S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రామ స్వరాజ్యాధినేత..

మన రాజ్యాంగ చట్ట రచనకు ముందే ప్రకాశం పంతులు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1946లో గ్రామాలకు, పల్లెలకు స్వయం పోషణ, స్వావలంబనతో కూడిన ఖాదీ గ్రామ కుటీర పరిశ్రమలతో కూడిన గ్రామ స్వరాజ్య ప్రాతిపదికకు నిర్దుష్టమైన, నిర్దిష్టమైన రూపురేఖలను రచించి ‘్ఫర్కా డెవలప్‌మెంట్ స్కీమ్’ శాఖను రూపొందించారు.
ఆర్థిక వికేంద్రీకరణ విధానం తప్ప గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి శ్రేయస్కర సుపరిపాలనకు వేరే మార్గము లేదని పంతులుగారి అకుంఠిత విశ్వాసము. సకల ధర్మాలలో సత్యం, అహింసలు మూల ధర్మములు. సమాజ పరంగా పరిణితి చెందిన ఈ ధర్మాల మీదనే శోషణరహిత సంఘం గానీ, సర్వోదయ సమాజంగానీ వర్థిల్లగలదని ఆయన భావన. ఇలాంటి దూరదృష్టితో, గ్రామ స్వరాజ్యమే ఊపిరిగా ఆర్థిక వికేంద్రీకరణ విధానాన్ని అమలుపరచడానికి అవిరళ కృషి చేసిన రాజనీతిజ్ఞులు మన దేశంలో ఆంధ్రకేసరి తప్ప మరో నాయకుడు మనకు కానరారు అని ఉప్పులూరి రామశాస్ర్తీగారు ప్రస్తావించారు. శాస్ర్తీగారు ప్రముఖ గాంధేయవాది. వీరు గాంధీయిజంని తమ నరనరాల్లో జీర్ణించుకొన్న మహామనీషి.
ప్రకాశంగారు ప్రవేశపెట్టిన ‘్ఫర్కా అభివృద్ధిపథకం’ దేశం మొత్తంలోనే మొట్టమొదటిది. ప్రముఖమైనది. ఈ పథకం ఎంత ప్రాచుర్యం సంతరించుకుందంటే ‘ఈ పథకం ఆంధ్రకేసరి మానస పుత్రిక అయితే మహాత్ముడి ముద్దుబిడ్డ అయినది’ అని అన్నారు ఆ రోజుల్లో. తరువాతి కాలంలో ఎం.కె.డే గారు కొద్ది మార్పులతో నెహ్రూ ప్రభుత్వంలో ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ స్కీం’ పేరుతో అమలుపరిచారు.
ఈ ప్రణాళికలో భాగంగా గ్రామీణ, కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. దీనితోపాటు పంతులుగారు ‘సమగ్ర ఖాదీ పథకాన్ని’ సూత్రీకరించి శ్రీకారం చుట్టారు. ‘అందరికీ ఆహారం’ పథకం కింద సుమారు 30 వేల గ్రామీణ సంఘాలను ఏర్పరిచారు. వీటికి జత చేస్తూ ‘ఉత్పత్తి - వినియోగదారుల సహకార సంఘాలు’, ‘తీవ్రతర భారీ పథకాన్ని’ ప్రవేశపెట్టి చేనేత వారికి సబ్సిడీ ఇచ్చే పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది. 1946లోనే ప్రకాశంగారి ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. దీనివలన ప్రధానంగా దళారీల ప్రమేయం, ప్రభావాలను అదుపులోకి తేవడం జరిగింది. అతి కొద్దికాలంలోనే గ్రామీణ వాసులు తండోపతండాలుగా పాల్గొని దిగ్విజయం చేకూర్చారు. ఇందులో ప్రముఖులు జె.సి.కుమారప్ప, ఎర్నేని సుబ్రహ్మణ్యం, స్వామి సీతారాం, మోతే నారాయణరావు, తంగిరాల వీరభద్రరావు ఉన్నారు. ఈ పథకం ప్రారంభించిన మూడు నెలలకే అటు గాంధీగారి మెప్పు ఇటు పెట్టుబడిదారుల చెప్పులు.. ఈ రెండింటి అక్షింతలు ప్రకాశంగారి మీద పడినాయి’ అని ఆలూరి లక్ష్మీనారాయణగారు ‘ప్రకాశంగారి గ్రామోద్ధరణ’ వ్యాసంలో వ్యాఖ్యానించారు. బడాబాబులు చివరకు మఱకదుళ్ల రాద్ధాంత సిద్ధాంతాలపై ప్రకాశంగారి ప్రభుత్వాన్ని గుప్పిట బిగించి, చకచకా సాగుతున్న గ్రామాభ్యుదయ ప్రణాళికను కుంటుపరిచారని కూడా వాపోయారు.
గాంధీ - ప్రకాశం సంబంధం ఒక విధంగా ద్రోణ - ఏకలవ్యుల సంబంధంగా నిర్వచించవచ్చు.
నిర్మాణ, కార్యక్రమం, సర్వోదయ సిద్ధాంతంలో విశ్వాసంగలవారు ప్రభుత్వ ఉద్యోగాలలో, అధికారులలో ఉండకూడదని బయట నుంచి ప్రజలలో ప్రబోధాల ద్వారా చైతన్యవంతులను చేయాలని మహాత్ముని ఆదేశం.
అర్థం, అధికారం ఈ సిద్ధాంతాలలో నమ్మకం లేని వారికి అప్పగించి ఈ కార్యక్రమాలలో ప్రజలకు విశ్వాసం కలిగించడం అసంభవమని, ప్రభుత్వ అధికారాన్ని ఈ నిర్మాణ కార్యక్రమాల అమలుకు ఉపయోగించాలని ఆంధ్రకేసరి దృఢ విశ్వాసం. కానీ గాంధీగారి పథకాలను, ఆశయాలను తనదైన శైలిలో అధికారికంగానూ, అనధికారికంగానూ అమలు జరపడానికి ప్రయత్నించి తుదకు గాంధీగారి మన్ననలను పొందిన ప్రజ్ఞాశాలి ప్రకాశం. 7.2.1942న ‘గ్రామ స్వరాజ్య’ అనే తన సొంత పత్రిక సంపాదకీయంలో గ్రామ స్వరాజ్యాన్ని ప్రకాశంగారు ఈ విధంగా నిర్వచించారు. ‘అంకెల్లో రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్లు సమర్పించినంత మాత్రాన ప్రజలకు వొరిగేది ఏమియు లేదు. ఇంత మాత్రముననే ప్రభుత్వాల బాధ్యత తీరదు. గ్రామ బడ్జెట్, గ్రామంలోని ప్రతి కుటుంబ బడ్జెట్ తయారుచేయబడి ఆ పరిశీలనతో పరిపాలన జరిగిననాడే అందరికి (కూడు, గుడ్డ, కొంప) ఆహారం, వస్త్రం, నివాసములు ఏర్పడి సుఖశాంతులు కలుగగలవు. ఇందుకే గ్రామ స్వరాజ్యం వాంఛిస్తున్నాను.’ ఈనాటికీ, ఆనాటి మాదిరే పల్లె సీమలు భరతమాత కొంగు బంగారాలు, పట్టుకొమ్మలు కూడా. పల్లెల సర్వతోముఖాభివృద్ధే దేశ సర్వతోముఖాభివృద్ధి కాగలదని ప్రకాశంగారు తన సంపాదకీయాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా నిరంతరం ప్రజలలో చైతన్యాన్ని, అవగాహనని, ఆవశ్యకతను నిరంతరం బోధిస్తూ వచ్చారు. ఈ విధంగా తన దేశ ప్రగతికి, సమగ్రాభివృద్ధి నిర్మాణానికి సమీకరణలను, సూత్రాలను, పథకాల రచనకు కృషి చేశారు. దానికొక స్వరూప పరిణామాల నివ్వడానికి గాను అహర్నిశలు శ్రమపడిన ప్రజాబంధు ప్రకాశంగారిని గుర్తుంచుకోవడం వారసత్వం భవిష్యత్తరాలకు స్ఫూర్తి నింపడం మనందరి గురుతర బాధ్యత. నవ్యాంధ్ర నిర్మాతగా, తెలుగు రాష్ట్రాల పైనే కాదు భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. కనుకనే స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాల బీజాలు ప్రకాశంగారు ప్రవేశపెట్టిన వాటిలో ఉన్నాయన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
ప్రకాశంగారు అమలుపరుస్తున్న వివిధ ప్రజారంజక పథకాలను గాంధీగారికి ఒక అధికారి వివరించడం జరిగింది. అప్పుడు గాంధీగారు ఎంతో ఆసక్తిగా చిరునవ్వుతో వింటున్నారు. అన్నింటినీ శ్రద్ధగా విని ప్రశంసించారు గాంధీజీ. చివరిలో ఆ సదరు అధికారి ‘అయితే మహాత్మా! ప్రధాని జవహర్‌లాల్ గారికి చెప్పి దేశమంతటా అమలుపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు. గాంధీగారు చిద్విలాసంతో అన్నారు కదా! ‘ఓయి అమాయకుడా! ఇటువంటి పనులు కేసర్లకే సాధ్యం అవుతాయి కానీ పండితులకు కాదు’. ఇంతటి ప్రశంస భారత కాంగ్రెస్ చరిత్రలో మరే నాయకుడికీ దక్కలేదు.
1948-49 భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ప్రకాశంగారు పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగంలో స్థానం కల్పించడానికి చాలా కీలకమైనది. మార్గదర్శకమైనది. 1948 నవంబర్ 4న రాజ్యాంగ చట్టాన్ని ప్రవేశపెడ్తూ డా.అంబేద్కర్‌గారు ‘గ్రామాలలో ఏమున్నది గనక! సంకుచితత్వం, ముఠా తగాదాలు, అవిద్య, కుల కక్షలు తప్ప’ అనేశారు. గాంధీ శకంలో, స్వాతంత్య్ర పోరాట రోజులలో ప్రత్యేకించి గ్రామాలే భారతదేశ ఆత్మ అని నమ్మిన వారికి ఈ మాటలు మింగుడు పడలేదు. వారందరు ముక్తకంఠంతో నిరసిస్తూ ఒక్క ఉదుటున లేచారు. వారిలో ప్రముఖులు ఆచార్య రంగా, కె.సంతానం, అనంతశయనం అయ్యంగార్, ఆంధ్రకేసరి ప్రకాశంగార్లు. 1948 నవంబర్ 22న రాజ్యాంగ పరిషత్ సభలో ప్రకాశంగారి ప్రసంగం ఈ విధంగా సాగింది. ‘... ... ఈ రాజ్యాంగ చట్ట ముసాయిదాలో గ్రామాన్ని రాజ్యాంగ చట్టంలో నిజమైన భూమికగా తీసుకొనక పోవడం వలన చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడినది. ఈ ప్రకటింపబడిన ప్రతిపాదనలో రాజ్యాంగం పై నుండి క్రిందికి నిర్మించబడినది.. ... ఇక మేము మన రాజ్యాంగ చట్టం క్రింది నుంచి (గ్రామ స్థాయి నించి) గ్రామం పునాదిగా ఆరంభం కావాలని, ఇదే మహాత్మాగాంధీ చెబుతూ వచ్చినదీ ముప్పై ఏళ్లుగా కృషి చేస్తున్నదీనూ!’
ఈ నేపథ్యంలో కె.సంతానంగారు ముసాయిదాలో 31-ఎ అధికరణమును ప్రతిపాదించారు. ‘ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి, వాటికి కావలసిన వనరులను సమకూర్చి అవి స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా పెంపొందించేందుకు కృషి చేస్తుంది.’ ఒక ఏడాదిపాటు చర్చోపచర్చలు, తర్జనభర్జనలు జరిగిన తరువాత అంతిమంగా మన రాజ్యాంగంలో ఒక ఆదేశిక సూత్రం (ఆర్టికల్ 40)గా చేర్చబడింది. ప్రకాశంగారు నిజమైన స్వచ్ఛమైన గాంధేయవాదిగా తన వాదనలు అంగీకరింపబడినందుకు ఎంతో సంతోషించారు. 73న రాజ్యాంగ సవరణకు గాంధీజీ, ప్రకాశంగార్ల లాంటి వారందరి అవిరళ కృషి, దూరదృష్టియే కారణమనక తప్పదు. అందుకే, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, గ్రామ స్వరాజ్య అంశాన్ని గౌరవించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్యగారు 1981లో ప్రకాశంగారి జన్మదినాన్ని ఆగస్టు 23ను ‘గ్రామ స్వరాజ్య దినం’గా ప్రకటించి ఘనంగా ఆ మహానుభావునికి నివాళులర్పించారు.
1946 నుంచి మద్రాస్ ప్రీమియర్‌గా ప్రకాశంగారి ప్రభుత్వం చేపట్టిన బహుముఖ కార్యక్రమాలు గ్రామోద్ధరణ దిశలో చిరస్మరణీయములు. సాలీనా కోటి రూపాయలు గ్రాంటు మంజూరు చేశారు. హరిజన అభివృద్ధికి గాను మరో కోటి రూపాయలు కేటాయించారు. అంటరానితనం నివారణ దిశగా హరిజనులను దేవాలయాలలో ప్రవేశం వంటి శాసనాలు చేశారు. విద్యారంగంలో, ఉద్యోగాలలో ప్రత్యేక సౌకర్యాలు కేటాయించారు. ఎన్నికలలో ప్రత్యేక రిజర్వు స్థానాలను ఏర్పాటు చేశారు. ఆనాటి హరిజన గూడెల పద్ధతిని నిర్మూలింప సంకల్పంతో దశా దిశా మార్గాలను అమలుపరిచారు. విభిన్న కులాల వారు కలసిమెలసి బతకడానికి, కుల మత తారతమ్యాలను పారద్రోలడానికి గాను గృహ నిర్మాణాల పద్ధతిని ప్రోత్సహిస్తూ ఒక నిధిని కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని పథకాలను కేవలం 13 నెలల పాలనలో చేయగలిగారు. కారణం నిర్ణయాలు తీసుకోవడంలో వేగం- అమలులో ధైర్యం, పరిపాలన లక్ష్యం పేదల క్షేమం గ్రామ సౌభాగ్యం.
ప్రకాశంగారి సహచరులు, సన్నిహితులూ ఉప్పలూరి రామశాస్ర్తీగారి అక్షర నివాళి సదాస్మరామి.
ఆంధ్రకేసరి వంటి ఆదర్శవాదుల
ప్రతిఘటన వలన ప్రభవమందె
అరయ ‘నలుబదియవ’ ఆదేశ సూత్రము
గ్రామమె పునాది కావలెనని.

-టంగుటూరి శ్రీరాం.. 9951417344