S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుడ్డి సాక్ష్యం

సన్నీ కారు దిగి మంచు పేరుకున్న పేవ్‌మెంట్ మీద నడిచి మేరీ కాటేజ్‌కి చేరుకున్నాడు. ఆ చల్లటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆమె కాటేజ్‌కి అటు, ఇటు, వెనుక డజన్ల కొద్దీ మరికొన్ని కాటేజీలు కనిపిస్తున్నాయి. ఆ కాలనీలో ఇళ్లల్లోని గౌరవనీయమైన వాళ్లు భోజనం ముగించి టీవీ చూస్తూంటారని సన్నీ అనుకున్నాడు. చాలా కిటికీల్లోంచి టీవీ కాంతి కనిపిస్తోంది.
మేరీ ఇంటి లివింగ్ రూం కిటికీలోంచి లోపలకి చూశాడు. తను దినపత్రికల్లో చదివింది నిజమైతే ఆమె ఇంట్లో టీవీ ఆన్‌లో ఉండకూడదు అనుకున్నాడు. అది ఆన్‌లో లేదు. బహుశ ఆమె రేడియో వింటూండచ్చు.
ఇరవై రెండేళ్ల సన్నీ చప్పుడయ్యేలా మూడు మెట్లెక్కి ఆ కాటేజ్ పోర్చ్‌లోకి వెళ్లాడు. కొత్త వాళ్లకి సాధారణంగా చాలా మంది తలుపు తెరవరు. ముఖ్యంగా మేరీ లాంటి ఒంటరిగా జీవించేవాళ్లు. దొంగైతే అలా చప్పుడు చేస్తూ మెట్లు ఎక్కడని ఆమె అనుకోవాలి అన్నది అతని ఆలోచన.
ఇత్తడి డోర్ బెల్ బుల్‌డాగ్ తల ఆకారంలో కనిపించింది. దాన్ని వత్తాడు. లోపల నించి నాలుగు రకాల సంగీత శబ్దాలు వినిపించాయి. పోర్చ్‌లో అతని తల మీది లైట్ వెలిగింది. ఆ తలుపు అరంగుళం తెరచుకుంది. ఐదడుగుల ఎత్తు కూడా లేని మేరీ తన కళ్లని కనపడకుండా చేసే అతి నల్లటి కళ్లద్దాల్లోంచి అతన్ని చూసింది.
‘ఎవరు మీరు?’ బలహీన స్వరంతో అడిగింది.
‘నా పేరు డేవ్ గ్రోవర్. నేను పత్రికా విలేకరిని’ సన్నీ చెప్పాడు.
‘కానీ మీరు తప్పు అడ్రస్‌కి వచ్చారు’
‘కాదనుకుంటా. మీ పేరు మేరీ కదా?’
‘అవును. కానీ నేను వార్తల్లోకి రావడం ఆగిపోయి చాలాకాలమైంది’
‘ఇవాళ సాయంత్రం మీరు ఆరుగంటల టీవీ న్యూస్‌ని చూడలేదా?’
‘నేను ఇప్పుడు దేన్నీ చూడను. చూడలేను’
‘అవును. నేను మర్చిపోయాను. ఆరు గంటల వార్తల్లోని ప్రధానాంశం బేంక్‌లోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఈ మధ్యాహ్నం మరణించాడు అన్నది’
‘ఆఫీసర్ హార్ట్ పోయాడా?’ ఆవిడ నివ్వెరపోతూ ప్రశ్నించింది.
అది నటన కాదని సన్నీ గుర్తించాడు.
‘కోమాలోంచి బయటకి రాకుండా పోయాడు’
‘ఆరు వారాలు జీవించాక పోయాడన్నమాట. పాపం! అతని భార్య పిల్లల్ని తలుచుకుంటే నాకు బాధగా ఉంది’ మేరీ చెప్పింది.
‘అది అర్థం చేసుకోగలను. నేను రావడానికి కారణం అతన్ని కాల్చడాన్ని చూసిన ఏకైక సాక్షిని ఇంటర్‌వ్యూ చేయడానికి.’
‘కానీ ఇప్పుడు సాక్షిగా నేను పనికి రాననుకుంటాను. ఐనా చాలామంది పత్రికా విలేకరులు నన్ను ఇప్పటికే ఇంటర్‌వ్యూ చేశారు. నేను కొత్తగా చెప్పేదేం లేదు’
‘సరిగ్గా ఆ కోణాన్ని ఆవిష్కరించడానికే నేను వచ్చాను మేడం. మీరు అనుమతిస్తే నాకు ఐదారు నిమిషాలు చాలు’ అతను అర్థించాడు.
‘సరే రండి. అది మీ ఉద్యోగ బాధ్యత కదా? మీ పేరేమన్నారు? మిస్టర్ గ్రోవర్?’
‘అవును. డేవ్ గ్రోవర్’ సన్నీ జేబులోంచి ఓ విజిటింగ్ కార్డు తీసి ఆమెకి ఇచ్చాడు.
దాన్ని కొన్ని రోజుల క్రితం అతను పత్రికా విలేకరులు తరచు వచ్చే బార్లో ఒకర్నించి దొంగిలించాడు. దాన్ని తడిమి ఆమె చెప్పింది.
‘మీరు చెప్పింది నిజమని నమ్మాలి గ్రోవర్. మీరిచ్చిన కార్డ్‌ని చదవలేను’
ఆమె అడ్డు తొలగ్గానే సన్నీ లోపలకి అడుగుపెట్టాడు.
‘సోఫాలో కూర్చోండి. కుర్చీకన్నా అది సౌకర్యవంతంగా ఉంటుంది’ సూచించింది.
‘మీ ఇల్లు బావుంది’ సన్నీ చుట్టూ చూసి చెప్పాడు.
‘దీన్ని అమ్మేయదలచుకున్నాను. మా వారు పోయినప్పటినించీ నేను ఒంటరిగా ఈ ఇంట్లో ఉండలేక పోతున్నాను. ఓ చిన్న పని మిగిలిపోయింది. అది పూర్తయ్యాక అమ్మేస్తాను. నా కంటిచూపు పోయాక ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండటం కష్టంగా ఉంది. మీరు ప్రశ్నలు అడగండి’
సన్నీ దొంగిలించడానికి విలువైన వస్తువుల కోసం చుట్టూ పరిశీలనగా చూశాడు.
‘ఈ రాత్రి పోలీస్ బెనవలెంట్ అసోసియేషన్ ఒక ప్రకటన చేసింది. హార్ట్ హంతకుడ్ని పట్టించిన లేదా శిక్ష పడేలా చేసిన వారికి పదివేల డాలర్లని బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
‘కానీ నేనేం సహాయం చేయలేను’
‘మీ కంటిచూపు తిరిగి వస్తే మీరా హంతకుడ్ని కోర్టులో గుర్తు పట్టచ్చు. అతనికి శిక్ష పడటానికి సహాయం చేసినందుకు మీకా బహుమతి మొత్తం రావచ్చు. దీని గురించి మీరేమంటారు?’ సన్నీ ప్రశ్నించాడు.
‘అది అసాధ్యం.’
‘కానీ మిమ్మల్ని పరీక్షించిన ఓ డాక్టర్ మీకు చూపు వచ్చే అవకాశం ఫిఫ్టీ - ఫిఫ్టీ ఉందని చెప్పాడని గుర్తు.’
మేంటెల్ పీస్ మీది ఆవిడ చేతిగడియారం చూసి సన్నీ దాని వైపు నడిచాడు.
‘ఆ మాట చెప్పిన డాక్టర్ నిపుణుడు కాదు. పేరున్న ఓ ఆప్తమాలజిస్ట్ నన్ను పరీక్షించి ఆ అవకాశం లేదని చెప్పాడు’ మేరీ బాధగా చెప్పింది.
‘అంటే మీ అవకాశాన్ని ఆయన తగ్గించేసాడన్న మాట’ ఆ వాచీని ఎంతకి అమ్మచ్చా అని పరిశీలిస్తూ అడిగాడు.
‘ఆశ. నా ఆశని తొలగించాడు’
స్విస్ వాచ్! ప్లాటినం ఫినిష్. ఇనీషియల్స్ లేవు కాబట్టి

దొంగ సరుకు కొనే ఎవరైనా కొంటారు. వంద డాలర్లు రావచ్చు.
‘కానీ మీరు ఆ పోలీస్‌ని కాల్చిన వ్యక్తిని దగ్గర నించి వెలుతురులో చూశారు కదా?’
‘అవును. అతన్ని పరిశీలనగా చూశాను’
‘మరి?’ వాచ్‌పక్కన ఉన్న నోట్లని అందుకున్నాడు.
ఓ పది డాలర్ల నోట్, రెండు రెండు డాలర్ల నోట్లు, మూడు క్వార్టర్ బిళ్లలు. దాని కింద పధ్నాలుగు డెబ్బై ఐదు డాలర్లకి లాండ్రీ బిల్ ఉంది.
‘మీరు ఎందుకు పరిశీలనగా చూశారు?’ అడిగాడు.
‘గుర్తుంచుకోవాలని. నేను మా వారికి జరిగింది చూశాను కాబట్టి’
‘మీవార్ని కొంతకాలం క్రితం ఓ దొంగ చంపాడు కదా?’
‘అవును. మా వారు రాత్రి మామూలు టైంకే ఇంటికి తిరిగి వస్తూ దారిలో లిక్కర్ స్టోర్‌లోకి వెళ్లారు. అక్కడికి వచ్చిన దొంగ రివాల్వర్‌తో బెదిరించి డబ్బు దొంగతనం చేస్తూంటే మా వారు ఆ దొంగ మీదకి తిరగబడ్డారు. దాంతో అతను మా వార్ని కాల్చి పారిపోయాడు.’
‘డబ్బు తీసుకున్నాడా?’
‘లేదు. కాల్చాక భయపడి పారిపోయాడని ఆ లిక్కర్ స్టోర్ యజమాని పోలీసులకి చెప్పాడు.’
‘అవును. ఓసారి చంపాక ఆ నేరస్థుడు ఆ నేర ప్రదేశానికి దూరంగా పారిపోవాలి అనుకోవడం సహజం. నిజానికి ఆ డబ్బు తీసుకుని వెళ్లాల్సింది. బహుశ ఆ దొంగ కాల్చాలని కాల్చి ఉండడు’ సన్నీ తను భయంతో చేసిన పొరపాటుని గుర్తు చేసుకుంటూ చెప్పాడు.
‘కొన్ని గంటలకే మావారు పోయారు’
బేంక్‌లో కూడా ఆ రోజు అలా జరిగిందని సన్నీకి గుర్తొచ్చింది. అకస్మాత్తుగా ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. తను అతన్ని కాల్చి కేషియర్ నించి డబ్బు తీసుకోకుండా పారిపోయాడు.
‘మా వార్ని ఆ దొంగ కడుపులో కాల్చాడు. కొన్ని గంటల దాకా ఆయన స్పృహలోనే ఉండి చాలా బాధపడ్డారు. మత్తు మందు ఇవ్వడం ప్రమాదమని డాక్టర్లు ఇవ్వలేదు. ఆ పరిస్థితిలో నాలా వాల్టర్ మనుషుల్ని పెద్దగా గమనించి గుర్తు పెట్టుకునే రకం కాదు. అయోమయం’ మేరీ నవ్వి చెప్పింది.
‘ఇది ఆ దొంగకి అప్పుడు తెలిసి ఉండదు.. తెలిసినా అవకాశం తీసుకోకూడదని కాల్చేవాడేమో? మీరు మనుషుల్ని గుర్తుంచుకుంటారా?’
‘అవును. మనిషి, ఎత్తు, పొడవు, బరువు, దుస్తులు, చర్మం, జుట్టురంగు, కనుగుడ్ల రంగు...’
అప్పుడు తన మొహానికి రుమాలుని అడ్డుగా కట్టుకున్నాడు. ఈమె ఆ రోజు తన భర్తతోపాటు ఆ లిక్కర్ స్టోర్‌కి ఎందుకు రాలేదు? తన అడ్డంకి తీరిపోయేది.
‘నేను బేంక్‌లోకి రాగా మొహానికి బూడిదరంగు రుమాలు కట్టుకున్న ఆ దొంగని చూశాను. నీలం రంగు డెనిమ్ పేంట్, అదే రంగు టీషర్ట్, దాని మీద ‘క్రైమ్ డజన్ట్ పే’ అనే అక్షరాలు.. ఇరవై రెండేళ్లుండచ్చు.
‘మీరు అతన్ని బాగా చూశారన్నమాట?’
‘మొహం తప్ప మిగిలిందంతా చూశాను. కానీ కోర్టులో మంచి సాక్షిగా నిలబడటానికి మొహాన్ని గుర్తించడం ముఖ్యం కదా?’
‘అసలు మీరు బేంక్‌లోకి అంత ముందే ఎందుకు వచ్చారు? బేంక్ తెరిచేది తొమ్మిదికి కదా?’
ఎనిమిది ముప్పావుకే బేంక్ మేనేజర్ బేంక్ తలుపు తాళం తీసి లోపలకి వెళ్లడం చూసి, అటుగా వెళ్లే తను జేబులో రివాల్వర్ సిద్ధంగా ఉండటంతో లోపలకి వెళ్లాడు. మేనేజర్ని, కేషియర్ని నేల మీద బోర్లా పడుకోమని బెదిరించి తను కేష్ ట్రే దగ్గరికి వెళ్లాడు. దాని నిండుగా నోట్ల కట్టలు ఉన్నాయి. కనీసం ఏభై వేల డాలర్లు ఉండచ్చని అంచనా వేశాడు. ఆ తర్వాత ఐదారు నెలల దాకా తను దొంగతనం చేయక్కర్లేదని ఉత్సాహంగా అనుకున్నాడు.
‘నేను బేంక్‌కని బయలుదేరలేదు. పాలు, గుడ్లు కొనడానికి అటుగా వచ్చాను. కానీ బేంక్ కిటికీలోంచి కేషియర్ కనిపించడంతో మా వారి పెన్షన్ చెక్‌ని మార్చుకుందామని లోపలకి వెళ్లాను. దొంగతనం మధ్యలో నేను అక్కడికి వచ్చానని గ్రహించాను. ఆ దొంగ ఆ నోట్లని జేబులోంచి తీసిన సంచీలో నింపుకుంటున్నాడు. నాకు వెంటనే లిక్కర్ స్టోర్లోని మా వారు గుర్తొచ్చారు. అవసరం వస్తే ఆ దొంగని గుర్తు పట్టాలని నేను అతన్ని పరిశీలనగా చూశాను. ఆరడుగుల పొడవు, కాఫీరంగు జుట్టు, కాఫీరంగు కళ్లు, అలాంటి యువకులు లక్షల మంది ఉంటారు. కాబట్టి నేను సరైన సాక్షిని కాకపోవచ్చు అనుకున్నాను. అపుడు చూశాను. అతని చేతికి ‘సిసిసి’ అనే పచ్చబొట్టు ఉంది.’
పదహారో ఏట పొడిపించుకున్న సిసిసి అంటే కాల్విన్ క్రేగ్ క్రాబ్ ట్రీ అని సన్నీకి తెలుసు. పదిహేడో ఏట నేర ప్రపంచంలోకి వచ్చినప్పటి నించీ అందుకు చింతిస్తున్నాను. అది తన అసలు పేరు. సన్నీ తన ముద్దు పేరు. పోలీసుల రికార్డులోకి తను అంతదాకా ఎక్కకపోవడం అదృష్టం అనుకున్నాను.’
‘అప్పుడు మీ చూపు బావుందన్నమాట’
‘అవును. మీ దినపత్రిక ది పోస్ట్ హెరాల్డ్‌లో నేను ఇచ్చిన వర్ణనని బట్టి ఓ చిత్రకారుడు ఆ నేరస్థుడ్ని చిత్రించాడు. దాన్ని వాళ్లు ప్రచురించారు.’
‘అవును. చూశాను’
‘అది అతన్ని పట్టించేది కాదు. లేదా ఎప్పుడో పట్టుబడి ఉండేవాడు. అటుగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ హార్ట్ కూడా నాలా కిటికీలోంచి బేంక్‌లోకి చూశాడు. జరిగేది గ్రహించగానే బేంక్ తలుపు తెరచుకుని లోపలకి వచ్చి...’
ఆ మూర్ఖపు ఆఫీసర్ వచ్చి తన పనిని పాడు చేశాడు. అతను హోల్‌స్టర్లోంచి రివాల్వర్ తీస్తుంటే ఆత్మరక్షణకి తను ఆరుసార్లు కాల్చాడు. రెండు గుళ్లే తగిలాయి. అతను ఓ చోట నిలబడకుండా కదులుతూ తప్పించుకున్నాడు. నేల మీద పడ్డాక అతనూ తనని కాల్చాడు. కాని అతనికి గురి కుదర్లేదు. ఓ గుండు వెళ్లి బేంక్‌లో జరిగే చోద్యాన్ని టీవీ డ్రామాలా చూస్తూ ఇంకా నిలబడే ఉన్న మేరీ తలకి తగిలింది. అది అంధత్వానికి దారి తీసింది.
‘ఆరు వారాల క్రితం గాయపడ్డ హార్ట్ ఇవాళ మరణించాడన్న మాట’ ఆమె దీర్ఘంగా నిట్టూర్చి అడిగింది.
‘అవును. మీరు నిజంగా గుడ్డివాళ్లేనా?’ అతను జేబులోంచి ఓ కత్తిని బయటకి తీస్తూ అడిగాడు.
‘అవును. అసలు మీకా అనుమానం ఎందుకు వచ్చింది?’
ఆ కత్తి చాలా పదునుగా ఉంది. దాన్ని చేతిలో పట్టుకుని ఆమెవైపు నడిచాడు.
ఆమె నల్లకళ్లజోడుని బట్టి ఆమె కళ్లు తన వైపే తిరిగాయి అనుకున్నాడు. అకస్మాత్తుగా గోడ గడియారం అరగంట కొట్టడంతో అతను ఉలిక్కిపడ్డాడు. అతను పిల్లిలా నిశ్శబ్దంగా ఆమెకి రెండు అడుగుల దూరం చేరుకున్నాక ఆ కత్తిని ఆమె గొంతుకి అంగుళం ముందు ఉంచాడు. ఆమె మొహంలో భయం కాని, అడుగు వెనక్కి వేయడం కాని జరగలేదు. అలాగే నిలబడి ఉంది.
ఆమె గుడ్డిది అని నిర్ధారణ చేసుకున్నాక దాన్ని మళ్లీ జేబులో ఉంచుకుని వెనక్కి నడిచాడు.
‘సారీ! మీకు కొత్త విషయాలేం చెప్పలేకపోయాను’
‘మీ సమయానికి థాంక్స్’
‘యు ఆర్ వెల్‌కం మిస్టర్ గ్రోవర్’
అతను ఆమె దగ్గర సెలవు తీసుకుని ఆ ఇంట్లోకి బయటకి వచ్చి రోడ్ మీద ఆపిన తన కారు దగ్గరకి నడిచాడు. తలుపు తెరుచుకుని లోపల కూర్చున్నాక మనసులో ఏదో తొలచసాగింది. జేబులోంచి కారు తాళం చెవులని తీశాడు. దాంతోపాటు డేవ్ గ్రోవర్ విజిటింగ్ కార్డు కూడా బయటకి వచ్చింది. అతను పేరు కింది ది పోస్ట్ హెరాల్డ్ అని ఉంది. దాన్ని చదివాక అతనికి ఇందాక మేరీ తనకి చెప్పిన విషయం గుర్తొచ్చింది. ‘మీ దినపత్రిక ది హెరాల్డ్..’ తను ఆమెకి ఆ పత్రిక పేరే చెప్పలేదు. తను పత్రికా విలేకరి అని, తన పేరు డేవ్ గ్రోవర్ అని మాత్రమే చెప్పాడు. ఆమె గుడ్డిదో కాదో తెలుసుకోవడానికి మాత్రమే ఆ కార్డ్‌ని చూపించాడు.
ఆమె దాన్ని చదివింది!
ఆ తెలివిగల ముసల్ది నోరుజారి తన బండారాన్ని బయటపెట్టింది. తను దాన్ని అప్పుడు గుర్తించలేదు. వెంటనే అతను కారు తలుపు తెరచుకుని బయటకి దిగి, ఆమె ఇంటివైపు వేగంగా నడిచాడు. అతను మరోసారి ఆమె డోర్‌బెల్ కొట్టాడు.
‘ఎవరది?’ ఆమె కంఠం వినిపించింది.
‘డేవ్ గ్రోవర్ని. ఓ ముఖ్యమైన ప్రశ్న అడగడం మర్చిపోయాను’
‘ఒక్క క్షణం’
ఏం చేస్తోంది? దాదాపు నిమిషం తర్వాత ఆమె కంఠం వినిపించింది.
‘తలుపు నెట్టు గ్రోవర్’
అతను తలుపు తోసి కత్తితో లోపలకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆమె నల్ల కళ్లజోడులో లేదు. అతని వంకే నవ్వుతూ చూస్తోంది. ఆమె చేతిలోని రివాల్వర్ అతనికి గురిపెట్టబడి ఉంది. అతను నిశే్చష్టుడై చూస్తూంటే పోలీస్ సైరన్ శబ్దం వినిపించి, అది క్రమంగా దగ్గర అవసాగింది.

(ఫ్రేంక్ సిస్క్ కథకి స్వేచ్ఛానువాదం....)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి