S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీడ్కోలు

డిగ్రీ చదువుతున్నప్పుడు టైపు నేర్చుకొమ్మని మా బాపు సలహా ఇచ్చాడు. ఆ సలహా నాకు ఏ మాత్రం రుచించలేదు. టైప్ నేర్చుకొని టైపిస్ట్ కావాలా? అన్న భావన నాకు కలిగింది. చాలా రికామి సెలవులు వున్నా టైపు నేర్చుకోలేదు.
న్యాయవాద వృత్తి చేపట్టిన తరువాత టైప్ విలువ అర్థమైంది. ఏ చిన్న నోటీసు పంపించాలన్న టైప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టైప్ మిషన్ ఆఫీసులో వున్నా టైప్ చేయలేని పరిస్థితి. తాలూకాల్లో మంచి టైపిస్టులు చాలా తక్కువగా ఉంటారు. తప్పులు లేకుండా టైప్ చేస్తారు కాబట్టి మంచి టైపిస్టు దగ్గరే ఎక్కువ పని ఉండేది.
మా కోర్టులో ముగ్గురు టైపిస్టులు జాబ్‌వర్క్ చేసేవాళ్లు. మంచి అక్షరాలు వుండి, బాగా టైప్ చేసే వ్యక్తి ఒక్కడే. అతనికే ఎక్కువ పనిని అప్పగించేవాళ్లు న్యాయవాదులు. అందుకని పని చాలా ఆలస్యం అయ్యేది.
ఓ సీనియర్ న్యాయవాది దగ్గర పోర్టబుల్ టైప్‌మిషన్ ఉండేది. దాన్ని ఆయన కోర్టుకి తీసుకొని వచ్చి అవసరం వున్నప్పుడు ఆయన క్లర్క్‌తో టైప్ చేయించేవాడు. అర్జంట్ దరఖాస్తులని అప్పుడప్పుడు ఆయనే టైప్ చేసేవాడు. ఆయనను చూసిన తరువాత మొట్టమొదటిసారి అన్పించింది టైప్ నేర్చుకొని ఉంటే బాగుండేదని. టైప్ నేర్చుకోలేదు కానీ ఓ చిన్న అందమైన టైప్ మిషన్ కొనుక్కొని మా క్లర్క్‌ని టైప్ నేర్చుకొమ్మని చెప్పాను. నేను నేర్చుకుందామని అనుకున్నాను. కానీ కుదరలేదు.
కొంతకాలం తరువాత న్యాయవాద వృత్తి నుంచి న్యాయమూర్తి ఉద్యోగంలోకి మారడంతో టైప్ మిషన్ అవసరం నాకు లేకుండా పోయింది. కోర్టుల్లో స్టెనోగ్రాఫర్, ఇంగ్లీష్ టైపిస్ట్, తెలుగు టైపిస్టులతో బాటూ టైప్ వచ్చిన వాళ్లు ఒకరిద్దరు ప్రతి కోర్టులో వుండేవాళ్లు. ఆ విధంగా టైప్ నేర్చుకోవాలన్న ధ్యాస లేకుండా పోయింది.
కాలం మార్పులకి టైప్ మిషన్లు బలైపొయ్యాయి. వాటి స్థానంలో కొత్తగా కంప్యూటర్లు వచ్చాయి. అప్పుడప్పుడు కంప్యూటర్లతో బాటూ టైప్‌మిషన్లూ వాడేవాళ్లు. విద్యుత్ లేనప్పుడు టైప్ మిషనే్ల అవసరం అయ్యేయి. మరి కొంతకాలం తరువాత జనరేటర్లు, ఏవర్ బ్యాకప్‌లు వచ్చిన తరువాత టైప్ మిషన్ల ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మార్పులూ చేర్పులూ చేసుకోవడానికి వీలయ్యే అవకాశం వున్నవి కంప్యూటర్లు. అందుకని టైప్ మిషన్ అనవసర వస్తువుగా మారిపోయింది. అయినా వాటిని ఉపయోగంలో వుంచే పని చేసేవాళ్లం. కానీ వాటి అక్షరాలు విరిగిపోవడం, అరిగిపోవడం జరిగిన తరువాత కొత్త అక్షరాల కోసం ప్రయత్నిస్తే అవి దొరకని పరిస్థితి ఏర్పడి టైప్ మిషన్లు మూలకు పడే పరిస్థితి ఏర్పడింది.
ఇంటికి కూడా కంప్యూటర్, లాప్‌టాప్‌లు వచ్చేశాయి. పోర్టబుల్ టైప్‌రైటర్ కూడా అనవసర వస్తువుగా మారిపోయింది. ఎప్పుడైనా ఏదైనా రహస్య నివేదికలు పంపించే అవసరం ఏర్పడినప్పుడు నాకు టైప్ రాదన్న విషయం కొంత బాధ కలిగించేది. టైపింగ్ ట్యూటర్ ద్వారా టైపు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ నేర్చుకోలేక పోయాను.
పోర్టబుల్ టైప్ మిషన్‌కి ఇంట్లో స్థానం లేకుండా పోయింది. వస్తువులు ఎక్కువై దాన్ని బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే తరాలకు చూపించటానికి ఉంటుందని మా ఊరికి దాన్ని తరలించాను.
ఇంట్లో కంప్యూటరూ, ల్యాప్‌టాప్‌లు. ఇవీ టైప్ మిషన్ని భర్తీ చేస్తాయి. నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే అవి టైప్ నేర్పిస్తాయి. కానీ అంత అవసరం లేకుండా పోయింది.
టైప్ మిషన్ అనవసర వస్తువైంది. కానీ టైప్ రాదు కదా అని అన్పించినప్పుడల్లా అది నేర్చుకొమ్మని చెప్పిన మా బాపే గుర్తుకొస్తాడు.

-జింబో 94404 83001