S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇస్లాం మహిళకు ఊరట..

‘తలాక్.. తలాక్.. తలాక్..’ అని మూడుసార్లు హఠాత్తుగా చెప్పడం ద్వారా వివాహబంధాన్ని విచ్ఛేదనం చేసే వికృత సంప్రదాయాన్ని నేరమని నిర్ధారించడం హర్షణీయ నిర్ణయం. ఇలా నిర్ధారిస్తున్న అధ్యాదేశం- ఆర్డినెన్స్- బుధవారం రాత్రి వెలువడిందట! ఈ అధ్యాదేశాన్ని రూపొందించి ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్లాం మతస్థులైన మహిళల వివాహ సంబంధమైన హక్కుల పరిరక్షణకు దోహదం చేసింది. స్ర్తి పురుష సమానత్వ సాధనకు, మహిళల సామాజిక సాధికార సాధనకు ఈ ‘ఆర్డినెన్స్’ దోహదం చేయగలదన్నది నిర్వివాదం. నిర్వివాద అంశాలను వివాదగ్రస్తం చేయడానికి స్వార్థనిహిత రాజకీయం కృషి చేస్తుండడం మన దేశంలో దశాబ్దుల వైపరీత్యం. ఈ వైపరీత్యానికి ముస్లిం మహిళలు తరతరాలుగా బలి కావడం చరిత్ర! ఆధునిక విజ్ఞానం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం సామాజిక న్యాయ పరిరక్షణకు, సామాజిక సమానత్వానికి, సహజ న్యాయసూత్రాలను మెరుగైన రీతిలో సమన్వయం చేయడానికి, సమష్టి హిత సాధనకు దోహదం చేయగలగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే ఆధునికతకు అర్థం, ఔచిత్యం ఏర్పడగలవు. ఇలా విజ్ఞానం సమష్టి హిత సాధనకు దోహదం చేస్తోందన్నది సమష్టి విశ్వాసం. కానీ ముస్లిం మహిళల వివాహ జీవన పరిరక్షణకు మాత్రం ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేయకపోవడం మిక్కిలి దురదృష్టకరం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇస్లాం మతస్థుడు అమాయకురాలైన తన భార్యకు అక్రమంగా విడాకులివ్వడానికి అనేక సందర్భాల్లో దోహదం చేసింది. దూరవాణి ద్వారా ‘తలాక్.. తలాక్.. తలాక్’ అని భార్యకు మూడుసార్లు చెప్పడం ద్వారా భర్త ఆమెతో తన వివాహ బంధాన్ని రద్దు చేసుకోగలిగాడు. వివాహబంధం విచ్ఛిన్నమైన ఒంటరి మహిళలు భరించరాని దారిద్య్రానికి, కడగండ్లకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా మరింత మానవీయ సమాజం రూపొందడం లక్ష్యం. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా ఇస్లాం మహిళను దుర్మార్గుడైన భర్త అమానవీయ దుస్థితికి గురిచేయగలిగాడు. వివాహబంధాన్ని న్యాయంగా ఆజీవనం ఆస్వాదిస్తున్న భార్యాభర్తలు అన్ని మతాల్లోను ఉన్నారు. ఇస్లాంలో కూడ ఉన్నారు. దుర్మార్గులు కూడ అన్ని మతాల్లోను ఉన్నారు. ఇస్లాంలోనూ ఉన్నారు. బ్రిటన్ దురాక్రమణ విముక్త భారతదేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ పరిణతి చెందింది. ఈ ప్రజాస్వామ్య ప్రస్థాన క్రమంలో స్ర్తి పురుష సమాన న్యాయసాధనకు, మహిళా సాధికార సంసిద్ధికి అనేక చట్టాలు, నియమాలు రూపొందాయి. కాని ఈ మానవీయ నియమాలు ఇస్లాం మహిళల కడగండ్లను దూరం చేయడానికి ఉపకరించక పోవడం ‘సర్వమత సమాన రాజ్యాంగ స్వభావాన్ని’, భారత జాతీయ స్వభావాన్ని నిలదీస్తున్న వైపరీత్యం!
ఈ వైపరీత్యానికి కారణం- మహిళాభ్యుదయం కోసం, స్ర్తి పురుష సమానత్వ పరిరక్షణ కోసం, పరిపోషణ కోసం ఏర్పడిన చట్టాలు, రాజ్యాంగ నియమాలు ఇస్లాం మతస్థులకు వర్తించక పోవడం. అల్పసంఖ్యాక మతస్థుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన రాజ్యాంగ నియమాలు ఇస్లాం మహిళలను సామాజిక న్యాయానికి దూరం చేస్తున్నాయి. పార్లమెంటు రూపొందించిన చట్టాలు కాక మతపెద్దలు నిర్ధారించిన మత నియమాలు ఇస్లాం సమాజాన్ని నిర్దేశించాయి, నిర్దేశిస్తున్నాయి. ఫలితంగా మహిళా సాధికార ప్రక్రియకు, సమానతా సూత్రానికి ఇస్లాం మహిళలు దూరమయ్యారు. అనాగరికమైన బహు భార్యాత్వ సంప్రదాయాన్ని పార్లమెంటు దశాబ్దుల పూర్వం రద్దు చేసింది. కానీ ఇస్లాం మహిళలు మాత్రం ‘బహు భార్యా సంప్రదాయ’ దౌష్ట్యానికి ఇప్పటికీ బలి అవుతున్నారు. కన్యాశుల్కం, వరకట్నం, అస్పృశ్యత, కులవివక్ష వంటి దురాచారాలను నిర్మూలించడానికి చట్టాలను చేసిన పార్లమెంటు, ప్రభుత్వం ‘ముమ్మారు తలాక్’ చెప్పే పురుష దురహంకారాన్ని ఇనే్లళ్లపాటు నిర్మూలించలేకపోయాయి. దీనికి ఏకైక కారణం అల్పసంఖ్యాక మతస్థులకు రాజ్యాంగంలో ఏర్పడి ఉన్న ప్రత్యేకత. ఈ ‘ప్రత్యేకత’ ముస్లిం పురుషుడు మాత్రం ఒకే సమయంలో అనేక మంది భార్యలను కలిగి ఉండడానికి వీలు కల్పించింది. సమానమైన ‘పౌరస్మృతి’- కామన్ సివిల్ కోడ్-ని రూపొందించి, దానిని దేశ ప్రజలందరికీ సమానంగా వర్తింప చేయకపోవడం ఇందుకు కారణం. దీనివల్ల ప్రధానంగా అన్యాయం జరిగింది, జరుగుతున్నది ఇస్లాం మతస్థులైన మహిళలకే..!
ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాల్లో సైతం కాలక్రమంలో సమకాల సమాజానికి అనుగుణంగా నియమాలను మార్చుకుంటున్నారు. మన దేశంలో సైతం తార్కికంగా, న్యాయబద్ధంగా ఆలోచిస్తున్న కోట్ల మంది ఇస్లాం మేధావులు, మతపెద్దలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఇలాంటి అభ్యుదయకరమైన మార్పులను కోరుతున్నారు. కానీ కొంతమంది రూఢవాదులు, ఉన్మాదులు మాత్రం అభ్యుదయకరమైన పరివర్తనను అడ్డుకుంటున్నారు. ఈ ‘కొంతమంది’ అభిప్రాయం ఇస్లాం మతస్థుల సమష్టి అభిప్రాయంగా దశాబ్దుల తరబడి ప్రచారం అవుతుండడం ఇస్లాం మహిళలు దమనకాండకు గురి అవుతుండడానికి కారణం. ముమ్మారు తలాక్- ట్రిపుల్ తలాక్-ను చెప్పి విడాకులిచ్చే పద్ధతికి క్రీస్తుశకం 1926లోనే టర్కీ స్వస్తి చెప్పింది. ఈజిఫ్ట్ 1929లోను, పాకిస్తాన్ 1961లోను, బంగ్లాదేశ్ 1971లోను, శ్రీలంక 2006లోను ఇలా ‘ముమ్మారు తలాక్’ చెప్పడం ద్వారా విడాకులను ఇవ్వడం చెల్లదని స్పష్టం చేస్తూ చట్టాలను రూపొందించాయి. ఈ దేశాలలో శ్రీలంక తప్ప మిగిలిన దేశాలు ‘ఇస్లాం’ను అధికార మతంగా గుర్తించిన రాజ్యాంగ వ్యవస్థలు. కానీ సర్వమత సమభావ వ్యవస్థను కలిగిన మన దేశంలో మాత్రం ఈ విజ్ఞత ఇన్నాళ్లుగా వికసించక పోవడం విచిత్రం.. ఈ విచిత్రం, ఈ వికృత సంప్రదాయం కొనసాగడంలో న్యాయం లేదు, తర్కం లేదు, సామంజస్యం లేదు, హేతుబద్ధత లేదు, మానవీయత లేదు. ఈ ‘సామంజస్య రాహిత్యం’ మన దేశంలోని అనేక రాజకీయ పక్షాలను ఆవహించి ఉంది. ఇస్లాంలోని అధికాధిక సంఖ్యలో ఉన్న సామాన్య ప్రజల అభిప్రాయాన్ని కాక కొద్దిమంది స్వార్థనిహిత మత గురువుల మాటలను ఈ రాజకీయ పార్టీలు సమష్టి అభిప్రాయంగా భావిస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించిన ‘ముమ్మారు తలాక్ వ్యతిరేక బిల్లు’ను పార్లమెంటులో ఈ రాజకీయ పక్షాలు వ్యతిరేకించడానికి ఇదీ కారణం.. ‘ట్రిపుల్ తలాక్’ పద్ధతి చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పునకు అనుగుణంగానే ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది, బిల్లును ప్రవేశపెట్టింది. ‘ముమ్మారు తలాక్’ను హఠాత్తుగా ప్రకటించడం నేరమని నిర్ధారించింది. ఈ నేరానికి పాల్పడేవారిని శిక్షార్హులుగా ప్రకటించింది. పార్లమెంటులో ‘బిల్లు’ ఆమోదించకుండా ప్రతిపక్షాల వారు అడ్డుపడుతుండడం వల్లనే ‘అధ్యాదేశం’ అనివార్యమైంది. దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించగల ‘ఉమ్మడి పౌరస్మృతి’ని రూపొందించడం ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగంలోని నలబయి నాలుగవ అధికరణంలో స్పష్టం చేశారు.
కానీ డెబ్బయి ఏళ్లకు పైగా రాజకీయ నిర్వాహకులు ఈ సంగతిని పట్టించుకోలేదు. ఈ సామంజస్య రాహిత్యం ‘భారత న్యాయ వ్యవహారాల సంఘం’- లా కమిషన్ ఆఫ్ ఇండియా- వారిని కూడ ఆవహించి ఉండడమే జాతీయ వైపరీత్యం! ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి పౌరస్మృతి అవసరం కాదు, వాంఛనీయం కాదు..’ అని ‘లా కమిషన్’ వారు ఇటీవల ప్రకటించడం ఇందుకు సరికొత్త సాక్ష్యం!