S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజకీయ అవకాశవాదం

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం ఈ దశాబ్దపు జోక్‌గా అభివర్ణించవచ్చు. ప్రఖ్యాత సినీ నటుడు ఎన్.టి.రామారావు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి, చిన్న చిన్న విషయాలకు కూడా అధిష్ఠానంపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మన రాష్ట్రం కోసం పనిచేసే పార్టీ స్థానికంగానే వుండాలన్న ఆయన నినాదం తెలుగు ప్రజలకు నచ్చడంతో- ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. కాలక్రమేణా ఎన్.టి.ఆర్ సిద్ధాంతాలకు ప్రస్తుత తెదేపా నాయకత్వం తిలోలోదకాలిస్తోంది. రాజకీయ స్వార్థంతో ఏ పార్టీతోనైనా చేతులు కలుపుతూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోంది. ఏ పార్టీ తనకు అవసరమని అనిపిస్తే- ఆ పార్టీతో తెదేపా చేతులు కలపడం పరిపాటి అయ్యింది. 1992లో కమ్యూనిస్టులు, 1996, 2014లో బిజెపితో, 2004లో మహాకూటమి పేరిట తెరాస, కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకోవడం తెలిసిందే. 35 సంవత్సరాల పాటు బద్ధశత్రువుగా భావించిన కాంగ్రెస్‌తో ఇపుడు తెదేపా ఎన్నికల పొత్తుపెట్టుకోవడం అవకాశ వాదానికి నిదర్శనం. ‘ఇటలీ దెయ్యం’ అంటూ సోనియా గాంధీపై అలుపెరగక విమర్శలు కురిపించిన చంద్రబాబు ఇప్పుడు అదే దెయ్యంతో కలిసి రాజకీయ ప్రయాణం ప్రారంభించడం ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఏ పార్టీలకు ఎంత సంఖ్యాబలం వుందన్న కాకిలెక్కలతో పొత్తులు పెట్టుకొని, ఎన్నికలకు వెళ్ళడం అన్నివేళలా సత్ఫలితాలను ఇవ్వదు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే కొత్తగా వోటు బ్యాంకు కలసి రాకపోగా, ఆంధ్రుల ఆత్మగౌరవం అన్న నినాదాన్ని తుంగలో తొక్కినందుకు మొదటికే మోసం వచ్చే ప్రమాదం వుంది. పూటకో సిద్ధాంతం, రోజుకో పార్టీతో స్నేహ సంబంధాలను ప్రజలు అసలు ఏమాత్రం హర్షించరు. శత్రువులతో దోస్తీ నెరపడం కంటే సొంత బలం మీద పోటీ చేయడం తెలుగుదేశం పార్టీకి అన్నివిధాలా శ్రేయస్కరం. సిద్ధాంతాల ప్రాతిపదికపై నిలబడే పార్టీలకే ఈ దేశంలో మనుగడ వుంటుందని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం