S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆర్.ఎం.ఎస్. భోగీలో దాక్కొని...

ఏదైనా పడ్డప్పుడు కష్టమే కావొచ్చును కాని - వయసు మళ్లినాక బాల్య స్మృతులు నెమరు వేసుకుంటూ వుంటే భలేగా ఉంటుంది. ‘సరంగు’ తాతయ్య గుర్తొస్తున్నాడు. 1948 నాటి సంగతి. వైజాగ్ పోర్ట్ సహజ రేవు పట్నం అని సోషల్ పుస్తకం చెబుతుంది. నాటికి ఔటర్ హార్బర్‌లో దూరంగా పెద్ద ఓడలు ఆగితే, చిన్నచిన్న పడవలు పోయి సరుకులు దించి ఒడ్డుకు చేర్చేవి. ఈ పడవల్ని నడిపేది ‘సరంగు’లు. ఎక్కువగా మత్స్యకారులదే సరంగులలో డామినేషన్. తాతయ్య అటువంటి సరుకుల పడవ వాడు. మా మేనమామలు ఫ్లాప్ షోగా 1948లో నడిపిన సుందర్ ట్రేడింగ్ కంపెనీ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లోకి తన ఉద్యోగ విరమణ అయినాక తాతయ్య ఈ షాప్‌లోకి వచ్చాడు. నారాయణ బాబూ అంటూ - మా పెద్ద మామయ్యని ఏవో రేవు పాలిటిక్స్ చెబుతూ కాలక్షేపం చేస్తూ వుండేవాడు. అతను ఈ కృష్ణుడికి ఫ్రెండ్. అది ఎట్లనినన్.. టైఫాయిడ్ జ్వరం తరువాత ఇంకా నేను మేనమామల కొంపలలోనే దిగడిపోయి ఉన్నానుగా.. వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు. మా అమ్మ ఒకత్తే - అప్పచెల్లెలు. యలమంచిలిలో మా అమ్మని మా పెద్ద మామయ్య - పొలాల్లోకి సరదాగా ఎత్తుకుని పోయి ఆడిస్తూ, ఓ గేదె మీద కూర్చోబెట్టి షైరు చేయించేవాడుట. అంత ముద్దుగాను మా మేనమామలు నన్ను కూడ చూసుకుంటారని - పిచ్చిపిల్ల మా అమ్మ నమ్మకం. కాని, వాళ్లు అప్పుడు యమ బిజీ. మా పెద్ద మామయ్య జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ - వైజాగ్ పోర్ట్ లేబర్ యూనియన్ సెక్రటరీట. అది కూడా వివి గిరి గారి హయాంలో. వైస్ ప్రెసిడెంటు.. ఆ తరువాత ప్రెసిడెంటు అయిన గిరిగారు మా మామయ్యలకి శ్రేయోభిలాషి. మా సుబ్బారావు మామయ్య - పోర్ట్‌లోనే కలాసి నుంచి క్రేన్ ఆపరేటర్ హెల్పర్‌గా పెరిగాడు. కాని వీళ్లు ఇద్దరూ - ఒకరు పర్మినెంటుగ మరొకరు దీర్ఘకాల సెలవు మీద ఉద్యోగాలు వొగ్గేసి- ఓ పెద్ద -ఈనాటి మాల్ లాంటి - దుకాణం పెట్టి లక్షలు లక్షలు రూపాయలు ఆర్జించాలనుకున్నారు. ఇక్కడ కొంచెం ‘టోపోగ్రఫీ’ - అంటే స్థల పురాణం చెప్పకపోతే మీకు దృశ్యం పొడగట్టదు. ఆనాటి ‘వైజాగ్’కి మెయిన్‌రోడ్డు ఒక్కటే - జగన్నాథ స్వామి కోవెల దాని మీద అప్పటి కొత్త రోడ్డుకి పక్కన వుండేది. ఏటా రథయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమై ఇదే మెయిన్ రోడ్డు మీద వున్న గుజ్జనగుడులకి చేరుకుంటుంది. అక్కడ మొండి చేతుల స్వామీ ఓ వారం రోజులు సుభద్ర బలభద్రుల సమేతంగా కాలక్షేపం చేశాక ‘రిట్రీట్’ - మలి రథయాత్రగా స్వామి తన గుడికి చేరుకుంటాడు. బహుశా ఈ సంబరాలే శ్రీశ్రీకి వస్తున్నై వస్తున్నై జగన్నాథ జగన్నాథ రథ చక్రాల్ అంటూ ఫిరంగులు పేల్చడానికి ప్రేరణ ఇచ్చాయేమో ‘తెల్దు’. అన్నట్లు అసలు విషయం సుందర్ ట్రేడింగ్ అను సూపర్ మార్కెట్ కదూ?! ఈ గుజ్జన్ గుడుల గుట్టకి ఎదురుగానే మామాసురుల దుకాణ సముదాయం. చెప్పుల దగ్గర్నుంచి - ఎలక్ట్రిక్ పంఖాల దాకా ఏది కావాలన్నా ఇక్కడ లభించును అన్నది - నినాదం. అక్కడ దింపేశారు నన్ను ఆడుకోవడానికి. షో కేసులు సర్దడం.. సబ్బులతో పిరమిడ్లు పేర్చడం.. షాప్ బాయ్ జగన్నాథం మీద రుబాబు చెయ్యడం - తాతయ్య - ఎల్లయ్యలు చెప్పే కబుర్లు వినడం, కస్టమర్లకి మర్యాద చెయ్యడం వగైరా నా నిత్యకృత్యాలు. ఆనక ఈ ఎల్లయ్యే - ఎల్లాజిరావు అయినాడు మునిసిపల్ కౌన్సిలర్ కూడ అయి పెద్ద కాంగ్రెస్ నాయకుడిగా మారిపోయాడు. నేను యూనివర్సిటీలో చేరాక ఓసారి మెయిన్ రోడ్డు మీద కలిశాడు. అది అట్లుండనిండు. ఎనిమిది ఏండ్ల బాలుడైన అమ్మాయిగారి కృష్ణుడికి - తనకి చదువుకొనే యోగం లేదేమో?నన్న భయం. అమ్మ మీద నాన్నగారి మీదా బెంగా మొదలైనాయి. నిజం చెప్పొద్దూ? మా ‘వించిపేట’కి ‘కాశీపట్నం సూడర బాబో’ పెట్టె వచ్చేది. ఓ ‘కాని’ ఇస్తే - నెత్తి మీద గుడ్డ కప్పేసి - రంగురంగుల సినరీలు మేడలు సముద్రాలు అవీ చూపెట్టేవాడు. అల్లాంటి భావన ఏదో ఇక్కడ ఈ షాపుల రోడ్లు - శకటాలు - జంగిడీల వాళ్లు గట్రా చూస్తూ వుంటే.. కలిగేది. పెద్ద మామయ్యా బిజీ చిన్న మామయ్య యాపారంలో ఫుల్ బిజీ. ఎవడ్ని అడగాలి? సొతంత్రం వొచ్చింది అంటూ జెండాలు ఎగరేశారు. టంగుటూరి సూర్యకుమారి పాటలు - సినిమా పాటలు అవీ ‘బాకా’ల్లో పెట్టారు.. అందులో ఓ పాట జ్ఞాపకం ఉంది. అది ఇది. ‘రావే రావే బంగారు పాపా! ఆడుతూ దోగాడుతూ..’ ఈ పాట వినేసరికి అమ్మ దగ్గరికి పారిపోదామనిపించింది.
తాతయ్య కారాకిల్లీ దట్టించి గీరగా మాట్లాడేవాడు. తెల్ల లుంగీ - తెల్ల జుబ్బా ధరించి ‘పెద్దమనిషి’గా సభ్య లోకంలో గౌరవం మర్యాద పొందేలాగా ప్రవర్తించే ప్రయత్నం చేసేవాడు. ‘ఏడవ బాక పోంతులు బాబూ..’ అని ఓదార్చేడొక్కోసారి. ఆ సరంగు తాతయ్యే నన్ను ‘రేవు దాటించాడు’.. జాలిపడి కాదు.. సాహసం నేర్పి నన్ను అమ్మ దగ్గరికి వెళ్లిపోయేలాగ ప్రోత్సహించాడు. (ఆ రోజుల్లో కార్డు ముక్క లేదా కాకి కబురు తప్ప - కమ్యూనికేషన్ సదుపాయాలూ గట్రా లేవు) ఉత్తరాలన్నీ మెయిల్‌లోనే మూటలుగా ఎక్కి వేరే బోగీలో సార్ట్‌ఐ ఊరూరికి చేరేవి. అందుకే హౌరా నుంచి కలకత్తా దాకా పరిగెత్తే ఆ రైలుని ‘మెయిల్’ అన్నారు. అందులో పనిచేసే క్లర్కుకి నన్ను అప్పగించారు బెజవాడలో దిగిపోయే డ్యూటీ అతనిది. గుజ్జన్న గుళ్లకి వాల్తేరు స్టేషన్ దూరమే. నన్ను తన సైకిల్ మీద తీసుకుని పోయి ఆ క్లర్క్ ఉత్తరాల మూటల మధ్య కూర్చోబెట్టాడు. అంతలో చెకింగ్ స్ట్ఫా ఎక్కారు. నన్ను బల్ల క్రిందికి తోసేశారు ‘స్టార్టర్’ ఫ్రెండ్స్. కలుగులో ఎలకనే అయ్యాను. పిల్లిని చూసిన ఎలుకలాగా ముడుచుకు పోయాను.. భయంతో వణికాను.
బెజవాడలో మా రాంగోపాల చౌల్ట్రీ గురించి లోగడ చెప్పానుగా- ఆ సత్రం వీధిలో పోస్టల్ శాఖ వారి ‘రెస్ట్‌రూమ్’ ఉంది. అక్కడ వదిలేశాడు మా పోస్ట్ ‘మామయ్యా...’ మా ఇల్లు అక్కడికి చాలా దగ్గరే. నేను ఇంటికి పరుగు తీశాను. అమ్మ అచ్చెరువు చెందుతూ ఎదురొచ్చింది. ఆమె కాళ్లకు చుట్టుకుని ‘అక్కుల్లు బుక్కుల్లు’గా ఏడ్చేశాను.. తనూ నన్ను అక్కున అదుముకుని ఏడుపు మొదలెట్టింది.. తరువాత కథ..? (ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com