S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవసేవే మాధవసేవ!

పూర్వం రైతులు పంట చేతికి వచ్చి ధాన్యం ఇంటికి చేరిన తర్వాత యాత్రలు చేసేవారు. సంవత్సరమంతా ఎండా వానలు, చలిగాలులు లెక్కచేయకుండా పొలాలలో కష్టించి పని చేసిన రైతులకు యాత్రలు మానసికానందాన్ని కలిగించేవి.
దేవరకొండ పట్టణం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులను కూడగట్టి యాత్రలు నిర్వహించేవాడు దేవయ్య. అప్పట్లో కొంత దూరం ఎద్దుల బళ్ల మీద, అడవులలో కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శించుకునేవారు. దేవయ్య ప్రతి మనిషికి ఇంత అని ఖర్చులకు డబ్బు తీసుకునేవాడు. దారి పొడుగునా ఆహారం, నదులు దాటవలసి వచ్చినప్పుడు బల్ల కట్టు రుసుము, సామాను మోసేవారికి కూలీ చెల్లించడం అన్నీ చూసుకునేవాడు.
ఎప్పటిలాగానే దేవరకొండ నుంచి శ్రీశైలం క్షేత్రానికి యాత్ర బయల్దేరదీశాడు దేవయ్య. ఎద్దుల బళ్లు వెళ్లగలిగినంత వరకు అందులో ప్రయాణించారు. అడవి మార్గంలో అంతా కాలినడకనే సాగుతున్నారు.
ఒక చెంచుగూడెంలో రాత్రి బస చేసి ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి వెళ్లారు. ప్రయాణీకులలో ఒకరైన సోమనాథుడు ఒక రాయి మీద కాలు వేయగానే అది కదిలింది. సోమనాథుడు నేల మీద పడిపోయాడు. శరీరానికి గాయాలయ్యాయి. కాలు బెణికి వాచింది. నడిచే పరిస్థితి లేదు. ఆయన్ని చెంచుగూడెం చేర్చారు. గూడెం నాయకుడు ఆకుపసరులతో గాయాలకు కట్టుకట్టి, కాలికి తైలంతో మర్దన చేసి ఉపశమనం కలిగించాడు.
ఐతే కాలినడకన శ్రీశైలం వరకు ప్రయాణించడం వీలు కాదు. ‘పది రోజులైనా విశ్రాంతి తీసుకోవాలి’ గూడెం నాయకుడు సలహా ఇచ్చాడు. శ్రీశైలం వెళ్లే దారి అంతా దుర్గమారణ్యం, కొండలు ఎక్కవలసి ఉంటుంది.
‘దేవయ్యా! నా ఒక్కడి వల్లా మీరంతా పది రోజులు ఇక్కడ ఆగిపోవడం భావ్యం కాదు. మీరంతా శ్రీశైలం వెళ్లి దేవుడిని దర్శించుకుని రండి. నేను ఇక్కడే వుంటాను. తిరుగు ప్రయాణంలో కలిసి మన ఊరు వెళ్దాం’ అన్నాడు సోమనాథుడు.
‘సరే’ అని అంతా ప్రయాణానికి సిద్ధపడుతూ ఉండగా, రమణయ్య ‘దేవయ్యా! సోమనాథుడు వృద్ధుడు. గాయపడి ఉన్నాడు. ఒంటరిగా వదిలి వెళ్లిపోవడం ధర్మం కాదు. అలా అని అందరూ యాత్రను ఆపుకోవడం కుదరదు కాబట్టి నేను ఆయనకు తోడుగా ఉంటాను. మీరు వెళ్లి రండి’ అన్నాడు.
‘ఆయన ఒంటరిగా ఉంటానంటున్నాడు కదా! నువ్వెందుకు దైవ దర్శనం మానుకుంటావు? శివుడిని సేవించుకునే అవకాశం ఎందుకు వదులుకుంటావు? మాతోపాటు బయల్దేరు’ అన్నాడు దేవయ్య.
‘మానవసేవే మాధవసేవ’ అని పెద్దలు చెప్తారు. నాకు ఆ మాట మీద నమ్మకం ఉంది. వృద్ధుడైన సోమనాథుడిని ఒంటరిగా వదిలిపోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను బలవంతపెట్టకండి. చెంచుల గూడెంలో ఎందరు మనుషులున్నా సొంత మనిషికి సాటిరారు. వాళ్లెంతవరకు ఆదరిస్తారో తెలియదు. శ్రీశైలం వెళ్లిన వారంతా ఎన్ని రోజులకు తిరిగి వస్తారో తెలీదు’ అన్నాడు రమణయ్య.
మొండిగా వుండిపోతానన్న రమణయ్యను గూడెంలో వదిలి అంతా శ్రీశైలం యాత్రకు బయల్దేరారు.
‘రమణయ్య పిచ్చోడిలా ఉన్నాడు. ఆ ముసలాయన వీడికి చుట్టం కాదు, పక్కం కాదు. ఆయన సేవ కోసం శ్రీశైలం వెళ్లే అవకాశం వదులుకుంటారా ఎవరైనా?’ అని కొందరు విమర్శించారు.
సోమనాథుడు రమణయ్యను మెచ్చుకున్నాడు.
‘రమణయ్యా! వయసులో చిన్నవాడివైనా నా పాలిట ఆపద్బాంధవుడవు. నీకు చేతులెత్తి మొక్కాలి’ అన్నాడు.
‘అయ్యో పెద్దలు. అంత మాట అనవద్దు’ అని నొచ్చుకున్నాడు రమణయ్య.
శ్రీశైలం యాత్రకు వెళ్లిన వారంతా పదిహేను రోజుల తర్వాత తిరిగి వచ్చారు. అప్పటికి సోమనాథుడికి స్వస్థత కలిగింది. దేవరకొండకు తిరుగు ప్రయాణమయ్యారు.
* * *
కొంతకాలం తర్వాత రమణయ్య ఇంటికి ఒక గుర్రబ్బండి వచ్చింది. అందులో నుంచి ఒక యువకుడు దిగాడు.
‘రమణయ్యగారు ఎవరండీ?’ అని అడిగాడు.
‘మీరెవరు?’ అని అడిగాడు రమణయ్య తండ్రి.
‘నేను సిరిపురంలో వ్యాపారి సోమనాథుడి మనవడిని. హర్షవర్థనుడు నా పేరు’ అన్నాడు.
ఇంతలో రమణయ్య వచ్చి పరిచయం చేసుకున్నాడు.
‘రమణయ్యగారూ! మా తాతగారు సోమనాథుడు మిమ్మల్ని సిరిపురం ఆహ్వానించి తీసుకురమ్మన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా మీకు అక్కడ సన్మానం ఏర్పాటు చేశారు. ఎందుకో మీకు తెలుసు’ అన్నాడు హర్షవర్థనుడు.
రమణయ్య హర్షవర్థనుడి వెంట సిరిపురం చేరుకున్నాడు. సోమనాథుడి కుటుంబ సభ్యులు రమణయ్యకు ఘనంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు.
దసరా ఉత్సవాల సందర్భంలో దుర్గ గుడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రమణయ్య యాత్ర సందర్భంలో తనకు ఆపద్బాంధవుడిగా వుండి సేవలు చేసిన విషయం వివరించాడు.
‘మానవసేవే మాధవసేవ అని నమ్మిన రమణయ్యని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మంచి మనుషులను సత్కరించడం మన విధి. అందువలన రమణయ్య వలెనే మనం కూడా మానవ సేవలో తరించాలనే ఆలోచన ప్రజలలో కలుగుతుంది’ అని ప్రకటించాడు సోమనాథుడు.
రమణయ్యను సిరిపురంలో సోమనాథుడు సన్మానించి లక్ష రూపాయలు బహుమతి ఇచ్చాడనే సంగతి దేవరకొండలో, ఆ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీశైలం వెళ్తే పుణ్యం వచ్చే సంగతి ఏమోగాని, సోమనాథుని మానవతా దృక్పథంతో ఆదుకున్నందుకు రమణయ్య లక్షాధికారి అయ్యాడు.

-వాణిశ్రీ 8309860837