S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సొగసుపై మనసు !

========================
నేడు - అందమే ఆనందం..
మనుషులంటే 34, 24, 34 కొలతలే..
అంకెల మధ్య కుదించుకుని, కుదించుకుని..
నవ్వినా..
మాట్లాడినా..
నడిచినా..
కూర్చున్నా.. సౌందర్యమే..
ఇలా అందం పోటీయైన చోట
అందం సరుకైన చోట
ప్రతీదీ వ్యాపారమే..
అందుకే దైవమిచ్చిన సహజ సౌందర్యాన్ని వదిలి..
కృత్రిమ సౌందర్యాలకై వెంపర్లాడుతూ..
ఈ ‘స్వచ్ఛంద సౌందర్య హింస’ సహజాతమని నమ్ముతూ..
ముందుకెడుతోంది నేటి తరం.
=========================

అతిశయోక్తిగా అనిపించినా నేటి తరానికి అందం ఇచ్చినంత ఆనందం మరేదీ ఇవ్వదు! అందుకే ముఖంలో ఏ మాత్రం కళ తగ్గినా, ముఖంపై చిన్న మచ్చ పడినా అంతులేని వేదన, దిగులు, ఒత్తిడి.. ఏదో ప్రళయం ముంచుకొచ్చినట్టుగా కలవరపడిపోతోంది ఈ తరం. వయసుతో పాటు వచ్చే మార్పులను ఆపలేమని తెలిసినా యవ్వన నిగారింపును తిరిగి పొందటానికి ఎనె్నన్నో ప్రయత్నాలు. ముడుతలు లేని చర్మం కోసం, వృద్ధాప్య ఛాయలు లేని సొంపైన సౌందర్యం కోసం ఎంతగానో ఆరాటం.. ఇది అసహజమైనదేమీ కాదు.. అనాదిగా మనిషి మనసులో మెదులుతూ వస్తున్న సౌందర్య కాంక్షకు ప్రతీక ఇది.. ఆధునిక వైద్యరంగం కూడా ఇందుకు ఎనె్నన్నో పరిష్కార మార్గాలను చూపిస్తోంది. చర్మంపై ఉన్న సూక్ష్మమైన పొరలను తొలగించే మైక్రోడెర్మబ్రేజన్, నలుపును తగ్గించే కెమికల్ పీల్స్, ముడతలను నిర్మూలించే బొటాక్స్ ఇంజక్షన్లు, ముక్కును సరిదిద్దడానికి రైనో ప్లాస్టీ, అందచందాలను తీర్చిదిద్దే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్.. ఇలా ఎన్నో విధానాలతో అందాలను తీర్చిదిద్దుతున్నారు వైద్యులు.
మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రూప లావణ్యంపై మోజు ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతోంది. అందం కోసం చాలామంది తహతహలాడుతున్నారు. మహిళలకంటే ఎక్కువగా పురుషులు భౌతికరూపంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. తీరైన తలకట్టు, ముఖాకృతి, ఆరుఫలకాల (సిక్స్ ప్యాక్) దేహం కోసం కొత్త కొత్త మార్గాలను అనే్వషిస్తున్నారు. మహిళలు వివిధ రకాల శస్త్ర చికిత్సలతో అందమైన శరీరాకృతిని సొంతం చేసుకుంటున్నారు. బండ పెదాలను నాజూకుగా, పెద్ద ముక్కును చెక్కేసి సంపంగిలా, లోపలికి వెళ్లిపోయిన బుగ్గలను చూడముచ్చటగా తీర్చిదిద్దుకుంటున్నారు. పొత్తికడుపుపై ఫలకాలను రప్పించడం, ఛాతీ భాగాన్ని పెంచి, బట్టతలపై వెంట్రుకలను మొలిపించే శస్తచ్రికిత్సలు చేయించుకుంటున్నారు. వెండితెర హీరోల మాదిరిగా దేహరూపం పొందేందుకు ఖర్చుకు వెరవకుండా శస్తచ్రికిత్సల బారిన పడుతున్నారు. తాము కోరుకున్న ఆకృతిలో కండరాలను మలచుకునేందుకు కొందరు జిమ్‌లకు వెళుతుండగా, మరికొందరు శ్రమలేకుండా లైపోసెక్షన్ చికిత్సలను ఎంచుకుంటున్నారు.
సినీ ప్రముఖుల్లో తీరైన నాసిక కోసం శ్రీదేవి, జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్.. సన్నగా, నాజూగ్గా కనిపించడానికి కరీనా కపూర్, దొండపండు వంటి పెదవుల కోసం అనుష్క శర్మ.. ఇలా హీరోహీరోయిన్లందరూ సినీ పరిశ్రమ అంచనాలను చేరుకునేందుకు శస్తచ్రికిత్సలు చేయించుకున్నవారే. ప్రేక్షకుల్ని అలరించి, మార్కెట్లో తమ డిమాండ్ పడిపోకుండా చూసుకునేందుకు ఇలాంటి పాట్లు పడుతున్నా అమాంతం బరువు తగ్గిపోవడం, అనవరమైన శస్తచ్రికిత్సలు చేయించుకోవడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ‘సైజ్ జీరో’ అంటూ 2009లో కరీనా కపూర్ అందుకున్న పల్లవి మనదేశంలో సంచలనం సృష్టించింది. ఆమే కాదు చాలామంది హీరో హీరోయిన్లు సౌందర్యపరమైన శస్తచ్రికిత్సలు చేయించుకుంటూ చికిత్సకు ముందు, ఆ తరువాత కనిపించిన తీరును సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
సౌందర్యపరమైన శస్తచ్రికిత్సలనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు మైఖేల్ జాక్సన్. ఈ పాప్ ధ్రువతార ముక్కు, బుగ్గలు, గడ్డం, దవడలు.. తదితర భాగాలకు అనేకానేక శస్తచ్రికిత్సలు చేయించుకున్నాడు. అప్పుడే అందుబాటులోకి వస్తున్న ప్రమాదకర చికిత్సలను ఆయన ఎంచుకోవడం విశేషం. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఆయన పనె్నండు శస్తచ్రికిత్సలను చేయించుకున్నాడట!
ఏటా రూపలావణ్యం కోసం చేస్తున్న కాస్మొటిక్ శస్తచ్రికిత్సల సంఖ్య పెరుగుతూ పోతోంది. యువతరమే కాదు వయసు మీద పడిన వారు కూడా సౌందర్య చికిత్సల పట్ల మొగ్గు చూపుతుండటం ఆశ్చర్యకరం. కేవలం డబ్బున్న వారు మాత్రమే వీటి జోలికెళుతున్నారు అనుకుంటే పొరబాటే.. మధ్య తరగతి వారు కూడా కాస్మొటిక్ శస్తచ్రికిత్సల బాట పడుతున్నారు. అందంపై తహతహ రోజురోజుకీ పెరిగిపోతుండడంతో శస్తచ్రికిత్సలకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్గానిక్ ఫేషియల్, హెయిర్ గ్లాజింగ్ ట్రీట్‌మెంట్, ఆయుర్వేదిక్ ట్యాన్ రిమూవల్‌తో పాటు వివిధ రకాల ఆమ్లాలతో మొటిమలను నివారించే పద్ధతులు కూడా అందుబాటులోకి రావడంతో ఆ చికిత్సలను చేయించుకుంటున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం దేశంలోని పురుషుల్లో మూడో వంతు మంది ఇరవై ఏళ్ల వయసులోనే తల వెంట్రుకలు ఊడిపోతూ బాధపడుతున్నారు. ఇలాంటివారంతా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం బారులు తీరుతున్నారు. తల వెనుక, పక్కన ఉన్న వెంట్రుకలను తీసి తల పై భాగంలో చర్మానికి గాటు పెట్టి వెంట్రుకలను నాటుతారు. ఇక ఆడవాళ్ల విషయానికొస్తే మూడో వంతు ఆడవారు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్, బ్రెస్ట్ లిఫ్టింగ్‌కు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా శరీరాకృతి అందంగా కనిపిస్తుందని వారి భావన. ఇక మొటిమలు, మచ్చలను తొలగించుకునేందుకు వైర్‌బ్రష్, గరుకైన వజ్రంతో తయారుచేసిన చక్రం సాయంతో ముఖం పై చర్మం మీది పొలుసులతో నిండిన పై పొరను తీసేయించుకుంటున్నారు. దీంతో ఏర్పడిన పుండ్లు మాని కొత్త చర్మం వస్తుంది. కొందరైతే సొట్టబుగ్గల కోసం తాపత్రయపడుతున్నారు. బుగ్గ లోపలి భాగంలో చిన్న పాటి గాటు పెట్టి రెండు అంచులను కుట్టేయడంతో బుగ్గ బయటి భాగంలో సొట్ట ఏర్పడుతుంది. సహజ సిద్ధంగా వచ్చిన రూపాన్ని, తమకు నచ్చిన ఆకృతికి మార్చుకోవాలని కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా శరీరానికి రకరకాల ఇనె్ఫక్షన్లు, దుష్ప్రభావాలు కలుగుతున్నాయి.
చర్మ సోయగం
చర్మం నిగనిగలాడుతుంటే ఆ సోయగమే వేరు. మనసంతా ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. కణకణాన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది. అందుకేనేమో అనాదిగా చర్మ సౌందర్యం మన జీవితంలో భాగంగా మారిపోయింది. అందంగా కనిపించడానికే కాదు, శరీర రక్షణకు కూడా చర్మమే కీలకం. పైకి ఒకలా కనిపించినా చర్మాన్ని మూడు పొరలుగా విభజించవచ్చు. కంటికి కనిపించే పై పొర ( ఎపిడెర్మిస్) కోట గోడలా శరీరానికి రక్షణగా నిలుస్తూ సూక్ష్మక్రిముల వంటివి ఒంట్లోకి చొరబడకుండా నిరంతరం కాపాడుతుంటుంది. చర్మానికి రంగునిచ్చే మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసేది కూడా ఇదే. దీని కింది పొర డెర్మిస్. చెమట, నూనెలను ఉత్పత్తిచేయడం, స్పర్శ జ్ఞానం, చర్మానికి రక్తాన్ని చేరవేయడం వంటి వాటికి ఇది తోడ్పడుతుంది. దీని కింద ఉండేది కొవ్వు పొర. ఇది శరీరంపై అన్ని చోట్లా ఒకేలా ఉండదు. కంటి రెప్పల వద్ద పలుచగా ఉంటే, కడుపు, తొడలు, పిరుదుల వద్ద చాలా మందంగా ఉంటుంది. డెర్మిస్‌లో మొదలయ్యే రక్తనాళాలు, నాడీ కణాలన్నీ కూడా దీనిగుండానే ఇతర భాగాలకు వెళ్తాయి. ఇది కండరాలకు, ఎముకలకూ వెన్నుదన్నుగా నిలుస్తూ.. దెబ్బల వంటివి తగిలితే షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తూ అంత నొప్పి కలగకుండా కాపాడుతుంది. చర్మం అందంగా నిగనిగలాడుతూ కనబడేలా చేసేది కూడా ఇదే.. ఇది క్షీణిస్తున్న కొద్దీ చర్మంపై ముడుతలు, గుంతలు పడటం, కళ తగ్గడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలను కప్పిపుచ్చడానికి ఖరీదైన సౌందర్య సాధనాలను ఎంచుకుంటూ ఉంటాం. కానీ వాటికి మించిన మెరుగైన, దీర్ఘకాలపు ఫలితాలను చర్మ చికిత్సల ద్వారా పొందవచ్చు.
చర్మ చికిత్సలు
ఫేస్ లిఫ్ట్
వయసుపైబడే కొద్దీ చర్మం అడుగున కొవ్వు కణాలు, కొల్లాజెన్ కరిగిపోతాయి. దాంతో యాభై ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి చర్మంపై ముడుతలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. చర్మం పలుచబడి కళ్లకింద, పెదవులు, కళ్లచుట్టూ ముడుతలు చోటుచేసుకుంటాయి. ఈ దశకి చేరుకున్నవారికి ఈ చికిత్సను చేస్తారు. చర్మపు నిగారింపును పెంచడమే ఈ చికిత్స ముఖ్య ఉద్దేశం. సర్జరీలో ముఖానికి రెండువైపులా చెవుల ముందు, వెనుక చిన్న కోతలు పెట్టి వాటి ద్వారా చర్మం, కండరాల పొరల్ని పైకి లేపి కణజాలాన్ని బిగుతుగా చేస్తారు. ఆ తర్వాత అదనంగా సాగిన చర్మాన్ని కత్తిరించి కుట్లు వేస్తారు. ఈ కుట్లు చర్మంలో కలిసిపోతాయి.
బొటాక్స్ ఇంజక్షన్స్
ముడుతల వల్ల వయసుకి మించి కనిపించేవారికి బొటాక్స్ ఇంజక్షన్లు అనువైనవి. ఇవి ఫేస్‌లిఫ్ట్ చేయించుకుంటే ఎలాంటి ఫలితాలొస్తాయో అలాంటి ఫలితాలే కలుగుతాయి. చర్మం విపరీతంగా సాగే గుణం ఉన్నవాళ్లకి ఈ చికిత్స వల్ల ఆశించిన ఫలితం కనిపించదు. హీరో హీరోయిన్లు ఈ ఇంజక్షన్లని ఎక్కువగా వేయించుకుంటారు. ఇవి ముఖంలో ముడుతల ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనే ఇస్తారు. కొందరికి కళ్ల చివర్లలో ‘క్రోస్ ఫీట్’ గీతలు ఏర్పడతాయి. కొందరికి ముక్కుకి రెండువైపులా ‘నోసలోవియల్ గ్రూప్స్’ ఏర్పడతాయి. మరికొందరికి పెదవుల చుట్టూ ‘లాఫింగ్ లైన్స్’ ఏర్పడతాయి. ఇలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఏర్పడిన ముడుతలు, గీతల్ని తొలగించడం కోసం ఆయా ప్రాంతాల్లో కండరాల్లోకి బొటాక్స్ ఇంజెక్షన్లు ఇస్తారు. దాంతో ముడుతలు తొలగి చర్మం బిగుతుగా మారుతుంది.
డెర్మాబ్రేషన్
రసాయనాలకు బదులుగా నేరుగా చర్మపు పై పొరలను తొలగించే చికిత్స డెర్మాబ్రేషన్. ఇందుకోసం డెర్మాబ్రేడర్స్ అనే పరికరంతో చర్మాన్ని సున్నితంగా రుద్ది చర్మపు పై పొరల్ని తొలగిస్తారు.
కెమికల్ పీల్స్
ఈ చికిత్స కూడా చర్మపు బాహ్య పొరలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. కెమికల్ పీల్స్‌తో చర్మంపై మచ్చలు, ముడుతలను తొలగించవచ్చు.
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోడానికి రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే వక్షోజాలు బిగుతుగా మారడానికి, ముక్కు సంపెంగలా మారడానికి, పెదవులు అందంగా మారడానికి ఎన్నో రకాల కృత్రిమ పద్ధతులు ఉన్నాయి. అయితే వీటి ఫలితం పది శాతమే.. కానీ ప్రచారం మాత్రం తొంభై శాతం. వీటిలో వాడే రసాయనాల వల్ల మొదట కొంతమేర ఫలితం కనిపిస్తుంది. తరువాత క్రమంగా ఫలితం తిరగబడుతుంది.
సహజసిద్ధ చర్మ ఆరోగ్యానికి..
చర్మం ముడుతలు లేకుండా మంచి మెరుపుతో నిగారించాలంటే సహజసిద్ధంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
* కంటి నిండా నిద్రపోవాలి. నిద్రలేమి ప్రభావం మొదటగా కనిపించేది చర్మం పైనే..
* మంచి పోషకాహారం తీసుకోవాలి.
* తాజాపళ్లు, కూరగాయలను తీసుకోవాలి.
* మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
* కూల్ డ్రింక్స్‌కు బదులుగా తాజా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి.
* శ్వాస సంబంధ వ్యాయామాల వల్ల చర్మం యవ్వనవంతంగా ఉంటుంది.
* ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించాలి.
* చర్మ సమస్యలకు సొంత వైద్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
* బోర్లా పడుకునే అలవాటు మానుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల ముఖంపై ఎక్కువ ముడతలు, గీతలు ఏర్పడతాయి.
బ్రిటన్‌లో..
ఆఫీసు సమయంలో మధ్యమధ్యలో ఆడవాళ్లు కానీ, మగవాళ్లు కానీ వాష్‌రూమ్‌కి వెళ్లి అందం తఒతతగా, ఫ్రెష్‌గా కనిపించడానికి ముఖం కడుక్కునో, తలదువ్వుకునో వస్తుంటారు. అయితే బ్రిటన్ ఉద్యోగులు మాత్రం ఫ్రెష్ లుక్ కోసం ఆఫీసులో మధ్యలో వెళ్లి బొటాక్స్ ఇంజెక్షన్స్‌ని చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లో ఇలాంటి మగాళ్లు పదిశాతం వరకూ ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ పదిశాతం మంది భోజన విరామ సమయంలో వాష్‌రూమ్‌కి వెళుతున్నామని చెప్పి గుట్టుగా ఎవరికీ తెలియకుండా ముఖానికి బొటాక్స్ ఇంజెక్షన్స్ వేయించుకుని ఏమీ ఎరుగని అమాయకుల్లా మెరిసిపోయే ముఖంతో తమ సీట్లలోకి వచ్చి కూర్చుంటున్నారు. ఇంటికి కూడా అదే గ్లోతో వెళ్లినప్పటికీ అసలు రహస్యాన్ని వీళ్లు తమ భార్యలకు కూడా చెప్పడం లేదట. బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ముఖంపై ముడుతలు దాదాపుగా వెంటనే మాయమైపోతాయి. బ్రిటన్‌లో ప్రధానంగా 35-45 మధ్య వయసులోని మగవాళ్లు, కొత్తగా విడాకులు తీసుకున్న మగవాళ్లు రహస్యంగా బొటాక్స్‌ను ఆశ్రయించి ఇన్‌స్టంట్‌గా మన్మథావతారం ఎత్తుతున్నారు. అమ్మాయిలను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పైగా అమ్మాయిలు ఎక్కడ కనుక్కుంటారో అని క్రెడిట్ కార్డు, బ్యాంకు అకౌంట్లలో వయసు కనిపించకుండా ఉండడం కోసం వీరు తమ కార్డులను వాడకుండా, క్యాష్ రూపంలో మాత్రమే బిల్లులను చెల్లిస్తున్నారట. ఈ ధోరణి ఇంకా ఇండియాకు ఇంకా రాలేదు. వస్తే బొటాక్స్‌కు కొరత ఏర్పడుతుందేమో.. ఎందుకైనా మంచిది అమ్మాయిలూ.. కాస్త జాగ్రత్తగా ఉంటూ అబ్బాయిల వయస్సుపై దృష్టి పెట్టండి. లేకపోతే బురిడీ కొట్టించేస్తారు ఈ అబ్బాయిలు.
బొటాక్స్ అంటే..
బొటాక్స్ అంటే క్లాస్ట్రీడియమ్ బొటులినమ్ అనే బ్యాక్టీరియా నుంచి లభించే ఓ విషం. ఈ గరళం నరాల మీద పనిచేస్తుంది. నరాలపై పనిచేసే విషయాలను న్యూరో టాక్సీన్స్ అంటారు. ఒకవేళ ఈ విషయంతో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటే పక్షవాతం వచ్చినట్లుగా ప్రధాన కండరాలన్నీ చచ్చుబడిపోతాయి. అంతటి ప్రమాదకరమైన ఈ విషయం ముడుతలు ఉన్న చోట శరీరానికి అనుసంధానమైన కండరాలకు దీన్ని ఇచ్చినప్పుడు నరాల నుంచి వచ్చే సిగ్నళ్లకు ఈ విషం అడ్డంకిగా నిలుస్తుంది. దాంతో ఆ ముడుతలు తెరచుకుంటాయి. అలా బొటాక్స్ ముడుతలను నివారిస్తుంది. దాంతో ముఖం సాఫీగా మారి వనంగా వారి కాంతులీనుతుంది.
అందానికి వాడే కాస్మొటిక్ డ్రగ్‌గా వీరవిహారం చేసిన బొటాక్స్.. ఇప్పుడు మల్టీటాస్కింగ్ చేస్తూ ఆరోగ్యానికి సంజీవని అయ్యింది. పాము కాటుకు పాము విషమే పనిచేసినట్లు ఎన్నో వ్యాధులకు ఈ విషం మందుగా మారింది. బొటాక్స్ కేవలం ముఖంపై ఉన్న ముడుతలను తగ్గించడానికి పనికి వస్తుందనేది ఒకనాటి మాట. ఇప్పుడు ఇది మైగ్రేన్, డిప్రెషన్, కళ్లు పదే పదే చికిలించడం, మాటిమాటికీ మూత్రం వస్తుండటం, కాళ్లు, చేతులకు అతిగా చెమటలు పట్టడం.. వంటి సమస్యలన్నింటికీ ఇది దివ్యౌషధమైంది.
తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాడొక పేషెంట్. ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు అతడిని మాటిమాటికీ వేధిస్తోంది. ఎన్నో డోసుల యాంటీ డిప్రెషన్ మందులు వేసుకున్నా ఫలితం లేదు. ప్రముఖ సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ నార్మన్ రోసెంథెల్‌కు విభిన్నంగా ఓ ప్రయత్నం చేద్దామనిపించింది. ఈయన ఆ పేషెంట్‌కి బొటాక్స్ ఇచ్చి చూద్దాం అని ఇచ్చాడు. కొద్దిరోజుల్లోనే మెరుగైన ఫలితం కనిపించింది. వెంటనే ఆ డాక్టర్ ఇంకా 793 రకాల జబ్బులకు బొటాక్స్‌తో చికిత్స సాధ్యం అంటూ ఓ అధ్యయనంలో వెల్లడించాడు.
ఏది ఏమైనా అందం పోటీయైన చోట, అందం సరుకైన చోట, అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం.. మన మనుగడకు అందం అనివార్యమైన చోట.. అలాంటి మనుగడనే విసర్జిద్దాం (విస్మరిద్దాం).
*

--ఎస్.ఎన్. ఉమామహేశ్వరి