S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్మగ్లర్

మిస్ కెన్నడీ నేరస్థురాలు అవడానికి అరవై ఐదేళ్లు పట్టింది. ఆరున్నర దశాబ్దాల పాటు ఆవిడ నిజాయితీకి మారుపేరుగా జీవించింది. ఆవిడ టి అక్షరం మీద నిజాయితీగా అడ్డు గీతని, ఐ అక్షరం మీద చుక్కని పెట్టేది. వై అక్షరం కొమ్ముని బాగా కిందకి గీసేది. అంత సక్రమంగా జీవించాక తొలిసారి ఆవిడ చట్టవిరుద్ధమైన ఓ పని చేస్తోంది!
స్విట్జర్లాండ్ నించి ఆవిడ ఓ ఖరీదైన వాచీని స్మగుల్ చేస్తోంది. ఆవిడ రైల్లో తన సీట్లో కూర్చుని తమ రైలు స్విట్జర్లాండ్‌ని దాటిపోవడం గమనించింది. కొద్దిసేపట్లో వారి రైలు ఇటలీకి వెళ్తుంది. మూడు రోజులు ఇటలీలో పర్యాటకురాలిగా గడిపాక రోమ్ నించి తిరిగి న్యూయార్క్‌కి విమానంలో వెళ్లిపోతుంది.
ఆ చిన్న వాచీని ఇటాలియన్ కస్టమ్స్ శాఖ వారు చూడకుండా స్మగుల్ చేయడం తేలిక అనుకుని మిస్ కెన్నడీ ఆ సాహసానికి ఒడిగట్టింది. ఆ ఖరీదైన వాచీని ఆవిడ తోలు సూట్‌కేస్‌లో అడుగు భాగంలో కొద్దిగా పైకి లేచిన ఓ తోలు పొర కింద ఉంచి పైన ఫెవీకోల్‌తో అతికించింది. పెట్టెలోని సామానంతా బయటకి తీసినా ఆ వాచీ బయటకి కనపడదు. ముందస్థు సమాచారం ఉంటే తప్ప ఆ తోలు పొరని చింపి వెతకాలన్న ఆలోచన ఎవరికీ రాదన్నది ఆవిడ ధైర్యం. నమ్మకం. పైగా తన వయసుని చూసి తనో స్మగ్లర్ అని ఎవరూ అనుకోరన్న ధీమాతో మిస్ కెన్నడీ ఈ నేరానికి పాల్పడింది.
ఆవిడ ఖరీదైన దుస్తుల్ని ధరించింది. సదా నవ్వుతూంటుంది. అందువల్ల ఆవిడ టూర్‌లో ఆవిడ సూట్‌కేస్‌ని బ్రిటన్‌లో కాని, ఫ్రాన్స్‌లో కాని కస్టమ్స్ మనుషులు అంతదాకా తెరవలేదు.
అక్కడక్కడా విశాలమైన పచ్చటి మైదానాల్లో ఆవులు, గొర్రెలు కంచెల మధ్య మేస్తూ కనిపించాయి. ఆవిడ తన కేబిన్‌లో కూర్చుని కిటికీలోంచి మంచుతో కప్పబడ్డ ఆల్ఫ్స్ పర్వత శిఖరాలని చూడసాగింది. వాటి మీద పడే ఎండ వల్ల అవి వజ్రాల్లా మెరుస్తున్నాయి. వజ్రాలు అన్న ఆలోచన కలగ్గానే ఆవిడకి మళ్లీ తను స్మగుల్ చేసే ఆ వాచీ గుర్తుకు వచ్చింది. ఆ సూట్‌కేస్ పాతది. అనేకసార్లు ప్రయాణించిన గుర్తుగా అది మాసి, వెలసిపోయి అక్కడక్కడా ముడతలు కూడా పడింది. అది స్మగ్లర్లది అనే అనుమానం ఎవరికీ కలగదు అనుకుంది. తనని చూసి అది ఓ సగటు నిజాయితీ పరురాలిది అని వాళ్లు భావిస్తారని ఆవిడ విశ్వసిస్తోంది. ఆ కేబిన్‌లో ఆవిడ తప్ప మరెవరూ లేకపోవడంతో ఆలోచనలు ఆ వాచీ చుట్టూనే తిరుగుతున్నాయి.
దాన్ని ఆవిడ మేనల్లుడి కోసం కొన్నది. తను వాడికి అంతదాకా ఖరీదైంది ఏదీ కొనివ్వలేదు. యూరప్ నించి ఏం కావాలని అడిగితే వాడు వాచ్ అని కోరాడు.
‘స్విట్జర్లాండ్‌లో వాచీలు చవగ్గా దొరుకుతాయి. నాణ్యమైనవి కూడా. అక్కడ కొను’ సూచించాడు.
వాడు అడిగింది ఇస్తే తను అంతదాకా సరైంది బహుమతిగా ఇవ్వలేదన్న లోపం సవరించబడుతుంది అని మిస్ కెన్నడీ భావించింది.
నెమ్మదిగా తెరచుకుంటున్న తన కేబిన్ తలుపు వైపు చూసింది. లోపలికి వృద్ధుడైన ఓ ఫాదర్ వచ్చాడు. ఆయన ఒంటి మీది నల్ల దుస్తులని, మెళ్లోని వెండి శిలువని, చేతిలోని బైబిల్‌నిబట్టి ఆయన ఫాదర్ అని తేలిగ్గా గ్రహించింది. ఆయన ఆవిడకన్నా పొట్టిగా, లావుగా ఉన్నాడు. ఆయన తెల్ల గడాన్ని చూసి ఎర్ర బట్టలు లేని శాంటాక్లాజ్‌లా ఉన్నాడు అనుకుంది. ఆయన వంక చూసి పలకరింపుగా నవ్వింది. ఆయన బదులుగా ఇటాలియన్ భాషలో పలకరించాడు. ఆవిడ మొహాన్ని బట్టి ఆవిడకి తన భాష రాదని అర్థం అవగానే ఇంగ్లీష్‌లో అడిగాడు.
‘ఇంగ్లీష్ వచ్చా? బ్రిటీష్ వాళ్లా?’
‘ఒచ్చు. అమెరికన్ని’ జవాబు చెప్పింది.
ఆయన సన్నగా తలని ఊపి నవ్వాడు. తర్వాత ఆవిడ ఎదురు సీట్లో కూర్చున్నాడు. ఆయన కాళ్లు సీట్ మీంచి బూడిద రంగు నేలకి ఓ అంగుళం పైనే వేలాడుతున్నాయి. తన చిన్న ముతక, చవక పాత సంచీని సీట్ పక్కన ఉంచాడు. తర్వాత నల్లటి కోట్ జేబులోంచి ఓ రోజరీ (జపమాల)ని బయటకి తీశాడు. ఆవిడకి ఆయన ఎంతో పవిత్రంగా కనిపించాడు.
ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ కూర్చునే కంటే మాట్లాడేందుకు ఇంకో మనిషి దొరికాడనే సంతోషం ఆవిడలో కలిగింది.
‘యూరప్‌కి ఇది మీ మొదటి ప్రయాణమా?’ అడిగాడు.
‘అవును. నేను స్కూల్ టీచర్‌గా పని చేసి రిటైరయ్యాను. ఇది నా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో చేసే ప్రయాణం. యూరప్‌కి ఇది నా మొదటి ట్రిప్.’
‘సి.సి.’ ఆయన ఇటాలియన్లో మాట్లాడాడు.
తన భయాన్ని ఆయన గమనించకుండా తను జాగ్రత్త పడాలని ఆయన తన వంక కొద్దిగా దీక్షగా చూడటంతో ఆవిడకి తోచింది.
‘యూరప్ చూడదగ్గ ఖండం. నేను యూరప్‌లో అంతటా పర్యటిస్తూంటాను. మత ప్రచారం. మీరు అమెరికాలో ఎక్కడ ఉంటారు?’
‘న్యూయార్క్’
‘నిజంగా? నా బంధువులు కొందరు న్యూయార్క్‌లో ఉన్నారు. థర్డ్ కజిన్స్. వాళ్లు అల్ కపోనాలు (అమెరికాలోని ఇటలీ నించి వలస వచ్చిన ఓ ఘోర నేరస్థుడు) కారు. మంచి వాళ్లు’ నవ్వి చెప్పాడు.
నవ్వే ఆవిడతో ఆయన కరచాలనం చేస్తూ చెప్పాడు.
‘ఇటలీకి స్వాగతం. కొద్ది సేపట్లో రైలు కస్టమ్స్ చెకింగ్ ఆరంభమయ్యే మొదటి స్టేషన్‌కి చేరుకుంటుంది.’
క్రమంగా రైలు వేగం పంజుకోవడం ఆవిడ గమనించింది. పర్వతాల్లోంచి అది ప్రయాణిస్తోంది. ఆవిడ కొద్ది క్షణాలు తను నింపిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫారంలో ‘డిక్లేర్ చేయడానికి ఏం లేదు’ అన్నది ‘ఉంది’గా మారిస్తే అనిపించింది. కాని ఆ వాచీని తన మేనల్లుడికి తీసుకెళ్లాలన్న బలమైన ఆలోచన దాన్ని అణచివేసింది.
‘మీరు ఇటలీలో ఎన్ని రోజులు ఉంటున్నారు?’ ఆ ప్రశ్నకి ఆయన రెండోసారి అడిగితే కాని ఆలోచనల్లో ఉన్న ఆవిడ చెవిన అది పడలేదు.
‘మూడు రోజులు మాత్రమే. మూడో రోజు రాత్రి న్యూయార్క్‌కి వెళ్లిపోతాను.’
‘వసంతంలో ఇటలీ చాలా అందంగా ఉంటుంది. అవకాశం ఉంటే ఇంకొన్ని రోజులు ఉండటానికి ప్రయత్నించండి’ సూచించాడు.
‘నేను తెచ్చుకున్న డబ్బు దాదాపు ఐపోయింది. ఈ మూడు రోజులకి సరిపడే డబ్బు మాత్రమే బొటాబొటీగా ఉంది.’
ఆవిడ కొద్దిగా సందేహించాక ఫాదర్ ముందు తన తప్పిదాన్ని ఒప్పుకోవడం వల్ల తన పాపానికి కొంత ఉపశమనం కలగచ్చన్న ఆలోచన కలిగింది.
‘నిజానికి ఎక్కువ డబ్బే తెచ్చాను. కాని దాంతో జూరిక్‌లో నా మేనల్లుడి కోసం ఓ బహుమతి కొన్నాను’ చెప్పింది.
‘ఏం బహుమతి?’
‘చక్కటి వాచీ. దాంతో నా దగ్గర డబ్బు ఐపోయింది.’
‘మరి కస్టమ్స్ డ్యూటీ కట్టడానికి సరిపడే డబ్బు దగ్గర ఉంచుకున్నారా?’
ఆయన మాటలు ఆవిడకి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించాయి.
‘డ్యూటీ?’ అడిగింది.
‘సి. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా దాన్ని రహస్యంగా స్మగుల్ చేసే ప్రయత్నం చేయకండి. మీరు చేస్తారని కాదు. చాలామంది అమెరికన్స్ చేసే పనే అది. ముఖ్యంగా వాచీలు. ఈ రైలు మార్గంలో అందుకని కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యంగా అమెరికన్స్ విషయంలో. ఇదంతా మీకు ముందే తెలిసి ఉండాలే?’ ఫాదర్ ప్రశ్నించాడు.
‘తెలీదు. ఎవరూ చెప్పలేదు. అసలు ఎవర్నైనా అడగాలనే నాకు తోచలేదు.’
‘ఈ మార్గంలోని కస్టమ్స్ ఆఫీసర్లలో గారోంజా ఒక్కడే మంచివాడు. స్మగ్లర్లు అన్ని రకాల తెలివైన పద్ధతుల్లో స్మగుల్ చేస్తూంటారు. కాని ప్రయోజనం ఉండదు. కారణం ఎక్కడెక్కడ దాస్తారో అవన్నీ గారోంజాకి క్షుణ్ణంగా తెలుసు. అతను చెయ్యి పెట్టి వెతికి ఎక్కడ దాచినా ఆవగింజంత వజ్రం కూడా బయటకి తీస్తాడు అని ప్రతీతి. నేనీ మార్గంలో కొన్నిసార్లు ప్రయాణించాను కాబట్టి అతని గురించి తెలుసు’
‘అలాగా? లంచం ఇస్తే...’ మిసెస్ కెన్నడీ అర్థోక్తిగా ఆపేసింది.
‘లేదు. ఒద్దు. అతను అసలైన కేథలిక్. నా చర్చ్‌కి కొన్నిసార్లు వచ్చాడు కాబట్టి నాకు తెలుసు. అతను అవినీతిపరుడు కాదు. పైగా అదో కొత్త నేరవౌతుంది’ ఫాదర్ హెచ్చరికగా చెప్పాడు.
‘డ్యూటీ ఎంత వేస్తారు?’ కొద్దిగా భీతిగా అడిగింది.
‘స్విస్ వాచీలు ఖరీదైనవి. బహుశ మీరు రెండు వందల డాలర్లు చెల్లించి ఉంటారు. కస్టమ్స్ డ్యూటీ దాని రెండు రెట్లుంటుంది.’
‘నాలుగు వందల డాలర్లు! అది రోమ్‌లో నా మూడు రోజుల ఖర్చుని తుడిచిపెట్టేస్తుంది. అదృష్టవశాత్తు తిరుగు ప్రయాణం టిక్కెట్లని ముందే కొనేశాను. హోటల్‌కి, భోజనానికి, రవాణాకి ఇక డబ్బుండదు. చిక్కుల్లో పడతాను. ఐనా ఎందుకంత?’ ఆవిడ అడిగింది.
‘ఇటలీలో చాలామంది స్విస్ వాచీలు కావాలని అనుకుంటారు. అందువల్ల ఇటాలియన్ డబ్బు స్విట్జర్లాండ్‌కి వెళ్లిపోతుంది. అలా వెళ్లకుండా ఉండటానికి ఎక్కువ డ్యూటీని వేస్తారు. అందువల్ల రెండు వందల డాలర్ల స్విస్ వాచ్ ధర ఇటలీలో ఐదు వందల డాలర్ల దాకా పలుకుతుంది. ఐనప్పటికీ స్మగ్లింగ్ ద్వారా ఇటాలియన్ డబ్బు స్విట్జర్లాండ్‌కి వెళ్తూనే ఉంది.’
మిస్ కెన్నడీకి కిటికీలోంచి సైన్ బోర్డులు కనిపించాయి. రైలు వేగం తగ్గడం ఆరంభమైంది. చివరికి ప్లాట్‌ఫాం కనిపించింది. ఆవిడ మరోసారి ఆలోచించి తను తెచ్చిన వాచీ సంగతి రహస్యంగానే ఉంచాలని, చెప్పకూడదని నిర్ణయించుకుంది.
రైలు ఆగిన కొద్దిసేపటికి ఆ కేబిన్ తలుపు ఎంత అకస్మాత్తుగా తెరచుకుందంటే ఆవిడ ఉలిక్కిపడింది. లోపలకి యూనిఫాంలోని ఓ ఇటాలియన్ కస్టమ్స్ ఆఫీసర్ వచ్చాడు.
‘గుడీవినింగ్. నా పేరు గారోంజా. నేను ఇటాలియన్ కస్టమ్స్ ఆఫీసర్‌ని.’
అతనికి మిస్ కెన్నడీ మొహంలో భయం స్పష్టంగా కనిపించింది.
‘మీరు ఏదైనా డిక్లేర్ చేయదలచుకున్నారా?’ వెంటనే ఆవిడని అడిగాడు.
ఆవిడ జవాబు చెప్పడానికి గొంతు తడారిపోవడంతో అతనికి తన పాస్‌పోర్ట్‌ని, కస్టమ్స్ డిక్లరేషన్ ఫారాన్ని ఇచ్చింది. ఇస్తూ వాచ్ గురించి చెప్పాలని అనుకుంది. కాని అంతలోనే ఆవిడలో ఏదైతే కానిమ్మనే మొండి ధైర్యం ప్రవేశించింది.
అతను నిశ్శబ్దంగా ఆవిడ పాస్‌పోర్ట్‌ని, వీసాని చూసాక అందులోని ఫొటోతో ఆవిడ మొహాన్ని పోల్చి చూశాడు. కస్టమ్స్ డిక్లరేషన్ ఫారాన్ని చదివాక అతని దృష్టి ఫాదర్ వైపు మళ్లింది. ఆయన పక్కనే ఉన్న వెలసిపోయిన సంచీని చూశాడు.
మిస్ కెన్నడీ రిలీఫ్‌గా నిట్టూర్చింది.
‘క్షమించండి. మీరు ఆ వాచీ గురించి చెప్పరా?’ తన పాస్‌పోర్ట్‌ని గారోంజాకి ఇచ్చి ఫాదర్ ఇంగ్లీష్‌లో మిస్ కెన్నడీని అడిగాడు.
ఆ ప్రశ్నకి ఆవిడ తుళ్లిపడింది. తక్షణం గారోంజా దృష్టి మళ్లీ ఆవిడ వైపు మళ్లింది. ఈసారి అతని చూపులో గతంలో లేని తీక్షణత కనిపించింది. ఆవిడ తేరుకునే లోపల గారోంజా ఇంగ్లీష్‌లో అడిగాడు.
‘దయచేసి ఆయన ప్రశ్నకి జవాబు చెప్తారా?’
ఆవిడకి ఏం మాట్లాడాలో తోచలేదు. కొన్ని క్షణాల తర్వాత ఫాదర్ మళ్లీ చెప్పాడు.
‘ఆవిడ ఆ వాచీని తన మేనల్లుడి కోసం కొన్నానని ఇందాక నాతో చెప్పింది. డ్యూటీ చెల్లించాలని నేను చెప్తే, తన దగ్గర అంత డబ్బు లేదని కూడా చెప్పింది. నిజమైన కేథలిక్‌గా నేను నా బాధ్యతని నిర్వర్తించాను.’
‘అది నిజమా మిస్ కెన్నడీ?’ గారోంజా ఆవిడ వంక గుచ్చిగుచ్చి చూస్తూ ప్రశ్నించాడు.
ఆరు తరాల పిల్లలకి పాఠాలు చెప్పిన ఆ స్కూల్ టీచర్ అబద్ధం ఆడలేకపోయింది. అవునన్నట్లుగా తల ఊపింది.
గారోంజాకి ఆమె సూట్‌కేస్‌ని తెరచి వెదకి ఆ వాచీని కనుక్కోడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తను నేరస్థురాలిగా ఓ ప్రభుత్వ అధికారి ముందు తలవంచాల్సి వచిచ్నందుకు ఆవిడ మనసు బాధపడింది.
‘ఇది చాలా సీరియస్ నేరం మిస్ కెన్నడీ.’
ఆవిడ తల వంచుకుంది.
‘మీ పాస్‌పోర్ట్‌ని, ఈ వాచీని నేను స్వాధీనం చేసుకుంటున్నాను. రేపు ఉదయం మీరు మేజిస్ట్రేట్ ముందు హాజరవాలి. కాబట్టి నాతో రండి’
‘ఒద్దు... లేదు.. దయచేసి...’ భయంతో వణికిపోతూ ఆమె అర్థించింది.
ఫాదర్ ముందుకి వంగి అతనితో ఏదో ఇటాలియన్ భాషలో గబగబా మాట్లాడాడు. అతను తలాడిస్తూ మధ్యమధ్యలో మిస్ కెన్నడీ వంక చూస్తూ వౌనంగా విన్నాడు. తర్వాత ఇంగ్లీష్‌లో మిస్ కెన్నడీని అడిగాడు.
‘మీరు విమానం ఎక్కాల్సిన అవసరం ఉందని ఫాదర్ చెప్తున్నారు. నిజమేనా?’
‘అవును. వాచీకి డ్యూటీకి కట్టడానికి నా దగ్గర డబ్బు లేదు. ఆ విమానం మిస్సైతే ఇంకో టిక్కెట్ కొనే డబ్బు కూడా నా దగ్గర లేదు’ బలహీనంగా చెప్పింది.
‘సరే. నాకున్న అధికారంతో ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. కాని ఈ వాచీని మాత్రం నేను స్వాధీనం చేసుకుని మా శాఖకి అందజేయాల్సి ఉంటుంది.’
ఆవిడకి పాస్‌పోర్ట్‌ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. తర్వాత నిశ్శబ్దంగా బయటకి నడిచాడు. అతను వెళ్లాక కొన్ని నిమిషాల దాకా ఆవిడ తేరుకోలేక పోయింది. జీవితంలో ఓ అధికారి ముందు మొదటిసారిగా అపరాధిగా నిలబడే అనుభవం ఆవిడని కలచివేసింది.
రైలు కొద్ది నిమిషాల్లో మళ్లీ కదిలింది. ఆవిడ తన ఏడుపుతో పోరాడి అది బయటకు రాకుండా అణచివేయడంలో గెలిచింది. తను కొన్న బహుమతి పోయినందుకు దుఃఖం, తనని రైల్లోంచి దింపనందుకు సంతోషం ఆవిడలో సమానంగా కలిగాయి.
ఎదురుగా కూర్చుని బైబిల్‌ని చదివే ఫాదర్ వంక చూసి క్రోధంగా అడిగింది.
‘మీరు ఫాదరన్న గౌరవంతో నేను చెప్తే, ఆ రహస్యం అతనికి మీరు ఎలా చెప్పగలిగారు?’
అతను చిన్నగా తల పంకించి చేతిలోని బైబిల్‌ని మూశాడు. తన సంచీ జిప్ లాగి తెరిచాడు. దాన్నిండా వాచీలు! వెండి, బంగారం, ప్లాటినమ్ వాచీలు!
‘మీలాగా కాదు. నేను వృత్తిరీత్యా స్మగ్లర్‌ని. అనుమానం మీ మీదకి మళ్లించి, మీ వాచీ పట్టుబడితే నేను నిజాయితీపరుడిని అనుకుని నా సంచీని గరోంజా వెతకడని నేను భావించినట్లే జరిగింది. నన్ను చెడ్డవాడిగా అనుకోకండి.. ఇదిగోండి. అతను స్వాధీనం చేసుకున్న లాంటి ఒకటి కాదు రెండు వాచీలని మీకు ఇస్తున్నాను. తీసుకోండి’ ఆయన నవ్వుతూ చెప్పాడు.

(బజ్ డిక్సన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి