S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తొలి ‘ఫఠన’ ధారావాహిక నవల..

ప్రజాశక్తి నగర్ - బెజవాడ మొగల్రాజపురం గుహల ప్రాంగణంలో విస్తరిస్తున్న ‘మేధావుల’ పేట మా ఇంచిపేట నుంచి - బెజవాడ రైల్వేస్టేషన్ బ్రిజ్ (దీనిని నేను వైతరిణి అనేవాణ్ణి) దాటి కొత్తగా పెరుగుతున్న కస్తూర్బా పేట మీదుగా ప్రజాశక్తి నగర్‌కి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ప్రతీ శనివారం సాయంకాలం క్రమం తప్పకుండా రెండున్నర మైళ్లు పోయేవాళ్లం తమ్ముడు నేనూ... ఐదవ శతాబ్దం నాటి విష్ణుకుండినులు నిర్మించిన గుహలు నేటికి ట్రాఫిక్ దెబ్బలు తింటూ ఉన్నాయి. అక్కడే, మహీధర రామమోహనరావు గారు చిన్న మేడ (1959) నిర్మించుకుంటున్నారు. కరెంటు ఇంకా లేదు. వారింటి వసారాలో సాహితీ పిచ్చాపాటి ఏర్పాటు చేసేవారాయన. దానికి నామకరణం కూడా అయింది. విజయ సాహితీ సమావేశాలు. పేటలో ఎక్కువమంది రిచ్ కమ్మ(ని)వారే. సమావేశానికి విశాలాంధ్రలో ఎంగేజ్‌మెంట్ చూసి - వాసికెక్కిన వాసి గల రచయితలూ - చరిత్రకారులు, రచయితలు - లెఫ్ట్ రైట్ కొట్టేవారు - అంచేత అదేదో లెఫ్టిస్టు ఇలాకా అనడానికి వీలులేదు. రైటిస్టూ, మిడిలిస్ట్ - అట్లాగే మాలాంటి చిరుకప్పలు - చేరేవాళ్లు. ఆ తరంలో మహీధర వారి పేరు, పరిచయం లేని వారు లేరు. ఏటుకూరి బలరామ్మూర్తి గారి నుంచి ఎబికె ప్రసాద్ దాకా ముక్కామల నాగభూషణం దగ్గర్నుంచి పరకాల పట్ట్భా రామారావు దాకా - కొండపల్లి కోటేశ్వరమ్మ మొదలు ‘లత’ దాకా నాటి పాపులర్ ప్రోగ్రెసివ్ హేమాహేమీలు సంధ్య వేళ చేరేవారు. మహీధర వారి సతీమణి కామేశ్వరమ్మగారు వెలిగించిన హరకేన్లాంతరు కునికేసే దాకా - గొప్ప చర్చలు.. కబుర్లు - పరిచయాలు - జేగీయమానంగా సాగేవి. నాలాంటి యువ రచయిత రాసిన కొత్త అముద్రిత రచన చదవాలి - ఆనక పెద్దలు పిన్నలు దూది ఏకేసినట్లు దాన్ని ఏకేసేకా - అంతా ‘లేచ్చక్కా పోయేవాళ్లం’. అది కవితల కాలం - తాపీ రాజమ్మగారు ‘మా భూమి’ ఫేం, వారి అమ్మాయిలిద్దరితో వచ్చేవారు. బొమ్మారెడ్డిగారు సహా (అప్పుడాయన న్యూస్ ఎడిటర్ విశాలాంధ్ర స్ట్ఫా.) ఇట్లా మహీధర (కొండలు) మేళా సాగేది. ఓసారి గోపీచంద్‌గారు మరోసారి చండ్ర రాజేశ్వరరావు గారు - రాజేశ్వరరావు గారు పొలిటేశియనా? కాని, మా అందరిని చూసి ఆయనకీ హుషారు వచ్చి, పాండవోద్యోగ విజయాలలోని చెల్లియో చెల్లకో పద్యం అందుకున్నాడు. ‘అయ్యో! హోరమనీ లేదే’ అన్నారు చనువుగా సీనియర్‌గారు (కంభంపాటి సత్యనారాయణ) అట్లాగే గోపీచంద్ గారు వచ్చేపాటికి - కథకి నవలకి తేడా ఏమిటీ? అనే చర్చ సాగుతోంది. ఆయన అన్నాడు ‘రెండూ వో గూటి పిట్టలే కాని సాంకేతికమయిన తేడా వున్నదేమో?’ నేనన్నాను వినయంగా. వృత్తంలో భాగమే కదా? సార్ ‘చాపము’ అట్లాగా ఇతి‘వృత్తం’లో ‘సెక్టర్’ (చాపము) లాంటిది, కథానిక అనుకోవచ్చుగా? అని అట్లా పిన్నలు పెద్దలు కలుపుగోలుగా ఉండి సాగేవి సభలు. చెప్పాల్సిన విషయమేమిటంటే -ఆనాడు సభలో నేను ‘మునగచెట్టు’ కథ చదివాను. ‘ఓ నవలని కథగా కుదించేశావోయ్?’ అన్నారు రామ్మోహన్ గారు. పుంఖానుపుంఖాలుగా కథలు రాస్తున్న నాకు - వారపత్రికలలో మధ్యపుటలలో ‘పడుతున్న’ నాకు చివుక్కుమంది. కాని, దాన్ని నవల చెయ్యడం బెటర్ వీరాజీ అన్నారంతా. తొలి మలుపు ఫెయిర్ కాపీ చేస్తున్నాను. దాన్ని (సాపు కాపీ రాయడం) పక్కనబెట్టాలిగా మరి అనుకున్నాను. ఈలోగా ఢిల్లీ నుంచి సైనిక సమాచార్ పత్రిక నుంచి గోవాడ సత్యంగారు లెటర్ రాశాడు. కథ రాస్తే వెంటనే డబ్బులు వచ్చే కేంద్ర గవర్నమెంటు పత్రిక అది. ప్రతీ లైబ్రరీకి వచ్చేది కూడా. మిలిటరీ వాళ్లు చదవాలి అంటే? హనీమూన్ అన్న కథ రాశాను. యోజనకీ రాయాలి. అట్లా బిజీ అయ్యాను. మొట్టమొదట విజయ సాహితీ సమావేశానికి పోయినప్పుడు కవితలే తీసుకు వెళ్లాను. తమ్ముడు అప్పటికే విశాలాంధ్ర ఆఫీసులో కూడా చనువు సంపాదించాడు. కానీ వాల్తేరు నుంచి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి వచ్చానుగా ఆ గ్లామర్ కూడా ఉంది. ఇక్కడో సంగతి చెప్పాలి. మహీధర వారి పెద్దబ్బాయి నళినీ మోహన్ ఫిజిక్స్, చిన్నవాడు మురళీమోహన్ - మురళి - నాకు ఎస్సారార్ కాలేజీలో ఇంటర్‌మీడియెట్‌లో బెంచిమేట్. అలాగే కంభంపాటి వారి అబ్బాయి అరుణకుమార్ రాజేశ్వరరావుగారి అబ్బాయి లెనిన్ కూడా ఇంటర్ క్లాస్‌మేట్లే. మురళి, అరుణ ఇద్దరూ రష్యాకీ, అమెరికా చదువులకి పోయారు. ఆవేళ (1959) తండ్రులు - పెద్దలు నాకు తమ వాత్సల్యామృతాన్ని పంచుతున్నారు. థ్రిల్లింగ్‌గా ఉండేది. ముఖ్యంగా, మహీధర రామమోహన్రావుగారు నాకు దేవుడిచ్చిన ‘మెంటార్’గా దొరికారు. ఆనాడు విశాలాంధ్ర డైలీకి ఎడిటర్ల ‘పంచక మండలి’ వుండేది. వర్కింగ్ ఎడిటర్ కాట్రగడ్డ రాజగోపాలరావా? ఔను. ఈ సంపాద వర్గంలో ఏటుకూరి బలరామమూర్తి, కంభంపాటి సత్యనారాయణ సభ్యులూ. ‘వి’ డైలీలో మా వాడు పిల్లల శీర్షికకి రాజపోషకుడు. అందరూ పరిచయమే. నేను మొదట్లో కలం చిందుల (శీర్షిక) కోసం రాసిన కవితలు తీసుకొని వెళ్లడం చదవడం చేశాను. అది మరుసటి ఆదివారం డైలీ లేదా వాహినీ, ప్రజాసేవ, లేకపోతే ప్రతిభ, దేనిలో ఒకదానిలో సొమ్ము అయిపోయేది కాని గ్లామర్ కావాలంటే కథే రాయాలి అనేవారు. కథ పత్రికలో వస్తే దాని మీద ప్రశంసల వర్షమే కురిసేది. పైగా, పాఠకుల గుండెల్లో నాటుకుపోయేది కథయే అనిపించింది. అక్కడ పదాల పొందిక, ఇక్కడ పాత్రల సజీవ సంభాషణలు ప్రాణం. ఇది ‘్ఛలెంజింగ్’ అనుకున్నాను. గోరాశాస్ర్తీ గారొచ్చారోసారి - కృష్ణానంద్ పేరుతో స్వతంత్రకి ‘స్కెచ్‌లు’ నేనే రాస్తున్నాను అని చెప్పాను. ‘స్కెచ్’కి కో.కు.గారు ‘గల్పిక’ అని పేరెట్టారు. ‘అడాప్ట్ ఇట్’ అన్నారు భుజం తట్టి. ఓకే అన్నా. ఇట్లా ఆ రోజు ఊళ్లోకి వచ్చిన సాహితీమూర్తులు ఎవరైనా మహీధర ఇంటికి వచ్చి విజయ సాహితి సమావేశంలో కాస్సేపు ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. అట్లా పెద్దాళ్ల పరిచయాలు పెరిగాయి. మహీధర రామ్మోహన్ గారు రాజకీయ నవల ‘రథచక్రాల’తో టాప్ పాపులర్ అయ్యారు. ఈ సమావేశాల రథానికి ఆయన ప్రోత్సాహమే ఇంధనం, చక్రం కూడా. ఆ వసారాలోని లాంతరే ఓ గ్యాసులైట్‌గా అనిపించేది. పోలవరపు శ్రీహరిరావు (అభిసారిక ఫేం) ఒక గొప్ప రచయితా కూడా. కోపి కొంచెం అంటే. కాని నా రాతి మేడ నవలను తెలుగు నవలా సాహిత్యంలో ఒక నూతన ప్రయోగం అని రివ్యూ (ఆంధ్రభూమి)లో రాశాడాయన. ఆయనా, ‘శ్రీవిరించి’ ఇద్దరూ - మంచి ఎనాలిసిస్ ఇచ్చేవారు. చిన్నతనం చేత ఒక్కోసారి వారి విమర్శలను వీళ్లు ‘ఉడుకుపోతు’లై పోయారు అనుకునేవాణ్ణి. డైరీలో అలా రాసుకున్నాను కాని నేను పూర్తిగా తప్పు అని ఆనక తెలుసుకున్నాను. మంచి విమర్శ ఒక అవార్డు లాంటిది. సరే. నా యూనివర్సిటీ నవలకి ‘వెలక్కాయంత రాతి గవ్వ’ అన్న పేరు మార్చి ‘ఖే సరా సరా’ అని పెట్టాను. సాపురాత స్పీడు అందుకుంది. విజయ సాహితిలో సీరియల్‌గా చదవడం మొదలెట్టాను. బోలెడు సిగ్గు. దీపం కాంతి బుక్ మీద పడేలాగా మొహం చాటేసి కూర్చుని చదివేవాణ్ణి. మర్నాడు విశాలాంధ్ర చిన్న వార్తగా వేసేది. పైవారం ఎంగేజ్‌మెంట్ కూడా. వారం వారం చదివే సీరియల్‌గా నా నవల ‘నిజంగా’ పేలింది. తొలి విద్యార్థి జీవిత నవలయే కాదు, తొలి శ్రవణ నవల కూడా అన్నారు. నాకు అమ్మలాంటి వారే పాల్గొన్న విద్యావంతులైన మహిళామణులు అందరూ. ఏటుకూరి వారి సతీమణి సీనియర్‌గారి సతీమణి ఇంకా, రాజమ్మగారు వగైరా - కుర్రవాడు చెడిపోతాడు - దిష్టి కూడాను’ అని హెచ్చరించారుట. మహీధర మాట. ధన్యోస్మి.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com