S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేలు చేసే చారు

ధప్పళం: ఎక్కువ కూరగాయల ముక్కలు వేసి చిక్కగా కాచిన పులుసుని ‘్ధప్పళం’ అంటారు. కూరగాయల సారం అంతా దీనిలో నిండి ఉంటుంది. పులుపును పరిమితంగా వేసి వండిన ధప్పళం లాంటి వంటకం ఒక్కటుంటే వంద వంటకాల పెట్టుగా పని చేస్తుంది.
నిమ్మచారు: నీళ్లలో చారు పొడి వేసి మరగకాచి దించి, చల్లారిన తరువాత నిమ్మరసం పిండాలి. నిమ్మరసాన్ని కాయకూడదు. రుచి చెడిపోతుంది. ‘సి’ విటమిన్ ఎగిరిపోతుంది.
పప్పుచారు: కందిపప్పు లేదా పెసరపప్పు, కూరగాయల ముక్కలు, సంబారాలు చేర్చి తాలింపు పెట్టి కాచిన పప్పుచారులో పులుపును పరిమితం వాడుకొంటే ఆరు రుచులూ ఇందులో ఉంటాయి. ఇంట్లో కాచుకొంటే పప్పు చారు అనీ హోటల్లో తింటే సాంబారు అనీ అంటూ ఉంటాం గానీ, సాంబారుకీ, పప్పు చారుకీ సంబారాలు, కరగాయలు కలపటంలో కొంత తేడా ఉంటుంది.
బస్సారు: బీర, పొట్ల, సొర, గుమ్మడి, బూడిద గుమ్మడి లాంటి నీరు ఎక్కువ కలిగిన కూరగాయలు లేదా ఆకుకూరల్ని మిక్సీ పట్టి రసం తీసి, చారు పొడి వేసి కాచి, తాలింపు పెట్టిన చారుని కన్నడం వారు ‘బస్సారు’ అంటారు. బసిడి సారు అని కూడా పిలుస్తారు.
బెల్లం చారు: కన్నడంలో ‘కట్టిం చారు’ అంటారు. కొద్దిగా చింతపండు బెల్లమూ కలిపిన ఘాటయిన మిరియాల చారు.
భయిల్లా సారు: కందికట్టు. చింతపండు వెయ్యని కందిపప్పు చారు.
మజ్జిగ చారు: పులవని, చిక్కని మజ్జిగలో కొత్తిమీర, అల్లం, వాముపొడి వేసి గోరువెచ్చ చేసిన చారు ఆరోగ్యదాయకం. మామూలు మజ్జిగకన్నా ‘మజ్జిగచారు’ని తయారుచేసుకొని గ్లాసులో పోసుకొని తరచూ తాగటం మంచిది. దీనే్న చల్లచారు అని కూడా పిలుస్తారు. ఇది పొయ్యి మీద పెట్టి కాయకుండా చేసిన చారు.
మజ్జిగ పులుసు: చిక్కని మజ్జిగలో కొబ్బరి, అల్లం, మిర్చి, ధనియాలు, మిరియాలు, కొద్దిగా శనగపప్పు వగైరా మిక్సీ పట్టి, కూరగాయల ముక్కలు కూడా కలిపి బాగా మరిగేలా కాచినది ‘మజ్జిగ పులుసు’. మోరు కొళంబు అనేది తమిళ నామం. తేమనం అని మన పూర్వీకులు దీనే్న పిలిచారు. ఇంత అందమైన తెలుగు పేరు ఎలా మరుగున పడిపోయిందో ఆశ్చర్యమే!
మామిడికాయ చారు: చారు పొడి వేసి చింతపండుకు బదులు మామిడి టెంకెలు వేసి కాచిన చారు.
మిరియాల చారు: ‘ముల్లీగాటనీ సూప్’ అని పశ్చిమ దేశాల వాళ్లు పిలిచే మిరియాల చారు తెలుగు కన్నడ ప్రజలకు ప్రీతిపాత్రమైంది. ‘మిలగుసారు’ అంటారు దీన్ని కన్నడం వాళ్లు. కంఠపర్యంతం భుజించినా ఈ మిరియాల చారన్నం తింటే భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.
ములక్కాడల చారు: రుచికి పర్యాయ పదం ఇది. కీళ్లవాతం రోగులకు చాలా మేలు చేస్తుంది.
మెంతిమజ్జిగ చారు: మజ్జిగలో కొద్దిగా మెంతులు, జీలకర్ర, వాము వేసి ఇంగువ తాలింపు పెడతారు.
మైసూరు రసం: కంది, పెసర, మినుము, శనగపప్పులు తీసుకొని, దోరగా వేయించి పైపైన దంచి, కొత్తిమీర, కరివేపాకు వేసి చారు పొడి బాగా దట్టించి కాచిన కట్టుచారు.
వంకాయ బజ్జీ చారు (పచ్చిపులుసు): లేత వంకాయని నిప్పుల మీద కాల్చి చింతపండు రసం పోసి కాచిన చారు. పచ్చి పులుసు అని కూడా పిలుస్తారు. ఊర్పు అనే నామాంతరం కూడా ఉంది.
శనగల చారు: కన్నడంలో ‘కడలే సారు’ అంటారు. శనగపప్పు, కొబ్బరి అల్లం వేసి కాచిన కట్టుచారు.
చింతపండును పరిమితంగా వాడుకొంటే మనకిష్టమైన ఏ ద్రవ్యాన్నయినా చారుగా కాచుకోవచ్చు. దాన్ని సారాన్ని పూర్తిగా పొందటానికి చారు ఒక చక్కని అవకాశం. భోజనం చివర మజ్జిగ అన్నానికి ముందు చారు అన్నం తినడం తెలుగువారి భోజన విధి.
సారంగ పక్షుల వంటి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృతం లాంటి సారవంతమైన ఈ చారుని మాటిమాటికీ తాగండి. లేకపోతే సంసారమే వృథా.. అని. ‘యోగరత్నాకరం’ అనే వైద్య గ్రంథంలో ఒక చమత్కార శ్లోకం ఉంది. రసము తాగితే రసికత పెరుగుతుందని, జీవితంలో సారాన్ని పొందవచ్చనీ దీని భావం.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com