ప్రయాస ( సండేగీత )
Published Saturday, 8 September 2018జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం.
కొంతమందికి ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి చదివితే చాలు. అంతా గుర్తుండిపోతుంది.
ఒక్కసారి వింటే చాలు.
గుర్తుండిపోతుంది.
ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు.
చాలామంది రెండు మూడుసార్లు చదివితే తప్ప, వింటే తప్ప గుర్తుండదు.
ఏకసంథాగ్రాహులు చాలా తక్కువమంది ఉంటారు. సహజంగా వాళ్లకి వచ్చిన లక్షణం.
కొంతమంది ప్రవాహంలాగా మాట్లాడుతారు.
మరి కొంతమంది తట్టుకొని తట్టుకొని మాట్లాడుతారు.
సహజంగా గొప్ప లక్షణాలు వున్న వ్యక్తులని చూసి నిరుత్సాహపడకూడదు.
వాళ్లు ఒక్కసారి చదివితే-
మనం పదిసార్లు చదవాలి.
వాళ్లు అలవోకగా మాట్లాడితే
మనం ఇంట్లో నాలుగుసార్లు రిహార్సల్ చేసుకొని రావాలి.
మన స్థాయిని మనం గుర్తించి - అందుకు తగినట్టుగా మన శ్రమ వుండాలి.
అందుకని ఎక్కువసార్లు వినాలి.
ఎక్కువసార్లు చదవాలి.
ఇంకా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి.
మన మెదడుని మనం ప్రేరేపించాలి.
మన వెంట ఎప్పుడూ ఓ పుస్తకం వుండాలి.
చిన్న ఐపాడ్ కానీ కింజిల్ గానీ మన మన వెంట ఉండాలి. ఎప్పుడు సమయం దొరికినా చదవడానికి ఉపయోగించాలి.
మన చేతిలో ఎప్పుడూ వుండే టీవీ రిమోట్‌ని, చెవి దగ్గర వుండే స్మార్ట్ఫోన్‌ని దూరం పెట్టాలి.
లేదా వాటిని మనకు అవసరమైన విధంగా ఉపయోగించుకోవాలి.
స్మార్ట్‌గా ఉండటం సహజసిద్ధంగానే కాదు. మనం చేసే ప్రయాస (ఎఫెర్ట్) వల్ల కూడా వస్తుంది.