S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెరతీయగ రాదా!

ఎన్నిసార్లు మనం స్నానం చేసినా మళ్లీ మరునాటికి సహజంగానే శరీరం మలినం కావటం తప్పదు. వేసుకున్న దుస్తులైనా కాస్సేపటికి మురికవటం ఖాయం.
మనం వాడే వస్తువులైనా సరే ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోకపోతే మకిలితో మలినమై పోతాయి. కంటికి కనిపిస్తాయి కాబట్టి శుభ్రపరచుకో గలుగుతున్నాం, సరే.
మరి కంటికి కనిపించకుండా ఒక ఆట ఆడించే ‘మనసు’ సంగతేమిటి? బాహ్య ప్రపంచంలో పవిత్రత వేరు. అంతరంగం శుద్ధంగా ఉండటం వేరు.
ఇదే పెద్ద సమస్య. చిరునవ్వు లొలికిస్తూ పైకి ఒకటి మాట్లాడతారు. నమ్ముతాం.
కానీ అంతరంగమంతా విషమయమే అయితే దిక్కెవ్వరు? దేవుడే దిక్కు. మరో గత్యంతరం లేదు.
మహాయోగులూ, ఋషులు సైతం ఈ మనస్సు చేసే ‘మాయలు’ తెలిసినవారే. ముక్కు మూసుకుని జీవితాన్ని తపోనిష్టలోనే గడిపేశారు. ‘మాయ’ స్వరూపం ఎలా ఉంటుందో వాళ్లకు తెలుసు. ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధీ, అంతకు మించి ఆత్మ అంతస్తుల ప్రకారం మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తూంటాయి.
కనిపించకుండా తిరిగేది ఆత్మ. దీన్ని పట్టుకోవటానికి ఏర్పడ్డ సాధనాలే, మనస్సు, బుద్ధీను.
చిక్కంతా ఈ మనస్సు మీదే ఆధారపడి ఉంది చూడండి.
మనిషిలో అజ్ఞానమనే చీకటి పొర అంత తేలికగా వదలదు. అందుకే మనస్సును స్వాధీనపరచుకున్న వాడి కంటే విజేత ప్రపంచంలో మరొకడుండడు.’
మాయ సృష్టికి మాయా సంకేతాలే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్రాలు. కంటికి ఇవి కనిపించని పరికరాలు. మనసు వెంట పరుగెత్తించేవి ఇవే.
ఏది మంచిదో, ఏది కాదో బుద్ధిని అడిగి తెలుసుకుని నడవటం బుద్ధిమంతుడి లక్షణం. అందుకే మనోబుద్ధి అహంకారాలు చేసే మాయ తెలిసిన త్యాగరాజు లోకరీతులు, లోక మర్యాదలు, మనుషుల బలహీనతలూ బాగా తెలిసినవాడే కాబట్టి తన ‘మనోరాజ్యాన్ని’ తానే నిర్మించుకున్నాడు. ఎంతైనా ఆయన కూడా మనిషేగా? మనిషి అనుభవించే మానసిక అవస్థలన్నీ ఆయన కూడా అనుభవించినవాడే.
మనసును సంబోధిస్తూ సాగిన కీర్తనలే ఇందుకు సాక్ష్యం. ఏమనుభవించాడో ఏమో తెలియదు కానీ,
‘కలిలో రాజస తామస గుణాలు పుష్కలంగా వుండే మనుషులతో తిరుగుతూ కాలక్షేపం చేయకుండా బిచ్చమెత్తి అడుక్కునే వాడిలా దైవాన్ని నిత్యం స్మరిస్తే చాలు. బ్రతుకు ధన్యవౌతుందని చెప్తూ చెవిని ఇల్లు గట్టుకుని’ చెప్పాడు. ఎన్నో కీర్తనలు పాడుకున్నాడు. అంతేకాదు. ఆ క్షేత్రం, ఈ క్షేత్రమంటూ తిరక్కుండా గుట్టుగా ఇంటి పట్టున ఉండి నీ హృదయంలోనే నెలకొన్న పరమాత్మను స్మరిస్తే చాలదా? సర్వతీర్థాలూ (కోటి నదులు ధనుష్కోటిలో) ధనుష్కోటి క్షేత్రంలోనే వున్నాయిగా నాయనా? ఎందుకు తిరుగుతావన్నాడు.
‘్ధ్యనమే వరగంగా స్నాన’మని చెప్పాడు. ‘్ధనుష్కోటి’ అంటే రెండు కనుబొమ్మలూ కలిసే చోటు. అంటే నాసికా స్థానం అని మరో అర్థం. పరమాత్మ అక్కడే ఉన్నాడని నమ్మిన మహాయోగులు చేసే ధ్యానం అక్కడే. వినటానికేం? భేషుగ్గా వినవచ్చు. కానీ ఆచరణే పెద్ద సమస్య. మనస్సు నిలకడగా లేకుండా ఊరికే పక్కన గంపల కొద్దీ పుష్పాలతో పూజ చేస్తే ఏమిటి ప్రయోజనం? ఎన్ని తీర్థాలు సేవించినా ఎన్ని నదుల్లో మునిగినా స్వభావం మారకపోతే బూడిదలో పోసిన పన్నీరే. (‘మనసు నిల్ప శక్తి లేకపోతే’ అనే కీర్తన) అని చెప్పీ చెప్పీ అలా నానా తిప్పలూ పెట్టే మనసును నియంత్రించుకోలేక, మనలాగే త్యాగయ్య కూడా ‘పుణ్యక్షేత్రాలు తిరగవలసిన అవసరం కూడా ఏర్పడింది. పుణ్య పురుషుడు కాబట్టి ఆయన దర్శనంతో ఆయా క్షేత్రాలకే పవిత్రత సిద్ధించింది.
దర్శించిన ప్రతి క్షేత్రంలోనూ కూర్చుని కీర్తనలు చేసి, ఆయా క్షేత్ర దేవతలను స్తుతించాడు.
తనివి తీరా పాడుకున్నాడు. మహాభక్తులకూ మనకూ తేడా అదే. భక్త్భివంతోనే పుణ్యక్షేత్రాలను దర్శించి స్వరార్చన చేసి వాళ్లు పాడుకుని తృప్తిపడ్డారు. మనం తీర్థ ప్రసాదాలతోనే తృప్తిపడి ఇళ్లకు చేరుకుంటాం. వారి స్థితికి చేరుకోవటం సామాన్య విషయం కాదు. నాదమే ఊపిరిగా జీవించి, ఊపిరి వున్నంతవరకూ రాముణ్ణే కీర్తించిన త్యాగరాజు పాడుకున్న కొన్ని కీర్తనలు ఆయన మానసిక స్థితికి సాక్ష్యంగా నిలిచినవే. అటువంటిదే గౌళీపంతు రాగంలోని ‘తెర తీయగ రాదా’ అనే కీర్తన.
సంగీత సాహిత్య కోవిదుడైన త్యాగయ్యను ఉపనిషద్బ్రహ్మేంద్రుల వారు ఓ రోజు కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. శిష్యుల్ని వెంటబెట్టుకుని త్రోవలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి వేల్పులను దర్శించిన అనుభవంతో కీర్తనలు రచించి పాడుకున్నాడు.
కోవూరు, పుత్తూరు, నాగులాపురం, వాలాజీపేట, శ్రీరంగం, నాగపట్టణం తపస్థీర్థం, ఘటికాచలం.. మొదలైన క్షేత్రాల్లో రచించిన కీర్తనలన్నీ ఒక ఎతె్తైతే, తిరుపతిలో స్వామి వారిని దర్శించుకున్నప్పుడు పాడిన కీర్తన మరో ఎత్తు. అదో చారిత్రాత్మక సన్నివేశం.
‘తెర తీయగ రాదా నాలోని/ తిరుపతి వెంకట రమణ మత్సరమను ॥
పరమ పురుష ధర్మాది మోక్షముల
పారద్రోలుచు న్నది నాలోని ॥
మత్స్యమాకవి గొని గాలముచే/ మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీప సన్నిధిని మరు
గడ్డపడి చెర చినయట్లున్నది ॥
గురయని తెలియక, మృగ గుణములు
వచ్చి తగులురీతి యున్నది
వేగమె నీ మతము ననుసరించిన
త్యాగరాజ నుత మద మత్సరమను ॥
కోవూరు సుందరేశ్వరుణ్ణి చూసి, తిరుపతికి చేరుకున్న త్యాగయ్యకు వెంటనే దర్శనం కాలేదు.
ఆలయంలో ప్రవేశించగానే అర్చకులు తెర వేసి వెళ్లిపోయారు. నిరుత్సాహంతో చింతాక్రాంతుడైన త్యాగయ్య, ‘స్వామీ! నాలో వున్న దోషాలను తొలగించు. లౌకిక ప్రపంచంలో బతుకుతున్నాను. మత్సరమనే తెర అడ్డుగా వుండి, సత్యం బోధపడకుండా పోతోంది. నాలోవున్న కామక్రోధాలతో బాటు మద మాత్సర్యాలను కూడా తొలగించి నీ దర్శనమివ్వవయ్యా!’ అని ప్రార్థించాడు.
జాలరులను చూడండి. గాలానికి ఎరను తగిల్చి నీటిలో వదుల్తారు. వెర్రిమొహంతో ఆకలిగా వున్న చేప ఆ గాలానికి టక్కున తగులుకుంటుంది. ‘మాయ’ అని దానికేం తెలుసు? దీపానికి అడ్డంగా ఏదో వస్తువుంటే అది కాస్తా అడ్డమై కూర్చుంటే కనిపించేదెలా? భోజనం చేద్దామని కూర్చుంటే ఈగ పడితే ఎలా? ‘వల’ అని గమనించలేని నిస్సహాయ స్థితిలో లేళ్ల గుంపు వాటంతటవే వచ్చి అందులో ఇరుక్కుపోయినట్లుగా వుంది తన స్థితి! అంటాడు త్యాగయ్య.
మనం కోరి తెచ్చుకున్న సంసార లంపటాలన్నీ పెద్ద మాయ’ అని తెలిసినా తప్పించుకోలేని స్థితిలో ఎలా తిరుగుతున్నాం? కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనే ఆరు శత్రువులతో పోరాడలేక చతికిలపడి కూర్చుంటున్నాం. త్యాగరాజు అనుభవించిన స్థితి కూడా ఇదే.
కర్ణాటక సంగీత కచేరీలు జరిగే వేదికపై సాధారణంగా ప్రధాన గాత్ర విద్వాంసుడికి వయొలిన్, మృదంగం, కంజిరా, లేదా ఘటం, మోర్సింగ్ లాటి సహకార వాద్యాలుంటాయి.
సాహిత్యం కంటే సంగీతంపైనే దృష్టి వుంటే కీర్తనల అంతరార్థం శ్రోతలకు తెలియకుండా పోయే ప్రమాదమముంది.
వెనకటి తరంలో మహావిద్వాంసులకు సహకారమందించిన ప్రక్కవాద్య విద్వాంసులు సాహిత్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాయించేవారు.
పాడే ప్రతి మాటా విని, ఆ మాట చుట్టూ అల్లుకున్న సంగీత వరుసకు తగినట్లుగానే ఎంతో అణకువతో గమనించి వాయించేవారు.
పళని సుబ్రహ్మణ్య పిళ్లై, దక్షిణామూర్తి, పాల్ఘాట్ మణిఅయ్యర్ లాంటి అలనాటి పెద్దపెద్ద విద్వాంసులకు కీర్తనలను అనుసరించటమే లక్ష్యంగా భావించేవారు. కచేరీ మధ్యలో అవకాశం రాగానే వ్యక్తిగతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి అభినందన లందుకునేవారు. మృదంగ విద్వాంసులకు తాళమే ప్రధానమైనా భావంలో లయ వుంటుంది. శృతికీ లయ ఉంటుంది. ఆధారషడ్జమైన శృతిలో ఏయే స్వరాలు ఏయే స్థానాల్లో పుట్తాయో దాన్ని దాటిపోకుండా, అన్నీ అందులోనే లయమవ్వటం ‘శృతిలయం’. నిశ్చలంగా నిర్మలంగా మొదటి నుంచి చివరి దాకా ‘లయ’ను పాటిస్తూ పాడటమే తాళంలో ‘లయం’. ఇవన్నీ అనుభవంతోనూ, సంస్కారంతోనూ అలవడవలసినవే.
సంఖ్యామాత్ర ప్రధానమైన గానానికి మృదంగం ఎంతో సొగసుగా వినిపించినప్పుడే సాహిత్యం చెవికి చేరుతుంది. సొగసుగా మృదంగ వాద్యం వాయించ గలిగినవారు కొందరే. చిత్ర విచిత్ర ధ్వని విన్యాసాలతో, విరుపులతో సాహిత్యాన్ని అప్రధానం చేస్తే ఏ పాటలోని సాహిత్యమైనా నిరర్థకమై కూర్చుంటుంది. దీనికీ సంస్కారముండాలి. బకాసురుడులా నాదఘోషతో మాటలేమీ వినబడకుండా మాటలను మింగేసి వీరావేశంతో ఢమఢమ ధ్వనులతో సాగే మృదంగ వాద్య విన్యాసాలు ఎవరిని ఉద్ధరిస్తాయి? సాహిత్యాన్ని మింగేసే పాట ఎవరి కోసం?
ఎందుకా పాట? నిగూఢమైన అర్థంతో లోకరీతులను అర్థం చేసుకుంటూ తనను తాను విమర్శించుకుంటూ పాడుకున్న త్యాగరాజు సాహిత్యంతో కూడిన సంగీతమే ప్రధానమై నిలవాలి. మనో మాలిన్యాన్ని కడిగేది సాహిత్యమే. ధ్వని కాదు. అప్పుడే ‘ఆయన ఆత్మవిచారం లోకవిదితవౌతుంది - సంగీతమొక్కటే కాదు. కర్ణాటక సంగీతం, కర్ణపేయంగా వినబడాలంటే సాహిత్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలి. లయ వాద్య ఘోషతో తాళగతమైన విన్యాసాలు ఆ కాస్సేపూ బాగుండవచ్చు.
కానీ శాశ్వతానందాన్నిచ్చే ఆలోచనామృతమైన సాహిత్యం బాపతు అనుభూతి నివ్వలేవు.
సంగీత కళానిధి డా.బాలమురళీ కృష్ణకు ఖ్యాతి లభించడానికి ఎన్నో కారణాలున్నాయి. ఒక కారణం- ఆయన సాహిత్యానికిచ్చే ప్రాధాన్యత. ప్రక్కవాద్యాలు పొరబాటున కూడా ఆయన పాటను అధిగమించిన సందర్భాలు చాలా అరుదు. మీరు గమనించే వుంటారు. ‘మృదంగ వాద్యమని’ పేరు చెప్పి ఉరుములు మెరుపులతో కరకర లాడే ధ్వనులతో హోరెత్తించగల ఎందరో ఉద్ధండులు సైతం ఆయన గానానికీ, పాడే పాటలోని సాహిత్యానికీ లొంగిపోయి ఒదిగిపోయి కూర్చోవటం సంగీత రసికులకు అనుభవమే.

- మల్లాది సూరిబాబు 90527 65490