S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జ్ఞాపకాల నీడలలో

‘నాన్నా.. లే నాన్నా.. కొంచెం అన్నం తిని పడుకో నాన్నా ప్లీజ్...’ ఐదేళ్ల స్మృతి అభిషేక్‌ని లేపుతోంది తన చిట్టిచిట్టి చేతులతో. నిద్రపోతుంటే కదా.. లేవడానికి.. శివానీ తలపులతో తలగడకి కన్నీటి అభిషేకం చేస్తున్న అభిషేక్ కదలలేదు మెదలలేదు.. ఎంత లేపినా లేవని తండ్రి మీద తన ఆఖరి అస్త్రం ప్రయోగించింది చిన్నారి స్మృతి.
ఆరున్నొక్క రాగాలాపన... మంద్రంలో మొదలయి తారాస్థాయికి చేరింది. గండు శిలలైనా కరిగించే ఆ రోదన కనీసం అభిషేక్ చెవులకైనా చేరలేదు.
పక్క గదిలో కూర్చుని కూతురి అకాల మరణానికి దుఃఖపడుతున్న శివానీ తల్లి, తండ్రీ ఒక్కసారిగా పరిగెట్టుకొచ్చారు. శిలా సదృశంగా పడుకొని వున్న అల్లుడినీ, పక్కనే కూర్చొని రాగాలు పెడుతున్న చిన్నారినీ చూస్తూనే...
‘అమ్మలూ ఎందుకమ్మా ఏడుస్తున్నావ్... ఆకలేస్తోందా? దా... అన్నం పెడతా..’ కళ్లు తుడుచుకుంటూ దగ్గరికి తీసుకోబోయింది అమ్మమ్మ భార్గవి.
‘నాకేం వద్దు.. మా నాన్న తింటేనే నేనూ తింటా’ ఆవిడ చేతులు తోసేస్తూ తల అడ్డంగా ఊపింది.. వెక్కిళ్లతో...
‘నాయనా అభిషేక్ లే.. పసిది పొద్దుటనుంచీ పచ్చి మంచినీళ్లైనా తాగలేదు.. పోయిన వాళ్లతో మనమూ పోతామా... దానికంతే రాసిపెట్టి ఉంది. లేకపోతే ఇంత ప్రేమించే భర్తనీ, ముద్దులు మూటగట్టే చిన్నారినీ... కాదనుకుని కాలదన్నుకునీ ఎలా పోగలిగిందీ...’ అంటూనే గుండె బద్దలయి భోరుమంది.. కూలబడిపోతూ.
‘ఏమిటి అతనిని ఓదారుస్తున్నావా? ఇంకొంచెం ఏడిపిస్తున్నావా? లే, నువ్వు కూడా లే అభిషేక్.. ఈ రోజు గడిస్తే రేపటికి రెండు.. మరపు మనిషికి ఆ దేవుడిచ్చిన వరం.. తలచుకు తలచుకు బాధపడటంలో అర్థం లేదు. అందరం ఏదో ఒకరోజు పోవలసిన వాళ్లమే... అప్పుడే నాలుగు రోజులయ్యింది ఇలా నిన్ను నువ్వు హింసించుకుంటూ తిండీ తిప్పలూ మానేసి కూర్చోవడం వలన పోయినది తిరిగి వస్తుందా... పిచ్చివాడిలా ప్రవర్తించి తల్లి లేని నీ బిడ్డకు తండ్రి కూడా లేకుండా చేసే దానిని అనాధని చెయ్యకు...’ తన దుఃఖం దిగమింగుకుంటూ అల్లుడికి హితవు చెప్పాడు రామచంద్ర.
* * *
శివానీ, అభిషేక్ ప్రేమించి, కాదన్న పెద్దల నెదిరించి పెళ్లి చేసుకున్నారు... ఏడేళ్ల వారి వైవాహిక బంధంలో చవిచూసిన ఆనందాలకన్నా విసిగి వేసారిన రోజులే ఎక్కువ. శివానీ మంచిదే కానీ మితిమీరిన మంకుతనం.. వల్లమాలిన అభిజాత్యం.
ఒక్కతే కూతురిగా ఆడింది ఆటా, పాడింది పాటగా పెరిగిన ఆ పిల్లకి తన మాట నెగ్గాలనే మొండితనమే కానీ ఎదుటి వారు చెప్పింది వినే లక్షణం, మంచీ చెడూ ఆలోచించుకునే విజ్ఞత రాలేదు... పిల్ల తల్లయ్యింది కానీ ఆమెకు తల్లి మనసు, మమతలలో ఉన్న మాధుర్యం తెలియరాలేదు.
అప్పుడే తమకు పిల్లలు వద్దు అన్న ఆమె ఇష్టానికి విరుద్ధంగా తల్లయ్యింది.. అభిషేక్ అన్ని విషయాల్లో సర్దుకుపోయినా.. కన్సీవ్ అయ్యాక అబార్షన్ చేయించుకుంటానన్న ఆమె మూర్ఖత్వాన్ని ఒప్పుకోలేదు. ఫలితంగా రోజూ ఇంట్లో గొడవలే. తమ పెళ్లికి ఒప్పుకోని అత్తమామలు, అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి మీద ప్రేమతో తమ అహాన్ని చంపుకుని శివానీని తననీ ఆదరించి తమలో కలిపేసుకున్నారు. తమ ఇంటికి దగ్గరగా ఒక అపార్ట్‌మెంట్ కొని అందులో వాళ్లని ఉంచి వాళ్ల మంచీ చెడూ చూస్తూ సంతోషిస్తున్నంతలో కూతురు గర్భవతి కావడం.. ఆమె మొండితనాన్ని భరిస్తూ అల్లుడు ఆమెని ప్రాణప్రదంగా చూసుకుంటుంటే అతని మంచితనం అర్థం అయి తమ పెంకి కూతురికి అతనే సరి జోడీ అని ఆనందించారు. అభిషేక్ తల్లిదండ్రులు ఒక్కగానొక్క తమ కొడుకుని వదులుకోలేక తమ పట్టుదల వదులుకుని కొడుకూ కోడలి దగ్గరికి వచ్చినా కోడలి మంకుతనం, అర్థం పర్థంలేని అభిజాత్యం, ఆ పిల్లతో తమ కొడుకు పడుతున్న అవస్థ చూసి తట్టుకోలేక... వాడి ఖర్మ అనుకుని వాళ్ల ఊరు వెళ్లిపోయారు. ఎప్పుడైనా ఆఫీస్ పని వంకతో అతను వెళ్లి చూసి రావడమే.. అలా అలా మూడు గొడవలూ ఆరు తగవులూగా వాళ్ల కాపురం నడుస్తుండగా చిన్నారి స్మృతి వారి జీవితాల్లోకి వసంతంలా వచ్చింది.. తప్పు తప్పు.. వారి జీవితాలు కాదు అతని జీవితంలోకి మాత్రమే.. ఆమెకి మాత్రం అదో న్యూసెన్స్.. తన ప్రగతికి అడ్డువచ్చే ప్రతిబంధకం.. తనేమో, తన పనులేమో.. తన ప్రాజెక్ట్‌లేమో.. పసిదానికి పాలిచ్చి అక్కున చేర్చుకున్న సందర్భాలు కంచు కాగడా పెట్టి వెదకినా కనపడవు. చిన్నారి స్మృతి ఆలనా పాలనా అన్నీ అభిషేక్‌వే.. అతను ఆ పాపతో ఆడి పాడి ఆనందించే క్రమంలో తన కెరీర్ గురించి కూడా పక్కన పెట్టేశాడు. పాపకూ తండ్రితోనే లోకం.. మూడో ఏడు నిండగానే మంచి స్కూల్లో వేశాడు. టీం లీడర్ అయితే తన బాధ్యత మరింతగా పెరిగి పాపకు సమయం కేటాయించలేనని అది కూడా కాదనుకుని, సాయంత్రంతోనే ఇంటికి వచ్చేసి పాపతో కాసేపు ఆడుకుని.. తన స్కూల్ విశేషాలు తెలుసుకుని హోంవర్క్ చేయించి అన్నం తినిపించి.. పాప పడుకున్నాక తన వర్క్ చేసుకునేవాడు.. శివానీ టీం లీడర్ అయి పెద్ద ప్రాజెక్ట్ చేపట్టి, అది విజయవంతంగా పూర్తయితే తనకు దొరకబోయే అమెరికా చాన్స్ కోసం చూసే ఎదురుచూపులూ... దాని కోసం అహర్నిశలూ ఆమె పడే కష్టం చూసి.. ఎన్నోసార్లు నచ్చజెప్పాడు. జీవితం అంటే పోటీలు, కెరీర్, సంపాదనా అవే కాదనీ.. దానికి మించిన ఆత్మానందం, సంతృప్తి, సంసారం ఇచ్చే ఆత్మీయబంధం అనీ.. అతని మాటలు ఆమెకి ఛాదస్తంగానూ, చేతకానితనంగానూ కనపడేవి. ఆమె అంతగా ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది.. ఆ రోజు జరిగిన గొడవే ఇంత అనర్థానికి కారణం అయింది.
ఆ రోజు సాయంత్రంతోటే ఇంటికి వచ్చేసింది శివానీ.. వస్తూ వస్తూ తనకీ, అభిషేక్‌కీ, పాపకీ కొత్తబట్టలూ స్వీట్స్.. పాపకి బొమ్మలూ అన్నీ తెచ్చింది. ఇంతకాలానికి శివానీకి తనూ పాపా, ఇల్లూ గుర్తుకొచ్చినందుకు అభిషేక్ ఆనందపడినంతసేపు పట్టలేదు. అమెరికాలో ప్రాజెక్ట్ వచ్చిందనీ.. ఏడాదిపాటు ఆ ప్రాజెక్ట్ తన లీడ్ చేసే మహదవకాశం దక్కిందనీ, ఆనందంగా చెబుతున్న ఆమెను పిచ్చివాడిలా చూశాడు.. కొంతసేపటికి తేరుకుని,
‘అలాంటి అవకాశం నాకు రెండేళ్ల కిందటే వచ్చింది.. కానీ నిన్నూ పాపనూ వదిలి వెళ్లడం ఇష్టం లేని నేను ఆ అవకాశం వదిలేసుకుని, అది నా జూనియర్‌కు వచ్చేలా చేశాను.. ప్లీజ్ శివా ఆలోచించు. ఒక ఏడాదిపాటు నువ్వక్కడ ఒంటరిగా, మేమిక్కడ... అవసరమా?.. మనకి వచ్చే ఈ జీతాలూ.. ఇక్కడి ఈ ఉద్యోగాలూ మనకి చాలు.. ప్లీజ్ ఆలోచించు’ ఎంతో ఓపికగా నచ్చజెప్ప జూసిన అతనిని...
‘్ఛ.. ఇంత మంచి కబురుతో వస్తే.. నా ఆనందాన్నంతా పాడు చేస్తున్నావు... నీకు ఆ అవకాశం వచ్చిందని అప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు.. పోనీ ఒక పని చేద్దాం. ఇప్పుడు నీ బాస్‌ని అడుగు. అలాంటి అవకాశం ఉంటే ఇద్దరం వెళదాం. ఎంత... ఒక ఏడాది ఎంతలో అయిపోతుంది.. పాపను మా అమ్మా వాళ్ల దగ్గర ఉంచుదాం.. సరేనా..’ ఎంతో సింపుల్‌గా చెబుతున్న ఆమెని చూసి కోపం ఆగలేదు.
‘పాప నా ప్రాణం.. దాన్ని ఎవరి దగ్గరో వదిలిపెట్టి అమెరికా వెళ్లి చేసే ఆ ఉద్యోగం నాకు అక్కర్లేదు. నా మాట విను... కన్నపిల్లలతో గడుపుతూ, వాళ్ల ఆలనా పాలనా చూడాల్సిన టైంలో అమెరికా, సంపాదనా అంటూ వాళ్లకు దూరంగా ఉంటూ వాళ్లని గాలికి వదిలేసే నీలాంటి తల్లులు ఎక్కడా ఉండరు.. మా ఖర్మకొద్దీ మాకు మాత్రమే దొరికావు.. మా జీవితాలకు శాపంలా..’ ఒళ్లు తెలియని కోపంలో నోరు జారాడు అభిషేక్.
‘సరే.. అంత ఖర్మ అనుకునే మిమ్మల్ని పట్టుకు నేనేం పాకులాడను.. ఇక మీ జీవితాలు మీవి నా జీవితం నాది.. నేను ఒక ఏడాది మాత్రమే అనుకున్నా కానీ నన్ను అర్థం చేసుకోని, నేను అక్కర్లేని నీ కోసం నేను కోరుకున్న జీవితం ఎందుకు వదిలేసుకోవాలి.. గుడ్‌బై.. ఫరెవర్...’ అంటూ పిలుస్తున్నా వినకుండా కారు తీసుకు విసురుగా వెళ్లిపోయిన ఆమె, అదే విసురు కారు నడపడంలో చూపించి, ఎదురుగా వచ్చే హెవీ వెహికల్ చూసుకోకుండా ముందుకు వెళ్లి దాని కింద పడి కారు నుజ్జునుజ్జు అయిపోయి అక్కడికక్కడే మరణించింది. అది జరిగి నాలుగు రోజులవుతున్నా అభిషేక్ తేరుకోవడం లేదు.
ఆమె ఆవేశం.. దూకుడూ తెలిసి కూడా తను రెచ్చిపోయేలా మాట్లాడి, ఆమె చావుకు కారణం అయ్యానంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతనిని ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు.
ఎప్పుడూ స్మార్ట్‌గా నవ్వుతూ నవ్విస్తూ తనతో ఆడి పాడి, కబుర్లూ, కథలూ చెబుతూ తినిపించే తండ్రి తన ఉనికినే మరచిపోయి అలా ఏడుస్తూ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం చూసి ఆ పసి మనసు తట్టుకోలేక పోయింది.. తల్లి ఏనాడూ ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. అందుకే ఆ పసిదాని తల్లి తనకు శాశ్వతంగా దూరం అయిందన్న నిజం అర్థం కాలేదు.. తల్లి కోసం అడగను కూడా అడగలేదు. కానీ కంటికెదురుగా కనపడుతూ తనని పట్టించుకోని తండ్రిని చూసి తట్టుకోలేక పోయింది. తను బ్రతిమిలాడినా తినని తండ్రిని చూసి తనూ తినడం మానేసి బెంగటిల్లిపోతున్న ఆ పసిదానిని చూసి బాధపడటం తప్ప ఏం చెయ్యలేకపోయారా అమ్మమ్మ తాతయ్యలు.
విషయం తెలిసి పరుగు పరుగున వచ్చిన అతని తల్లిదండ్రులనైతే దగ్గరకి కూడా రానీయకలేదు. ఆ చిన్నారి.. ఆకలికి తట్టుకోలేక శోష వచ్చి పడిపోయిన స్మృతిని గబగబా హాస్పిటల్‌కి చేర్చి సెలైన్ పెట్టిన డాక్టర్, అభిషేక్‌తో-
‘చూడండి.. మీకు వచ్చిన కష్టం ఎవరూ తీర్చలేనిది.. ఆ బాధ వర్ణనాతీతం నిజమే.. కానీ కాస్త మీ బేబీ గురించి కూడా ఆలోచించండి.. మీ పాపను చిన్నప్పటి నుండి ట్రీట్ చేసిన డాక్టర్‌గా చెబుతున్నా.. మీ బేబీ బ్రతికి బట్టకట్టాలంటే.. మీరు మళ్లీ మామూలు మనిషి అవ్వాలి.. నాకు తెలిసి ఆ పసిదాని ప్రాణం మీ చేతిలోనే ఉంది.. చనిపోయిన భార్యనే తలచుకుంటూ బ్రతికి ఉన్న పాపను చేజేతులా చంపుకుంటారో.. జరిగిపోయిన దానిని పీడకలలా మరచిపోయి మీ పాపను జాగ్రత్తగా పెంచుకుంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా... ఒక్కటి మాత్రం నిజం మీరు ఎప్పటిలా ఆ పాపతో గడపకపోతే.. పాప బ్రతికినా జీవశ్చవంలా బ్రతుకుతుంది.. ఆ పసిమనసు అంతలా మీతో పెనవేసుకు పోయింది..’
డాక్టర్ చెప్పిన ఆ మాటలు అభిషేక్ మనసులో నాటుకుపోయాయి.. తన బాధను, దుఃఖాన్ని తనలోనే దాచేసుకు తన లోకం అంతా తన బంగారు తల్లే అన్నంతగా ఆమెను అరచేతిలో పెట్టి పెంచాడు... కంటిపాపలా చూసుకున్నాడు.. ఎంతమంది ఎన్ని విధాల చెప్పినా, నీ కోసం కాదు.. నీ కూతురి కోసం అయినా మళ్లీ పెళ్లి చేసుకో అన్న వాళ్ల మాటల్ని తోసిరాజని, తల్లీ తండ్రీ తనే అయి పెంచాడు.. స్మృతి కూడా అతనికి తనే తల్లి అయి ఆలనా పాలనా చూసింది.. తనకు స్నేహితులూ, సంతోషం, దుఃఖం, కాలక్షేపం అన్నీ తండ్రే.. అలాంటి స్మృతి కాలంతోపాటు పెరిగి పెద్దదయి పెళ్లీడుకొచ్చింది.. చక్కగా సంగీతం, చిత్రలేఖనంతోపాటు సైకాలజీలో పీజీ చేసిన ఆమె చక్కదనాల చుక్క.. ఆమెని తన స్నేహితుడి పెళ్లిలో చూసిన చరణ్ తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడు.. ఎంత వేడుకున్నా, తన ప్రేమ ఎంతగా తెలియజెప్పినా స్మృతి మనసు కరగలేదు.. తను పెళ్లి చేసుకు వెళ్లిపోతే తన తండ్రి ఒంటరి అయిపోతాడనీ.. తనకు వివాహేచ్ఛ ఎంత మాత్రం లేదనీ, దయచేసి తన వెంట పడద్దనీ సున్నితంగా వారించింది.
తనను పెళ్లి చేసుకుంటే ఆమెతోపాటూ తనూ ఆమె తండ్రికి తోడూ నీడా అవుతాననీ.. కన్నకొడుకు కంటే ఎక్కువగా ఆయనను చూసుకుంటాననీ ఎంత చెప్పినా వినని ఆమెని మర్చిపోలేకా.. వదులుకోలేకా చరణ్ సతమతమై ఆఖరికి అభిషేక్‌నే బతిమాలుకున్నాడు. స్మృతిని ఎలాగైనా ఒప్పించమనీ.. తను ఆమెని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాననీ, ఆమెనీ, తననీ కూడా ఎంతో ప్రాణంగా చూసుకుంటానన్న అతని మాటలకి కరిగిపోయి.. తను మాత్రం ఆమెకు అంతకంటే మంచివాడినీ, ప్రేమించేవాడినీ తేగలనా అనుకుని.. స్మృతితో...
‘తల్లీ నువ్వు చరణ్‌ని పెళ్లి చేసుకో.. మిమ్మల్ని చూసుకుంటూ.. మీ బిడ్డలలో నా చిట్టితల్లి చిన్నతనాన్ని మరోసారి మనసారా ఆస్వాదిస్తూ ఈ జీవితం గడిపేస్తా... లేకపోతే నీ కంటికే కనిపించనంత దూరం వెళ్లిపోతానని బెదిరించి చరణ్‌తో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు అభిషేక్.
====================================================
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-మీనాక్షీ శ్రీనివాస్.. 9492837332