S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం - 23

ఏ మనిషి జ్ఞాపకమయినా ఎన్ని రోజులుంటుంది? నెమ్మది నెమ్మదిగా ఆమె జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి. వసంతం సినిమాలో నా కేరెక్టర్ పెద్దది కాకపోయినా సినిమా హిట్ కావటంతో నాకూ మంచి పేరే వచ్చింది. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకున్నానేమో, నా జీవితం పరుగందుకుంది. సినిమా అవకాశాల్తోపాటు నా వ్యక్తిగత జీవితం కూడా మలుపు తిరిగింది. పరిమళ నా జీవితంలోకి ప్రవేశించింది. ఆమెతో నా పరిచయం స్నేహంగా, తరువాత ప్రేమగా మారింది.
ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించినపుడు అందరూ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ‘అంత తొందరేముంది?’ అన్నారు. ‘మార్కెట్ పడిపోతుంది..’ అన్నారు. అయినా నేను పట్టించుకోలేదు.
లేట్ చెయ్యకుండా ఆమెని పెళ్లి చేసుకున్నాను. పరిమళ పెళ్లి తరువాత నటించటం మానేసింద. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు.
మనిషి జీవితంలో ఉచ్ఛ స్థితి అని ఉంటుందట. అది నా జీవితంలో ఆగకుండా నడుస్తోంది. నేను నటించిన సినిమాలన్నీ హిట్లవుతున్నాయి. ఇంటి ముందు కోట్ల రూపాయల అడ్వాన్సులు పట్టుకుని సంవత్సరాల తరువాత నేను ఇచ్చే కాల్‌షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
మరోపక్క నాకంటే ఎక్కువ టాలెంట్, బ్యాకింగ్ ఉన్న అభిమన్యు కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది. ఒక సినిమా హిట్ అయితే నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. నెమ్మది నెమ్మదిగా అతన్ని పెట్టి సినిమా తియ్యాలంటే భయపడే స్థితికి చేరుకున్నారు.
మేమిద్దరం ఒక పార్టీలో కలిసినపుడు అభిమన్యు డిప్రెషన్‌లో కూరుకుపోతున్నాడన్న అనుమానం వచ్చింది. అతని మాటలో తడబాటూ, అతని కళ్లల్లో చంచలత్వం నాలో వేరే అనుమానాలు రేకెత్తించాయి. అతని మొహం కూడా పీక్కుపోయినట్లయి కళ లేకుండా తయారైంది.
‘అభీ! ఏమీ అనుకోనంటే ఒక మాట - నీకు డ్రగ్స్ అలవాటు ఉందా?’ డైరెక్ట్‌గా అడిగాను.
‘ఎందుకనుకుంటున్నావ్?’ అని ఎదురు ప్రశ్నించాడు తప్ప లేదనలేదు.
డ్రగ్స్ అలవాటు ఎలా మనిషిని నాశనం చేస్తుందో చెప్పాను. రోజులెప్పుడూ ఒకలా ఉండవనీ, అతనికున్న డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకోమనీ చెప్పాను. అన్నీ విన్నాడు. దేనినీ కాదనలేదు. మారతాడనే అనుకున్నాను.
ఒకటి రెండు సినిమాలు అతను నటించినవి బాగానే ఆడాయి. కానీ అతని అలవాట్ల వలన ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారసాగాయి. పేరున్న దర్శకులు క్రమశిక్షణ లేని అతన్ని తమ సినిమాల నుండి తొలగించసాగారు. దానితో అతని అలవాటు వ్యసనం అయింది. చివరకు ఆ మత్తు లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నపుడు అతని కుటుంబ సభ్యులు కల్పించుకుని, ఈ వాతావరణం నుండి దూరంగా కేరళలోని ఒక రీహాబిలియేషన్ సెంటర్లో చేర్చారు. అతని అలవాటు మాన్పించటానికి శతథా ప్రయత్నించారు. అతను కూడా వారికి సహకరించటంతో తిరిగి మామూలు మనిషి అయి వెనక్కి వచ్చాడు.
ఇండస్ట్రీకి తిరిగి వచ్చిన అభిమన్యు తన మారిన ప్రవర్తనతో అందరికీ నమ్మకం కలిగించాడు. ఒక నిర్మాత అతన్ని సోలో హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఇంకో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కూడా సినిమాల కోసం అతన్ని అప్రోచ్ అయ్యారు. అలాంటి సమయంలో జరిగింది ఆ అనూహ్య సంఘటన.
అభిమన్యు అరెస్ట్ అయ్యాడు. అతని దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ దొరికాయి. మామూలుగా అయితే అతని సినిమా ఎలా ఆడేదో కానీ ఈ నెగెటివ్ పబ్లిసిటీతో ఫ్లాప్ అయింది.
ఒకసారి అతన్ని కలుసుకోవటానికి జైలుకు వెళ్లాను. నాలాంటి సెలబ్రిటీ ఒక స్నేహితుడిని కలుసుకోవటానికి జైలుకు వెళ్లటం ఎంత కష్టమో అపుడే తెలిసింది.
‘ఏమిటిది అభీ! ఎందుకిలా చేశావ్?’ అన్నాను.
‘నువు కూడా ఇదంతా నిజమని నమ్ముతున్నావా?’ అని అడిగాడు.

‘కాదా?’ ఆశ్చర్యంగా అడిగాను.
‘కాదు. నాకు డ్రగ్స్ అలవాటు ఉన్న మాట నిజం. మొన్నమొన్నటి వరకు వాటిని వాడిన మాట నిజం. కానీ వాటిని తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను? అంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా?’ అన్నాడు.
‘మరి నువు తెచ్చి పెట్టకుండా మీ ఇంట్లో ఎలా దొరికాయి?’
‘నా ఉన్నతిని చూసి ఓర్వలేక, నా మీద కక్షతో ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు...’ అన్నాడు.
నాకు నవ్వు వచ్చింది. అతనున్న పరిస్థితుల్లో అతన్ని చూసి ఈర్ష్య పడేవారెవరుంటారు? అలాంటిది ఇంత ప్లాన్ చేసి అతన్ని ఇరికించవలసిన అవసరం ఎవరికి ఉంటుంది?
నా అపనమ్మకాన్ని మనసులోనే దాచుకుని బయటకు నడిచాను. అతను జైలు నుండి బయటకు వచ్చేటప్పటికి ఎన్ని ఏళ్లు పడుతుందో?
అభిమన్యు వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నాశనం అయ్యాడని నాకు అర్థం అయింది.
ఆ రోజు సాయంత్రం సంతోష్ గెస్ట్‌హౌస్‌లో కూర్చుని మందు కొడుతూ అభిమన్యు గురించి చెప్పాను. సంతోష్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు.
ఇప్పుడు సంతోష్ గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదు. పెద్ద నిర్మాత కూడా. తన సినిమాలన్నిటికీ తనే దర్శకత్వం కూడా చేసుకోలేనంత బిజీ.
నేను అతనితో అదే అన్నాను. ‘ముగ్గురం ఒకే సినిమాతో పైకి వచ్చాం. మనిద్దరం చూడు. ఎలా వృద్ధిలోకి వచ్చామో! అభి మాత్రం ఇలా దిగజారిపోయాడు...’
సంతోష్ ఏమీ మాట్లాడలేదు. వౌనంగా ఉండిపోయాడు. ఈ మధ్య సంతోష్ చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు.. అందులోనూ కొన్ని హిందీ సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. అతని దగ్గర అంత డబ్బు ఎక్కడిదో నాకు అర్థం కాలేదు.
‘సంతోష్ ఒక్కసారి అన్ని ప్రాజెక్టులు టేకప్ చేయటానికి భయమెయ్యదా?’
‘పులి మీద స్వారీ ఆపలేమన్న నిజం నాకు కూడా ఇప్పుడే తెలిసింది’
‘అది ప్రమాదకరమైన పనులకు వాడే సామెత. ఇక్కడ నప్పదు...’ అన్నాను.
‘నేనెన్ని ప్రమాదాల మధ్య జీవిస్తున్నానో నీకేం తెలుసు?’ అన్నాడు సంతోష్.
అప్పుడది జోక్‌గా తీసుకుని నవ్వేశాను. ఆ తర్వాత సంతోష్ చాలా కాలం కలవలేదు.
ఇండస్ట్రీలో రకరకాల రూమర్లు చెప్పుకుంటున్నారు. సంతోష్‌కి అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయనీ, వారి డబ్బు పెట్టి ఇతను సినిమాలు తీస్తున్నాడనీ అనుకోసాగారు. ముందు నేను నమ్మలేదు. నెమ్మది నెమ్మదిగా మరిన్ని వివరాలు రాసాగాయి.
ఒకరోజు బాగా రాత్రి దాకా షూటింగ్ చేసి గాఢంగా నిద్రపోతున్న నాకు ఉదయానే్న పరిమళ లేపుతుంటే కళ్లు తెరిపిళ్లు పడక బద్ధకంగా, ‘ఏంటి పరిమళా... ఏమిటంత అర్జంటు?’ అంటూ లేచి కూర్చున్నాను.
టీవీ వైపు చూపించింది పరిమళ. ‘ఏదో జరిగింది!’ అనుకున్నాను... టీవీలో వస్తున్న మ్యూజిక్ చూసి, తెర మీద పడుతున్న అక్షరాలు మెదడులోకి ఎక్కేటప్పటికి మత్తు మొత్తం వదిలిపోయింది. ‘సినీ నిర్మాత, దర్శకుడు సంతోష్ దుర్మరణం..’ అన్న ఆ వార్త ఆ రోజు సాయంత్రం వరకూ అన్ని చానళ్లలోనూ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఆ తరువాత సాయంత్రంలోపు చాలా విషయాలు మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. ఫ్యాక్షనిస్టులతో సంతోష్ సంబంధాలు చివరకు ఎలా పరిణమించాయో రకరకాల మసాలా కలిపి మరీ చెప్తున్నారు.
కొన్ని రోజుల క్రితమే కదూ... మేమిద్దరం కలిసి అభిమన్యు మీద జాలి పడింది. ఇప్పుడు సంతోష్ ఇలా చనిపోవటంతో నేను మానసికంగా కుంగిపోయాను. మనసుకు దగ్గరైన ఇద్దరు స్నేహితులు అతి తక్కువ సమయంలో ఇలా నాశనమయి పోవటం నమ్మలేకుండా ఉంది.
ఇంకొక ఆలోచన నెమ్మదిగా మొదలయి, మర్రిమానులా విస్తరించింది. ఈ దుర్ఘటన పరంపరలో తరువాత నేనేనా?... అని. తల విదిలించి ఆ ఆలోచన దూరం చేసుకున్నాను. అలాంటి నెగెటివ్ ఆలోచనలను దూరం చేసుకోవటానికి మరింతగా పనిలో లీనమయ్యాను.
నాకు నేనే తీరిక లేకుండా చేసుకున్నాను. నా జీవితం అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది. నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అవటం అన్నది అరుదయ్యింది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత సేఫ్ అయ్యే వసూళ్లు నా సినిమాలు సాధిస్తున్నాయి.
అలాంటి సమయంలో డైరెక్టర్ భరత్ ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణ దేవరాయల కాలానికి సంబంధించిన సంఘటనలతో అతను చెప్పిన సినిమా కథ నాకు అద్భుతంగా నచ్చింది.
‘మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది?’
‘50 కోట్లు అవుతుంది సార్. మీరు ఊ... అంటే ప్రొడ్యూస్ చెయ్యటానికి ఇద్దరు, ముగ్గురు నిర్మాతలు తయారుగా ఉన్నారు.’
‘అది అలా ఉంచండి. నేనే ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందంటారు?’
‘బానే ఉంటుంది సార్! మీరు ప్రొడ్యూసర్ అంటే ఫైనాన్షియర్లు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎగబడతారు...’
ఈ మధ్యకాలంలో నా సినిమాలేవీ అపజయం పొందక పోవటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నా శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసే పని మీద పడ్డాను.
మొత్తం ఏడు నెలలు పట్టింది. నా ప్రాజెక్ట్ పూర్తి కావటానికి. ప్రెస్టేజియస్‌గా తయారయిన ఈ సినిమా నా కెరీర్‌లోనే మైలురాయిగా మిగిలిపోతుందని అందరూ అనుకుంటున్నారు.
సినిమా రిలీజుకు ముందే ఏరియాలు కొనుక్కోవటానికి బయ్యర్లు పోటీలు పడుతున్నారు. మంచి లాభానికి సినిమాని అమ్మాను. రిలీజు డేటుకు ముందు డబ్బులు ఇస్తారు బయ్యర్లు.
సినిమా ప్రచారం కోసం ప్రివ్యూ ఏర్పాటు చేశాను. మా డైరెక్టర్ ముఖ్య అతిథిగా క్యాబినెట్ మినిస్టర్ వసుంధర గారిని పిలుద్దామన్నాడు. ఆ పేరు వినగానే నాకు పరిచయమైన వసుంధర గుర్తుకు వచ్చి మనసు చివుక్కుమన్నా, ఆ వసుంధర ఇలా క్యాబినెట్ మినిస్టర్ వసుంధరగా మారుతుందని అప్పుడు నేను ఊహించే ఛానే్స లేదు.
ప్రివ్యూకి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాము. సరిగ్గా ఆ రోజే మంత్రిగారు తన నియోజకవర్గ పర్యటన పెట్టుకున్నారని తెలిసింది. ఆమె సమయానికి వస్తుందో, రాదో అనుకున్నాను. ఒకటికి రెండుసార్లు ఆర్గనైజర్ల చేత గుర్తు చేయించాను.
ఆమె చెప్పిన మాట ప్రకారం సమయానికే వచ్చింది.
పరుగెత్తుకుంటూ మా యూనిట్ మెంబర్లు ఎదురువెళ్లారు. వారి వెనుక నేను కూడా వెళ్లాను.
ముందుగా మా డైరెక్టర్ భరత్‌ని పరిచయం చేశారు.
‘మీరు తీసిన సినిమాలు కొన్ని చూశాను. చాలా బాగా తీస్తున్నారు...’ అంది ఆమె.
ఆమె మొహం చూసి గుర్తు పట్టలేక పోయేవాడినేమో కానీ, ఆ గొంతు.. ఏ మాత్రం మారని ఆ గొంతు ఆమెని పట్టిస్తోంది.
నాకేమీ అర్థం కాలేదు. ఇదెలా సాధ్యం? వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే వసుంధర, హఠాత్తుగా ట్రయల్ షూట్ మధ్య నుండి మాయమయిన వసుంధర... ఇలా, ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ వసుంధరగా తేలటం ఎలా సాధ్యమైంది?
ఇప్పుడు ఆమె నన్ను గుర్తు పట్టిందో, లేదో తెలియదు. మా పాత పరిచయాన్ని గుర్తు చేయవచ్చో, లేదో తెలియదు.
ఇంతలో ఆమె అసిస్టెంట్ రేఖ నన్ను పరిచయం చేసింది. ‘ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు మేడమ్! ఈ సినిమా హీరో...’
‘అవును. ఇతని గురించి నాకెందుకు తెలియదు?’ అంది వసుంధర. ఆమె మొహంలో నన్ను గుర్తు పట్టిన ఛాయలు లేవు. మాటలు మాత్రం నాకు
వ్యంగ్యంగా ధ్వనించాయి.
ఇంతలో మరొక వ్యక్తి వచ్చి ఆమెకు నమస్కరించాడు.
‘ఇతను సినిమా ప్రొడ్యూసర్ మేడమ్!’
‘అదేమిటి? ఈ సినిమా చంద్రంగారు స్వయంగా తీస్తున్నారని విన్నానే...’
‘అంటే!... నిజానికి చంద్రంగారే ప్రొడ్యూసర్. కానీ పేరు మాత్రం భార్య తరఫు బంధువులది పెట్టారు. మీకు తెలుసుగా ట్యాక్స్ ప్రాబ్లమ్...’
పెద్దగా నవ్వింది వసుంధర. ‘చంద్రంగారు నటించటంలోనే కాదు, ఇలాంటి విషయాల్లో కూడా చాలా షార్ప్ అన్నమాట’
అంత పెద్ద హోదాలో ఉన్న ఆమె పిలవగానే రావటం ఒక వింత అనుకుంటే, ఇంత ఉత్సాహంగా అన్ని విషయాల్లో ఉత్సాహం చూపించటం అక్కడకు వచ్చిన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఆమె విశ్రాంతి కూర్చున్న వెంటనే సినిమా మొదలయింది.
అద్భుతంగా ఉంది సినిమా. ఇంతవరకు తెలుగు తెర మీద కనపడనంత భారీ సెట్టింగులు, యుద్ధ దృశ్యాలతో కళ్లు మరల్చలేనట్లు ఉంది.
శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో నాకు నేనే ముద్దు వస్తున్నాను.
విరామ సమయానికి కథ కూడా మంచి రసకందాయంలో పడింది.
మా డైరెక్టర్ భరత్ వచ్చి వసుంధర పక్కన నిలబడ్డాడు.
ఆమె కూల్‌డ్రింక్ తాగుతోంది.
‘సినిమా ఎలా ఉంది మేడమ్?’ అడిగాడు అతను.
‘ఇప్పటివరకు బాగుంది. కానీ, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందన్నది ముఖ్యం కదా!’
‘అది కూడా బాగుంటుంది మేడమ్. మీరే చూస్తారుగా...’ ఆత్మవిశ్వావసంతో అన్నాడు భరత్.
నవ్వింది ఆమె. పక్క నుండి చూస్తున్న నాకు ఆ నవ్వులో వ్యంగ్యం కనపడటం యాదృచ్ఛికం అనిపించలేదు.
సినిమా తిరిగి మొదలయింది.
వసుంధర సినిమాలో లీనమయింది. ఇంతలో చిన్న కలకలం. ఎవరో వచ్చి నా చెవిలో ‘మీరు అర్జంటుగా బయటకు రావాలి...’ అంటున్నారు.
నేను బయటకు నడిచాను. నా వెనుకే భరత్ కూడా బయటకు వచ్చాడు.
‘సార్! ఈ లెటర్ చూడండి...’ ఒక లెటర్ నా చేతిలో పెడుతూ అన్నాడు అసిస్టెంట్.
‘రాష్ట్రంలోని ప్రముఖులకు మీ సినిమా ప్రివ్యూ వేస్తున్నావా చంద్రం? నీ ప్రదర్శన పూర్తయ్యేలోపు దేశంలోని అందరికీ నేను ప్రివ్యూ చూపించగలను... ఫ్రీగా. నమ్మలేకపోతే నేను పంపే సీడీ చూడు. నీ సినిమా మొత్తం నా దగ్గర ఉంది. రేపు సాయంత్రంలోపు పది కోట్లు నాకు ఇవ్వకపోతే, నీ సినిమా నెట్‌లో ప్రత్యక్షమవుతుంది. డబ్బు ఎలా ఇవ్వాలో రేపు మధ్యాహ్నం నీకు తెలుస్తుంది...’ అని ఉంది ఆ లెటర్‌లో.
‘ఏమిటిది?’ అయోమయంగా అడిగాను.
‘కొత్తరకం బ్లాక్‌మెయిల్’ ఎవరో చెప్పారు.
‘ఎలా జరిగి ఉంటుంది ఇది?’ అని అడిగాను. వద్దనుకున్నా అటూ ఇటూ ఆందోళనగా తిరగకుండా ఉండలేక పోతున్నాను.
ఒక మూల సోఫాలో కూర్చుని డైరెక్టర్ భరత్ తెరచి ఉంచిన ల్యాప్‌టాప్ వైపు తదేక దీక్షతో చూస్తున్నాడు.
బ్లాక్‌మెయిలర్ చెప్పిన విషయం నిజమే అని రుజువు చేస్తూ సీడీ ప్లే అవటం మొదలుపెట్టింది. ల్యాప్‌టాప్ తెర మీద ఇంకా రిలీజ్ కాని నా సినిమా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంతలో ప్రివ్యూ అయిపోయింది. మినిస్టర్‌గారు వెళ్లిపోతున్నారంటే సాగనంపటానికి బయటకు వెళ్లాను.
‘ఏమిటి హడావిడి?’ అడిగింది ఆమె నావైపు సూటిగా చూస్తూ.
జరిగింది చెప్పాను.
‘ఎంత అడుగుతున్నారు?’
‘పది కోట్లు’
‘మైగాడ్. పది కోట్లా?’ ఆశ్చర్యంగా అంది ఆమె. ‘మీ సినిమా రిలీజయినా అంత లాభం వస్తుందంటారా?’
‘ఆ సంగతి ఏమో కానీ.. సినిమా కనుక ఇంటర్‌నెట్‌లో రిలీజ్ అయితే పెట్టుబడి పెట్టిన మొత్తం పోవటమే కాదు, అసలు సినిమా రిలీజవుతుందో, లేదో కూడా అనుమానమే! ఏరియాలు కొన్న బయ్యర్లు కూడా ఒప్పుకున్న డబ్బు ఇవ్వటానికి ముందుకు రాకపోవచ్చు’
‘ఇంతకీ మిమ్మల్ని బెదిరిస్తున్నది ఎవడన్నా ఫేక్ బ్లాక్‌మెయిలర్ ఏమో ఆలోచించారా?’
‘మనకి ఇలాంటి అనుమానం వస్తుందనే అనుకుంటా వాడెవడో కానీ సినిమా కాపీ సీడీ ఒకటి నాకే పంపాడు’ నీరసంగా అన్నాను నేను.
‘అయితే మీరు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర రిపోర్టు ఇవ్వండి. వారితో నేను కూడా మాట్లాడతాను...’ అంటూ వెళ్లిపోయింది వసుంధర.
పోలీసు రిపోర్టు ఇవ్వటం వలన ఉపయోగం ఉన్నా, లేకపోయినా ఆమె చెప్పింది కాబట్టి ఆ పని పూర్తి చేసుకుని వచ్చాను.
అప్పటికల్లా ఇండస్ట్రీ హేమాహేమీలందరూ మా ఇంటికి వచ్చారు.
‘అసలు మన సినిమా కాపీ బయటకు ఎలా వెళ్లింది?’ ఆక్రోశంగా అన్నాను.

మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002