S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ గుడుల్లో మగాళ్లకు ‘నో ఎంట్రీ’!

సుదీర్ఘ న్యాయపోరాటాల ఫలితంగా ముంబయిలోని ప్రఖ్యాత హాజీ అలీ దర్గాలోకి, శని షింగ్నాపూర్ ఆలయంలోకి మహిళా భక్తులు ప్రవేశించేందుకు అనుమతి లభించింది. అన్ని వయసుల స్ర్తిలను శబరిమలలోని అయ్యప్ప గుడిలోకి అనుమతించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో ప్రవేశానికి ‘పురుషులకు అనుమతి లేద’న్న విషయం వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది ముమ్మాటికీ వాస్తవం. మతపరమైన విశ్వాసాల ప్రాతిపదికగానే కొన్ని ప్రముఖ ఆలయాల్లో పురుషులను అనుమతించడం లేదు. కొన్ని ఆలయాల్లో పూర్తిగాను, మరికొన్ని గుడుల్లో ప్రత్యేక సందర్భాల్లోను పురుషులను అనుమతించడం లేదు. మహిళా భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు కొన్ని పర్వదినాలను పురస్కరించుకొని పురుషులను అనుమతించని ఆలయాలు మన దేశంలో ఉన్నాయి.
మహిళలను అయ్యప్ప గుడిలోకి అనుమతించాలని ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్న కేరళలోనే రెండు ప్రముఖ దేవాలయాల్లో పురుషులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా జనవరిలో ‘పొంగల్’ ఉత్సవం ఘనంగా జరిగే కేరళలోని అత్తుకల్ ఆలయంలో పురుషులకు ప్రవేశం లేదు. ఈ ఆలయంలో ఆమధ్య 30 లక్షల మంది మహిళలు ఒకేసారి ‘పొంగల్’ వేడుకల్లో పాల్గొనడం ‘గిన్నిస్ రికార్డు’గా నమోదైంది. ఇదే కేరళలో చక్కులతుకవులోని భాగవతీ అమ్మవారి ఆలయంలో ఏటా డిసెంబర్‌లో తొలి శుక్రవారం జరిగే ‘నారీపూజ’ సందర్భంగా పురుషులకు ప్రవేశం లేదు. ‘నారీపూజ’ రోజున ఈ ఆలయంలోని మగ పూజారులు మహిళా భక్తులకు కాళ్లు కడగడం ఓ ఆచారం. అలాగే, పలు ప్రాంతాల్లోని సంతోషిమా ఆలయాల్లో శుక్రవారాల్లో యువతులు ఉపవాసాలు చేస్తూ పూజల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లోకి మగాళ్లను అనుమతించరు.
రాజస్థాన్‌లోని పుష్కర్ వద్ద బ్రహ్మదేవుడి ఆలయంలోకి వివాహితులైన పురుషులను అనుమతించరు. పెళ్లయిన మగాళ్లు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే బ్రహ్మకు కష్టాలు తప్పవని సరస్వతీ దేవి శపించినట్లు పురాణ కథనం. కన్యాకుమారి (తమిళనాడు) లోని ప్రఖ్యాత భాగవతీ దేవి ఆలయంలోకి మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అయితే, ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ద్వారం వద్దకు సన్యాసులను మాత్రం అనుమతిస్తారు. గుడిలోపలికి పురుషుల ప్రవేశంపై ఇప్పటికీ నిషేధాన్ని పాటిస్తున్నారు. ముజఫర్‌నగర్ (బిహార్)లోని మాతా ఆలయంలో కొన్ని పర్వదినాల్లో పురుషులను, మగ పూజారులను కూడా అనుమతించరు. నాసిక్ (మహారాష్ట్ర)లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో బొంబాయి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2016 సంవత్సరం నుంచి పురుషులను అనుమతించడం లేదు. ఈ శివాలయంలో మహిళలకు అనాదిగా ప్రవేశం లేదు. గర్భాలయంలోకి మహిళలను అనుమతించనందున- లింగ సమానత్వం పాటేంచేలా పురుషులకు కూడా ఆ అవకాశం ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది. దీంతో గర్భగుడిలోకి ప్రస్తుతం పురుషులకు కూడా ప్రవేశం లేదు. ఇక అన్నిటికంటే వింతగా- అస్సాంలోని కామ్‌రూప్ కామాఖ్య ఆలయంలో ‘రుతుక్రమం’లో ఉన్న మహిళలను మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ మహిళా పూజారులు, సన్యాసినులు పూజాదికాలు నిర్వహిస్తారు.