S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాధ.. బోధ (కథ)

అది ఆ ఊరిలోకి వెళ్లే ప్రధాన రహదారి. ఊరి బయట ఆ రహదారిని ఆనుకుని ఉంది ఒక ఉన్నత పాఠశాల.
ఆ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు పవన్. పవన్ తెలివైనవాడే కానీ చదువుకంటే ఇతర విషయాల మీద ధ్యాస ఎక్కువ. స్కూలు ఎగ్గొట్టడం, అల్లరి, వెకిలితనం, కాలేజీకి వెళ్లే పిల్లలతో స్నేహం, రోడ్ల వెంట తిరగటం - ఇవీ ఆ పిల్లాడి లక్షణాలు.
తరగతిలో పాఠం వినడు. పక్కవాళ్లను విననీయడు. నోట్స్ రాయడు. ఎప్పుడూ పాఠశాల ముందున్న రోడ్డు మీద నిలబడి వచ్చేపోయేవాళ్లను చూస్తూ ఉంటాడు.
పవన్ అల్లరిని గురించి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరూ ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు పవన్ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాడు. పవన్ తన తల్లిదండ్రులను కూడా లెక్క చేయటం లేదని తేలింది. ప్రధానోపాధ్యాయుడు టి.సి ఇచ్చేస్తానని బెదిరించాడు. రెండు రోజులు కొంచెం అల్లరి తగ్గించాడు పవన్. తర్వాత మళ్లీ అదే అల్లరి.
ఈ మధ్యన పవన్ కొత్త అల్లరి మొదలు పెట్టాడు. పాస్‌బెల్ విరామంలో స్కూల్ నుండి బయటకు వెళ్తాడు. రోడ్డు పక్కనున్న చెట్టు పక్కన ఎవరికీ కనపడకుండా నిలబడి, అటుగా ఏదైనా వాహనం వస్తూండగా అక్కడున్న కుక్కనో, మేకనో రోడ్డు మీదకు తోలుతాడు. అది హఠాత్తుగా ఆ వాహనానికి అడ్డంగా వెళ్తుంది. ఆ వాహనదారుడు కంగారు పడుతుంటే పడీపడీ నవ్వుతాడు.
ఒకసారి పవన్ తోలిన కుక్క అడ్డం పడటంతో ఒక వాహనదారుడు తీసుకెళ్తున్న గుడ్లన్నీ పగిలిపోయాయి.
మరోసారి పవన్ తోలిన మేక అడ్డం పడటంతో ఒక వాహనదారుడు తన వాహనాన్ని కోడి మీదకు ఎక్కించాడు. కోడి యజమానికి అయిదొందలు కట్టాడు.
ఇంకోసారి పవన్ చేసే ఈ అల్లరికి ఒక వాహనదారుని కాలు బెణికింది. ప్యాంటు చిరిగిపోయింది.
పవన్‌తో చదివే శ్రీరామ్ అలా చేయటం మానమని రోజూ పవన్‌తో చెప్పేవాడు. పవన్ నవ్వి ఊరుకునేవాడు. శ్రీరామ్ చదువు, సంస్కారం కలిగిన మంచి విద్యార్థి.
ఒకరోజు పాస్‌బెల్ విరామంలో ఎప్పటిలాగా పవన్ పాఠశాల నుండి బయటకు వచ్చాడు. రోడ్డు పక్కనున్న చెట్టు చాటున నిలబడ్డాడు. అటుగా ఒక వాహనం వస్తూండటంతో అక్కడున్న కుక్కను రోడ్డు మీదకు తోలాడు. కుక్క రోడ్డు మీదకు వెళ్లకుండా పవన్ మీదకొచ్చి అతని కాలుని కరిచింది. అనుకోని ఈ సంఘటనకు పవన్ కంగారుగా రోడ్డు మీదకు పరుగెత్తాడు. అటుగా వస్తున్న వాహనాన్ని గుద్దుకుని కిందపడటంతో పవన్ చెయ్యి విరిగింది.
బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు, చేతికి కట్టు - నరక యాతన పడ్డాడు పవన్. నాలుగు రోజుల తర్వాత పాఠశాలకు వచ్చాడు. అందరూ అతన్ని చూసి నవ్వుతున్నారు. ‘బాగా జరిగింది’ అంటున్నారు. ‘అయ్యో పాపం!’ అని ఒక్కరూ జాలి తలచలేదు.
పవన్‌తోపాటు చదివే శ్రీరామ్ జ్వరం పడ్డాడు. అతను కూడా పవన్‌లాగా నాలుగు రోజుల తర్వాత అదే రోజు పాఠశాలకు వచ్చాడు. అతన్ని మాత్రం అందరూ పరామర్శించారు.
ఒక్కసారిగా తన మీద తనకే అసహ్యం వేసింది పవన్‌కు. ఒక మూలకు పోయి కూర్చుని చాలాసేపు ఏడ్చాడు. ఆ రోజు నుండి అల్లరి పూర్తిగా మానేశాడు. చదువులో పడ్డాడు.
పిల్లలూ! అంత బాధపడితే గానీ పవన్‌కు బోధపడలేదు. పెద్దవాళ్లూ, ఉపాధ్యాయుల మాటలు బోధపడితే ఏ బాధా పడక్కర్లేదు.

-కళ్లేపల్లి తిరుమలరావు 9177074280