S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

74 ఏళ్లనాటి ‘కల్లుముంత’ బుర్రకథ

భారతదేశానికి స్వాతంత్య్రం రావటానికి మూడేళ్ల ముందే అంటే 1944లోనే ముగ్గురు గిరిజన వైతాళికులు గిరిజనోద్ధరణ కొరకు నడుం కట్టారు. వారివారి నివాసిత గ్రామాలను విడిచి తంబూర, రెండు డక్కీలు తీసుకొని కాలినడకన ఊరూరా తిరిగారు. ఊరికి దూరంగానో, కాల్వగట్లపై, చెరువు గట్లపై, తాటాకు గుడిసెల్లోనో, బొంతల నీడల్లోనో నివాసముండే తమ జాతి జనుల దగ్గరికి వెళ్లేవారు. దయనీయమైన, దారుణమైన వారి జీవిత వెతల గూర్చి చెప్పేవారు. మూఢాచారాలతోపాటు వారి జీవితాలను పీల్చిపిప్పి చేస్తున్న కల్లుముంత పిశాచి గూర్చి ‘కల్లుముంత’ బుర్రకథ చెప్పేవారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలోని గండేపల్లి గ్రామానికి చెందిన పొన్నా సత్యనారాయణ, పొన్నా కోటేశ్వరరావు, చదల జానకి రామారావు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని నార్నెపాడు గ్రామానికి చెందిన పాలపర్తి వీరయ్య ఆదివాసీ నాట్యమండలిగా ఏర్పడి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ఊపిర్లు పోశారు. కల్లుముంత నుండి గిరిజనులను దూరం చేసేందుకు మూడు దశాబ్దాలకు పైగా కష్టించారు.
స్వాతంత్య్ర భారతంలో ఇప్పటికీ 70 శాతం నుండి 80 వరకు గిరిజన తెగల వారికి సొంత భూమి లేదు. వారి పిల్లలకు బడి సౌకర్యాలు లేవు. వైద్య సౌకర్యాలూ లేవు. ఆఖరికి రేషన్ కార్డులు సైతం ఉండవు. వీరి పుట్టుకలు వీరికి తెలియవు. మరణాలు ఎక్కడో తెలియవు. మైదాన ప్రాంతాలలో నివసించే వారిని ‘నిలువ నీడలేనోళ్లు’ అని పిలిచినా, సంచార జాతుల వాళ్లను ‘తాడూ బొంగరం లేనోళ్లు’ అని పిలిచినా మిన్నకుంటారే తప్ప ఎదురు మాట్లాడరు. ఎరుకల, యానాది, లంబాడి, కోయ, చెంచు, భిల్లు, సవర, పాముల, కోతుల, బుడముక్కల, బయటి కమ్మరులు ఇలా దాదాపు 35 తెగలకు చెందిన వారి జీవితాలు ఇలాంటి దుర్భరమైన జీవితాలే.
అప్పట్లో వీరి జీవితాలను కల్లుముంత శాసించేది. కల్లు తాగటం వీరికి ఆచారం. రోజంతా కష్టించి రాత్రికి కల్లు దుకాణాలకు వెళ్లేవారు. అక్కడ కల్లుబానల చుట్టూ బారులు తీరి కూర్చుంటారు. ఓపికున్నంత వరకు కడుపునిండా కల్లు తాగుతారు. కల్లు మత్తులోనే పిల్లల పెళ్లిళ్లు నుండి అప్పుల వరకు మాట్లాడుకుంటారు. ఒకరికొకరు కల్లు ముంతలపై ఒట్టెట్టి ప్రతినలు చేస్తారు. చేతిలో చెయ్యి వేసుకొని బాసలు చేస్తారు. పెట్టుకున్న ఒట్టుకు, చేసుకున్న బాసలకు కట్టుబడి ఉంటారు. పిల్లల పెళ్లిళ్లైనా, అప్పుల బాధలైనా మళ్లీ కల్లు ముంతల దగ్గరే తేల్చుకుంటారు. కాలుకు కాలు కట్టేసుకొని పోట్లాడుకుంటారు. కుల పంచాయితీలు పెట్టుకొని కాగుతున్న నూనెలో చెయ్యి పెట్టో, కాలుతున్న గడ్డపారను చేతితో పట్టుకునో ప్రమాణాలు చేస్తారు. ఇలాంటి ఈ తెగల జీవితాలను కల్లుముంత శాసిస్తుందని గ్రహించిన పొన్నా సోదరులు 1944లోనే ఈ కల్లుముంత బుర్రకథను రాశారు. 1949లో ఆంధ్ర రాష్ట్ర ఎరుకల సంఘం ఎట్టకేలకు ఈ బుర్రకథను పుస్తక రూపంలోకి తెచ్చింది. ఈ పుస్తకానికి పొన్నా సోదరులు ముందు మాట రాస్తూ ‘దేహానికి, ఆహారానికి గల సంబంధం ఎట్టిదో, ఎరుకల జీవితాలకు, కల్లుముంతకు గల సంబంధం అట్టిది’ అంటారు. ప్రాథమిక జీవన వసతులు లేని వీరి జీవితాలు జంతువుల కంటే హీనం’ అంటూ రోదిస్తారు.
ఈ కల్లుముంత బుర్రకథను పొన్నా సత్యనారాయణ, పొన్నా కోటేశ్వరరావు రాస్తే, కథలో కథకుడు పాలపర్తి వీరయ్య, హాస్య నటుడు పొన్నా కోటేశ్వరరావు, రాజకీయ వ్యాఖ్యాత చదల జానకి రామారావు తమ పాత్రను పోషించారు. ఈ బుర్రకథలోని కథాంశాన్ని కూడా పొన్నా సోదరులు అద్భుతమైన రీతిలో రాశారు. కల్పనలు, కల్పితాలు లేకుండా గిరిజన జీవితాలలో జరిగే వాస్తవ సంఘటనలతోనే కథను రక్తి కట్టించారు. ఈ బుర్రకథలోని కథాంశం ఏమిటంటే, దక్షిణాదిన పాడిపంటలతో పచ్చపచ్చగ ఉన్న పెదపల్లె ఉంది. ఆ పల్లెలో ఎరుకల రామయ్య. ఇతడు బలశాలి. అందగాడు, యోగ్యుడు, అణకువ గలవాడు. ఆడిన మాట తప్పి ఎరుగనోడు. అతని భార్య వెంకటలక్ష్మి. గుణవతి, పతికి తగ్గ అతివ. వీరికి పెదనాగులు, చిన నాగులు అనే ఇద్దరు కొడుకులు, సీత అనే ఒక కూతురు. సీతకు పెళ్లి ఈడు వచ్చింది. దీంతో పెదపల్లెకు రెండామడల దూరంలో ఉన్న పాలకుదురు గ్రామానికి చెందిన వెంకటప్పయ్య కుమారుడు సీతారాములు ఉన్నాడని ఆ గ్రామ పెద్ద ముచ్చకోటడు చెప్తాడు. ఈ వివాహం సందర్భంగానే తేనెబూసిన కత్తిలా ముచ్చకోటడు కల్లుముంతకు రామయ్యను దగ్గరజేస్తాడు. తాను తాగుతూ పెళ్లికొచ్చిన పెద్దలకు, బంధువులకు రామయ్య నెలల తరబడి కల్లు పోయిస్తాడు. ఆఖరికి అప్పులపాలవుతాడు. ఫలితంగా ఉన్న ఇల్లు, పొలం అమ్మేస్తాడు. గుణవతి అయిన భార్యను నానా చిత్రహింసలకు గురి చేస్తాడు. తుదకు ఊరంతా అసహ్యించుకునేలా తయారై ఒక గొడవ కారణంగా పోలీసులు అరెస్టు చేస్తారు. ప్రసవ వేదనలో ఉన్న కుమార్తె సరియైన వైద్యం అందక మరణిస్తుంది. భార్య అనారోగ్యం పాలై మృతి చెందుతుంది. కొడుకులు కానీకి కొరగాని వారుగా మారతారు. తుదకు తన తప్పును గ్రహించిన రామయ్య తన జీవితం శిథిలం కావటానికి కల్లుముంత కారణమని గ్రహించి తోటి గిరిజనులకు కల్లుముంతకు దూరంగా ఉండాలని హితవు చెప్తాడు.

‘ఎన్ని కష్టములు వచ్చిన పడినవి ఈ కుటుంబమునకు
కల్లుముంతయే యిట్లుజేసె ఈ కుటుంబమును
పండువంటి సంసారము చివరకు పాడైపోయొగదా’
-అనే సందేశం ఇస్తారు.

--పోతుల బాలకోటయ్య 98497 92124