S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆరాధనాభావాన్ని కలిగించే అనువాదం!

‘గీతాంజలి’
పేజీలు:137, వెల:రూ.100/-, ప్రతులకు:వి.శివరామకృష్ణారావు, 4238 జనప్రియ మెట్రోపాలిస్, నాల్గవ బ్లాకు, 2వ వింగ్, మోతీనగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్-18, ఫోన్:9441428804.
==============================================================
రవీంద్రనాథ్ టాగోర్ రచించిన ‘గీతాంజలి’ భారతీయ భాషల్లోనే కాక.. ప్రపంచ భాషల్లోకి అనువదింపబడిన సార్వజనీనతను సంతరించుకున్న ఓ గొప్ప కావ్యం! సద్వర్తన, తాత్విక భావనతో సాగిన ‘గీతాంజలి’ని తెలుగులోకి ఎందరో ప్రముఖ కవులు, రచయితలు అనువదించినారు. అయినా.. ఈ కావ్యం యొక్క ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా అనువాదాలు వస్తూనే వున్నాయి. విభిన్న కోణాల్లో విశే్లషణలూ చోటుచేసుకుంటున్నాయి! విశ్వవ్యాప్త భావ పరిమళాలను గుబాళింపజేస్తూ టాగోర్ ప్రపంచాన్ని ఓ వసుధైక కుటుంబంగా భావించాలి. ప్రేమ అనే సూత్రంతో ముడిపెడుతూ.. ‘గీతాంజలి’ని తీర్చిదిద్దిన తీరును ప్రశంసిస్తూ వివరణాత్మక అనువాదాలు నేటికీ రావడం విశేషం! ఈ క్రమంలోనే.. శివరామకృష్ణ గారు కూడా గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేసి.. ఓ గ్రంథాన్ని ప్రకటించడం ప్రశంసనీయం. రవీంద్రనాధ్ ఠాగోర్ మూల రచనకు ఎక్కడా తేడా రాకుండా సమర్థవంతంగా అనువాదం చేయడం అభినందనీయం.. ఆంగ్ల మూలంతోపాటు తెలుగు అనువాదాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచి పాఠకులను మెప్పించారు. టాగోర్ ‘గీతాంజలి’లోని హృదయాన్ని పట్టుకుని.. అనువాదం కొనసాగించారు.. సరళమైన రీతిలో.. చక్కని శబ్ద సౌందర్యంతో రమణీయంగా.. తీర్చిదిద్దడం విశేషం! ‘గీతాంజలి’లోని అసాధారణ భావనా శక్త్యానుభూతుల సాంద్ర క్రాంతి మూర్తిమత్వంగా దర్శనమిస్తుందన్న అంశానికి అద్దంపట్టే విధంగా శివరామకృష్ణగారు తమ అనువాదాన్ని సాగించారు. శివరామకృష్ణ గారి ఈ అనువాద గ్రంథంలో.. తెలుగు అనువాదంతోపాటు.. ఆంగ్ల మూలంకు సంబంధించిన కవితల్ని పొందుపరిచారు. టాగోర్‌పై.. ‘గీతాంజలి’పై ఆరాధనాభావం పెంపొందించేలా శివరామకృష్ణగారు తమ రచనలో శ్రద్ధ తీసుకున్నారు. నిర్గుణుడు, నిరాకారుడూ అయిన అమృతమయుడైన పరమాత్ముడిని మనముందు కవితాత్మకంగా రవీంద్రులవారు ఆవిష్కరించిన విషయాన్ని ఈ గ్రంథంలో శివరామకృష్ణగారు నిక్షిప్తం చేసిన తీరు బాగుంది.
ప్రభూ, నన్ను అవధిలేని ఆనందంతో చిరంజీవిని చేశావు! ఈ తేలిక పాత్రని పదే పదే ఖాళీ చేస్తుంటావు, తిరిగి నువ్వే కొత్త బతుకుతో నింపుతూ ఉంటావు.. కేవలం ఒక వెదురుముక్క ఈ వేణువు అంటూ భగవంతుని పట్ల టాగోర్‌కు ఉన్న అచంచల విశ్వాసాన్ని ప్రకటించారని.. మొదటి కవిత అనువాదంలో గుర్తుచేసిన తీరు బాగుంది.
రెండో కవితలో.. నేను ఎన్నడూ కలలోనైనా ఆశపడలేని విధంగా నా గానపు పక్షాంచలాలతో నీ చరణాలను తాకుతాను అన్న పంక్తులు ఆంగ్లమూలం వెలుగులో కొలువుదీరాయి!
అంతంలేని నీ గానజాలంలో నా హృదయాన్ని బందీ చేశావు ప్రభూ! అంటూ మూడో కవితలో.. నువ్వు దయచేసిన దక్షతే నా పనుల్లో బలమై నిలుస్తుంది. కనుకనే నా ప్రతి కార్యం వెనుక నువ్వున్నావని చూపే ప్రయత్నం చేస్తానని టాగోర్ తన మూల గ్రంథంలో ప్రకటించిన భావాలను శివరామకృష్ణగారు చక్కగా తెలుగులోకి అనువదించారు. ఇలా ‘గీతాంజలి’లోని 103 కవితల్ని హృద్యంగా తెలుగులోకి తీసుకొచ్చిన శివరామకృష్ణగారు గ్రంథంలో సందర్భోచిత రేఖా చిత్రాలను పొందుపరిచి మరింత అందాన్ని సంతరింపజేశారు. అనువాదం కత్తిమీద సామువంటిదే అయినప్పటికీ మూలకవిత్వం పరిధిలో.. రచయిత దీన్ని అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దారు.
దైవచింతన, తాత్విక భావన, ప్రాకృతిక సౌందర్యంతో... ముప్పేట అల్లుకుపోయిన ‘గీతాంజలి’ని ఎన్నిసార్లు చదివినా.. కావలసినంత సందేశం లభ్యమవుతుంది.. వివిధ భాషల్లోకి ఎన్నిసార్లు అనువదింపబడినప్పటికీ.. ప్రతిసారీ ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి శక్తి వున్న ఓ గొప్ప కావ్యం ‘గీతాంజలి’! దీన్ని తనదైన శైలిలో అనువదించి పాఠకులను మెప్పించిన శివరామకృష్ణగారు అభినందనీయులు! ప్రతి ఒక్కరూ చదువదగిన గ్రంథమిది!

-దాస్యం సేనాధిపతి 9440525544