S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 97 మీరే డిటెక్టివ్

సీతకి పర్వతాల అందాన్ని చూపించాక రాముడు మంగళకరమైన నీళ్లతో నిండిన అందమైన మందాకినీ నదిని ఆమెకి చూపించాడు. పద్మాల్లాంటి కళ్లు గల రాముడు అందమైన కటి ప్రదేశం, చంద్రుడి లాంటి ముఖం గల వైదేహితో చెప్పాడు.
‘విచిత్రమైన ఇసుక తినె్నలతో, హంసలతో, పద్మాలతో, సారస పక్షులతో నిండిన అందమైన ఈ మందాకినీ నదిని చూడు. ఈ నదీ తీరాల మీద అనేక రకాల పూలు, పళ్ల చెట్లు ఉండడంతో సౌగంధికా సరస్సులా మెరిసిపోతోంది. దీని రేవుల్లో దిగిన లేళ్ల గుంపులు ఇప్పుడే నీళ్లు తాగడంతో నీళ్లు మురికిగా ఉన్నాయి. చూడటానికి ఇదంతా ఆనందంగా ఉంది. ప్రియా! జటలు, కృష్ణాజినం ధరించి, నార చీరలని ఉత్తరీయంగా వేసుకున్న మునులు సంధ్యాకాలంలో ఈ మందాకినీ నదిలో స్నానం చేస్తున్నారు. విశాలమైన కళ్లు గల సీతా! తీవ్రమైన నియమాలు గల మరి కొందరు మునులు చేతులు పైకెత్తి సూర్యుడ్ని ఉపాసిస్తున్నారు. గాలి వల్ల చెట్ల పైభాగాల్లోని పువ్వులు, ఆకులు నది చుట్టూ రాలుతూ ఈ పర్వతం నాట్యం చేస్తున్నట్లుంది. ఈ మందాకినీ నదిలో కొన్ని చోట్ల మణుల్లా నిర్మలమైన నీరుంది. కొన్ని చోట్ల ఇసుక తినె్నలున్నాయి. మరి కొన్ని చోట్ల సిద్ధులున్నారు. చూడు, గాలి ఎగరగొట్టడంతో పూల గుత్తులు కొన్ని చోట్ల ఎక్కువగా పడుతున్నాయి. మరి కొన్ని పూల గుత్తులు నీళ్లలో పడి తేలుతున్నాయి చూడు. సీతా! మధురమైన ధ్వనులు చేసే చిలుకలు శుభప్రదంగా కూస్తూ ఆ పూల రాసుల మీద ఎక్కుతున్నాయి. నువ్వు పక్కన ఉండగా ఈ చిత్రకూటాన్ని, మందాకినీ నదినీ చూడటం మిథిలలో ఉండటంకన్నా ఆనందంగా ఉంది. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, శాంతి కలిగిన సిద్ధులు పాపాలని తొలగిస్తూ ఎల్లప్పుడూ ప్రవేశించి స్నానం చేయడంతో కల్లోలమైన నీరు గల ఈ మందాకినీ నదిలో నాతో కూడా దిగు. అందమైన ఓ సీతా! ఎర్రని, తెల్లని పద్మాలు నీటిలో ముణిగేట్లు చేస్తూ స్నేహితురాల్లా మందాకినీ నదిలోకి వెళ్లు. అడవిలోని మృగాలని పౌరులుగాను, ఈ చిత్రకూట పర్వతాన్ని అయోధ్యగాను, మందాకినీ నదిని సరయూ నది గాను భావించు. నా ఆజ్ఞని పాటించే ధర్మాత్ముడైన లక్ష్మణుడు, నాకు అనుకూలురాలివైన నువ్వూ నాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. నీతో కలిసి నివసిస్తూ మూడు కాలాల్లో స్నానం చేస్తూ, తేనె, దుంపలు, ఫలాలు తినే నాకు అయోధ్య మీద కాని, రాజ్యం మీద కాని ఆసక్తి లేదు. అందమైన ఈ మందాకినీ నది లేళ్ల గుంపులతో ప్రకాశిస్తోంది. ఏనుగులు, సింహాలు, కోతులు, లేళ్లు, పులులు దీని నీటిని తాగుతున్నాయి. చక్కగా పుష్పించిన చెట్ల నించి రాలిన పూల రాసులతో అలంకరించబడి ఉన్న ఈ నదిని చేరి, శ్రమ తొలగి సంతోషించని వాడు ఉండడు.’
రఘువంశాన్ని వృద్ధి పొందించే రాముడు మందాకినీ నది గురించి ఈ విధంగా, చక్కగా వర్ణించి చెప్తూ, ప్రియురాలితో కలిసి కాటుక కాంతి వంటి కాంతి గల ఆ చిత్రకూట పర్వతం మీద విహరించాడు. (అయోధ్య కాండ 95 సర్గ)
రాముడు ఇలా సీతకి మందాకినీ నదిని చూపించి ఆమెని అనునయించి మాంసం తినిపిస్తూ పర్వత శిఖరం మీద కూర్చున్నాడు. ధర్మాత్ముడైన రాముడు ‘ఈ మాంసం పరిశుద్ధమైంది. ఇది రుచిగా ఉంది. ఇది బాగా కాలింది’ అని చెప్తూ సీతతో కలిసి అక్కడే ఉన్నాడు.
రాముడు అలా కూర్చుని ఉండగానే అక్కడికి భరతుడు రావడంతో, సేనల వల్ల చెలరేగిన దుమ్ము, శబ్దాలు ఆకాశాన్ని తాకాయి. దాంతో గుంపు నాయకులైన మదించిన ఏనుగులు మొదలైన మృగాలు ఆ మహాధ్వనికి భయపడి, బాధపడి తమ గుంపులతో కలిసి అక్కడ నించి నాలుగు దిక్కులకి పారిపోసాగాయి. రాముడు ఆ శబ్దాలని విని, పారిపోయే మృగాలని చూసి, మహాతేజశాలైన సుమిత్ర కొడుకు లక్ష్మణుడితో చెప్పాడు.
‘లక్ష్మణా! ఏమిటిది? ఆశ్చర్యం. భయంకరమైన మేఘాల గర్జన లాంటి గంభీరమైన ధ్వని ఇక్కడికి వినిపిస్తోంది. అదేమిటో చూడు. అడవిలోని ఏనుగుల గుంపులు, మహావనంలోని ఎద్దులు, లేళ్లు, సింహాలు భయపడి నాలుగు వైపులకీ పారిపోతున్నాయి. ఎవరైనా రాజు కాని, రాజకుమారుడు కాని వేటాడటానికి వచ్చాడా? లేదా ఏదైనా క్రూరమృగం అడవిలోకి వచ్చిందా? తెలుసుకో. ఈ పర్వతం మీద పక్షులు సంచరించడం కూడా కష్టంగా ఉంది. అందువల్ల ఈ శబ్దం వివరాలు తెలుసుకో.’
లక్ష్మణుడు వేగంగా పూలతో నిండిన ఓ వృక్షాన్ని ఎక్కి నాలుగు దిక్కులూ పరికిస్తూ తూర్పు దిక్కు వైపు చూశాడు. తర్వాత ఉత్తరం వైపు చూస్తూ అటు నించి రథాలతో, గుర్రాలు, ఏనుగులతో కిక్కిరిసిన సన్నద్ధులైన కాలి బంట్లు గల సేనని చూశాడు. గుర్రాలతో, ఏనుగులతో నిండి, రథాలపైన కట్టిన జెండాలతో కళకళలాడే సేన వస్తోందని రాముడికి చెప్పి మళ్లీ ఇలా చెప్పాడు.
‘నువ్వు నిప్పుని చల్లార్చి సీతని గుహలోకి పంపించి, ధనస్సుకి నారి కట్టు. కవచాన్ని ధరించి బాణాలని సిద్ధం చేయి’
‘లక్ష్మణా! సరిగ్గా చూడు. ఈ సేన ఎవరిది అనుకుంటున్నావు?’ రాముడు అడిగాడు.
ఆ సైన్యాన్ని అగ్ని కాల్చివేసినట్లు కాల్చేయదలచుకున్నాడా అన్నట్లుగా బాగా కోపంగా ఉన్న లక్ష్మణుడు రాముడికి జవాబు చెప్పాడు.
‘కైకేయి కొడుకైన భరతుడు రాజ్యాభిషిక్తుడై రాజ్యాన్ని నిష్కంటకం చేయాలనే కోరికతో మనిద్దర్నీ చంపడానికి వస్తున్నాడు. ఆ మహాసైన్యంలో రథం మీద చాలా గొప్పది, కాంతి గలది, విశాలమైన మాను గలదైన కోవిదార వృక్షం గుర్తుగా గల జెండా ఉంది. అశ్వికులు యధేచ్ఛగా, వేగంగా నడుస్తున్న గుర్రాల మీద ఆ జెండా వెంట వస్తున్నారు. ఏనుగుల్ని ఎక్కిన వీరులు సంతోషంగా ఉన్నారు. ఓ వీరుడా! మనిద్దరం ధనస్సులు ధరించి పర్వతం మీదకి ఎక్కుదాం. లేదా కవచాలు కట్టుకుని, ఆయుధాలు ధరించి ఇక్కడే ఉందాం. రామా! ఈ కోవిదార ధ్వజం యుద్ధంలో మనకి స్వాధీనమవుతుందా? నీకు, సీతకి, నాకు విచారం కలగడానికి మూల కారణమైన భరతుడ్ని చూడగలనా? ఎవరి వల్ల నువ్వు స్థిరమైన రాజ్యం నించి వెళ్లిపోయావో ఆ శత్రువైన భరతుడు వచ్చాడు. అతను నాకు చంపదగినవాడే. భరతుడ్ని చంపడంలో నాకు దోషమేమీ కనపడటంలేదు. భరతుడు ధర్మాన్ని వదిలేసి నీకు అపకారం చేసాడు. పూర్వం అపకారం చేసిన వాడిని చంపడం అధర్మం కాదు. అతన్ని చంపిన తర్వాత నువ్వు భూమినంతా పాలించు. రాజ్యం మీద కోరిక గల కైకేయి ఈనాడు నా చేత యుద్ధంలో చంపబడి ఏనుగు విరక్కొట్టిన చెట్టులా పడున్న కొడుకుని చూసి విచారించు గాక! బంధు పరివారంతో కూడిన కైకేయిని కూడా చంపేస్తాను. భూమి మీది పాపం నేటితో తొలగిపోవు గాక! రామా! మనకి జరిగిన అవమానాన్ని, అణచి ఉంచిన కోపాన్ని నేడు శత్రుసైన్యం పైన అగ్నిని డొంకల్లో వదిలినట్లు వదులుతాను. పదునైన బాణాలతో శత్రువుల శరీరాలని ఛేదించి, ఈ చిత్రకూట అడవిని రక్తంతో తడుపుతాను. నా బాణాలతో హృదయం చీల్చబడి ఉన్న శత్రు సైనికుల ఏనుగులు, గుర్రాలని క్రూర మృగాలు ఈడ్చుకు వెళ్లు గాక! ఈ మహారణ్యంలో భరతుడ్ని, అతని సైన్యాన్ని చంపి నేను నా ధనుర్బాణాల ఋణాన్ని నిస్సందేహంగా తీర్చుకుంటాను.’

(అయోధ్యకాండ 96 సర్గ)

ఆ రోజు ఆశే్లష తన దగ్గర ఉన్న అయోధ్యకాండలోని ఆ రెండు సర్గలని చూసుకుంటూ హరిదాసు చెప్పేది విన్నాడు. అతనికి హరిదాసు చెప్పిన దాంట్లో ఆరు తప్పులు కనిపించాయి. మీరు వాటిని కనుక్కోగలరా?
*

1.అయోధ్య కాండ 93వ సర్గలో 15వ శ్లోకం నించి చివరి దాకా హరిదాసు చెప్పాడు.
కాని 94వ సర్గ చెప్తున్నానని తప్పుగా చెప్పాడు.

2.కుందేళ్లు నెమళ్లు గురించి కాక ఒంటి మీద చుక్కలు ఉన్న లేళ్ల గురించే భరతుడు చెప్పాడు.

3.సైనికులకి కనపడింది పొగ. అగ్ని కాదు.

4భారతుడు సైనికులతో తను వెళ్తానన్నది కేవలం ఇద్దరితోనే. సుమంత్రుడు, వశిష్ఠుడు, శతృఘు్నడి పేరు భరతుడు చెప్పినట్లుగా హరిదాసు తప్పుగా చెప్పాడు.

5.రాముడు చిత్రకూట పర్వతాన్ని దేవేంద్రుడు శచీ దేవికి చూపించినట్లు చూపించాడు.
కాని హరిదాసు పొరపాటుగా స్వాహా దేవి అని చెప్పాడు.

*
మీకో ప్రశ్న

మందాకిని అంటే అర్థం ఏమిటి?

*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

కినె్నరలు ఏ రూపంలో ఉంటారు?
*
సగం మనిషి సగం గుర్రం ఆకారంలో ఉంటారు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి