S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదే నేను

ప్రతిరోజు ఆరు గంటలౌతోందంటే నాలో ఎక్కడలేని భయం, ఆందోళన మొదలవుతుంది. ఆ సమయానికి నా ఒక్కగానొక్క కొడుకు ఆఫీసు నుంచి ఇంటికొస్తాడు. అదే సమయానికి నా కోడలు నా కొడుక్కి ఎదురెళ్లి గుమ్మంలోనే వున్నవీ లేనివీ చాడీలు చెప్పటం గత ఆరు నెలలుగా రివాజుగా మారింది. ఆ రోజు కూడా ఎప్పట్లానే నా కొడుకు అలా గుమ్మంలో అడుగుపెట్టాడో లేదో కోడలు వాకిట్లోనే నిలేసి-
‘ఏవండీ ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఉంటే ఇంట్లో మీ నాన్న ఉండాలి, లేదా నేనూ నా పిల్లలన్నా వుండాలి. ముందు ఏ విషయం తేల్చి అప్పుడు కాని లోపలికి రండి’ అంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడింది.
‘ఏం జరిగిందీ రోజు మళ్లీ. రోజూ ఉండే గొడవేగా’ అని విసుక్కుంటూ, అడ్డంగా నిలబడ్డ కోడల్ని తోసుకుంటూ లోపలికొచ్చాడు మా వాడు.
‘మీకు ఏం జరిగినా చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఇంకా ఏం జరగాలి? ఆయనగారు నా పెంపకానికే వంక పెడుతున్నాడు. పిల్లల్ని కనంగా సరిపోదు, సరిగ్గా పెంచటం కూడా నేర్చుకోవాలిట!’ అంటూ వాడి వెనకాలే నీడలా అనుసరించింది.
హాల్లో నన్ను చూడగానే ‘నాన్నా! వేళకు ఇంత పెడుతోంది కదా! తిని మీ పనేదో మీరు చేసుకోవచ్చు కదా. ఒకవేళ తోచకపోతే ఏ గుళ్లోనో కాలక్షేపం చేసి రావచ్చు కదా’ నా మొఖం మీదే అనేసి వాడి గదిలోకి దారితీశాడు.
‘అది కాదురా...’ అంటూ నేను చెప్పబోయేది కనీసం వినిపించుకోకుండా, ‘అమ్మ పోయింత్తర్వాత ఈయనకు ఛాదస్తం మరీ ఎక్కువైంది’ అని నోట్లో నోట్లోనే గొణుక్కుంటూ వాడి గదిలోకి వెళ్లాడు. కూడా కోడలు కూడా వెళ్లి గది తలుపు నా మొఖానే వేసింది.
ఉరిశిక్ష పడ్డ ఖైదీకయినా కడసారిగా తన బాధను చెప్పుకోనిస్తారు. కానీ నాకు మాత్రం మా వాడు ఆ అవకాశం కూడా ఇవ్వటం మానేశాడు.
* * *
ఆర్నెల్లుగా ఆలనా పాలనా లేకపోవడంతో ఇంటి ముందంతా చెత్తాచెదారంతో, పిచ్చి మొక్కలతో నిండిపోయి తెలుగు సినిమాల్లో చూపించే దెయ్యాల కొంపలా ఉంది. మొలకి కట్టుకున్న తాళం చెవితో సింహద్వారానికి వేసిన తాళం తీయాలని ప్రయత్నించినా, బాగా తుప్పు పట్టి వుండటంతో రానని మొరాయిస్తోంది. తాళం తప్ప మంచిదే కాని తుప్పు పట్టి ఉండటంతో, ముసలి ముండా కొడుకుని కదా నా శక్తి చాలట్లా. నా కోడలు కూడా అంతే. మనిషి మంచిదే. కాని బుద్ధి అంతా తుప్పు పట్టిపోయింది. ఆవిడ మార్చటం నావల్ల కాలేదు.
* * *
‘ఏం మాష్టారూ! ఏంటీ ఇబ్బంది పడుతున్నారు’ అంటూ నే పడుతున్న తిప్పలు చూసి మా వూరి పోస్ట్‌మేన్ తన సైకిల్ దిగి నన్ను సమీపించాడు.
సైకిల్ స్టాండ్ వేస్తూ ‘ఏంటీ మళ్లీ మనూరు రానని చెప్పి వెళ్లారు. ఆర్నెల్లు తిరక్కుండా, అడ్రస్ దొరకని ఉత్తరంలా తిరిగొచ్చారు’ అంటూ నా దగ్గరకొచ్చాడు.
‘ఇటివ్వండి ఆ తాళం’ అంటూ నా సమాధానం కోసం కూడా ఆగకుండా చేతిలోని తాళం తీసుకుని బలంగా తిప్పాడు. ఆ దెబ్బకు పటపటమంటూ తుప్పంతా రాలిపోయి తాళం తెరుచుకుంది.
మా కోడలి బుర్రలోని తుప్పు కూడా ఎవరన్నా వదల్చగలిగితే, మనోకవాటాలు తెరుచుకుంటాయి.
‘మావాడెప్పుడు ఆ పని చేస్తాడో’ అని ఆలోచనలో వుండగా-
‘ఏంటి మాస్టారూ. అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి’ అనే పిలుపుతో ఈ లోకంలోకొచ్చాను.
‘ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది మాస్టారూ. ఇదంతా శుభ్రం చెయ్యాలంటే మీ ఒక్కళ్ల వల్ల కాదు. నేను ఎటూ రాయుడి గారింటి కెళుతున్నా. ఆయనతో మాట్లాడి ఓ నలుగురు మనుషుల్ని పంపిస్తా. అప్పటి దాకా మీ పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకోండి’ అంటూ నట్టింట్లో ఓ పక్కగా వున్న నా పడక్కుర్చీ తీసుకొచ్చి, దుమ్ము దులిపి వసారాలో వేశాడు.
‘మాస్టారూ! ఎన్నింటికి బయల్దేరారో ఏమిటో? ఏమన్నా తిన్నారా?’ నేను మాట్లాడేలోపే, ‘మావాడి చేత కేరియర్ పంపిస్తా. మొహమాట పడకుండా తినండి. మీ శిష్యుడు మిమ్మల్ని చూసినట్టు కూడా ఉంటుంది’ అంటూ నా సమాధానం కోసం ఎదురుచూడకుండా, సైకిల్ ఎక్కి రివ్వున రాయుడిగారి ఇంటి వైపున వెళ్లిపోయాడు.
వసారాలో వేసిన పడక్కుర్చీని చూస్తుంటే, రాజుగారి సింహాసనంలా ఉంది. అందులో కూర్చుని, ఆ దారంట వచ్చేపోయే వాళ్లని పలకరిస్తూ, వాళ్లంతా మాస్టారనే గౌరవంతో నమస్కార బాణాలతో నన్ను చిత్తు చేస్తుంటే ఏనుగు అంబారీ ఎక్కినంత ఆనందంగా వుండేది.
‘ఆ రోజులే వేరు’ అనుకుంటూ పడక్కుర్చీలో చిన్నగా మేను వాల్చాను. అలవాటు తప్పిందేమో కిర్రుమంటూ పడక్కుర్చీ సన్నగా మూలిగి, మళ్లీ సర్దుకుంది. బహుశా పాత వాసనలు గుర్తుకొచ్చాయేమో.
బస్సులో వెనుక సీటులో కూర్చుని వచ్చానేమో, బస్సు కుదుపులకు వొళ్లంతా పులిసిపోయింది. ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే వొళ్లు తెలియలేదు. అలాగే నిద్రపోయాను పడక్కుర్చీలో.
* * *
‘మాస్టారూ!’ అన్న పిలుపుతో మంచి నిద్రలో వున్నవాణ్ణి కాస్త మెల్లగా కళ్లు తెరిచాను.
ఎదురుగా పోస్ట్‌మేన్ కొడుకు వాసు కొరియర్ పట్టుకుని నిలబడి వున్నాడు.
‘సాయంత్రానికల్లా పనంతా అయిపోవాలి. ఇల్లు అద్దంలా మెరిసిపోవాలి’ అన్న మాటలు చెవుల్లో పడటంతో పడక్కుర్చీ వెనకున్న కిటికీలోంచి ఇంట్లోకి తొంగి చూశాను.
ఎప్పుడొచ్చాడో ఏమో పోస్ట్‌మేన్, రాయుడి మనుషుల చేత ఇల్లు శుభ్రం చేయిస్తున్నాడు.
‘ఏరా వాసూ! ఎలా చదువుతున్నావ్?’ అంటూ నన్ను చూస్తూ బెదురుబెదురుగా దూరంగా నిలబడ్డ వాసును దగ్గరకు రమ్మని సైగ చేశాను.
నా మాట విని, నేను మేల్కొన్నానని తెలిసి ‘వాడి మొహం చదువు మాస్టారూ. ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో ఏవో ఆటలాడుతుంటాడు. చెబితే వినడు. మీరన్నా గట్టిగా చెప్పండి. మీ మాటంటే వీడికి వేదం’ అని వాసు చేతిలో కారియర్ తీసుకుని, ‘మాస్టారికి మంచినీళ్లు పట్టుకురా’ అంటూ వసారా అరుగు మీద విస్తరి పరిచాడు స్వామి ఉరఫ్ మా ఊరి పోస్ట్‌మేన్.
* * *
‘అమ్మాయి దివ్యా! పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఆ సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. గమనిస్తున్నావా?’ అన్నాను కాఫీ గ్లాసందిస్తున్న కోడలు పిల్లతో.
‘తెలుసులే మామయ్యా. మీరేం ఆందోళన పడకండి. ఈ రోజుల్లో టెక్స్ట్‌బుక్స్‌లో కన్నా ఇంటర్నెట్‌లోనే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. అందుకే సెల్‌ఫోన్లు కొనిచ్చాం ఇద్దరికీ’ అని తేల్చి పారేసింది.
‘అది కాదమ్మా. అంతసేపు సెల్‌ఫోన్‌తో గడిపితే కళ్లు పాడవటమే కాక, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని మొనె్నక్కడో పేపర్‌లో చదివాను’ అన్నాను.
‘వాళ్లలాగే రాస్తారు మావయ్యా. అయినా మీ మనవడు మనవరాలి జ్ఞాపకశక్తికి ఇప్పుడొచ్చిన ప్రమాదమేమీ లేదు. కావాలంటే చూడండి. అమ్మలూ బాహుబలిలో మహేంద్ర బాహుబలిని ఎవరు చంపారు?’ అని ప్రశ్నించింది.
‘కట్టప్ప కట్టప్ప’ అంటూ ఇద్దరూ తల కూడా తిప్పకుండా సమాధానం ఇచ్చారు.
ఆ సమాధానంతో మా కోడలు మొహం పేరుకు తగ్గట్టు దివ్యంగా వెలిగిపోవటం మొదలెట్టింది. ఆ పిల్ల అమాయకత్వానికి జాలిపడాలో, పిల్లలు సెల్‌ఫోన్ ధ్యాసలో పడి పాడైపోతున్నారని బాధపడాలో నాకే అర్థం కాలేదు.
* * *
‘మాస్టారూ! అన్నం వడ్డించాను’ అని నన్ను కుదుపుతూ ‘ఏంటి మాస్టారూ పొద్దుట్నించి చూస్తున్నా. తెగ ఆలోచిస్తున్నారు. ఏం జరిగిందేంటి?’ అని విస్తరాకు నా ముందుకు జరిపాడు.
సమాధానం ఏం చెప్పాలి? నా కొడుకు, కోడలు పెట్టే బాధలు తట్టుకోలేక వచ్చేశానని నిజం చెప్పి నా కొడుకు గౌరవాన్ని పాడు చెయ్యాలా? లేక ఊరి మీద గాలి మళ్లిందని అబద్ధం చెప్పాలా? ఓ టీచర్‌గా పిల్లల నెప్పుడూ అబద్ధాలు ఆడకూడదని చెప్పే నేనే అబద్ధం ఆడాలా?
నా అంతరంగాన్ని గ్రహించాడో ఏమో స్వామి ‘ముందు తినండి. తరువాత మాట్లాడుకుందాం’ అంటూ లేచి లోపలికెళ్లాడు పనివాళ్లను పర్యవేక్షించడానికి.
అన్నం తింటున్నంతసేపు వాసు మంచినీళ్ల చెంబు పట్టుకుని నా పక్కనే నిలబడ్డాడు. మధ్యమధ్యలో గొంతు పట్టినప్పుడల్లా మంచి నీళ్లు అందిస్తున్నాడు వౌనంగా. వాడి వౌనానికి కారణం నేనంటే భయమో లేక గౌరవమో అర్థం కాలేదు.
‘ఏరా వాసు! ఎప్పుడూ సెల్‌ఫోన్‌తో ఆడుతున్నావట. తప్పు కదా’ అన్నాను మంచినీళ్ల గ్లాసు పక్కన పెడుతూ. ‘అయినా ఇంతలేవ్. ఐదో తరగతికే నీకు సెల్‌ఫోన్‌తో ఏం పని?’ ప్రశ్నించాను మళ్లీ.
‘గేమ్స్...’ అని సన్నగా గొణిగి, ఒకడుగు వెనక్కి వేశాడు. కొడతాననుకున్నాడో ఏమో.
‘ఎప్పుడూ ఆ వెధవ గేమ్సే మాస్టారూ. ఎంత చెప్పినా వినడు’ మళ్లీ వసారాలోకొచ్చాడు స్వామి.
‘స్వామి ఇందులో వాడి తప్పేం లేదయ్యా. అంతా నీదే’ అన్నాను.
‘అదేంటి మాస్టారూ. అటు తిరిగి, ఇటు తిరిగి నా మీద పడ్డారు. అంతేలెండి. ఎంతైనా గురుశిష్యులు కదా’ అన్నాడు కాస్తంత నిష్ఠూరంగా.
‘లేదు స్వామి. చిన్నపిల్లలు దేన్నైనా జీవితాన్నుంచి నేర్చుకుంటారు. నేర్చుకున్నదే జీవిస్తారు. కాబట్టి మన జీవితాల్లోని మంచినే వాళ్లకందేటట్లు చూడాలి. నాకింకా గుర్తు. నా చిన్నతనంలో మా నాన్నగారికి చుట్ట తాగే అలవాటుంది’ అంటూ విస్తరి మడిచి, చెయ్యి కడుక్కోవటానికి పైకి లేచాను.
వాసు నాకన్నా ముందు పరిగెట్టుకుంటూ వెళ్లి చెట్లపాదు దగ్గర నీళ్ల చెంబుతో నిలబడ్డాడు. చెయ్యి కడుక్కుని, కండువాతో తుడుచుకుంటూ,
‘ఓ రోజు కాల్చిన చుట్టపీకను నా ఎదురుగానే బయట పారేశారు. బాగా చిన్నవాణ్ణి కావటంతో అదేదో నేనూ చెయ్యాలనిపించింది. నెమ్మదిగా వెళ్లి పారేసిన చుట్ట పీకను చేతిలోకి తీసుకున్నానో లేదో నా చెంప ఛెళ్లుమంది. ఎదురుగా నాన్నగారు’ అంటూ మళ్లీ పడక్కుర్చీలో కూలబడ్డాను.
‘తర్వాత...’ అంటూ వాసు ఉత్సాహం ఆపుకోలేక నా పక్కకు చేరాడు.
వాడి తల నిమురుతూ ‘ఇంతలో మా అమ్మ వచ్చింది. చిన్నపిల్లాణ్ణి అంత దెబ్బ కొట్టడానికి చేతులెలా వచ్చాయి. అయినా వాడేం చేశాడు? మీరు చుట్టలు తాగుతున్నారు కాబట్టే వాడికి తాగాలనిపించింది. అది తప్పని వాడికేం తెలుసు. ఏనాడన్నా మనం చెప్పామా, ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? ముందు మీరు ఆ అలవాటు మానుకోండి’ అంటూ నన్ను లోపలికి తీసుకెళ్లింది’ అని వాడి వంక చూశాను.
వాడి కళ్లల్లో ఏదో మెరుపు. మార్పుకు ముందు జరిగే ఘర్షణకది సంకేతంలా వుంది.
‘ఆ రోజు నుంచి మా నాన్న మళ్లీ చుట్ట ముట్టలేదు. నా జీవితంలో నేను ఏ చెడు అలవాటుకి బానిస కాలేదు’ అంటూ స్వామి వంక చూశాను.
తన తప్పు తెలిసినట్లుగా కాస్తంత తలదించి, ‘కానీ ఇది ఆఫీస్ వాళ్లిచ్చారు మాస్టారూ. నా వృత్తికి దీని అవసరం తప్పనిసరి’ అంటూ గొణిగాడు.
‘ఆఫీస్ పని అయిపోయిన తరువాత, దాన్ని ఆఫీసులోనే పడేసిరా. దరిద్రం అని తెలిసి ఇంటి దాకా తీసుకురావటం ఎందుకు? పెద్దవాళ్లం మనమే దానికి బానిసలం అయితే, చిన్నపిల్లలు వాళ్ల వయసెంత, మనసెంత’ అన్నాను.
‘అసలు నువ్వూ, మీ ఆవిడా వీడితో ఎక్కువసేపు గడిపితే, ఈ సమస్యే రాదు. తల్లిదండ్రుల ఆదరణ దొరకకే పిల్లలు వేరే మార్గాలు ఎంచుకుంటున్నారు’ అని నిజం కొంత నిష్ఠూరమైనా చెప్పక తప్పదు కాబట్టి చెప్పాను.
‘అవును మాస్టారూ. నాకింకా గుర్తు. మీరు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా, సాయంత్రపు వేళల్లో మీరూ, అమ్మగారు కలిసి ఊళ్లో పిల్లలందర్నీ పోగేసి మంచి మంచి కథలు చెబుతూ, సరదా ఆటలు నేర్పుతూ వుండేవాళ్లు. ఇవాళ ఆ ఓపిక ఎవరికున్నాయి మాస్టారూ. నేనా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొస్తా. మా ఇంటావిడకి ఆ టీవీ సీరియల్స్ తప్ప ఇంకొకటి పట్టదు’ అని నిజాన్ని ఒప్పుకున్నాడు.
‘తప్పదయ్యా. మన జీవితాల్లో పిల్లలకు కాస్తంత చోటివ్వాలి. లేకపోతే వాళ్ల జ్ఞాపకాల్ల మనం మిగలం’ అంటూ కళ్లు మూసుకున్నా.
* * *
‘ఇంట్లోకన్నా రానివ్వు. వీధిలోనే నిలబెట్టేశావ్ వాళ్లని. నీ కొక్కదానికే వాడి మీద ప్రేమ వుందని తెలియాలనా’ అంటూ ఊరి నుంచి వస్తున్న మా అబ్బాయి, కోడలు, మనవళ్లకి ఎదురెళ్లిన మా ఆవిడ్ని ఉడికించాను.
‘అవును నాన్నా మీ మీద అమ్మకొక్క దానికే ప్రేమ ఉంది. మీకు కూడా ఉంటే రిటైరైనా ఇంకా ఈ పల్లెటూరు పట్టుకుని వేలాడ్తారా’ అంటూ లోపలికొచ్చాడు మావాడు.
‘అలవాటు పడ్డ ప్రాణం కదరా. చూడు రిటైరైనా ఎంతమంది పిల్లలో నా చుట్టూ. వీళ్లందర్నీ వదిలి ఎలా రాను’ అన్నాను అనునయంగా.
‘అంతేలెండి. ఊళ్లో వాళ్ల పిల్లలను మాత్రం ఉద్ధరిస్తారు. మా పిల్లలను మాత్రం మీరు పట్టించుకోరు’ అంటూ నా పక్కన చేరాడు మా వాడు.
‘ఇవాల్టికి చాలుగాని, ఇక ఇళ్లకు వెళ్లండి’ అని నా చుట్టూ ఉన్న పిల్లల్ని తోలేసింది మా ఆవిడ.
‘అవును మామయ్యాగారు. మీరు అత్తయ్యగారు కూడా మాతో వుంటే మీ మనవళ్లని మీ అబ్బాయంత చెయ్యచ్చు కదా’ అంది కోడలు కూడా ఎదురుగా కూర్చుంటూ.
‘అయని నువ్వు వున్నావు కదమ్మా. పిల్లల్ని చూసుకోటానికి. ఓపికున్నంత వరకూ ఏదో నాకు తోచింది ఈ సమాజానికి సహాయం చెయ్యాలన్నదే నా కోరిక. ఎందుకంటే ఈ ఊళ్లో వాళ్లు ఇన్నాళ్లు నాకే లోటు లేకుండా చూసుకున్నారు. మరి వాళ్ల రుణం తీర్చుకోవాలి కదా’ అన్నాను కళ్లజోడు తుడుచుకుంటూ.
‘అయినా ఎన్నిసార్లు చెప్పాను, మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్లండి, మేం చూసుకుంటాం అని’ అంది మా ఆవిడ వంటింట్లో నుంచే.
‘నిజమేననుకోండి అత్తయ్యా. కాని పట్నంలో ఇంగ్లీషు

అదే నేను (7వ పేజీ తరువాయ)
మీడియం స్కూల్స్ ఉంటాయి కదా’ అంది గడుసుగా కోడలు పిల్ల.
‘అదంతా నాకు తెలియదమ్మా. ఈసారి పిల్లల్ని ఇక్కడే వదిలి మీరన్నా వెళ్లండి. లేదా మీ నాన్నను వదిలి నేనన్నా వచ్చేస్తా’ అంటూ నా వైపు చూసింది.
ఏ నిమిషాన ఆ మాట అన్నదో మా ఆవిడ, పండుగకి వచ్చిన పిల్లలు తిరిగి వెళ్లకముందే, నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయింది.
దశదిన కార్యక్రమాలన్నీ పూర్తి చెయ్యటానికి మా వాడు మరో పదిహేను రోజులు సెలవు పెట్టాడు. ఈ ఇరవై రోజుల్లో మా ఆవిడ దూరమవ్వటం, తాతయ్యా అంటూ మనవడూ మనవరాలు నా చుట్టూ తిరుగుతుండటంతో మా ఆవిడ మీద ప్రేమ వాళ్ల మీదకు మళ్లింది. సెలవులు పూరె్తై వెళ్తూ, ‘మీరొక్కరే ఇక్కడెందుకు నాన్నా! మాతో వచ్చెయ్యండి’ అన్న మా వాడి మాటను తీసెయ్యలేక పోయాను. కొన్నాళ్లు వాతావరణం మారితే నేను కూడా మా ఆవిడ మీద ఉన్న దిగులు నుండి బయట పడగలుగుతానని, సరేనన్నాను.
* * *
‘మాస్టారూ! ఇల్లంతా శుభ్రం చేశారు. అద్దంలా మెరిసిపోతోంది. ఓసారి లోపలికి రండి’ అన్న అరుపులాంటి పిలుపుతో మెలకువ వచ్చి ఈ లోకంలోకొచ్చి పడ్డా.
లోపలికెళ్లి చూద్దును కదా. అద్దంలా కడిగి పెట్టారు. చాలా సంతోషం వేసింది. పనివాళ్లందరూ అప్పటికే వెళ్లిపోయినట్టున్నారు. ఎప్పుడు చూశాడో, నా సంచిలోంచి తీసి మా ఆవిడ ఫొటో ఫ్రేమ్ గోడకు తగిలిస్తున్నాడు స్వామి.
‘స్వామీ నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా..’ నా మాట పూర్తయ్యేలోపే..
‘్భలేవారే మాస్టారూ. ఇదేపాటి సాయం. మీరు మా ఊరికి, మా పిల్లలకు చేసిన ఉపకారం ముందు. మా పిల్లలకో అక్షరం ముక్కొస్తోందంటే అది మీ పుణ్యమే. రాత్రిక్కూడా భోజనం పంపిస్తా. ఈ పూటకు వంట గింట ఏం పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోండి’ అంటూ తన కొడుకుతో సైకిల్ దగ్గరకు వెళ్లాడు.
స్వామి తన కొడుకుతో నిష్క్రమించాక ఇల్లంతా బోసిపోయినట్లయింది.
మా ఆవిడ వున్నప్పుడు ఇదే ఇల్లు పదిమంది పిల్లలతో ఇద్దరు ముగ్గురు పనివాళ్లతో కళకళలాడుతూ వుండేది. ఆ కళ, గౌరవం, గొప్పతనం ఆవిడతోనే పోయాయి.
ఎంతైనా ఆడది బ్రతికున్నంత వరకే మగవాడికి గౌరవం. కాని ఆ ఆడదానికి మగవాడు మాత్రం గౌరవం ఇవ్వడు. భర్త చనిపోతే భార్య బ్రతగ్గలదు కాని, భార్య చనిపోతే భర్త మాత్రం బ్రతకలేడు అనే సత్యం మా ఆవిడ పోయిన తరువాత కాని తెలిసి రాలేదు నాకు.
* * *
‘అమ్మాయ్ దివ్యా, నీ సీరియల్స్ గోల నీదే కాని పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో గమనిస్తున్నావా?’ అని టీవీ సీరియల్‌లో పీకలోతు మునిగిన కోడలి ఏకాగ్రతకు అడ్డు రావటంతో...
‘ఏం జరిగింది మావయ్యా’ అంటూ టీవీ ముందు నుంచి కదలకుండానే అడిగింది.
‘వాడు చూస్తే క్రికెట్ మ్యాచ్ అంటూ పొద్దుననగా వెళ్లాడు. అమ్మాయి చూస్తే ఎవరో ఫ్రెండ్స్ వచ్చారని వాళ్లతో పొద్దుట్నుంచి గదిలోనే కంప్యూటర్‌లో ఏవో సినిమాలు చూస్తూ గడుపుతోంది. అస్సలు వాళ్ల గురించి పట్టించుకోవా’ అని విసుక్కున్నాను.
రాత్రి భోజనాల దగ్గర మొగుడూ పెళ్లాల గుసగుసలు సన్నగా వినపడుతున్నాయి. ‘అబ్బబ్బా మీ నాన్నతో చచ్చిపోతున్నాను. ఆయనకన్నీ తప్పులే. పిల్లలేదో కాస్తంత వాళ్ల స్నేహితులతో గడిపితే, అది కూడా భరించలేక పోతున్నారు’ అంటూ నా మీద చాడీలు చెప్తోంది కోడలు. వాటిని ఖండించకపోగా వౌనంగా తలాడిస్తూ వింటున్నాడు మా వాడు.
* * *
మనవడు, మనవరాలు నా కళ్లెదుట చెడిపోతుంటే నా మనసుండ బట్టలేక పోయింది. పిల్లలు చెడిపోతున్నారంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులే కారణం. పెద్దవాళ్లం మనమే టీవీ సీరియల్స్, సెల్‌ఫోన్లను వదిలి వుండలేక పోతే, చిన్నపిల్లలు వాళ్లు మాత్రం ఎలా వుండగలరు. వాళ్లు తప్పుదారిలో ప్రయాణించకుండా పర్యవేక్షించాల్సిన నా కోడలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆ రోజు ఆవిడకు హితబోధ చేద్దామని చూశాను.
కానీ నేనన్నా, నా మాటలన్నా లెక్కలేనట్లు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని తన గదిలోకెళ్లి తలుపులేసుకుంది. మళ్లీ మా వాడు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి బయటకు వచ్చింది. అదీ గొడవ.
* * *
ఒకప్పుడు ఊళ్లో వాళ్ల పిల్లలను చేరదీసి, వారిని సరిదిద్దుతుంటే, మా పిల్లలనెందుకు మీరు పట్టించుకోరు అని నిష్ఠూరాలాడిన కొడుకు కోడలు, ఈ రోజు వారి గురించి ఆలోచిస్తుంటే వద్దు పొమ్మంటున్నారు. ఎందుకు?
అప్పుడు అదే పల్లెటూళ్లో అదే నేను, అందరి చేత కీర్తించబడుతూ, మరి ఇప్పుడు ఇక్కడా అదే నేను. వీళ్ల చేత తూలనాడబడుతూ. ఏమిటి తేడా? తేడా అల్లా మనిషి అవసరం. మనిషి మీద గౌరవం.
అక్కడ ఆ పల్లెటూళ్లో నా అవసరం ఇంకా ఉంది. అందుకే నేనంటే గౌరవం. ఇక్కడ నా అవసరం వున్నా అది గుర్తించే స్థితిలో వీళ్లు లేరు. అది గుర్తెరిగేసరికి జీవితాలు చేజారిపోతాయి.
గౌరవం వున్నచోటే ఏ మనిషైనా మనుగడ సాగించటం మంచిది. ఆ తరువాతే బంధాలు, అనుబంధాలూ. సిరిసంపదలూ అన్న ఆలోచన రాగానే ఇక అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడే నా శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నా.
=====================================================================
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ప్రొ. ఇ.శ్రీనివాస్‌రెడ్డి.. 7893111985