S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాంతులీనే కొల్హాపూర్ బొమ్మలు

‘‘గణపతి బొప్పా మోరియా
మంగళమూర్తి మోరియా’’

..అంటూ దేశంలోని ప్రాంతాల్లోనూ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలలో ప్రతిష్టించే గణపతి విగ్రహాలు తయారుచేయడంలో మహారాష్టల్రోని కొల్హాపూర్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రాంతంలో తయారవుతున్న గణపతి విగ్రహాలు సజీవంగా కనిపిస్తూ, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా పలువురిని ఆకట్టుకుంటాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పట్టణాలు, నగరాలకు చెందినవారు ఇక్కడి గణపతి విగ్రహాలను తమతమ ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రతిష్టించడానికి శ్రద్ధ చూపడం గమనార్హం. ఎంతోమందిని ఆకర్షిస్తున్న గణపతి విగ్రహాలను తయారుచేస్తున్న కళాకారులు, కార్మికులు, వ్యాపారస్థుల పరిస్థితి మాత్రం ఇక్కడ దయనీయంగా ఉంది.
మహారాష్టల్రోని కర్ణాటక సరిహద్దులో ఉన్న కొల్హాపూర్ నగరంలో దాదాపు పదిహేను వందల ‘కుంబార్’ తెగకు చెందిన కుటుంబాలు గణపతి విగ్రహాలు తయారుచేసే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. 1965వ సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొల్హాపూర్ నగర శివార్లలో ఈ కుంబార్లకు ప్రత్యేకంగా 36 ఎకరాల స్థలాన్ని కేటాయించి అరకొర వసతులను ఏర్పాటుచేసింది. ప్రారంభంలో వీరు ఆ ప్రాంతంలో లభ్యమయ్యే ఎర్రని మట్టితో ఇటుకలు తయారుచేస్తూ జీవనం సాగించినప్పటికీ మరోవైపు చిన్న చిన్న మట్టిబొమ్మలను అందంగా తయారుచేసి జీవనోపాధిని మెరుగుపరుచుకున్నారు. కానీ మార్కెట్లోని ప్లాస్టిక్ బొమ్మల ముందు ఇవి వెలవెలబోయాయి. ఇలాంటి పరిస్థితులలో గణపతి విగ్రహాలను తయారుచేయడానికి కొంతమంది యువకులు ముందుకు రావడంతో క్రమేణా ఈ ప్రాంతంలో తయారవుతున్న అందమైన గణపతి విగ్రహాలకు డిమాండ్ పెరగడం మొదలైంది. దీనితో మరికొన్ని కుటుంబాలు గణపతి విగ్రహాలను తయారుచేసే వృత్తిని పారంభించారు. రానురాను అనేక కుటుంబాలు ఈ వృత్తిని చేపట్టడంతో అందరూ కలిసి ‘కుంబార్ మాల్ ఉత్పాదక్ సొసైటీ’ పేరిట ఒక సంఘాన్ని ప్రారంభించుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 2,500 మంది సభ్యులతో పాటు, 50 మంది కళాకారులు, 5000 మంది దాకా కార్మికులు పనిచేస్తున్నారు.
ఈ ప్రాంతంలో లభించే ఎర్రమట్టి విగ్రహాల తయారీకి ఎంతగానో ఉపయోగపడటంతో వీరి జీవనోపాధి మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఇక్కడి కార్మికులు ఆయా సీజన్లను అనుసరించి దుర్గామాత, శివాజీ,గణపతి విగ్రహాలను ఎంతో అందంగా తయారుచేస్తుంటారు. సీజన్లో వినాయక విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సంపాదన బాగానే ఉంటుందని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఈ నగరంలోని ‘సంత్ గోరకుంబార కాలనీ, పాపాబీ టిక్‌టి (బాపట్ క్యాంప్), దత్త మహరాజ్ కాలనీ, లక్ష్మీగల్లీ, రుణముక్తేశ్వర్ గల్లీ’ తదితర ప్రాంతాలలో గణపతి విగ్రహాలను విరివిగా తయారుచేస్తారు. సాధారణంగా గణపతి విగ్రహాలను తయారుచేసేందుకు మట్టి మరియు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లను వాడతారు.
కేవలం మట్టితో విగ్రహాలు తయారుచేస్తే, ఇతర ప్రాంతాలకు రవాణ చేసే సమయంలో విగ్రహాలు విరిగి, బీటలు వారే అవకాశం ఉందని, మట్టితో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఈ విగ్రహాల తయారీకి వినియోగిస్తామని చెబుతున్నారు ఇక్కడి కార్మికులు. నాలుగు అడుగుల నుండి పదకొండు అడుగుల ఎత్తుగల విగ్రహాలను ఇక్కడ తయారుచేస్తారు. చిన్న, పెద్ద విగ్రహాలను తయారుచేయడానికి మొదట్లో అవసరమైన అచ్చులను తయారుచేసుకుంటారు. వీటికే ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఈ అచ్చులలో విగ్రహాన్ని మట్టితో తయారుచేసుకుని తదనంతరం ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ పేపర్‌ను పైపూతగా వాడుకుని విగ్రహాన్ని సిద్ధం చేసుకుంటారు. ఈ ప్రక్రియలో మట్టి, పి.ఓ.పితో పాటు టెంకాయ పీచు కూడా అవసరం అవుతుంది. ఇలా తయారైన విగ్రహాలకు ఆకర్షణీయమైన ఆయిల్ పెయింట్స్‌ను వేస్తారు. ఇలా పండుగకు కొద్దిరోజుల ముందుగానే వినాయకులు సిద్ధమైపోతారు.
ఈ వృత్తిలో నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు కూలీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారస్థులకు కూడా ఒక్కోసారి టోకు వ్యాపారంలో నష్టం వాటిల్లే పరిస్థితులు ఎదురవుతాయ. ‘కుంబార్ మాల్ ఉత్పాదక సొసైటీ’ అధ్యక్షుడు శంభాజీ శివాజీ కుంబార్‌ను ఈ విషయం గురించి అడిగితే.. ‘ఈ వృత్తిలో వ్యాపారస్థులకు కూడా ఒక్కోసారి నష్టం వస్తూంటుంది. ఈ నష్టాన్ని ఎవరికి వారే భరించుకోవాలి. ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం ఉండదు. సొసైటీ వారే వ్యాపారస్థులకు రుణ సదుపాయం కల్పిస్తారు. విగ్రహాల తయారీకి అవసరమైన మట్టిని తవ్వుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతి లభించకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం నుండి ఇక్కడి పిల్లలకు విద్య, వైద్య సౌకర్యాల లేవు. వీటిని కల్పించాలి. అలాగే మా ప్రాంతం వారికి కనీస వౌలిక సదుపాయాలు కల్పించాలి’ అని తెలిపారు.

-కెరె జగదీష్ 94407 08133