S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప‘రేషాన్’ కార్డు

‘నమస్కారం సార్’ అన్నాను మా ఆఫీసులోకి దూసుకొచ్చిన రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గారితో. ఆయన నా నమస్కారం అందుకోకుండా అలవాటుగా పక్క గదిలోకి వెళ్లి పోస్ట్‌మాస్టారి సీటుకు ఎదురుగా వున్న కుర్చీలలో అదీ మధ్య కుర్చీలో చేరబడి కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని, ఒక కాలు ఆడిస్తూ, రెండు చేతులు ప్రక్క కుర్చీ మీద పెట్టి వేళ్లతో తాళం వేస్తూ, రాజసం, దర్పం వొలకబోస్తూ అసహనంగా కూచున్నారు.
సాయంత్రం ఆరున్నరయింది. నెలలో ఆఖరి రోజు. జీతాలు పెన్షన్లు ఆ రోజే పేమెంట్ చేశాం. అదీగాక, రోజూ ఉండే మనియార్డర్లు, సేవింగ్స్ బ్యాంకుల మొ. లెక్కలు టాలీ చేస్తున్నాం, నేనూ మరో ఇద్దరు క్లర్కులు. ఆర్.ఐ. గారు అయిదు నిమిషాలు కూర్చుని అసహనంగా ‘పోస్ట్‌మాస్టర్ లేరా నేను వచ్చి అరగంటయింది’ అన్నారు. నేనా ప్రశ్న అందుకోలేదు.
మరో అయిదు నిమిషాల్లో టాలీ అవగానే క్యాష్ కేషియర్ కిచ్చేసి, నేను ఆర్.ఐ. గారికి మళ్లీ నమస్కారం చేసి ఆయన ప్రక్కనే నిలబడి ‘ఆర్నెల్లబట్టి మీ చుట్టూ తిరుగుతున్నా నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు మీరు’ అన్నాను.
‘అడ్రస్ వెరిఫై చేయాలని చెప్పాను కదండీ. టైం పడుతుంది’ అన్నారారై గారు, నా నమస్కారం ఎడమచేతి చూపుడు వేలితో అందుకుని.
‘వెరిఫై చేయండి సార్. ఇదేం విజయవాడ, హైదరాబాద్ కాదు కదా! విశాఖపట్నం, విజయనగరం కూడా కాదు. ఆ రెండింటి మధ్యనున్న శృంగవరపు కోట. నేనీ ఆఫీసులో పని చేస్తున్నానని, నేను కాపు వీధిలో ఫలానా నంబరు ఇంట్లో ఉన్నాననీ నా అప్లికేషన్‌లో రాశాను.’
‘సరే చూద్దాం. కానీ, నేనొచ్చి గంటయింది. ప్రతి నెలాఖరు రోజున మీరివ్వవలసిన ఫిగర్సు ఇవ్వండి. మేస్టారు గారేరీ?’
సడెన్‌గానే వెళ్లి పోస్టుమాస్టారిగారి కుర్చీలో కూర్చున్నాను. ఆయన వింతగా చూశాడు. అతను వచ్చి పది నిమిషాలైనా కాలేదు.
‘అవును. నేనే పోస్టుమాస్టర్‌ని. ఆయన నాలుగు రోజులు సెలవు. మీకు కావలసిన ఫిగర్స్ ఏమిటి? ఈ నెలలో ఎంతమంది వివిధ పొదుపు ఖాతాలు తెరిచారు. ఎంతమంది ఎన్ని సేవింగ్సు సర్ట్ఫికెట్స్, కిసాన్ వికాస పత్రాలు కొన్నారు, వాటి విలువ ఎంత? అంతే కదా? నాలుగు రోజుల్లో పోస్ట్‌మాస్టర్ వస్తారు. అప్పుడు రండి’ అన్నాను.
‘అమ్మో! నేను రేపు విజయనగరం వెళ్లి కలెక్టర్ గారికి ఈ ఫిగర్సు ఇవ్వాలి’
‘ఏ రోజు ఫిగర్సు ఆ రోజు స్టాటిస్టికల్ రిజిస్టర్‌లో రాసి అవన్నీ కూడి ఇవ్వాలి. మా ఆఫీసులో ఒక గుమాస్తా సెలవు, పోస్టుమాస్టరు సెలవు. అంచేతనే 5 గంటలకే ఇంటికెళ్లిపోవలసిన మేమంతా ఏడు గంటలు కావస్తున్నా ఇక్కడే ఏడుస్తున్నాం. అంచేత మీ ఫిగర్సు ఇవ్వడానికి టైం పడుతుంది’ అన్నాను.
‘ఎలా ఇవ్వరో చూస్తా’ అంటూ ఆయన కోపంగా వెళ్లిపోయారు.
నాలుగు డి టీలు అదే, డొక్కు టీలు వచ్చాయి. అవి తాగి అందరం ఫిగర్సు వేస్తున్నాం.
ఫోను మోగింది. ‘హలో ఎవరండీ’ అన్నాను. ‘నేను తాసీల్దారు ఆఫీసు నుండి టి.టీ మాట్లాడుతున్నాను. మా ఆర్.ఐ. గారు వస్తే మీరు ఫిగర్సు ఇవ్వనన్నారట?’ ‘అవును’ అని ఫోను పెట్టేశాను.
మళ్లీ ఫోను. ఫోను తీయడం మానేద్దామనుకున్నా అయిదు గంటలతో మా ఆఫీసు సరికదా. అయినా తీశా. ‘ఎవరండీ?’
‘నేను తాసీల్దారు మాట్లాడుతున్నా! కృష్ణగారా? నమస్కారం ఫిగర్సు ఇవ్వకపోతే నా కొంప మునుగుతుంది. అది నా అసమర్థత అంటారు. జాయింట్ కలెక్టర్ గారు పోస్టల్ వాళ్లతో సత్సంబంధాలు పెట్టుకోవాలని తెలీదా? అంటారు.’
‘నేను సేవింగ్సు ఫిగర్స్ ఇవ్వననలేదు సార్. నేను రేషన్ కార్డు కోసం ఆర్నెల్లబట్టి తిరుగుతుంటే టైం పడుతుంది అంటున్నారు మీరు. నేను అదే మాట అంటున్నాను టైం పడుతుందని. అదీగాక మా ఆఫీసులో ఎంతో మంది డబ్బు దాచుకుంటారు. అది ఎవరికీ చెప్పకూడదు. అఫీషియల్ సీక్రెట్ యాక్టు ఒకటి ఉంది కదా! మీకు అంతగా ఫిగర్సు కావాలంటే కాగితం రాసివ్వండి. మా సూపరింటెండెంట్ గారికి పంపిస్తాను. విజయనగరం, ఆయన ఇమ్మంటే ఇస్తాను. నాలుగైదు రోజుల్లో వస్తుంది రిప్లై’ అన్నాను.
తాసీల్దారు గారు తెలివైనవారు చాలా. ‘మీకు కావలసింది రేషన్ కార్డే కదా! మీరు మా ఆఫీసుకు వస్తే ఇప్పుడే ఇస్తాం’ అన్నారు.
నేను వెళ్లాను. నరసింగరావు అనే గుమాస్తాగారు ఆఫీసు గేటు వద్దే ఎదురై నవ్వుతూ షేక్ హాండిచ్చి ‘రండి రండి తాసీల్దారుగారు మీ కోసమే చూస్తున్నారు. మీలాంటి వాళ్లుండాలి’ అన్నారు.
నేను తాసీల్దారు గారి ఛాంబర్స్ తలుపు వద్ద నిలబడి ‘నమస్తే సార్!’ అన్నాను చేతులు జోడించి. ఆయన తుళ్లిపడి లేచి నిల్చుని ‘అరె లోపలికి రండి కృష్ణగారూ’ అంటూ కుడిచేయి అందించాడు. నేనూ కుడి చెయ్యే అందించి కూచుని ‘నేను ఏ ఆఫీసుకి వెళ్లినా ఆఫీసు లోపలికి రమ్మంటేనే వెళతాను సార్. పోస్ట్ఫాసు గుమ్మానికి నో అడ్మిషన్ బోర్డు ఉన్నా మీ ఆర్.ఐ. గారు లోపలికి దూసుకొస్తుంటారు’ అన్నాను.
తాసీల్దారుగారు తన ప్రక్కనే నిల్చున్న ఆర్.ఐ. వైపు కోపంగా చూసి ‘అప్పారావూ, రెండు టీలు తీసుకురా నాకు, పోస్టుమాస్టర్ గారికీ, రెండు చాలు’ అన్నారు.
తాసీల్దారు గారు తన డ్రాయర్లోంచి ఒక దొంగ రేషన్ కార్డు తీసి నా పేరూ, వివరాలు నన్నడిగి రాశారు. పాత పేర్లు శుభ్రంగా కొట్టేశారు. స్టాంపు వేసి నాకిచ్చి ‘్ఫగర్సు ఎప్పుడిస్తారు? మీరు ఇప్పుడివ్వకపోతే అది నా అసమర్థత అనుకుంటారు’ అన్నారు.
‘నేను ఆర్నెల్లబట్టి తిరుగుతున్నా నాకు రేషన్ కార్డు ఇవ్వలేదని కలెక్టర్ గారికి రాసినా అది మీ అసమర్థతే అనుకుంటారు సార్! మీరు ఫోనులో సౌమ్యంగా మాట్లాడినప్పుడే ఈ కథ సుఖాంతం అవబోతున్నదని నాకు తెల్సిపోయింది. అందుకే ఫిగర్సు రెడీ చెయ్యమని మా వాళ్లకి చెప్పి ఇక్కడికి వచ్చా’ అన్నాను.
‘చాలా థాంక్స్ కృష్ణగారూ. నేను దొంగకార్డు ఇచ్చానని మీరు కూడా తప్పు ఫిగర్సు ఇవ్వకండి’
‘అలాగే సార్! కానీ ఇది ఇప్పటికీ దొంగ కార్డే. ఎందుకంటే మీరు సంతకం చెయ్యలేదు. నేను గమనిస్తూనే ఉన్నాను’ అన్నాను.
ఆయన నాలుక్కర్చుకొని సంతకం చేసి బ్రాకెట్టులో తన పేరు రాసి ఇచ్చారు. ‘జీపులో వెళ్లండి’ అన్నారు. నేను డి. టీ గారు పోస్ట్ఫాసు వెళ్లేసరికి ఫిగర్సు రెడీగా ఉన్నాయి. ఇచ్చేశాను.

-ఎ.వి.జి.కృష్ణ 96183 04663