S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రక్త సంబంధం

మనిషి ఏ స్థాయికి ఎదిగినా అతని మానసిక స్థితి ఒకప్పటిలానే ఉండాలి.. ఎదిగిన కొద్దీ వొదగాలి, ఉనికిని ఎన్నడూ మరచిపోరాదు - సంపాదన పెరిగితే ఆస్తిపాస్తులు ఏర్పడవచ్చు.. ఓడలంత కార్లల్లో తిరగవచ్చు కాని నేలవిడిచి సాము చేయరాదు. అమ్మ తినిపించిన గోరుముద్దలు.. నాన్న అందించిన చేతి ఊతలు మరువరాదు.
అర్ధాంగి చిటికెన వేలు పట్టుకున్నంత మాత్రాన అంతవరకు పెనవేసుకుని అల్లుకున్న పేగు బంధాలను, ప్రేమానురాగాలను మరచి మనరాదు, అందించిన తల్లిదండ్రులను.. నిచ్చెన లెక్కించిన స్నేహ బంధాలను విడరాదు అంటూ ఒక్కసారిగా పెల్లుబికిన కరతాళ ధ్వనుల మధ్య మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించాడు శంతన్ ప్రముఖ దర్శకుడు సినిమా సక్సెస్ మీట్‌లో.
ఇంకా చప్పట్లు మ్రోగుతూనే ఉన్నాయి... ఈ నా సక్సెస్ వెనుక అమ్మానాన్న గురువుల దీవెనలు, బంధుమిత్రుల ఆకాంక్ష.. ఇల్లాలి ప్రేరణ, ఆదరణ ఉన్నాయంటూ తన సీటులోకి వెళ్లి ఆశీనుడయ్యాడు, శంతన్.
చప్పట్లు చరిచిన వాళ్లల్లో ప్రముఖ పాత్రికేయుడు సృజన్ కూడా ఉన్నాడు. సృజన్‌కి అర్థం కానిది ఏమంటే శంతన్ అచ్చు తన పోలికలోనే ఉన్నాడు.. నెట్‌లో షేర్ చేసినట్లుగా తన మనోభావనలే ప్రకటితమైనవి తన ప్రసంగంలో. ఇది ఎలా సాధ్యం? ఎంత వెతికినా బోధపడలేదు సృజన్‌కి.
* * *
ఆ రోజు మదర్స్ డే-
పేపర్ తిరగేస్తున్నాడు శంతన్ - ఆ రోజు పేపరంతా అమ్మ గురించే - అమ్మతో తన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదుల్తున్నాయ్.. మనసులో మెదల్తున్నాయ్.
‘కథ చెప్పమ్మా...’ మొదలయ్యేది దినచర్య.
అమ్మ బుజ్జగింపుగా పొద్దు పొద్దునే్న కథలు చెప్పుకుంటూంటే మన డ్యూటీ ఎలా చేస్తాం. అందుకని రాత్రి వెనె్నట్లో ఎంచక్కా మనం కథలు చెప్పుకుంటూ నిద్దరపోదాం.. సరేనా!! - అంటూ అమ్మ చెప్పకుండానే అందమైన కథ కళ్ల ముందు కదలాడేది - నిండు చందమామ చుట్టూరా అందమైన తారలు, ఆ వెనె్నల ఆకాశ వీధులు అందులో నేనో రాజకుమారుణ్ని - ఊహకొచ్చేవి. అమ్మ ఒడి ఊయల ఆ వెనె్నట్లో.. ఇది గతం.
వాస్తవానికి తెస్తూ నానిగాడు.. నాన్నగారు అమ్మ మీద ఓ వ్యాసం రాసివ్వరూ అంటూ కుదిపాడు. మదర్స్ డేకి ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్నాడు. అంతే అమ్మతో నా చిన్ననాటి అనుభవాలు గుదిగుచ్చి పేపర్ మీద పెట్టాను. వాడు చదువుకుని చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ప్రెజెంటేషన్ చేయటానికి ప్రిపేర్ అయి చదువుతున్నాడు - నేను స్నానానికి లేచాను.
నా భార్య సుధారాణి పేపర్ సర్దుతూ గొణుక్కుంటోంది. ఈయనగారు పేపర్ ఎలా అంటే అలా వదివెళ్తారు, వాడేమో పుస్తకాలన్ని ఇల్లంతా పేర్చేస్తాడు. నడుములు నలిగిపోతున్నాయ్ సర్ది సర్ది. మామూలే ప్రతి ఇంట్లో గృహిణికి - అందుకే తనని భూదేవితో పోలుస్తుంటారు ఓర్పుకి. ఇలా అనుకుంటూ స్నానం ముగించుకొని పూజ గదిలోకి వెళ్లాడు శంతన్.
* * *
లాన్‌లో కూర్చుని పేపర్ తిరగేస్తూ కాఫీ తాగుతున్నాడు సృజన్, తండ్రి ప్రకాశరావుగారు ‘సృజన్ ఈ రోజు మదర్స్ డే ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్తున్నావా.. పేపర్లో చదివాను.’
‘అవును డాడీ’ అంటూ ఆహ్వాన పత్రిక అందించాడు సృజన్.
ఈ రోజు సాయంత్రం శ్రీమతి ప్రసూనాంబగారికి ‘మహోపాధ్యాయ’ బిరుదు ప్రదానం సృజన్ చేతుల మీదుగా... ఆమెగారి ఉత్తమ ప్రతిభకి గుర్తింపుగా. అందులో ఉన్న ప్రసూనాంబగారి ఫొటోను చూస్తూ పరుగందుకున్నాడు ప్రకాశరావు గారు ఇంటిలోనికి.
* * *
మదర్స్ డే ఫంక్షన్ సాయంత్రం స్కూలు ఆవరణలో ఆరంభమైంది. మొదట ప్రార్థనా గీతం. తదుపరి జ్యోతి ప్రజ్వలన. ఆ తర్వాత కమిటీ సెక్రటరీ తొలి పలుకులు.. ఒకటొకటిగా జరిగిపోతున్నాయ్. సభ ప్రారంభమయ్యింది - అతిథులు, ఆహ్వానితులు, అధ్యక్షులతో వేదిక నిండుగా ఉంది. ముందు వరుసలో ప్రకాశరావుగారు కూర్చున్నారు వి.ఐ.పి.లకు కేటాయించిన చైర్‌లలో.
శ్రీమతి ప్రసూనాంబ గారికి సృజన్ చేతుల మీదుగా సన్మానం, బిరుదు ప్రదానం జరుగుతుండగా శంతన్ కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. సృజన్, శంతన్ ఇద్దరూ ప్రసూనాంబ ఆశీర్వాదం పొందారు. తనని అమ్మగా భావించి, మదర్స్ డే నిండుగా అన్పించింది ప్రకాశరావుకి. శంతన్, సృజన్ ఇద్దరూ కవలల్లా అగుపించారు ప్రసూనాంబగారికి. ఆ కార్యక్రమం కన్నుల పండువుగా జరిగింది.
తదనంతరం ప్రసూనాంబగారు మైకందుకుని తనకి జరిగిన ఘన సత్కారానికి.. ఘనత వహించిన ఎందరో కళావతంసులని స్తుతిస్తూ కృతజ్ఞతలు సభాముఖంగా తెలియచేసుకున్నారు. న్యాయనిర్ణేతలు సూచించిన మేరకు సాంస్కృతిక విభాగం వారు విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నారు శంతన్, సృజన్ చేతుల మీదుగా.
చిట్టచివరిగా ఒక వ్యాస రచన పోటీపై బహుమతికి విజేతలుగా ఇద్దరూ సమంగా నిలిచారు. ‘అమ్మ మీద...’ రాసిన వ్యాసం ఇద్దరు విద్యార్థులు ఒకే రీతిలో అమ్మను ఆవిష్కరించారు. ఇంచుమించుగా ఇద్దరికి ఇద్దరూ ఒకే స్థాయిలో మార్కులు సంపాదించుకున్నారు. న్యాయ నిర్ణయం నన్ను చేయమన్నారు.
ఎంత తూచినా త్రాసులో ఇద్దరూ సమంగా తూగుతున్నారు. కనుక దయచేసి ఇద్దరు విద్యార్థులు.. వారివారి పేరెంట్స్‌తో సహా వేదిక పైకి వచ్చి వివరణ ఇవ్వవలసినదిగా కోరుతున్నాను’ అంటూ ముగించింది, సాంస్కృతిక విభాగం కార్యదర్శి.
ఇద్దరు విద్యార్థులు వచ్చి శంతన్, సృజన్ ప్రక్కగా వచ్చి నిల్చున్నారు. ఆశ్చర్యం.. శంతన్, సృజన్ కవల పిల్లల్లా అనిపించారు సభికులందరికీ. అదే అనుభూతి ప్రసూనాంబకి కలిగింది.. కాని ఇది ఎలా సాధ్యం?
ప్రకాశరావుగారు స్టేజిపైకి వచ్చి సభాధ్యక్షుల వారి అనుమతి తీసుకుని మైకు వద్దకు వచ్చి తొలిగా సభకు నమస్కారం. నేను వేదిక మీదికి రావలసిన అవసరాన్ని కల్పించారు చిన్నారులిద్దరూ; వారివారి తండ్రులు. సభలో కలకలం మొదలయ్యింది ప్రకాశరావుగారి ఎంట్రీతో. ప్రకాశరావుగారు ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘అమ్మా ప్రసూనాంబా! మీరు నాకప్పగించిన కవలల్లో ఒకడు సృజన్.. ఇప్పుడు మీ ముందున్నాడు.’
ఇద్దరినీ సమీపించింది ప్రసూనాంబ. సృజన్, శంతన్ ఒకరినొకరు గట్టిగా చేతులు కలిపారు.
ఆ ఇద్దరినీ చూస్తున్న ప్రసూనాంబగారికి గతం కళ్ల ముందు మెదలింది - అమ్మ అప్పుడప్పుడు తను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన మధనం ఇప్పుడర్థమయ్యింది శంతన్‌కి. శంతన్ అమ్మ కళ్లల్లోకి చూస్తూ ‘నువ్వు కోల్పోయిన శాంతి ఇప్పుడు దొరికిందా అమ్మా...’ అంటూ అమ్మని గట్టిగా స్పృశించాడు ఆనందం అర్ణవమై.
సృజన్‌కి ‘శంతన్ అచ్చు తనలా ఎలా ఉన్నాడో.. తన భావనలే పలికాడో..’ ఇప్పటికి అవగతమైంది. ఆనందం అంబరమయ్యింది. ఇద్దరు బిడ్డల్ని దగ్గరగా చూసుకున్న ప్రసూనాంబకి సంతోషం అమితమైంది.
‘బామ్మా’ అంటూ పిల్లలిద్దరూ ప్రసూనాంబని అల్లుకుపోయారు.
అలా అల్లుకుపోయిన చిన్నారి శంతన్, సృజన్‌లను ఆ ప్రాయంలో విడదీయవలసిన పరిస్థితులను, సృజన్‌ని పొరుగున ఉన్న ప్రకాశరావు గారికి అప్పగించవలసి వచ్చిన ఆర్థిక దుస్థితులను.. పిల్లలే కలగని ప్రకాశరావుగారి దంపతుల అభ్యర్థనను.. కొడుకు, కోడళ్లకి వివరణ ఇచ్చి ప్రసూనాంబ మనవలిద్దర్నీ ఒద్దికగా ముద్దాడుతూ ప్రపంచాన్ని మరిచిపోయింది. ‘రక్త సంబంధాన్ని’ ఒక కప్పు కిందికి చేర్చినందుకు పరమాత్మునికి కైమోడ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంది.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505