S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శూర్పణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు(అరణ్యకాండ)

కామవశమైన ఆ రాక్షసి మాటలకు నేర్పుగల శ్రీరామచంద్రమూర్తి కోప్పడకుండా, మెత్తటి మాటలతో సందేహం కలగకుండా, తాను చెప్పేది స్పష్టంగా అర్థమయ్యేట్లు చెప్పాడిలా ఆమెకు. ‘రాకాసీ! దీనిని ముందు పెళ్లి చేసుకున్నాను. అయినా ఏంటంటావా? ఇప్పుడు ప్రియురాలైన దీనిని నేనెలా విడుస్తాను? అది ధర్మం కాదే? అది వుండవచ్చు.. నువ్వూ ఉండవచ్చు అంటావా? నీలాంటి అద్భుతమైన అందగత్తెకు సవతి పోరు వుండకూడదు. కాబట్టి నీకు దుఃఖం కలగక తప్పదు. నన్ను దుఃఖపెట్టటానికా పెళ్లి చేసుకోడం? కాబట్టి నా మీద భ్రాంతి వదిలిపెట్టు. నువ్వు కామం నిలుపలేనని అంటావా? ఇదిగో వీడిని చూడు. మంచి శీలం కలవాడు. నా తమ్ముడు. చూడడానికి ప్రియమైనవాడు. సహించరాని తేజం కలవాడు. లక్ష్మణుడనే పేరు కలవాడు. ఈ లక్ష్మణుడు భార్య లేనివాడు. అసమాన శౌర్యవంతుడు. సమర్థుడు. వనంలో వున్నాడ. అందగాడు. ఇదివరకు భార్యా సుఖం తెలియనివాడు. భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వయోగ్యుడు అవుతాడు. పూబోడీ! సవతి పోరు లేకుండా అతడిని భజించు’
అని శ్రీరామచంద్రుడు చెప్పగా విని ఆ రాక్షసి, రామ మోహం కళ్లకు కప్పి వుండడం వల్ల, తన విధవాగర్భాదాన నూతన మహోత్సవం నిమిషమైనా ఆలస్యం కావడానికి సహించలేక, లక్ష్మణుడితో, ‘ఓరుూ అందగాడా! నీ చక్కదనానికి సరైన అందగత్తెను నేనే. నీకు పెళ్లాం అవుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. వనాలలో, కొండలలో సంచారం చేద్దామా? రా.. పోదాం’ అన్నది. శ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకొన్న లక్ష్మణుడు, తానూ శూర్పణఖతో పరిహాసంగానే మాట్లాడాడు. ‘ఓసీ! వెర్రిపిల్లా! నేను బానిసను. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కూడా బానిసవై వీరి సేవ చేస్తావా? నీ చక్కదనానికి నువ్వు బానిసగా ఉంటావా? ఈ మహాత్ముడికి నేను బంటుగా సేవ చేస్తున్న సంగతి నీకు తెలియదేమో? నీకు తెలిసే అవకాశం లేదు. తెలుస్తే, నేనేంటి.. బానిసను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకొనేదానివి. అలాంటి సమృద్ధమైన అర్థం కలవాడిని నువ్వే సంతోషపెట్టగలవు. నిర్మలకాంతి కలదానివి కాబట్టి, నువ్వు, ఆయనే్న వరిస్తే నువ్వు చిన్న భార్యవై, కులుకుతూ ముద్దులొలకవచ్చు. మగవారికి పెద్ద భార్య మీద కంటే చిన్న భార్య మీదే ప్రేమ ఎక్కువ కదా? ఈ మాత్రం ఆలోచించలేవా? నినే్నమనాలి? ఇలాంటి వికార స్వరూపం గలదానిని, భయంకర స్వరూపం వున్నదానిని, ఆ సవతిని, పెద్ద పొట్టకలదానిని, ముసలిదానిని, జానకిని నెట్టి నిన్ను భార్యగా గ్రహిస్తాడు. ఇలాంటి పరమ సుందరిని వదిలి ఎవరు మనుష్య స్ర్తి కొరకు వేడుక పడతాడు?’ అని లక్ష్మణుడు పలికాడు శూర్పణఖతో.
లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీన, నిజమని నమ్మి, పర్ణశాలలో సీతతో వున్న శ్రీరామచంద్రుడి దగ్గరకు పోయి మదనతాపంతో ఇలా అంది. ‘ఈ విరూపను, సవతిని, ఈ కరాళను, నిర్ణతోదరిని గ్రహించి నువ్వు నన్ను గ్రహించడం లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే మింగి సవతి పోరు లేకుండా సుఖపడతాను’. ఇలా అంటూ శూర్పణఖ జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీత మీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు దాన్ని బిగపట్టి, కోపంతో లక్ష్మణుడితో ‘లక్ష్మణా! నీచులతో పరిహాసం ఆడడం తప్పు. అలా మనం చేసినందువల్ల కష్టం కలిగింది. దీని వాత పడకుండా సీతాదేవి ఎలా బతికి సుఖంగా ఉంటుందో ఆలోచించు. ఇది స్ర్తి. ఆయుధం ధరిచి యుద్ధానికి వచ్చింది కాదు. కాబట్టి చంపకూడదు. దీన్ని, బలగర్వంతో దేహం తెలియనిదాన్ని, రాకాసిని పట్టుకొని విరూపగా చేయి’ అన్నాడు. అప్పుడు శూర్పణఖ కంటే మహాబలశాలి అయిన లక్ష్మణుడు తటాలున కత్తి దూసి, అది ఎదిరించినా వదలక, దాని ముక్కు, చెవులు కోశాడు.
ముక్కు చెవులు ఈ విధంగా మొక్కలుపోగా, లబలబ నోరు కొట్టుకుంటూ, రొమ్ము గుద్దుకుంటూ, వానాకాలంలోని మేఘం అదిరినట్లు, అడవి ప్రతిధ్వనించేట్లు, పెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూ, నెత్తురు కారుతుంటే, వికార రూపం మరింత వికారం కాగా, మనుష్యులు తనను ఇలా చేశారే, నలుగురిలో నవ్వుల పాలైతిని కదా అని ఆక్రోశంతో ఏడుస్తూ అడవుల్లో పడి వేగంగా పరుగెత్తింది.
ఇలా పరుగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన వున్న తమ్ముడు ఖరుడిని చూసి, ఏడుపు ధ్వనితో ఆకాశం నుండి పిడుగు పడ్డట్లు దభీలున నేల మీద పడి పెద్దపెట్టున ఏడ్చింది. -సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12