S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శూర్పణఖ ప్రేరేపణతో శ్రీరాముడితో యుద్ధానికి పోయిన ఖరుడు (అరణ్యకాండ)

భయంకరంగా గట్టిగా ఏడ్చుకుంటూ, జనస్థానంలో వున్న ఖరాసురుడి దగ్గరకు వచ్చిన శూర్పణఖను (రాక్షస నాశనానికి కారకురాలు కాబోతున్న) చూసి ఖరుడు ఇలా అన్నాడు. ‘ఎందుకే మళ్లా ఏడుస్తూ వచ్చావు? నువ్వు కోరినట్లే, నీ ఇష్ట ప్రకారమే, మిక్కిలి శూరులైన రాక్షస శ్రేష్ఠులను నీ వెంట పంపాను కదా? ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఆ పధ్నాలుగు మంది నేనంటే భక్తి కలవారు. చెప్పిన కార్యం చేయక మానరు. మిక్కిలి ధీరులు. అనురాగం కలవారు. యుద్ధంలో ఓటమి ఎరుగని వారు. పరులకు జయించరానివారు. అయ్యో! నాథా అని ఆడుపాములాగా పొరలి పొరలి ఏడుస్తున్నావెందుకే? ఏ కారణాన ఏడుస్తున్నావు? ఉన్న విషయం చెప్పు. దీనురాలివై, అయ్యో! నాకు దిక్కెవరూ లేరని ఏడుస్తూ వున్నావెందుకు? నేనున్నాను కదే నీకు దిక్కు. అక్కడ ఏం జరిగిందో చెప్పవే. భయం వదలవే’
ఇలా ఖరుడు అనగానే, కన్నీళ్లు చేత్తో తుడుచుకొని, లేచి కూర్చొని, తోడబుట్టిన వాడిని ఊచసి ‘నా పగ తీర్చడానికి నువ్వు బలవంతులైన పధ్నాలుగు మంది రాక్షసులను పంపిన మాట వాస్తవమే. అయినప్పటికీ నువ్వు పంపిన వారందరూ రాముడి పదునైన, భయంకరమైన బాణాలకు చీల్చబడ్డ శరీరాలతో క్షణకాలంలో నిలబడి చచ్చిపోయారు. అది చూసిన నేను, అక్కడ వుంటే ననే్నం చేస్తారోనన్న భయంతో, గాలి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చానిక్కడికి. అప్పుడు పుట్టిన వణుకు ఇప్పటికీ తగ్గలేదు. ఖరుడా చూడు, నా మాట అసత్యమేమో? గొప్ప విషాదమనే మొసళ్లను, మహా భయమనే అలలను కల పెద్ద దుఃఖం అనే సముద్రంలో మునిగిన నన్ను లేవదీయి. నీ పని కోసం పోయిన రాక్షసుల మీద, తోబుట్టువైన నా మీద, నీకు కొంచెమైనా దయ నిజంగా ఉంటే, నువ్వు రాముడిని ఎదిరించి, యుద్ధం చేసే ధైర్యం ఉందా? వుంటే, ఏదీ చూద్దాం.. తక్షణమే ఆ రాక్షసుల పాలిటి ముల్లైన రాముడి మీదకు యుద్ధానికి బయల్దేరు’
‘చనిపోయిన రాక్షసుల మీద, బతికున్న నా మీద, దయ లేకున్నా, రాముడిని ఎదిరించి యుద్ధం చేసే ధైర్యం లేకున్నా, నాతోపాటు నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. నేను ఏడుస్తుంటా.. నువ్వు సంతోషంగా నవ్వుతుండు. ఆయన నిశాట కంటకుడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నా వదిలిపెట్టడు. ఎప్పటికైనా పక్కనున్న ముల్లు గుచ్చుకోకుండా ఉంటుందా? నాకు శత్రువైన శ్రీరామచంద్రమూర్తిని నువ్వు చంపడానికి ప్రయత్నం చేయకపోతే, నువ్వు చూస్తుండగానే, నీ ఎదుటనే ప్రాణాలు వదులుతా. ముక్కు చెవులు కోయించుకొని కూడా పగ తీర్చుకోలేని ఈ అవమానపు బతుకు బతకడం కంటే చావడం మేలు కదా? నా ఆరాటం కొద్దీ నేను చెప్తున్నా కానీ వాస్తవం ఆలోచిస్తే, నువ్వు నీ సైన్యంతో పోయినా యుద్ధ భూమిలో ఆయన ఎదుట నిల్వలేవనీ అనిపిస్తున్నది. ఆయన బలం, ఆయన ధైర్యం ఎక్కడ? పిరికిపందవు, దుర్బలుడివి, నువ్వెక్కడ?’
‘నాకేంటి? బలశౌర్యాలు లేకపోవడం ఏంటి? దేవతలను జయించానంటావా? అట్లయితే ఏదీ.. నీ బలశౌర్యాలు చూద్దాం. వెంటనే శ్రీరామచంద్రుడిని యుద్ధంలో ఎదుర్కోవడానికి సైన్యంతో బయల్దేరు. అలా చేయలేకపోతే, బలం, ధైర్యం లేని పిరికిపందకు ఈ దండకాటవి ఎందుకు? ఓరీ కులదూషకా! రాక్షస కులానికి అపకీర్తి తేవడానికి పుట్టావా? ఇక ఇక్కడ ఆలస్యం చేస్తే, రాముడు రానే వస్తాడు. అదిగో రాముడు వస్తున్నాడు.. నిన్నిక్కడే పూడుస్తాడు. మరెక్కడికైనా పరుగెత్తు. నా ముక్కు చెవులు కోసి నన్నిలా అవమానించిన వీరుడిని, రఘువంశ నాయకుడిని, శ్రీరామచంద్రమూర్తిని, ఆయన తమ్ముడు లక్ష్మణుడిని నువ్వేమని భావిస్తున్నావురా? సామాన్య మనుష్యులు అనుకుంటున్నావా? పదిమంది, నూరు మంది ఆయన్ను గెలవగలరని అనుకుంటున్నావా?’ అని శూర్పణఖ పెద్ద నగారా వాయించినట్లు కడుపు మీద బాదుకుంటూ, ఏడుస్తుంటే రాక్షస నాయకుడు ఖరుడు సమాధానపరిచాడు.
శూర్పణఖ నిందా వాక్యాలకు, తన పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మాటలకు జవాబుగా ఖరుడు ‘నా తోబుట్టువైన నిన్ను అవమానపర్చారన్న అవమానం వల్ల కలిగిన కోపం, పొంగిపోయే సముద్రాన్ని అణచడం సాధ్యం కానట్లే, తగ్గించడం సాధ్యం కాదు. నీచ మనుష్యులను, చచ్చిన వాళ్లతో సమానమైన వారిని, నేను లక్ష్యపెట్తానా? వాడిని నేను చంపాల్సిన పనిలేదు. వాడి దుష్ట చేష్టల వల్ల వాడే లోకంలో చంపబడుతాడు. ఇలాంటి వాడు ఇలా చేసి చచ్చాడని పేరు మాత్రం నిలుస్తుంది. ఎందుకు ఏడుస్తావు? ఏడవవద్దు. ఇదిగో ఇప్పుడే పోయి తమ్ముడితో సహా రామచంద్రుడిని నా పదునైన బాణాలతో, కఠినమైన కత్తితో చంపుతా. ఆ దుష్టుడి వేడి వేడి నెత్తురు నీ పగ తీరేదాకా జుర్రుకో’ చెప్పగానే శూర్పణఖ సంతోషించింది. తమ్ముడిని మరీ మరీ పొగిడింది. వాడు కూడా మరింత విర్రవీగుతూ, దూషణుడు అనే పౌరుషం, కోపం కల సేనానాయకుడిని పిలిచి యుద్ధానికి సన్నద్ధం కమ్మన్నాడు.
బలంతో భయంకరమైన వేగం కలవారిని, యుద్ధంలో వీపు చూపించని వారిని, సాహసవంతులను, నల్లటి మేఘం వనె్న దేహం కలవారిని, దయలేని వారిని, హింస చేయడానికి ఇష్టపడేవారిని, సింహంలాగా పరాక్రమం కలవారిని, తన ఇష్ట ప్రకారం నడిచేవారిని, రణ ప్రయత్నం కలవారిని, భయంకరమైన బలం కలవారిని, పధ్నాలుగు వేల రాక్షసులను శీఘ్రంగా సమకూర్చమని దూషణుడిని పురమాయించాడు ఖరుడు. విల్లులు, బాణాలు, కత్తులు ఇతర అనేక ఆయుధాలు కల తన రథాన్ని తీసుకురమ్మన్నాడు. పౌలస్త్య వంశంలో పుట్టిన రాక్షసుల ముందు తానూ పోతానన్నాడు. తన వెనుక సైన్యాన్ని రమ్మన్నాడు. శ్రీరామచంద్రుడికి చావుకూడేట్లు చేసి జయం పొంది లోకంలో ప్రసిద్ధి కెక్కుతానన్నాడు.
ఖరుడు ఇలా చెప్పగా దూషణుడు ప్రళయకాలం నాటి సూర్యుడితో సమానమై, నానా వర్ణాల గుర్రాలు కట్టిన రథాన్ని అతడి ముందు నిలిపాడు. దాని మీదకు కోపంతో ఎక్కాడు ఖరుడు. ఖరుడు రథం ఎక్కగానే, దూషణుడు పెద్ద సేనతో ఖరుడి పక్కన నిలిచాడు. సైన్యాన్ని కదలమని ఖరుడు ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే వేగంగా సేన బయల్దేరింది. ఆ ధ్వనికి అడవిలో మృగాలు తత్తరపాటుతో ఎటూ పోవడానికి దారితోచక తికమకలాడాయి. కొన్ని భయంతో మూర్ఛపోయాయి. సలాకులు, ముద్గారాలు, కత్తులు, గండ్రగొడ్డళ్లు, బాకులు, వజ్రాయుధాల లాంటి కత్తులు, బల్లాలు, ఇనుపకట్ల గుదియలు, విల్లులు, బాణాలు చేతుల్లో ధరించి, చూసేవారికి భయంకరమైన వేషాలతో, భూమి గడగడ వణకుతుంటే పధ్నాలుగు వేల మంది రాక్షసులు బయల్దేరారు. ఖరుడి మనసెరిగిన అతడి సారథి సైన్యం వెంట తీవ్రంగా రథాన్ని తోలాడు. ఆ రథం గమనవేగం వల్ల పుట్టిన ధ్వని భూమి నాలుగు దిక్కులా వ్యాపించింది. ఖరుడు కోపంతో, కఠినమైన గొంతుతో సారథిని త్వరితగతిన రథాన్ని తోలమని పురమాయించాడు. -సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12