S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్నేహం సాక్షిగా..

ఆ గాడిదని కట్టెయ్యండర్రా.. ఇల్లంతా తిరిగేసి ఆగమాగం చేసేస్తోంది.. గల్లుగల్లుమంటూ కాలి అందెలు గణగణ మోగుతుంటే... ఇల్లు పీకి పందిరేస్తున్న రెండేళ్ల ఫణిభూషణ్ ముని మనవడ్ని అదిలిస్తూ, అదుపు చేయాలని చూస్తోంది బామ్మగారు.
అదిలించే కొద్దీ చేతికి అందకుండా పనివాళ్లని పరిగెట్టించేస్తూ పని పెంచేస్తున్నాడు ఫణిభూషణ్. అద్దు.. అద్దు.. అంటూ వచ్చీరాని ముద్దుముద్దు మాటలతో పెరట్లోకి దారితీశాడు చంటాడు. వచ్చీరాని మాటలు ఆవకాయ పచ్చడిలో ఊటట. బామ్మగారు మునిమనవడి మాటలకి, బాలకిష్టుడి చేష్టలకి మురిసిపోతోంది యశోదలా. బామ్మగారి పెనిమిటి పేరు భూషయ్య. అదే మునిమనవడికి కొంచెం మోడ్రన్‌గా ఫణిభూషణ్ అని పేరు పెట్టారు.
ఒరేయ్ వెంకటేసు, రత్తాలు పిల్ల వెధవని ఒడిసిపట్టుకురండర్రా... పెరట్లో పురుగు పుట్రా వుంటాయ్ - బామ్మగారు కేకలెడ్తోంది. పనివాళ్లకి ఆ కేకలకి తలపోటెడ్తోంది; ఓ పక్క ఫణిబాబు పరిగెట్టిస్తుంటే.. ఇంకోపక్క బామ్మగారు కేకలెట్టేస్తుంటే... పనివాళ్లు పిల్లాడి పరుగందుకోలేక రొప్పేస్తున్నారు. చిట్టచివరాఖరికి ఇద్దరూ పిల్లాడి చుట్టూరా చేతులు కట్టేసుకుని ఒకర్ని ఒకరు చుట్టేసుకున్నారు రత్తాలు వెంకటేసూను పిల్లాడు కాస్తా తప్పించేసుకునేసరికి.
అవ్వా... అవ్వా.. పట్టపగలు ఇదేం సోద్యం.. అంటూ బామ్మగారు బుగ్గలు నొక్కేసుకుంటూ -పిల్లాడ్ని పట్టండర్రా అంటే ఈ కౌగిలింతలేమిట్రా.. పిదపకాలం.. పిదప బుద్ధులూ మీరూను మెటికలిరుస్తున్నారు బామ్మగారు. ఇంతకీ బామ్మగారికి ఈ తిప్పలెందుకంటే ఫణిభూషణ్‌కి ఆంజనేయ స్వామి లాకెట్ బంగరు గొలుసులోకి తెస్తామంటూ పట్నం వెళ్లారు మనవడు హనుమంతు, మనవరాలు సునీత. పనిలో పని ఏ హోటల్‌లోనో మెక్కేసి సినిమాకో షికారుకో అఘోరించుంటారు వెధవాయిలు... ఈ పల్లెటూళ్లో ఏం తోచేడుస్తుంది - ఇది బామ్మగారి స్వగతం.
ఇంతలో బయట బైక్ వచ్చిన శబ్దం అయింది.. బామ్మగారు వసారాలోంచి చూపు సారించారు. సునీత, హనుమంతు వచ్చారు. రెండు రెండు నాలుగు చేతులతో కవర్లతో పట్టుకొస్తున్నారు నెల్లాళ్లకి సరిపోయే ఇంటెడు సామాను. అదే వాళ్ల భాషలో షాపింగ్ చేసినట్లున్నారు.
ఒరేయ్ వెంకటేసు అబ్బాయి వచ్చినట్లున్నాడు. సామాన్లు లోనికి పట్రా.. ఈ కేకలకి వెంకటేసు కన్నా చంటాడు ముందస్తుగా వెళ్లి తల్లి చంకెక్కేశాడు. ఆ వయసంతే మరి. అడ్డాలనాటి పిల్లడు గడ్డాలొచ్చేవరకు చంక దిగడు సరికదా.. దింపితే గుక్క పెడ్తాడు. గారాలు పోతుంటారు. మారామూ చేస్తుంటారు. అందుకే పిల్లలందరు బాలకృష్ణులైతే తల్లులందరూ యశోదలే మరి. వీడిదంతా ముత్తాత పోలికే.. ఆయనగారి గురించి తన పెళ్లైన కొత్తల్లో అత్తగారు కథలు కథలుగా చెప్తుండేది.
బామ్మగారు పెనిమిటితో పంచుకున్న స్మృతులలో నుంచి ఎంచుకున్న మధుర స్మృతులలోకి వెళ్లినట్లున్నారు - ముసలాయన ఈ మధ్యనే కాలం చేశారు ముసలితనం మీదకొచ్చి.
‘ఒసేయ్ బామ్మా...’ చత్వారం జోడందించాడు మనవడు హనుమంతు. భర్త ధ్యానంలో పరధ్యానంగా వున్న బామ్మ హనుమంతు అందించిన జోడు కళ్లకి పెట్టి తడుముకుంటూ మురిసిపోయింది. మాయదారి చూపు మందగించి బొత్తిగా మనుషుల మొహాలు కూడా అలికేసినట్లై మొన్నటికి మొన్న వెంకటేసుని పట్టుకుని హనుమంతు అంటూ కేకేసింది. దాంతో హనుమంతు ఏమైనా సరే అని పట్టుపట్టి ఇవాళ్టికి కళ్లద్దాలు పట్టుకొచ్చాడు... మళ్లీ వాణ్ణెక్కడ వెంకటేసుని చేస్తానని భయపడి గుర్తు పెట్టుకు పట్టుకొచ్చాడు కళ్లద్దాలు.
ఇలా తృప్తిగా ఇంకో మూడేళ్లు బతికేసి బామ్మగారు, తొలి ఏకాదశి పుణ్యతిథుల్లో తనువు చాలించారు. బామ్మగారు లేకపోయేసరికి భౌతికంగా ఆ ఇల్లు, ఆ ఊరు బావురుమంది. అయితేనేం.. పుణ్యాత్మురాలు పుణ్య తిథుల్లో పోయారు. అందరి నోట ఒకే మాట.. ముసలి పండు రాలిపోయింది తృప్తి నిండి.
బామ్మలేని ఇంట బిక్కుబిక్కుమంటూ వుండలేక సగం... తను ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ ఫణిభూషణ్‌ని చదివించుకోవచ్చని సగం మకాం పట్నానికి మార్చేశారు తన చిన్ననాటి మిత్రుడు నితిన్ సహకారంతో. హనుమంతు పట్నంలో అన్నీ మొదలెట్టుకోవాలి కాని అవన్నీ పాపం నితిన్ దగ్గరుండి ఏర్పాటు చేశాడు.
ఇంటికి దగ్గర్లోనే ఫణిభూషణ్ కానె్వంట్. ఇక తను ఉద్యోగం చూసుకోవాలి - ఊళ్లో అంటే పొలం చూసుకుంటూ గడిచిపోయింది. ఇనే్నళ్లుగా తాత - బామ్మల పుణ్యమా అని. పొలం తాతయ్య హయాంలోనే కౌలుకిచ్చేశారు. వాళ్లు నమ్మకంగా, విశ్వాసంగా చేసుకుంటున్నారు. ఇల్లూ గొడ్డూ గోదా ఇంతకాలం మమ్మల్నే కనిపెట్టుకునున్న వెంకటేసు రత్తాలుకి అప్పగించాము. అక్కరకొచ్చిన సామాన్లు వెంకట తీసుకుని.. అనవసరమైన సామాన్లు అటకెక్కించి ఓ గది మాకింద అట్టిపెట్టి పట్నం దారి పట్టి వచ్చేశాము - ఇక చూడాలి పట్నవాసం.. ఇదంతా సింహావలోకనము కాదు నితిన్‌కి హనుమంతు ఇచ్చిన వివరణ.
ఆద్యంతం విన్న నితిన్ ‘డోంట్ వర్రీ.. మైహూఁన...’ అంటూ అభయమిచ్చి తను చేసే ఆఫీసులోనే తనక్కూడా ఒక పని కల్పించాడు. వాడి సంకల్పం బలమైనది మరి. బామ్మ మరణాన్ని.. ఊరి వాతావరణాన్ని.. నాలోని నిర్లిప్తతని.. నితిన్ స్నేహవాసం మురిపింది.
నితిన్ ద్వారా అన్ని వసతులు చక్కగా అమరినయ్. గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డ్.. ఓటర్ ఐ.డి. ఒకటేమిటి అన్నీ అన్నీ... అమర్చాడు నితిన్.. నోరు తెరవడమే తరువాయి.
ఏనాటి స్నేహమో.. ఏ దేవి వరమో.. నితిన్ తనకు బాల్యమిత్రుడు కావడం మా అదృష్టం. నితిన్ కుటుంబం, మా కుటుంబం వుండటానికి వేరు వేరు చోట్లనే కాని - మా హృదయాలలో ఏకభావమే మరి. వాళ్ల బంధువుల ఫంక్షన్లకి మేము, మా బంధువుల ఫంక్షన్లకి వాళ్లు వెళ్తుండేవాళ్లం. ఒకే కుటుంబం అనడానికి ఇంతకన్నా రుజువు మరేం కావాలి.
ఎంతో సజావుగా సాగిపోతున్న మా స్నేహ బంధానికి కళ్లెం వేసినట్లు, మమ్మల్ని... మా బంధాన్ని, అనుబంధాన్ని.. చూన ఇరుగు పొరుగుల కన్ను కుట్టినట్లుగా ఉన్నపళంగా, రాత్రికి రాత్రి వాడు వెళ్లిపోయాడు. వాడు ఉన్నన్నాళ్లు రాని శోభ, సుఖ సదుపాయాలు భాగ్యనగరానికి ఇపుడిపుడే వస్తోంది - తను పక్కన లేని లోటు వెలితిగా కన్పిస్తోంది.
భాగ్యనగరానికి మహద్భాగ్యం పట్టింది. మన ప్రధానమంత్రితో.. కేంద్ర మంత్రులతో.. మెట్రో రైళ్లు ప్రారంభించారు. ఇప్పుడు రోడ్డుపై వాహనాల్ని మాత్రమే నమ్ముకోవాల్సిన పని అంతగా లేదు. ఆకాశమార్గంలో సుదూర పయనాలు, సుఖవంతంగా, తక్కువ తక్కువ సమయాలలో చేయవచ్చు - ఆర్థికంగా కూడా పౌరులకు తృప్తికరంగా ఉంది.
కొత్తకొత్తగా మల్టీకాంప్లెక్స్‌లు, మాల్స్, స్క్రీన్స్, ఫుడ్ వరల్డ్స్, వండర్ వరల్డ్స్.
యాప్స్‌లో ఓలా, ఊబర్ క్యాబ్స్, మెడిసిన్స్, లంచ్, డిన్నర్... ఒక్కటేమిటి అన్నిటికి అన్నీ హోమ్ డెలివరీ ఇచ్చే ఫ్రాంచైజర్స్. అన్నీ ఇంటి నుండి, కూర్చున్న చోటికి రప్పించుకోగలిగిన, సౌకర్యం పొందగల సమయానికి నితిన్ లేకుండా అయింది. తను పక్కన వుంటే చాలు.. కొండంత ధైర్యం - చాలా బాధగా ఫీలవుతున్నాడు హనుమంతు. నితిన్ లేని లోటు తెలిసి వస్తున్నప్పుడల్లా కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయ్. గుండె ఆర్ద్రమయి పోతోంది. గుండె మంటలార్పలేక పోతోంది సన్నీళ్లున్న కన్నీళ్లు.
ఇలా బ్రెయిన్‌లో ట్రైన్‌లా సాగిపోతున్న హనుమంతు ఆలోచనలకు తెర దింపేస్తూ క్యాలెండర్ మారింది. నితిన్ అందర్నీ విడిచిపోయి.. భౌతికంగా మా నుంచి విడిపోయి.. మా ఆలోచనల్లో మాత్రమే వొదిగిపోయి అప్పుడే దశాబ్దం అయిపోయింది. వాళ్ల అమ్మగారి ఊళ్లో వున్న నితిన్ భార్యాపిల్లలతో... సునీతా, పిల్లలు ఓ వారం గడిపి వస్తుంటారు. నేను మాత్రం అనునిత్యం నితిన్ జ్ఞాపకాలతో గడిపేస్తూంటాను శాశ్వతమైన మా స్నేహం సాక్షిగా.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505