S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అన్నీ ఉన్నాయి

ఒకటి: ఆకాశం గగనం శూన్యం, అంటే, తెల్లోడు ఎర్రోడా ఏంటి గొట్టాలెట్టి సూడ్డానికి అంటూ గురజాడ అప్పారావు గగనం శూన్యం కాదని వాదం లేవదీశాడు కన్యాశుల్కంలో. తెల్లవాడు గొట్టాలతో ఏం చూసిందీ, ఇవాళ అందరికీ తెలుసు. కానీ, ఉన్నా లేనట్టుండే సైబర్ ప్రపంచంలో ఒక గొట్టం వెలిసిందండీ! దాని పేరు నీవు గొట్టము! కోపగించుకోకండి. నేను నా మీద నేను తప్ప, పొరపాటున కూడా మరొకరి మీద జోకు వేయను. వేయలేదు. నమ్మండి. ‘యూట్యూబ్’ అనే మాటకు అంతకంటే మచి తెనుగు మాట నాకు తోచిచావలేదంటే కూడా నమ్మండి.
‘ప్యాసా’ అని హిందీలో గురుదత్ తీసిన మహత్తరమయిన సినిమా! అందులో ‘జానేక్యా తూనే కహీ!’ అని నిజంగా బాగుండే పాట. వినాలని బుద్ధి పుట్టింది! అదేం సమస్య గనకనా? గొట్టంలో వెదకమన్నారు ఎవరో? అక్కడ పాట, వీడియోతోబాటు, నిన్న పెట్టినంత ఫ్రెష్‌గా ఉందండీ బాబూ! (ఈ సినిమాను తెలుగులో కూడా తీశారు. అది నాకు నచ్చలేదు. అది వేరే సంగతి! పోనీయండి!)
భావ కవిత్వం, బావ కవిత్వం బావుల్లో పడి కనపడకుండా పోయిన తర్వాత తెలుగు కవిత్వంలో విషయంగా ఏముంటుంది అన్న ప్రశ్నకు జవాబు కష్టమయింది. ఇక కథలలో మానవ సంబంధాలు, కష్టసుఖాల సంగతిని మరిచిపోయిన తరువాత, పోరాటం ఒకటే సబ్జెక్ట్! ప్రపంచమంతా ఇంత చీదరగా ఉంటే, సాహిత్యం కూడా చీదరగా ఉండాలి గదా! అంటే మరి తప్పా? నీ కథలింత చీదరగా ఉన్నాయెందుకు? అని సాదత్ హసన్ మంటోను ఏకంగా కోర్టు వారు అడిగారట. ప్రపంచం అంతకంటే చీదరగా ఉంది, అన్నాడట ఆ ధాయిర్యంగల రచయిత! కేసు కొట్టేసి, ఆ తరువాత ‘నీ కథలు బాగుంటాయి’ అన్నాడట జడ్జి! అయినా సాదత్ హసన్ మంటో కథల్లో హాస్యం తిరిగి చూస్తుంది, అంటే నమ్మగలరా? ఆయన ‘బంగారు ఉంగరం’ అనే అర్థంతో ఒక కథ రాశాడు. ఈ ఫయర్‌బ్రాండ్, అనగా నిప్పులు చెరిగే రచయిత కథేనా ఇది అనుమానం వస్తుంది ఆ కథ చదివితే. కానీ, అందులో సాంఘిక దురాచారాలు, మగవారి ఆగడాల గురించి ఆయన చెప్పకుండా చెప్పిన తీరు సాటిలేనిది. అవునయ్యా! ఈ గోలంతా ఎందుకు? అంటే హాస్యం అనేది మనం మరిచిపోయామని గుర్తు చేయడానికి.
కానీ, (వెనుక కానీలని నాణాలుండేవి) ఉరుదూలో ఇవాళటికీ హాస్య కవి సమ్మేళనాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందాకటి నుంచి చెబుతున్న గొట్టంలో వెదికి చూడండి. వందల విడియోలు. ఎంతసేపయినా హాయిగా నవ్వుకోవచ్చు. తెలుగు వారికి కితకితలు పెట్టినా నవ్వు రాదేమోనని నా అనుమానం! బాపు జోకుల్లేవు. చివరికి చంద్ర కూడా కార్టూన్‌లు వెయ్యడం లేదు. ఇక ఏం చూచి నవ్వుతాడు తెలుగు సోదరుడు. రేలంగోడు, రమణారెడ్డి, చివరకు రాజబాబులతో సినేమాల్లో కూడా హాస్యం తీరు మారిపోయింది. హాస్యానికని ఛానల్స్, స్లాట్ల్ పెట్టారు. వాటిని చూచినప్పుడల్లా కోపంగా, రిమోట్‌ను నొక్కుతారు ప్రేక్షకులు. ఏం చేసి నవ్వించాలో తెలియక, పిత్తులు, తన్నులను ఆశ్రయిస్తున్నారంటే దరిద్రం అర్థంగావట్లేదూ!
ఒకానొక తెలుగు సినిమాలో రాజబాబు ‘ఏ రిక్షా చప్పుడయిన నీవే వస్తున్నావని’ అంటూ విరహగీతం పాడతాడు. నిరుడు కురిసిన హిమ సమూహంలాగ ఆ రకం హాస్యం పాటలు కరిగి లేదా మురిగి మాయమయినవి. ఇంతకూ ఈ పాటలు యూగొట్టంలో దొరుకుతయ్యా? తస్సాదియ్యా! నాకినాళ్లూ ఎందుకు రాలేదు ఈ అనుమానం?
రెండు, కాదు మూడు: నంబర్ టూ అంటే బాగుండదనీ అంకె మార్చితిమి. అంతే! ఇంక ఈ యూట్యూబ్‌లో నాకు నచ్చిన తర్వాతి కార్యక్రమ రాజంబు లెట్టివిన ‘వంటి ప్రోగ్రాములు’ అనునవి అని ఎట్టి యనుమానమునకు తావు లేకుండ నొక్కి వక్కాణించుచున్న వాడయితిని గదా! అవునండీ! తినడం ఎట్లాగూ కుదరదు గానీ, కనీసం వంటలో ఆసక్తి గలవానిగా ఆయా వంటలలోని రహస్యములను, మెళకువలను తెలుసుకోవడం ఈ మధ్య గట్టి కాలక్షేపంగా చోటు చేసుకుంటున్నది. (ఈ చివరి మాట టీవీ వారిది. కుదిరిందో లేదో తెలియదు. పోనీయండి!)
దేశ విదేశాలలో రకరకాల వంటకాలు తయారుచేసే విధానాలను గురించి వివరించే విడియోలు, ఛానల్స్ యూట్యూబ్‌లో దండిగా ఉన్నాయని తెలుసా? రాంకీ బండీ దోసె మొదలు రావల్‌పిండీలో కబాబ్ దాకా ఎన్ని రకాలో, ఎన్ని రహసాయలో? కాకినాడ కాజా గురించి అసలయిన కాకినాడ వీడియో చూసిన తరువాత, వీటిని తినకుంటేనే మేలు అనిపిచింది. సోన్ పాప్‌డీ వీడియో తరువాత, ఇంత లాగుడా? అనిపించింది. దేశమంతటా దోసెలు దాలుస్తున్న అవతార విశేషాలను చూస్తే మాత్రం, ఆకలి మందగించింది. బుద్ధి నన్ను మందలించింది. తినే ఒక రొట్టెముక్క తిని హాయిగా పడుకోక నీకు ఈ ఫుడ్‌ఫెటిష్, తిండి వోయరిజం ఎందుకు అన్నది మనసు!
నాలుగు, కాదు ఒకటి చాలు: పెళ్లిగానీ, మరోటిగానీ, అయిదు నక్షత్రాలు, అధ్వాన్నం హాలుగానీ, ఈ మధ్యన స్పెషల్ భోజనం అంటే మిరపకాయ బజ్జీలు లేనిదే గడవడం లేదు. నాకు మంట! మొదట మిరపకాయలంటే ఇష్టంలేదు గనుక ఒళ్లు మంట. వాటిని తింటే పడదు గనుక ఆ తరవాత కడుపుమంట. గోకుల్ చాట్ పేరు బాంబుల కారణంగా అందరికీ తెలిసింది. మాకు మాత్రం 70 దశకం నుంచీ, ఒక్క మడిగె (మల్‌గీ అనగా దుకాణం) నాటి నుంచీ అక్కడ చాట్, మిర్చీ తినడం అలవాటు. ఆ తరువాత నారాయణ బండీ మిరపకాయ బజ్జీలు సూపర్! అది హనుమకొండలో. ఆ తరువాత నెమ్మదిగా కడుపుమంట మొదలయింది. ఇప్పటివరకు ఒకటి చాలు, అనే వాడిని. ఈ మధ్యన ముట్టుకోవడం లేదు. ఇంతకూ నా ప్రశ్న నా గురించి కాదు. ఎందుకని మనవాళ్లు మిరపకాయ బజ్జీలంటే అంతగా ఇష్టపడతారు? అని! అదొక కథకు, నవలకు సమానమయిన అంశం అని నా అనుమానం!
పచ్చిమిర్చి మన దేశపు పంట కాదు. దక్షిణ అమెరికా నుంచి బహుశ యూరపు ద్వారా అది మన దాకా వచ్చింది. టొమాటో కూడా అంతే! కానీ ఇవాళ మిరప, టొమాటో లేనిదే ఎవరికీ రోజు గడవదు. ముద్ద కడుపులోకి జారదు! మనకు మిరియాలు, చింతపండు తప్ప కారం, పులుపు మరోటి తెలియదు. వేసవిలో మామిడికాయల సంగతి వేరు.
‘చింతపండు తెచ్చి, రాచ్చిప్పలో వేసి’ అని మొదలుపెట్టి మా చిన్నతనంలో ఒక పద్యం చెప్పేవారు. దాని చివర్లో, ‘బజ్జి చేసి తినగ గజ్జి మొలుచు!’ అని ఉంటుంది. బజ్జికి గజ్జికి, పేర్లలోని అక్షర ప్రాస తప్పితే మరే రకంగానూ సంబంధం లేదు. గజ్జికి కారణం క్రిములు. అవి చింతపండులో, ద్వారా రాజాలవు! అంటే, గింటే అది తుంటరి పద్యమని అర్థం.
ఝలక్: భూత్ ఝలోకియా అనే రకం మిరపకాయలు మన దేశంలోని వాయవ్య ప్రాంతాలలో పండుతాయి. అవి బాగా చిన్నవి. ప్రపంచంలోని మిరప పంటలు అన్నింటిలోకీ ఎక్కువ కారంగలవి ఈ భూత్ ఝలోకియా! పండు మీదకు దాడిచేసే ఏనుగులను ఆపడానికి, పొలం గట్ల మీది రాతి ఖడీలనే స్తంభాలకు, మిరపకాయలు చిదిపి పూస్తారు, అస్సాం ప్రాంతాలలో. ఏనుగులు ఆ ఘాటు కారణంగా దూరం ఉండిపోతాయి!

కె.బి. గోపాలం