ఇంధనం(సండేగీత )
Published Saturday, 25 August 2018చి న్నప్పుడు ఏ చిన్న పని చేసినా అందరూ ప్రోత్సహించేవారు.
పెద్దగా అయిన తరువాత పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ప్రోత్సహించే వాళ్లు తగ్గిపోయారు.
అందువల్ల చాలామందిలో ఉత్సాహం తగ్గిపోతుంది.
పెద్దవాళ్లం అయిన తరువాత మనల్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తులు అవసరం లేదు. మనకి మనమే ప్రోత్సహించుకోవాలి. మనకి మనమే ‘కీ’ ఇచ్చుకుని పరుగెత్తాలి.
మక్క కంకులు కాల్చుకోవాలంటే బొగ్గులు కావాలి. ప్రతిరోజూ కొత్త బొగ్గులు అవసరం ఏర్పడతాయి. నిన్నటి బొగ్గులు మసిగా మారిపోయి ఉంటాయి. ఏవైనా మిగిలి వున్నా అవి అంతగా పని చేయవు.
కొత్తవి అవసరం.
పాతవాటి కాలం తీరిపోయింది.
నిన్న మనల్ని మనం ప్రోత్సహించుకొని ఉంటాం. అది ఈ రోజుకి సరిపోదు.
ఈ రోజు మళ్లీ మనల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిందే.
మన లక్ష్యాల వైపు దృష్టి సారించాల్సిందే.
మన దారిలో మనం ప్రయాణం చేయాల్సిందే.
గతంతో సంబంధం లేదు.
వర్తమానం చాలా ముఖ్యం.
మనల్ని ప్రోత్సహించే వ్యక్తులు తగ్గిపోవచ్చు.
కానీ మనల్ని ఉత్సాహపరిచే పుస్తకాలు, ప్రోత్సహించే వ్యాసాలు ఎన్నో ఉన్నాయి.
అవి చాలు.
మనం పరుగెత్తడానికి.
మన గమ్యం చేరుకోవడానికి.
నిన్నటి ఇంధనం నిన్నటికే
ఈ రోజు ఇంధనం ఈ రోజుకే.