S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆంగ్లేయులను పారద్రోలిన ఆగస్ట్ విప్లవం

భారత స్వాతంత్య్ర ఉద్యమాల చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైన రోజు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం అంటే ఆగస్ట్ 9, 1942న భారత ప్రజల కోపాగ్ని జ్వాలలకు తట్టుకోలేక కుటిల ఆంగ్లేయులు తోకముడిచిన రోజు. దేశ దాస్య విమోచన తుది పోరాటం, తుది విప్లవం ‘క్విట్ ఇండియా విప్లవం’ పరిపాలనను తుదముట్టించిన పోరాటం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సమూలంగా నిర్మూలించిన ఈ విప్లవం ఆగస్ట్‌లో ప్రారంభమైంది కాబట్టి ‘ఆగస్ట్ విప్లవం’గా ‘ఆగస్ట్ క్రాంతి’గా చరిత్రకెక్కింది. భారతీయుల శక్తి సామర్థ్యాలు ఏమిటో, వారి అమోఘమైన దేశభక్తి తెల్లవాడిని తరిమికొట్టిందనటంలో సందేహం ఏ మాత్రం లేదనే వాస్తవం ఈ విప్లవ పుట్టుపూర్వోత్తరాలు తెలియజేస్తాయి.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జర్మనీ నియంత హిట్లర్ చిన్నచిన్న రాజ్యాలను కైవసం చేసుకొని సోవియట్ రష్యాపై దాడికి పూనుకున్నాడు. బ్రిటీష్ ప్రభుత్వం మన దేశ రాజులను, ప్రజలను నిరాయుధులుగా చేశారు. సంస్థానాధీశులని తమ చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకొని అధోగతిపాలు చేశారు. అందుచేత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదురించి స్వాతంత్య్రాన్ని సాధించడమనేది మన శక్తికి మించిన కార్యమని ప్రజలలో నిరాశా నిస్పృహ, భావనలు ప్రబలిపోతున్నాయి. కానీ స్వాతంత్య్ర కాంక్ష, ‘వందేమాతరం’ నినాదం, స్వాతంత్య్రం నా జన్మహక్కు అన్న లక్ష్యం మాత్రం సడలిపోలేదు. బ్రిటీష్ పాలనను పాలద్రోలడానికి సాగించిన అనేక పోరాటాలలో ప్రజలదే ప్రధాన పాత్రగా చరిత్ర చెబుతున్నది. గాంధీ మహాత్ముడు స్వరాజ్యం ప్రజాయుద్ధంతోనే అది కూడా సంపూర్ణంగా అహింసతో కూడిన యుద్ధంతోనే సాధ్యమని సిద్ధాంతీకరించారు.
ఇంతలో ఇటలీ నియంత ముస్సొలినీ జర్మనీ వైపు చేరి సూయజ్ కాలువను ముట్టడించాడు. జపాన్ పసిఫిక్ దీవుల నాక్రమించి బర్మాను కూడా కబళించింది. ఈ పరిస్థితులలో ‘్ఫసిజమ్’ జయిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న సంగతి కాంగ్రెస్ పసిగట్టింది. బెంగాల్‌లో కొన్ని ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయించేటప్పుడు ప్రత్యామ్నాయం చూపించకపోగా బ్రిటీష్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. తన కుటిలబుద్ధితో ప్రజల జీవనాధారమైన పడవలను శత్రువు చేతికి చిక్కకుండా తగులబెట్టింది. ఇలాంటి దుశ్చర్యలు ప్రజల్లో ద్వేషాన్ని మరింతగా రగిలించాయి. తమ శత్రువు బ్రిటన్, బ్రిటన్ శత్రువు జపాన్ కనుక శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడని కొందరిలో దురభిప్రాయం ఏర్పడింది. కానీ గాంధీగారు ఇతర జాతీయ నాయకులతో కలిసి ఈ విధంగా తీర్మానించారు. జపాన్ గెలిస్తే బ్రిటన్ భారత్‌ను మాత్రమే కోల్పోతుంది. కాని భారతదేశం మనుగడే కోల్పోతుంది. పైగా ఎవరు గెలిచినా ఓడిపోయిన వాడి ఆస్తులు పంచుకోడానికే పరదేశం వస్తుంది. ఒకవేళ బ్రిటన్ భారతదేశంలో లేకపోతే జపాన్ మన వైపు రానేరారు. ఒకవేళ వచ్చినా మన జాతీయ భారత ప్రభుత్వం, ప్రజలు శత్రువును ఎదుర్కొంటాం, జయిస్తాం, విజయం సాధిస్తాం. కనుక యుద్ధంలో పాల్గొనము అని తీర్మానించబడింది.
కానీ బ్రిటిష్ భారత ప్రజలను సంప్రదించకనే మనల్ని యుద్ధానికి దింపింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామాలిచ్చాయి. ఇంతలో జపాన్ దాడి మొదలుపెట్టింది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వంగా ఏర్పడి, యుద్ధం చేయాలి అంటే బ్రిటీష్ వారు మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వాలి. క్రమపద్ధతిలో పరిపూర్ణమైన అధికారం భారతానికి ఇచ్చి తక్షణమే మా దేశాన్ని, ధనాన్ని, సంపదనూ, సంస్కారాన్ని వదిలి వెళ్లిపోవాలని షరతులు పెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం దీనికి నిరాకరించడంతో ప్రజలలో అగ్నిజ్వాలలు దేశమంతా ఆవరించాయి. బ్రిటిష్ బెదిరింది. అదిరింది. అయినా కుటిల రాజనీతిని ప్రదర్శిస్తూ, 1942 మార్చి 28న ‘సర్ స్ట్ఫార్డ్ క్రిప్స్’ నాయకత్వాన ఒక రాయబార సంఘాన్ని పంపింది. ఆ రాయబారంలో ముఖ్య ఉద్దేశం - రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏదో విధంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇక్కడ శాశ్వత తిష్ట వేయించడం. రాయబారం విఫలమైంది. స్వాతంత్య్రం కోసం శాసన ఉల్లంఘనం తప్పదన్నాడు గాంధీజీ. అందుకోసం యావత్ భారతావని తన శక్తియుక్తులను ఉపయోగించి సంపూర్ణ అహింసా మార్గంలో దేశ దాస్య విమోచనం సాధించి తీరుతుంది అని బ్రిటిష్ ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చాడు. బొంబాయిని (నేటి ముంబై) ఆగస్ట్ 7న ఈ తీర్మానాలను ఆమోదింప చేయడానికి గాను తుది ఉద్యమానికి శంఖారావ వేదికగా ఎంచుకొని, ప్రజల హృదయాలకు హత్తుకునే నినాదం కోసం జాతిపిత అనే్వషణ మొదలుపెట్టాడు.
ఈ నినాదం బ్రిటిష్ వారికి భీతి కలిగించేదిగా ఉండాలే కానీ, అమర్యాదగా ఉండకూడదు. ఒకరు ‘గెట్ అవుట్’ అని సూచించారు. ఇది అమర్యాదగా ఉంది అంతేకాకుండా అమానుషంగా, మోటుగా ఉంది అని నిరాకరించారు గాంధీ. మరొకరు ‘విత్‌డ్రా’ అన్నారు. స్వయంగా రాజగోపాలాచారి ‘రిట్రీట్’ అని సూచించారు. అవి కూడా అంగీకారంగా అనిపించలేదు. యూసుఫ్ మెహరలీ అనే ప్రముఖ కార్యకర్త గాంధీగారికి ఒక ధనస్సును బహూకరించాడు. దాని మీద ‘క్విట్ ఇండియా’ - భారత్‌ను వదలివెళ్లండి’ అని చెక్కి ఉంది. చూసిన వెంటనే జాతిపిత చిరునవ్వుతో ‘ఆమెన్’ అన్నాడు. ఈ విధంగా ఎన్నుకోబడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నినాదం. ఈ నినాదం ‘క్విట్ ఇండియా తీర్మానం’గా విశ్వవిఖ్యాతితో చరిత్ర సృష్టించింది. కరెంట్ తీగలా దేశం మొత్తాన్ని చుట్టేసింది- ఫలితం బ్రిటిష్ సామ్రాజ్యం చాప చుట్టేసింది.
1942 ఆగస్టు 8న బొంబాయిలో బ్రహ్మాండమైన సభలో ఉత్తేజభరిత ఉపన్యాసం ఇచ్చాడు. రాయబారం తీరు ‘దివాలా తీసిన బ్యాంకుకు పోస్ట్‌డేటెడ్ చెక్కు’ (ముందుగా తేదీ వేసిన) తీరుగా ఉంది అన్నారు. ఇక విజయమో వీరస్వర్గమో అన్నాడు. ‘డూ ఆర్ డై’ ‘పోరో - చావో’ ‘యుద్ధ్ కరేంగే యా మరేంగే’. ఇలాంటి నినాదాలతో ప్రజలలో విప్లవ జ్యోతిని వెలిగించాడు. ప్రతి ఒక్కరూ నాయకులే అని ప్రకటించాడు గాంధీ. ఈ ఉద్యమం సంపూర్ణంగా అహింసాయుతంగా జరగాలని కోరుకున్నాడు గాంధీ. సమావేశం పూర్తి కాగానే వైస్రాయికి ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు గాంధీ. కానీ ఆ ఉత్తరం పూర్తి కాకముందే గాంధీని అరెస్ట్ చేశారు. తెల్లవారితే ఆగస్ట్ 9. అంటే ఉద్యమం మొదలవ్వక ముందే గాంధీతో సహా ఇతర అగ్రనాయకులందరినీ నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. సరైన జాతీయ నాయకులు లేకపోతే అసలు ఉద్యమమే ఉండదని తలచింది కపట ప్రభుత్వం. కానీ వారి ఊహలు తలక్రిందులైనాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఈ దమన నీతి వలన ప్రజల కోప జ్వాలలు భళ్లున తెల్లవారగానే కట్టలు తెంచుకొని భీకరంగా ప్రభుత్వ స్థలాల మీద వ్యాపించాయి. 1857 నాటి తిరుగుబాటును తలపించింది.
తెలుగునాట ఈ ఉద్యమం ఆంధ్రా సర్క్యులర్‌గా ప్రసిద్ధి గాంచింది. వ్యక్తి సత్యాగ్రహం కింద అరెస్టయిన ప్రకాశం పంతులుగారిని ఇతర నాయకులతో అంతకు ముందే విడుదల చేయడమైనది. ప్రకాశంగారు విస్తృతంగా గాంధీ మార్గాన్ని ప్రచారం చేస్తున్నారు. ‘క్రిప్స్ రాయబారి విఫలమైంది కనుక బ్రిటిష్ వారు భారతదేశం నుండి వెళ్లిపోవాలి. అనంతరం అఖిలపక్ష ప్రతినిధులతో కూడిన జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుంది. అది అన్ని వర్గాల ప్రజలకు ఆమోదమైన రాజ్యాంగాన్ని రచిస్తుంది. జాతీయ ప్రభుత్వం జపాన్‌తో యుద్ధం చేస్తుంది...’ గాంధీగారు ఆమోదించిన తీర్మానాలను ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఉద్యమాన్ని శాంతియుతంగా జరపాలని ప్రజలను ప్రోత్సహించారు. అంతకు మునుపే విశాఖపట్నం, కాకినాడ తీర ప్రాంతాలలో జపాన్ బాంబులు అస్తినష్టం, విధ్వంసం సృష్టించాయి. ప్రజల దేశ సంపద రక్షణ చర్యలు చేపట్టేందుకుగాను తాను స్వయంగా సేవాదళ్ యూనిఫారం ధరించి ప్రత్యేక దళాలను తయారుచేసి ప్రజలలో ధైర్యాన్ని నింపడం, సహాయాన్ని అందించడం ప్రారంభించాడు.
గాంధీగారి పిలుపు కోసం దక్షిణ భారతదేశం ఎదురుచూస్తూ ఉంది. జూన్ జులైలోనే బందర్‌లో ఒక పెద్ద సమావేశం జరిగింది. పట్ట్భా సీతారామయ్యగారు, కళా వెంకట్రావుగార్లు చర్చలు జరిపి రహస్య సర్క్యులర్ ఒకదాన్ని రూపొందించారు. అదే ఆంధ్రా సర్క్యులర్‌గా ప్రసిద్ధి గాంచింది. ఈ ఉద్యమాన్ని ఆరు దశలుగా జరపాలని సూచించింది. ఆంధ్రా అంతటా టెలిఫోన్ తీగలను తెంపడం, గొలుసులు లాగి రైళ్లు ఆపటం, కార్మికులు సమ్మె జరపటం, వార్తా సౌకర్యాలను విచ్ఛిన్నం చేయడం, వంతెనలను కూల్చడం, రైలు పట్టాలను పీకడం వంటి చర్యలున్నాయి. ఇంకా మున్సిపల్ పన్నులు తప్ప మరే పన్నులు చెల్లించేది లేదు, మిలిటరీ రిక్రూట్‌మెంట్ ఆఫీసుల ముందు పికెటింగ్ జరపడం, ప్రభుత్వ ఆఫీసులపై జాతీయ పతాకాలను ఎగురవేయడం లాంటి పథకాలను ఆదేశించారు. ప్రకాశంగారి గురించి, వారితో కలిసి తిరిగిన కొన్ని జ్ఞాపకాలను సింహావలోకనం చేసుకుంటూ, కొడాలి ఆంజనేయులుగారు ఇంతటి గంభీర పరిస్థితులలో కూడా ఛలోక్తులు విసురుతారు అని రాసుకున్నారు. సర్క్యులర్ రచన పట్ట్భా గారింట్లో జరిగింది. అన్నింటినీ పట్ట్భాగారు వివరించి చెప్పిన తరువాత ప్రకాశంగారు ‘అయితే పట్ట్భా! బ్యాంకుల మాటేమిటి? బ్యాంకుల కీయవలసిన బాకీలు తీర్చవలసిందేనా? దేశంలో ఇంత విప్లవం జరుగుతున్నా బ్యాంకుల వ్యవహారాలు జరగవలసిందేనా యధాతథంగా’ అన్నారు. పట్ట్భాగారు వినిపించుకోనట్లు ఊరకుండిపోయార్ట. మిత్రులందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నార్ట. అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ. ఏమా అంతరార్థం?
ఆంధ్రా బ్యాంకుకి పట్ట్భాగారికి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రకాశంగారి ‘స్వరాజ్య’ పత్రిక తాలూకు కొంత బాకీ వ్యవహారాలు ఆంధ్రా బ్యాంక్‌కి ఉన్నాయి అప్పటికి. అదీ ప్రకాశంగారి ఛలోక్తి.
ఆ విధంగా దేశంలో ఆర్థిక సంక్షోభం తీసుకురావాలని ఆంధ్రా సర్క్యులర్ ముఖ్య లక్ష్యం. కాని ఆంధ్రకేసరిని విస్తృత ప్రచారం చేస్తుండగానే ఆగస్టు 12న కడప రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు మూడేళ్ల శిక్షతో పంపారు. పంతులుగారితోపాటు వి.వి.గిరి, అనంతశయనం అయ్యంగార్, కళా వెంకట్రావు, పల్లంరాజు, సంజీవరెడ్డి, తెనే్నటి విశ్వనాథం, సత్యమూర్తి, కామరాజ్, ముదలియార్, భక్తవత్సలం, మాధవ మీనన్, రాఘవ మీనన్ లాంటి తమిళనాడు, కేరళ నాయకులందరినీ జైళ్లపాలు చేశారు. అలాగే ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య, డి.రామసుబ్బారావు, కల్లూరి సుబ్బారావు, మాగంటి బాపినీడు, పట్ట్భా కాశీనాథుని నాగేశ్వరరావు గార్లని కూడా అరెస్ట్ చేశారు. ప్రతి పట్టణంలోనూ, హర్తాళ్లు, నిరశనలూ, ప్రదర్శనలూ, బహిరంగ సభలూ ఉవ్వెత్తున లేచాయి. విద్యార్థులు, కార్మికులు, రైతులు, ఉద్యోగస్తులూ పెద్దఎత్తున ఉద్యమంలోకి దూకారు. చాలాచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమం యొక్క స్వరూప స్వభావాలు మరువలేనివి. బొంబాయి సమావేశంలోనే స్వామి రామానంద తీర్థ మహాత్మాగాంధీని కలిసి నైజాం సంస్థానంలో ఉద్యమానికి అనుమతి పొందారు. వారిని హైదరాబాద్ రాగానే అరెస్ట్ చేశారు.
గాంధీ అభిమతానికి భిన్నంగా 1938లో కాంగ్రెస్‌ను వదిలి, ‘్ఫర్వర్డ్ బ్లాక్’ను స్థాపించారు సుభాష్ చంద్రబోస్. స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని జరపాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఇద్దరు హైదరాబాద్ స్వాతంత్య్ర సమరయోధులు హసన్ సప్రానీ, సురేష్ చంద్రలు ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో చేరారు.
అలాగే ఉస్మానాబాద్, నాందేడ్ లాంటి అనేకానేక ప్రాంతాల నుంచి సత్యాగ్రహులు ఈ ఉద్యమంలో జైలు జీవితాన్ని కోరికోరి అనుభవించారు. హైదరాబాద్ సంస్థానం నుంచి అరెస్టయిన ప్రముఖులలో రెసిడెన్సీ భవనం మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసి పద్మజ నాయుడు అరెస్టయ్యారు. ఇంకా, విమలాబాయి, పండిత్ నరేంద్రజీ, బూర్గుల రామకృష్ణారావు, వందేమాతరం రామచంద్రరావు, ప్రేమరాజ్ యాదవ్ ఇంకా ఎందరో దేశభక్తులు ఉన్నారు. ఈ ఉద్యమంలో తెలుగునాట రెండు రైళ్లు పట్టాలు పీకినందున తలకిందులైనాయి. 1500 పైగా టెలిఫోన్ వైర్లు తెగ్గొట్టబడ్డాయి. లక్షలాది మంది అరెస్టయ్యారు. లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది. అనేక మందిని కాల్చారు. కొన్ని రోజులు స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. అన్నింటికన్నా విషాదకరమైన విషయమేమంటే ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో అరెస్టయిన మహదేవ్ దేశాయ్, కస్తూరిబాయి గాంధీ జైళ్లలోనే తనువులు చాలించారు.
ఆగస్ట్ విప్లవంలో అరెస్టు చేయబడి జైలుశిక్ష నుంచి విడుదల కాగానే ఆంధ్ర దేశంలో శ్రీకాకుళం నుంచి బందర్ వరకూ ఉధృత తుపాను వచ్చి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రజాబంధు, దీన జనోద్ధారకుడైన పంతులుగారు స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబాలను అజ్ఞాతంగా ఉద్యమం నడిపిన వ్యక్తులను కలుసుకోవడానికి కారులో, ఎడ్లబండిలో లేకపోతే కాలినడన పర్యటించారు. ఆంధ్రకేసరి కదలి వస్తూంటే ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు తన సొంత ఖర్చులకుగాని విరాళాలు ఇచ్చారు. ప్రకాశంగారు పీడిత కుటుంబాల కష్టాలను తెలుసుకొని విశాల హృదయంతో ఆ డబ్బును అక్కడికక్కడే పంచేశారు. కొందరు కవర్లలో డబ్బు పెట్టి పంతులుగారి ప్రత్యేకంగా సొంతానికే అని రాసి ఇచ్చారు. కానీ ప్రకాశంగారు చెదిరిన జీవితాలను ఆ డబ్బుతో ఆదుకున్నాడు. చివరికి పర్యటన పూర్తయ్యేనాటికి యాభై వేలు మాత్రమే మిగిలాయి. పంతులుగారంటారూ.. ఈ పైకం ‘స్వరాజ్య’ పత్రిక అప్పును తీర్చివేస్తే అక్కడి ఉద్యోగులకు జీతాలకు పనికొస్తుంది అని. ‘తన బాగోగులు, నిత్యావసరాలు తన ప్రజలే చూస్తారులేవోయి’ అని ధీమాగా చెప్పారు ఆ త్యాగమూర్తి. ఈ సంఘటనను మనవాళ్లే వెళ్లి గాంధీగారికి వక్రించి ఫిర్యాదు చేశారు. గాంధీగారు పంతులుగారిని సంప్రదించకుండా, సత్యాసత్యాలను విచారించకుండా దానికి వివరణ ఇవ్వమన్నాడు. పంతులుగారు కొంత బాధపడ్డా గాంధీగారికి ఘాటుగా సమాధానం రాసి ఇచ్చాడు ఈ విధంగా.. ‘ప్రియమైన గాంధీజీ.. నేను రోజుకు వెయ్యి రూపాయలు తెచ్చిపెట్టే న్యాయవాద వృత్తిని వదిలి రాజకీయాలలోకి దేశసేవకి వచ్చాను. ప్రజల నుంచి సంపాదించిన డబ్బును ప్రజాసేవకే ఖర్చు పెట్టాను.. నేను ఇప్పుడు డబ్బు సంపాదించను. నాకు అత్యవసరాలకు కూడా ఖర్చు పెట్టను. ప్రజలు నా మీద కురిపించిన వాత్సల్యం ఆ డబ్బు రూపేణా నాకందింది. ప్రజల డబ్బు ప్రజల కోసం, ఖర్చు పెట్టాననే తృప్తి నాకుంది.’ గాంధీగారికి మరీ కోపం వచ్చి శాసనసభలో నీవుండరాదన్నాడు. ఆంధ్ర ప్రజకు అది రుచించలేదు. తరువాత ఎలక్షన్లలో ప్రకాశంగారిని ఎన్నుకున్నారు.
చిట్టచివరికి భారతదేశంలోని రాజకీయ ప్రతిష్టంభనకు గాంధీజీ విడుదల ఒక్కటే మార్గమని, గాంధీజీ అనారోగ్య కారణం వలన తప్పనిసరై, విధిలేక, 1944 మే 6న విడుదల చేసింది. భారత ప్రజలను పీడించి, సంపదను దోచుకొని వెళ్తూవెళ్తూ ‘తాంబూలాలు పుచ్చుకున్నాం - ఇక తన్నుకు చావండి’ అన్న ధోరణిలో బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరించి తోకముడిచింది. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం ప్రాప్తించింది. దేశ విభజన జరిగింది. ఇలా స్వాతంత్య్ర పోరాటంలో అగ్రభాగాన నిలబడి, అశేష త్యాగాలు చేసిన, అసమానమైన ధైర్యసాహసాలు చూపించిన నేతలలో మన తెలుగు తేజాలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రముఖులుగా చరిత్రకెక్కిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు దాదాపు అర్ధశతాబ్దం పైగా దేశ రాజకీయాలతో ముడి వేసుకొని ఆంధ్ర కేసరిగా పేరుగాంచి ప్రాతఃస్మరణీయులైనారు. వారు చూపిన బాటలో నడవడమే ఈ తరం వారి శ్రద్ధాంజలి అవుతుంది.

-టంగుటూరి శ్రీరాం.. 9951417344