S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పొదుపు మంత్రం

రామబాణానికి తిరుగు లేదు. అలాంటి రామబాణం. మన భారతీయులందరి జీవన విధానంలో భాగం కావడం మన దేశ అదృష్టం. మన గొప్పతనం మనకు తెలియక పోవచ్చు కానీ అది నిజం. ఓ పదేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు యూరప్ దేశాలు వణికిపోయాయి. ఇండియా మాత్రం చెక్కు చెదరకుండా అలానే నిలబడగలిగింది. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? మన వద్ద ఉన్న రామబాణమే మనల్ని నిలబెట్టింది. పొదుపు ఇదో రామబాణం. వ్యక్తుల జీవితాలనే కాదు మొత్తం దేశానే్న రక్షించే రామబాణం.
అమెరికాలో సగటు పొదుపు శాతం ఎంతో తెలుసా? మన దేశంలో ఎంతో తెలుసా? రెండు దేశాల మధ్య పొదుపు శాతంలో ఎంత తేడా ఉందో తెలుసా? నమ్మకం కలగకపోవచ్చు కానీ ఇది నిజం. అధికారిక లెక్కలు.
మన దేశంలో సగటు పొదుపు 30 శాతం అంటే వంద రూపాయలు సంపాదిస్తే ప్రజలు సగటున 30 రూపాయలను ఏదో ఒక రూపంలో పొదుపు చేస్తున్నారు. అదే అమెరికాలో కేవలం 2శాతం ఆదాయాన్ని మాత్రమే పొదుపు చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ రెండు దేశాల మధ్య ఇంతటి తేడాకు కారణం తెలుసా? కుటుంబ వ్యవస్థనే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ విశ్వనాథం రెండు దేశాల మధ్య పొదుపు అలవాట్లపై అద్భుతమైన ప్రసంగాలు చేశారు.
మనది కుటుంబ ప్రధానమైన దేశం. అమెరికాలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ కుటుంబం ప్రాధాన్యత చాలా తక్కువ. ఎవరికి వారు స్వతంత్రంగా జీవిస్తారు. మనల్ని కుటుంబం కట్టిపారేస్తుంది.
కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు కుటుంబం కోసం వ్యక్తి సంపాదిస్తాడు. కుటుంబ సభ్యులకు రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇస్తాడు. అమెరికా పౌరుడు రిటైర్ కాగానే అతని పోషణ బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వమే తగిన పెన్షన్ ఇస్తుంది. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉంటుంది. దాదాపు 95శాతం మంది ప్రజల వృద్ధ్యాంలో తమ అవసరాల కోసం తామే జాగ్రత్త వహించాలి. పిల్లల చదువుకు వ్యయం ఎక్కువ. ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపటి కోసం పొదుపు చేయడం మనకు అనివార్యం. అమెరికాలో పొదుపు లేదు, అసలు కుటుంబమే లేదు. వృద్ధాప్యంలో ప్రభుత్వమే చూసుకుంటుంది కాబట్టి పొదుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కో వ్యక్తి పది పనె్నండు క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం ఆ దేశంలో చాలా కామన్. అమెరికా ప్రభుత్వం, వ్యక్తులు, కంపెనీలు అన్నీ తమ సంపదను మించి మూడు రెట్ల వరకు అప్పుల్లో కూరుకుపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన పొదుపే మనల్ని రక్షిస్తోంది. చైనా, జపాన్, ఇండియా వంటి ఆసియా దిగ్గజ దేశాల్లో పొదుపు శాతం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 30 శాతం పొదుపు రేటు మరే దేశంలోనూ లేదు.
ఇండియాలో మరీ పొదుపు శాతం ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు అని అమెరికాలో పలు కార్పొరేట్ కంపెనీలు సదస్సులు నిర్వహించాయి. ఒక సదస్సుకు బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ విశ్వనాథం కూడా హాజరయ్యారు. ఇండియాలోని పరిస్థితులు, అమెరికా పరిస్థితులకు ఏ మాత్రం సంబంధం లేదు, పొదుపును తగ్గించలేరని విశ్వనాథం ఆ సదస్సులో తన అభిప్రాయం వెల్లడించారు.
అనుభవించు రాజా అంటూ సాగే ప్రచారం దీనిలో భాగమే. ఒకటే జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఉన్నప్పుడే అనుభవించాలి అని పలు కంపెనీలు సాగించే ప్రచారం ఉద్దేశం ఇదే. నవ తరంపై ఈ ప్రభావం కొంత పడినా, సత్యం కంప్యూటర్ దెబ్బ, ఆ తరువాత ఆర్థిక మాంద్యంతో పలు ఐటి కంపెనీల ఆర్థిక పరిస్థితి తలక్రిందులు కావడం వంటి సంఘటనలతో మన దేశంలో పొదుపు తిరిగి పట్టాలెక్కింది.
సత్యం కంప్యూటర్ కుంభకోణం బయటపడినప్పుడు ఐటి ఉద్యోగుల ఆలోచనలు వేరుగా ఉండేవి. ఇదే శాశ్వతం అనే ధోరణితో ఉండేవి. కుంభకోణం బయటపడగానే అప్పటి వరకు కుదిరిన పెళ్లి సంబంధాలు కూడా విచ్ఛిన్నం అయ్యాయి. ఐటి ఉద్యోగం అంటే శాశ్వతం ఏమీ కాదని తెలిసి వచ్చింది. ఒక్క ఐటి ఉద్యోగమే కాదు ఈ కాలంలో ఏ ఉద్యోగం శాశ్వతం కాదు. ఎదగడానికి ఎంతగా అవకాశం ఉందో కంపెనీ మూత పడేందుకు అంతే అవకాశం ఉంది. ఈ అవగాహనకు వచ్చిన తరువాత పాత మంత్రం పొదుపును ఆశ్రయించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇఎంఐలపై కారు, లగ్జరీ జీవితం వంటి వాటికి అలవాటు పడిన ఐటి యువతలో సైతం సత్యం ఉదంతం తరువాత చాలా మార్పు వచ్చింది.
30 శాతం పొదుపు చేస్తే వీటిలో 60 శాతం నిధులు బ్యాంకులు, పోస్ట్ఫాసులు, పిపిఎఫ్‌లలో డిపాజిట్లు చేస్తున్నారట! స్టాక్ మార్కెట్‌లోకి ఈ పొదుపులో కేవలం రెండు శాతం నిధులు మాత్రమే వెళుతున్నాయి.
పన్ను ఆదా వల్ల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ రోజు మనం చేసిన పొదుపే రేపు మనకు రక్షణ కవచంగా నిలబడుంది.
ఎంత సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. సంపాదించిన దానిలో ఎంత పొదుపు చేస్తున్నావు అనేదే ముఖ్యం. ఆ పొదుపే కొంత కాలానికి జీతాన్ని మించిన ఆదాయం తెచ్చి పెడుతుంది. ఆర్థిక క్రమ శిక్షణ లేని జీవితం ప్రమాదంలో పడేస్తుంది. మీ పొదుపు శక్తే వాస్తవమైన మీ ఆర్థిక శక్తి. కుటుంబాన్నయినా, దేశాన్నయినా బలంగా నిలిపేది పొదుపు మంత్రమే. ఈ మంత్రం మీ జీవితంలో ఎలా ఆచరిస్తున్నారో లెక్క చూసుకోండి. రేపటి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నేటి పొదుపు శాతం బాగుండాలి.

-బి.మురళి