిలో వీరవిహారం చేస్తూ ఉండడం. పైగా తొలి తెలుగు సింహం కావడం విశేషం. ఈ నిర్ణయాన్ని ప్రకాశంగారు జనవరి 1921లో బీచ్‌లో ఓ పెద్ద బహిరంగసభలో తెలియజేశాడు. ఈ విషయం ప్రకాశానికి సంబంధించినంతవరకూ హాట్ టాపిక్‌గా చెప్పుకున్నారు. హైకోర్టుల్లోనూ బయట కూడాను. కాని ఈ సంచలనాత్మకమైన వార్తను ఏదో ఒక పత్రికలో ఓ మూల చిన్నగా ప్రచురించబడింది. ప్రకాశంగారు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన పత్రికలు కూడా పక్షపాత వైఖరిని, ప్రభుత్వ అనుకూల సాధనంగా, భయభ్రాంతులతో పనిచేయడాన్ని సహించలేక తనే ఒక పత్రికను స్థాపించాలనుకున్నాడు. అంతే వెనువెంటనే అడుగులు పడ్డాయి. ప్రకాశంగారు మిత్రులతో ఈ నిర్ణయాన్ని చెప్పడమేమిటి దేశ విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, రాజకీయ దిగ్గజాలు, న్యాయకోవిదులు హర్షించారు. షేర్‌లు కొన్నారు. విరాళాలు ఇచ్చారు. తొలి తరం పాత్రికేయులందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకాశం స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో శిక్షణ పొందినవారే. ఒకరు కలం పడితే ఒకరు ప్రింటింగ్ మిషన్ పట్టారు, పెట్టారు. మరొకరు నిర్వహణలో పాలుపంచుకున్నారు. చిరకాలం నుండి ఆంధ్రుల ఆశయం మద్రాస్‌లో ఒక ఆంగ్ల దినపత్రిక నడపాలని ఉండింది. దానికిగాను మన ప్రకాశం నడుం బిగించారనుకున్నారు మన తెలుగు జాతి. రాజాజీగారు స్వయంగా ‘స్వరాజ్య’ పేరును ప్రతిపాదించారు. అంతేకాకుండా అరవంలో కూడా పత్రిక రావాలని కోరారు. ప్రకాశంగారు తన సొంత డబ్బుతో ఇంగ్లీష్‌లో, తెలుగులో, అరవంలో కూడా నెలకొల్పాడు.
మోతీలాల్ నెహ్రూగారు స్వరాజ్య పత్రిక పనితీరును మెచ్చుకొని ఆజన్మాంతం షేర్లు కూడా కొన్నారు. తరువాత కాలంలో పత్రికా జర్నలిజంలో అఖండ పేరు ప్రఖ్యాతులు గడించిన వారిలో ముఖ్యులు ఖాసా సుబ్బారావు, కృపానిధి, రామకోటేశ్వరరావు, ఆక్స్‌ఫర్డ్ ప్రసిద్ధ సంపాదకులు కె.ఎం.్ఫణికర్ లాంటి వారు సంపాదకీయ డెస్క్‌ను అలంకరించారు. స్వరాజ్య పత్రిక మొదటి నెలలో 5వేల కాపీలు, 2వ నెలలో 8 నుండి 9 వేల కాపీలు అమ్ముడుపోయాయి. ఆ రోజులలో అది ఒక సంచలన మార్కెటింగ్‌గా చెప్పుకున్నారు.
ప్రకాశం ‘స్వరాజ్య’ నడిపిన రోజులలో జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. స్వరాజ్య మన భారతావనిలో పత్రికా నిర్వహణలోనూ, వార్తల ప్రచురణలోనూ ఒక చరిత్ర సృష్టించింది. ఆ రోజులలో ఏ పత్రికైనా నిర్భయంగా వార్తా ప్రచురణ చేసింది అని చెప్తే ఆ మాట అబద్ధమైనా అయి ఉండాలి లేక ఆ పత్రిక కచ్చితంగా ‘స్వరాజ్య’ అయినా అయి ఉండాలి అనే స్థాయికి ఎదిగింది. ‘స్వరాజ్య’లో పనిచేసే సిబ్బంది పట్ల, ఆంధ్రకేసరి ప్రవర్తించే తీరు, వారి అవసరాలను తీర్చేందుకు పడే తపన, చేసే ప్రయత్నం చూసి సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉండేవారు. ప్రకాశంగారితో కలిసి పని చేయడం ఒక మరపురాని దివ్యానుభూతి అని రాసుకున్నారు రామకోటేశ్వరరావు. ఆయన సహాయ సంపాదకుడుగా పనిచేశారు. రచయితలకు పరిపూర్ణ స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఇచ్చేవారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి తనపై వచ్చిన విమర్శలకు కోపగించుకొని ఆ విలేకరిపై కఠిన చర్య తీసుకోమని ప్రకాశంగారిని కోరగా, ప్రకాశంగారు బహిరంగ ప్రకటన చేస్తూ ‘నేను తప్పు దారిన నడిచినప్పుడు నా ‘స్వరాజ్య’ నన్ను కూడా తీవ్రంగా విమర్శించడం జరిగింది’ అన్నారు. ఖాసా గారు ప్రకాశంగారి గురిచి సంతాప సభలో ప్రసంగిస్తూ అంటారు ‘ఇతరులు తమ తప్పులను చూపిస్తూ ఒప్పించడానికి సాహసిస్తే, తనకు నిజం అనిపిస్తే మార్పు చేసుకోవడానికి ప్రకాశంగారు ఆక్షేపించేవారు కాదు’. అర్జునుడికి పాశుపతాస్త్రం ఎలాంటిదో ప్రకాశానికి ‘స్వరాజ్య’ అలాంటిది.
ప్రకాశం గారు ‘స్వరాజ్య’ పత్రిక నిర్వహణ కోసం తను సంపాదించిన యావదాస్తి, స్థిరచరాస్తులు కర్పూర హారతిగా ఖర్చు చేశారు. గాంధీగారిని ప్రకాశంగారిని సన్నిహితులుగా చేసింది స్వరాజ్యనే. వారిద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తెచ్చిందీ ‘స్వ రాజ్య’నే. గాంధీగారు స్వరాజ్యను మూసివేయమని 1921, 24లోనూ సలహా ఇచ్చారు. కాని ప్రకాశంగారి నిజాయితీ చూడండి. ఆయన ఏమని రాసుకున్నారో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది. ‘నేను చేయగలిగిన యధోచిత సేవ చేస్తూ ఉండేవాడిని.. కాంగ్రెస్ అభివృద్ధికి, దేశ క్షేమానికి పాటుపడేవాణ్ణి. అంతేకాదు మోతీలాల్ నెహ్రూ లాంటి నాయకుణ్ణి కూడా తప్పుదారిన పడ్డారని తోచినప్పుడు చాలా తీవ్రంగా విమర్శించేవాణ్ణి.. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పాలసీకి కట్టుబడి కాంగ్రెస్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ఉన్న పత్రిక అది ఒక్కటే. గాంధీగారి కార్యక్రమ విజయానికి కూడా ఎంతగానో సేవ చేసింది. ఇటువంటి పత్రికను ఆపివేయాలని అనడానికి కారణం బహుశా ఎవరో స్వార్థపరులు నాపై నా పత్రికపై నిందలు మోపి ఉంటారని విశ్వసించాను.. మూసివేయడం నా ఒక్కడికి చెందిన స్వంత వ్యవహారమైతే నిమిషాల మీద ఆజ్ఞను పాటించేవాడినని వ్యక్తం చేశాను. ఈ పత్రిక ప్రజలచే స్థాపించబడిందని, నేను ప్రజల పట్ల విశ్వాసంతో నడుపుతున్నానని చెప్పాను.’ ఈ మాట స్వరాజ్య అష్టకష్టాలు పడుతున్న రోజులలోనిది. అందుకే ప్రకాశాన్ని ప్రజల మనిషి అన్నారు. తన సర్వస్వాన్ని వదులుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ ప్రజలకు అన్యాయం చేయడానికి కాదు.
తరువాత స్వరాజ్య మూత పడిన తరువాత ప్రకాశంగారు అంటారు. గాంధీగారి సలహా అన్నదమ్ముల ఆత్మీయ సలహా లాంటిది. నా సొంత పూచీపైన బ్యాంకులలో అప్పు తెచ్చి పేపర్‌లో పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. సుమారు అయిదారు లక్షలు ఉన్న బ్యాంక్ నిల్వలు, రాజమండ్రి నుంచి నీలగిరుల వరకూ ఉన్న స్థిరాస్తులూ చెక్కుచెదరకుండా ఉండేవి. 1922 తరువాత నేనూ నా కుటుంబీకులు ఇక్కట్ల పాలయ్యేవారమే కాదు. ఇంకా ఇలా రాసుకున్నారు తన స్వీయ చరిత్రలో ‘పెద్ద దేశం యొక్క స్వాతంత్య్రం కోసం జరిగిన శాంతియుత సమరంలో ప్రజల వద్ద నుంచి సంపాదించిన లక్షలు, ఆ ప్రజల స్వాతంత్య్రం కోసం ఆనందంగా ఖర్చు పెట్టగలిగాననే భావన నా మట్టుకు నాకు ఆనందదాయకంగానే ఉంది.’
ఇంతటి కష్టనష్టాలకు ఓర్చి స్వరాజ్య ద్వారా ప్రజలలో చైతన్యాన్ని వెలికితీశారు. దేశభక్తిని నెలకొల్పారు. దేశ సేవాదురంధరులైన అనేక సంపాదకులను దేశానికి అర్పించారు. ‘గ్రామ రిపబ్లిక్’ ‘గ్రామ స్వరాజ్’ ప్రజా పత్రికలను తరువాతి కాలంలో స్థాపించి అప్పటి కాంగ్రెస్ వాదుల దుష్పరిపాలనను, అవినీతిని తూర్పారబట్టారు. ఈ రీతిలో ప్రకాశంగారు సంపాదకీయం అత్యుత్తమ ప్రమాణాలతో సాగింది. అందుకే ‘ప్రజా పత్రిక’ మొదటి రోజునే 10వేల కాపీలు అమ్ముడుపోయాయి. ‘స్వరాజ్య’ మూతపడటానికి ప్రధాన కారణాలు ప్రకాశంగారికి స్వార్థం లేకపోవడం, నిర్వహణలో ఉన్న వారి కుతంత్రాలు, అప్పుల వాళ్ల మోసాలు.
మొత్తం మీద దేశంలోనే ‘స్వరాజ్య’ పత్రిక ఉన్నత ప్రమాణాలు గల పత్రికనీ, లక్ష్యసిద్ధికి ఆదర్శప్రాయంగా కృషి చేసిందని పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పత్రికా రంగంలో ఇంతటి ప్రతిభ, ప్రమాణాలతో ఏ పత్రికైనా ఉన్నదా? స్థాపింపబడుతుందా అన్న ప్రశ్న అందరి మదిలో రేకెత్తించింది అనడంలో అతిశయోక్తి లేదు.

--టంగుటూరి శ్రీరాం.. 9951417344