S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వకారణం.. విఘ్నవారణం

‘తలచితినే గణనాథుని తలచినే విఘ్నపతిని
దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా
విఘ్నములును తొలగుట కొరకున్’
ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడికి నమస్కరించి ‘ఆరౌ నిర్విఘ్న పరిసమావ్త్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించటం జరుగుతోంది.
వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత.
గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం. ఓంకార ప్రణవ నాద స్వరూపుడు మహా గణపతి. అన్ని నామ మంత్రాలకు ముందు ‘ఓం’కారము ఎలా చదువుతామో, ఆ విధంగానే అన్ని శుభ కార్యాలకు ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.
నరకుంజరుడు
మన దేవతలలో విచిత్రమైన రూపాలలో దర్శనమిచ్చే దేవతలలో నరసింహుడొకడు, నరకుంజరుడొకడు, హయగ్రీవుడొకడు. నరసింహుడు, హయగ్రీవుడు శ్రీ మహావిష్ణువైతే నరకుంజరుడు - మహాగణపతి. ము గ్గురూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన వారే. హి రణ్య కశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి కాపాడి, పరమాత్మ సర్వాంతర్యామి అని నిరూపించటానికి నరసింహావతారమైతే, మానవులను బాధించే విఘ్నాలనే దుష్టశక్తులను పారద్రోలి వారి కార్యాలను నిర్విఘ్నంగా సాగించటానికే వినాయకుని ఆవిర్భావం.
గణపతి పుట్టుక జ్యోతిష శాస్త్ర అన్వయం
‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి కలుగుతుంది. భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు ఆవిర్భవించాడు గదా భాద్రపదం అంటే ఏమిటి? భద్రమైన పదం, భాద్రపదం, అనగా శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజోరూపం. చతుర్థి అనగా చవితి. ఏమిటా నాలుగు? జాగృత్, స్వప్న, సుషుప్త్యావస్థలు. మరి నాలుగోది? ఈ మూడవస్థలను దాటిన తదుపరి వచ్చే నాల్గవది - తురీయావస్థ - నిర్వికల్ప సమాధి.
ఆయన నక్షత్రం, ‘హస్త’. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. విజ్ఞాన ప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేష రాశి నుంచి ఆరవ రాశి కన్యారాశి. షష్టమ అనగా ఆరవ భావం, శతృ ఋణ రణ రోగములను తెలియజేస్తుంది. మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. ఈ షష్ట భావంలో, హస్తా నక్షత్రంలో కన్యారాశిలో చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితినాడు పుట్టిన వినాయకుడు, ఈ నాలుగు రకములైన విఘ్నాలను తొలగిస్తానని అభయ హస్తమిస్తున్నాడు.
కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. కాలరాశి చక్రంలో పనె్నండవ రాశి - మీనరాశి, అనగావ్యయ రాశి. మేష రాశికి వ్యయ రాశి. పనె్నండవ భావం - వ్యయాన్ని బంధనాన్ని అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ, శత్రువులంటే అంతః శత్రువులు - అరిషడ్వర్గములు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవి. హస్తా నక్షత్రం, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి, జీవితాన్ని, సుఖమయం, సుసంపన్నం చేసి, లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడనే జ్యోతిష శాస్త్రాన్వయం.
పత్రి పూజ, ఉండ్రాళ్లు నివేదికలోని ఆంతర్యం
వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం కదా. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు గదా. నవ గ్రహములకు నవ ధాన్యాలు, నవ రత్నాలు చెప్పబడ్డాయి. చంద్రుడు తెల్లనివాడు. నవ ధాన్యాలలో చంద్రునికి సంబంధించినవి - బియ్యం. వినాయకుడు శుక్లాంబరధరుడు. చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించాడు. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి, ఉండ్రాళ్లు నివేదన చేయటంలోగల ఆంతర్యమిదే.
వినాయకునిది కన్యారాశి అని చెప్పుకున్నాం గదా. కన్యారాశికి అధిపతి - బుధుడు. బుధునిది, నవరత్నాలలో ‘పచ్చ’ రాయి. ‘ఎమరాల్డ్ గ్రీన్’ అనగా ఆకుపచ్చ రంగు. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. సంతుష్టుడవుతాడు - స్వామి.
గజ శబ్దార్థం
వశీ - శివ, హింస - సింహ, కశ్యపః - పశ్యకః అని వర్ణ వ్యత్యాసములతో మార్పు కలుగుతుంది. ఇదొక వ్యాకర శాస్త్ర ప్రక్రియ. ‘కశ్యపః పశ్యకో భవతి’ అన్నది యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం. కనుక, ఆ విధంగానే, జగ-గజ గా మారుతుంది. గజాననుడంటే - ‘జగదాననుడు’ అని అర్థం. జగత్తునే ముఖముగా కలవాడు. ‘గ’ అంటే లయము, జ- జన్మ. కనుక ‘గజ’మనగా సృష్టి, స్థితి, లయములు గల జగత్తు అని అర్థం. ‘గ’ అంటే జ్ఞానము. ‘జ’ అంటే పుట్టినది. గజమంటే - జ్ఞానము వలన పుట్టిన మోక్షమని అర్థము. ‘జ్ఞాన దేవతు కైవల్యం. కనుక గజ ముఖము, గజాననుని ముఖ దర్శనం - శుభ ప్రదము, జ్ఞానప్రదము, మోక్ష ప్రదము.
గరికతో పూజించటంలో
ఆంతర్యం
వినాయకునికి గరిక పూజ అంటే ప్రీతి అంటారు. వినాయక చవితి నాడు ప్రతిరోజూ విఘ్నేశ్వర ఆలయాలలో, గరికతో స్వామిని అర్చిస్తారు. పూజా ద్రవ్యములలో గరికను కూడా జతచేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకునే కథ ఒకటుంది. పార్వతీ పరమేశ్వరులు పాచిక లాడుతున్నారు కైలాసంలో. న్యాయ నిర్ణేతగా, నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నందీశ్వరుడు తీర్పు నిచ్చాడు. అయితే ఆ తరువాత అమ్మతో నిజం చెప్పాడు నంది. ‘ఈశ్వరుడు నాకు ప్రభువు తల్లీ. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా. మీరిద్దరూ ఒకటే’ అన్నాడు నంది. ‘నందీ నీవు నయం కాని రోగంతో బాధపడతావు’ అని శపించి, నంది దీనావస్థను చూచి, జాలి చెంది ‘నందీ! నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి, అతని అనుగ్రహంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది’ అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతికి సమర్పించాడు. అతనికి శాపవిముక్తి లభించింది. ఇది వినాయక పూజలో గరికకి ఉన్న ప్రాధాన్యత.
దూర్వాసూక్తం ఏం చెప్పింది?
‘సహస్ర పరమాదేవ శతమూలా శతాంకురా సర్వణ్‌ం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని’ సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధి, లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలిగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము, మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని చెప్పింది, దూర్వాసూక్తము. దూర్వాయుగ్మం అంటే గరిక. దుస్వప్నములతో భయపడేవారికి, గరికతో వినాయకుణ్ణి పూజించి, కాస్త గరికను పట్టుకొని పై చెప్పిన మంత్రాన్ని మూడుసార్లు చదివి, దిండు క్రింద పెట్టుకుని పడుకుంటే భయం పోతుంది, దుస్వప్నములు రావని పెద్దలు చెబుతారు.
గణపతి - లలితా పరమేశ్వరి
‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర నామం. లలితాదేవి విఘ్నములను అవిద్యను నశింపజేస్తుంది. కనుక ‘విఘ్ననాశినీ’ అని పేరు కలిగింది. మరి గణపతి గదా విఘ్నములను
లేకుండా చేసేవాడు? దీనిని బట్టి, లలితాదేవి గణపతి స్వరూపిణి, గంపతి లలితా స్వరూపుడు అని తెలుస్తుంది. లలితా గణపతులకు భేదం లేదు.
విష్ణు సహస్ర నామంలో గణపతి
ఏకదం- అంతా ఒక్కటే, రెండవది లేదు, అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు ఏకదంతుని ఉపాసించాలి. ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు, తం- గణేశుని అనేక దంతం - ప్రళయ కాలంలో అనేకములను హరించు గణపతిని ఉపాసించాలి అని అర్థములున్నాయి. ‘ఏకః నైకః సవః కః కిం’ విష్ణు సహస్ర నామముల భావమే ‘ఏకదః అనేకదః’ అని చెప్పారు.
గజాననుని రూపం - ఆధ్యాత్మిక విశేషాలు
మోక్షసిద్ధికి వక్రమైన ఆటంకములగు అరిషడ్వర్గములను (కామ క్రోధాదులు) నశింపజేసి, ఏకాగ్రత నొసగి, జీవ బ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించేవాడు వక్రతుండుడు. మూలాధార క్షేత్ర స్థితుడు. మూలాధారం - పృథ్వీ తత్త్వం. లంబోదరం - బ్రహ్మాండానికి సంకేతం.
విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు- రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది - మోదకం. ఆయన కృపా కటాక్షములతో ఆనందం లభిస్తుంది. నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం. మనిషి క్రోధాన్ని విడిచి అనురాగాన్ని అభివృద్ధి చేసికొని, శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు, ప్రేమ భావనా భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధధారుడు మహాగణపతి.
యుక్తాహార విహారస్య - అన్నాడు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబంధించినవి. తమోగుణానికి సంకేతం. ‘బ్రతకటం ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు, తమోగుణాన్ని చంపుకోలేరు. అటువంటి వారిని గూర్చి ఇతరులు జాలిపడటం, మనసులోనైనా పరిహసించటం సహజం. యోగి అయినవాడు యుక్తాహార విహారాదులతో, తమోగుణాన్ని జయించి సత్వగుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగ సిద్ధుడై, ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని, తన శరీరాకృతి, నాగయజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.
మూషిక వాహనం - అంతరార్థం
మూషికం అంటే ఎలుక. (కొన్ని ప్రాంతాల్లో ఎలక అంటారు.) వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది, బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకుని, చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను, నికృష్ట కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు. అంతేకాదు, అహంకారానికి చిహ్నం ఎలుక (మూషికం). అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది. బుద్ధిపతి అయిన మహాగణపతి దానిని మలిచి, జయించి సద్వినియోగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సద్బుద్ధి నిస్తాడు.
భాద్రపద మాస విశేషమేమిటి?
‘్భద్రం కర్ణ్భి శృణు యామ దేవాః భద్రం పశే్యమాక్షభిర్య జిత్రాః...’ అన్నది వేదం. మంగళకరమైన విషయాలనే మా కర్ణములు శ్రవణము చేయుగాక, మంగళకరమైన దృశ్యములనే మా నయనములు చూచునుగాక. దృఢమైన అంగములు, మంచి శరీర దారుఢ్యం కలిగి భగవంతుడు మాకు ప్రసాదించిన శరీరముతో సదా ఆయనను స్తుతిస్తూ ఆనందింతుము గాక. కనుక ‘్భద్ర’మనగా మంగళం, కల్యాణం శుభప్రదం అని అర్థాలు. భద్రమంటే సామవేద మంత్రం, అని కూడా అర్థం. సామవేద సారం - సంగీతం - నాదోపాసన. లయ యోగములలో కెల్ల సులభ మార్గం. అటువంటిది ‘్భద్ర’మంటే, భద్రమే భాద్రము. ‘్భందతే ఇతి భద్ర’. శుభముల నిచ్చునది. భద్రపదమే - భాద్రపదము. పదము అంటే ఏమిటి? పదము అంటే పదము, జ్ఞానము, పాదము, స్థానము అనే అర్థాలున్నాయి. కనుక శుభప్రదమైన మంగళకరమైన పదములు, పాదములు జ్ఞానము గలది ఏది? వేద వాక్కు. కనుక, భాద్రపద మనగా వేద పదములు అనగా వేద మంత్రముల స్థానం, నిలయం. అంటే విశేష మంగళకర సమాసము భాద్రపద మాసము.
భాద్రపద మాసానికి ‘ప్రోష్ఠపదము’ అని పేరు. భద్ర అన్నా ప్రోష్ఠా అన్నా ఒకే అర్థం - గోవు అని. గో పాదముల లాగా నాలుగు పాదములు కలిగి ఉన్నది - భాద్రపద నక్షత్రం. భాద్రపద నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం - భాద్రపద మాసం. ఇంత విశిష్ఠమైనది భాద్రపద మాసం.
అట్టి, భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిరోజున, ఉదయానే్న అభ్యంగన స్నానం చేసి, మట్టితో చేసిన వినాయకుణ్ణి తీసికొని వచ్చి, పూలు 21 రకముల పత్రితో పూజ చేసి, కథను విని, నివేదన మంత్రపుష్పాదులు సమర్పించి అర్చిస్తాము. కథాక్షతలు శిరస్సున దాల్చుకుంటారు.
మట్టి వినాయకుణ్ణే ఎందుకు పూజించాలి?
పంచభూత సదృశమైనది మానవ శరీరం. అందులో మూలాధారం - పృథ్వీ తత్త్వం. ‘మూలాధార చక్ర వినాయకా మూల్య వర ప్రదాయక, మూలా జ్ఞాన శోక వినాశక మూలకంద, ముక్తిప్రదాయక..’ అని మహాగణపతిని శ్రీరాగంలో కీర్తిస్తూ ముత్తుస్వామి దీక్షితులు, మూలాధార చక్రానిలయుడు మహాగణపతి అన్నారు. కనుక పృథ్వీ తత్త్వమైన (్భమి, మట్టి) మూలాధార నిలయుడైన గణపతి ఆరాధన మట్టి వినాయక విగ్రహానికే చేయటం శుభప్రదం, శాస్త్ర సమ్మతం.
‘జలభూత శుభాకారం చతుర్గుణ సమన్వితమ్ సర్వవిఘ్న హరం దేవం భజామి గణ నాయకమ్’ శబ్ద, స్పర్శ, రూప రసములను నాల్గు గుణములు గలవాడు. జలభూతాకారుడగుట చేతనే శ్రీగణపతి నవరాత్రుత్సవములు జరిపి ఆ మూర్తిని జలములో నిమజ్జనం చేసే ఆచారం, సంప్రదాయంగా వచ్చింది.
ముత్తుస్వామి దీక్షితులు - మహాగణపతి కీర్తనలు
వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందింది. హంసధ్వని రాగ కీర్తన ‘వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం.. వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం’ తప్పక జ్ఞప్తికి చేసికొని పాడుకోవాలి, కనీసం చదువుకోవాలి. గణపతి పూజలో ఇది ఒక భాగం కావాలి. ఆ మహనీయుడు గణపతి మీద ఎన్నో కీర్తనలు అందించాడు. ‘మహా గణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత’ నాట రాగ కీర్తన, గజానన యుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం’ ఇత్యాదులు వినాయక చవితికి స్ఫూర్తినిస్తాయి.
అహంకారమును దరికి రానీయక, అందరి పట్ల ఆదరణ కలిగి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతృత్వతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు, మహాగణపతి వినాయక చవితి పండుగ రోజున. *

వినాయకుడి రూప రహస్యం

గణపతి రూపం మేనేజ్‌మెంట్ పాఠాలకు ఎలా ఉపయోగపడుతోందో చూడండి. గణనాథుడి అవతారంలో ఎన్నో మంచి గుణాలు దాగున్నాయంటున్నారు మేనేజ్‌మెంట్ గురూలు. వాటిని గుర్తించి ఆచరిస్తే ఏ రంగంలోనైనా విజయదుందుభి మోగించవచ్చంటున్నారు. అవేమిటో చూడండి.

పెద్ద తల: పెద్దగా ఆలోచించు
చిన్న కళ్లు: ఏకాగ్రతను సాధించు
పెద్ద చెవులు: ఎక్కువగా విను
చిన్న నోరు: తక్కువ మాట్లాడు
పొడవైన తొండం: దీర్ఘకాల ప్రణాళికలు రచించు
ఏకదంతం: ఒకే లక్ష్యం కోసం పనిచేయి
పెద్ద బొజ్జ: ఎక్కువ సామర్థ్యాన్ని చూపించు
అభయ హస్తం: అందరికీ స్నేహశీలివై, సహాయకారివై ఉండు
ఉండ్రాళ్లు: సామర్థ్యానికి తగ్గ ప్రతిఫలం ఆశించు
ఆయుధం: సమయస్ఫూర్తితో సమస్యలను ఎదుర్కో
ఎలుకవాహనం: కిందిస్థాయి వారితోనూ స్నేహంగా ఉండు

-పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464