S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహాకూటమికి అప్పుడే గండి!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతిపక్షం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మహాకూటమికి గండి పడింది. మహాకూటమిలో అత్యంత కీలకపాత్ర నిర్వహించవలసిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుని కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ ఇష్టపడనందుకే తానీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లు మాయావతి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి స్వంత పార్టీ పెట్టుకున్న అజిత్ జోగితో మాయావతి సీట్ల సర్దుబాటు చేసుకున్నది. డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్న చత్తీస్‌గఢ్ శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య తొంభై కాగా బీఎస్పీ 35 సీట్లలో పోటీ చేస్తే, అజిత్ జోగి నాయకత్వంలోని జనతా కాంగ్రెస్ 55 సీట్లలో పోటీ చేస్తుంది. తమ కూటమికి మెజారిటీ లభిస్తే అజిత్ జోగి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, అతనికి తమ పార్టీ అన్ని విధాల తోడ్పడుతుందని మాయావతి ప్రకటించారు. 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 49, కాంగ్రెస్ 39 సీట్లు గెలిస్తే బీఎస్పీ ఒకటి, ఇండిపెండెంట్ ఒక సీట్లు గెలుచుకున్నారు. బీజేపీకి 41 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్‌కు 40.3 శాతం ఓట్లు పడ్డాయి. బీఎస్పీకి పోలైన ఓట్ల శాతం 4.3 మాత్రమే. ఇప్పుడు జనతా కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటీచేస్తే రెండు పార్టీల కూటమి కనీసం ఆరు శాతం ఓట్లు సంపాదిస్తాయని అంటున్నారు. అజిత్ జోగి నాయకత్వంలోని జనతా కాంగ్రెస్, బీఎస్పీ ప్రధానంగా ప్రతిపక్షాల ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లు చీలుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బీజేపీ మరోసారి అధికారంలోకి రావటం ఖాయమనే మాట వినిపిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో తమకు 15 సీట్లు కేటాయిస్తేనే పొత్తు పెట్టుకుంటామంటూ మాయావతి పంపించిన ప్రతిపాదనకు కాంగ్రెస్ నుండి ఎలాంటి స్పందన రానందుకే ఆమె అజిత్ జోగి నాయకత్వంలోని జనతా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకున్నది. ఇక మధ్యప్రదేశ్‌లోనూ సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్, బీఎస్పీ మధ్య అవగాహన కుదిరే సూచనలు కనిపించటం లేదు. మధ్యప్రదేశ్ శాసనసభలో 230 సీట్లున్నాయి. బీఎస్పీ తమకు 50 సీట్లు కేటాయిస్తేనే పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్‌కు స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అన్ని సీట్లు కేటాయించేందుకు సుముఖంగా లేదు. బీఎస్పీకి 20 లేదా 22 సీట్లు ఇవ్వగలుగుతామంటూ కాంగ్రెస్ చేసిన సూచనను మాయావతి తిరస్కరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44.88 శాతం ఓట్లతో 165 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ 36.38 శాతం ఓట్లతో 58 సీట్లు గెలుచుకున్నది. బీఎస్పీ 6.29 శాతం ఓట్లతో నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్నది. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన బీఎస్పీకి ఇప్పుడు యాభై సీట్లు ఎలా ఇస్తామని కాంగ్రె స్ నాయకులు అంటున్నారు. మాయావతి 20 సీట్ల తో సంతృప్తి చెందటం ఇరుపక్షాలకు మంచిదంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదనతో మాయావతి ఏకీభవించడం లేదు. ఇదిలాఉంటే మధ్యప్రదేశ్‌తోపాటు రాజస్థాన్‌లో సీట్ల సర్దుబాటు చేసుకోవాలంటూ మాయావతి చేస్తున్న వాదన కాంగ్రెస్ నా యకులకు ఎంతమాత్రం రుచించటం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీట్ల సర్దుబాటు విడివిడిగా జరగాలేతప్ప రెండింటిని కలిపి చేయటం సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రాజస్థాన్‌లో తాము ఓంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ వాదనతో ఏకీభవించని మాయావతి అక్కడ సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేయాలని ఆలోచిస్తోంది.