మనల్ని మనం.. (సండేగీత)
Published Saturday, 1 September 2018మీరు ఏదైనా పని చేద్దామని అనుకుంటే చాలామంది విశ్వసించరు. విశ్వసించకపోయినా పర్వాలేదు. కానీ అధైర్యపడకూడదు. కానీ చాలామంద అధైర్యపరుస్తారు. ఈ లోకంలో ఇవన్నీ సహజమే.
మిమ్మల్ని ఇష్టపడేవారు లేరు.
పర్వాలేదు.
మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా లేదో అనేది ముఖ్యం. మిమ్మల్ని మీరు ఇష్టపడితే చాలు. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే అర్థం.
మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఇతరుల దృష్టిలో అవి చాలా పెద్ద లక్ష్యాలు. మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోలేరని ఇతరుల విశ్వాసం.
విశ్వాసం ఉంటే ఫర్వాలేదు. మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోలేరని నిరుత్సాహ పరుస్తూ ఉంటారు. అది కూడా సహజమే.
అన్నింటికన్నా ముఖ్యమైంది. మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకుంటారా లేదానన్న విశ్వాసం మీకు ఉందా లేదా నన్నది అత్యంత ముఖ్యమైంది. ఆ విశ్వాసం మీకు ఉంటే ఇతరుల అభిప్రాయాలతో పనిలేదు.
ఈ లోకంలో రకరకాల గొంతులు వున్నాయి.
విమర్శించేవి-
కించపరిచేవి-
అధైర్యపరిచేవి.
ఇట్లా ఎన్నో గొంతులు విన్పిస్తూ ఉంటాయి.
వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మీ మీద మీకు విశ్వాసం ఉండాలి.
ఇతరులు మన గురించి ఏమని అనుకుంటున్నారు అన్న విషయంతో పనిలేదు.
మన గురించి మనం ఏమని అనుకుంటున్నామన్నది ముఖ్యం.