S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ కోర్టులో లొంగుబాటు

చిత్తూరు, నవంబర్ 30: సంచలనం సృష్టించిన మేయర్ దంపతుల హత్యలో ప్రధాన పాత్ర పోషించిన పి శ్రీరామచంద్రశేఖర్ అలియాస్ చింటూ (43) ఎట్టకేలకు సోమవారం చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. హత్య జరిగి 14 రోజులుగా పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకొని తిరిగిన ఇతను, తన అనుచరుల్లో ఇద్దరు మినహా మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తాను లొంగిపోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఇదే కేసు విషయమై సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్పీ విలేఖర్లతో నిర్వహిస్తున్న సమావేశ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఎస్పీ, డిఎస్పీ, స్పెషల్ బ్రాంచి డిఎస్పీలు ఉదయం 11 గంటల నుంచి 11.35 గంటల వరకు విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే అదే సమయంలో ఓ కారులో కోర్టుకు బయలుదేరిన చింటూ 11.43 నిమిషాలకు కోర్టు ముందు కారు దిగి తాపీగా నడుచుకుంటూ చిత్తూరు నాల్గవ అదనపు కోర్టులోకి వెళ్లి 11.45 నిమిషాలకు లొంగిపోయినట్లు ఓ కేసు విచారణ నిమిత్తం వచ్చి అక్కడే ఉన్న పలువురు తెలిపారు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన చింటూ ఒక చేతిలో గొడుగును, మరో చేతిలో కొన్ని కాగితాలు పట్టుకుని నింపాదిగా రావడం తాము చూశామని వారు తెలిపారు. ఇదిలాఉండగా ఈ నెల 17వ తేదీన మేయర్ దంపతుల హత్యలు జరిగిన సమయం, చింటూ కోర్టులో లొంగిపోయినసమయం ఒకటే కావడం గమనార్హం.
14 రోజుల పాటు రిమాండ్ విధింపు
కోర్టులో లొంగిపోయిన చింటూకు చిత్తూరు నాల్గవ సివిల్ కోర్టు న్యాయమూర్తి యుగంధర్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రిమాండ్ విధించే సమయంలో తనకు చిత్తూరు జిల్లాలోని కోర్టుల్లో రక్షణ ఉండదని, మరో జిల్లాకు తరలించాలని కోరడంతో కడప జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
వారం రోజుల పాటు పోలీసుల కస్టడీ : -
రిమాండ్ విధించిన చింటూ నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టాలని, ఆయనను రెండు వారాల పాటు తమ కస్టడీకి అప్పగించాలని చిత్తూరు పోలీసులు న్యాయమూర్తిని అభ్యర్థించారు. స్పందించిన న్యాయమూర్తి చింటూను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు పోలీసులు ప్రత్యేకంగా సిద్ధం చేసి ఉంచిన ఈచర్ వాహనంలో చింటూను చిత్తూరు పోలీసు కార్యాలయానికి తరలించారు. అయితే అప్పటికే కోర్టు ఎదుట బైఠాయించి చింటూను ఉరి తీయాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న కఠారి అనుచరులు కస్టడీ నిమిత్తం పోలీసు కార్యాలయానికి తీసుకెళ్తున్న వాహనంపై చెప్పులు విసిరి తమ కసిని తీర్చుకున్నారు.
జనసంద్రంగా మారిన చిత్తూరు కోర్టు ప్రాంగణం :
సంచలనం సృష్టించిన మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ కోర్టులో లొంగిపోయాడన్న సమాచారం విన్న ప్రజలు పెద్దఎత్తున చిత్తూరు కోర్టుకు చేరుకున్నారు. చిత్తూరు నగరం, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, పలు కేసుల విచారణ కోసం వచ్చిన వారితో కోర్టు ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది. ఈ క్రమంలో చింటూను చూసేందుకు ప్రజలందరూ ఒక్కసారిగా నాల్గవ అదనపు కోర్టు ముందుకు దూసుకురావడంతో తోపులాట జరిగింది. వీరిని చిత్తూరు డిఎస్పీ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిలువరించారు.

మేయర్ దంపతుల హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్
చిత్తూరు, నవంబర్ 30: చిత్తూరు నగర మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను చిత్తూరు పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసారు. సోమవారం స్థానిక పోలీస్ అతిథిగృహంలో ఎస్పీ విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి అరెస్ట్ అయిన వారి వివరాలను వెల్లడించారు. ఈ మేరకు కేసులో ఎ6 ముద్దాయి మురుగ (41), ఎ8 ముద్దాయి పరంధామ (30), ఎ9 ముద్దాయి హరిదాసు(44)లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మేయర్ దంపతుల హత్య కేసులో చింటూకు పై ముగ్గురు ముద్దాయిలు పరోక్షంగా సహాయ సహకారాలు అందచేసారని పేర్కొన్నారు. ఇందులో హరిదాసు గత కొన్ని సంవత్సరాల క్రితం కఠారి మోహన్ చికెన్ సెంటర్లు, ఇతర వ్యాపార వ్యవహారాలను చూసుకునేవాడన్నారు. కొన్ని ఆర్థిక కారణాల చేత ఆయనతో విభేదించి చింటూ వర్గంలో చేరాడన్నారు. మరో నిందితుడు అయిన పరంధామ చింటూకు సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీలు చూసేవాడని, కొన్ని ఆస్తులకు బినామిగా కూడా వ్యవహరిస్తున్నాడని తమ విచారణలో తేలిందన్నారు. మరో కీలక నిందితుడు అయిన మురుగ మేయర్ హత్య జరిగిన రోజు ఉదయం నుంచి హత్య పూర్తి అయ్యేంత వరకు చింటూకు సహకరిస్తూ కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. ఇటీవల తన డివిజన్ పరిధిలో పొక్లెయినర్‌తో చేస్తున్న పనులను కఠారి మోహన్ నిలిపించివేసాడని, అలా నిలిచిన పనిని చింటూ తన పొక్లెయినర్ పంపి పూర్తి చేయించాడని తెలిపారు. నాటి నుండి మురుగ మేయర్ దంపతులపై కక్ష పెంచుకున్నాడని వివరించారు. ఈ క్రమంలో నిందితులు అందరూ మేయర్ అనూరాధ, ఆమె భర్త మోహన్‌లను గువ్వ, గువ్వలోడు అనే కోడ్‌భాషతో సంభాషించుకునేవారని తమ విచారణలో తేలిందన్నారు. మేయర్ దంపతుల హత్య అనంతరం చింటూను మురుగ తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి వరకు సాగనంపి తిరిగి వచ్చాడని తెలిపారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకోనున్నట్లు వెల్లడించారు.
ప్రతి కార్యాలయంలోనూ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి
జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రభుత్వ, అనుబంధ కార్యాలయాల్లో తప్పనిసరిగా రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి కార్యాలయంలోను సిసి కెమేరాలు, వ్యక్తిగత రక్షక సిబ్బందిని నియమించుకునేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తమకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని, అందులో భాగంగా రౌడీయిజం చేసే వారి విషయాలను స్వయంగా తనకే ప్రజలు ఫోన్ చేసి చెప్పవచ్చని ఈ సందర్భంగా విలేఖర్లకు తెలిపారు.

తిరుపతి సమాచార కేంద్రంలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
* ఏడి వేధింపులే కారణమని బాధితుడు, ఉద్యోగుల ఆరోపణ
* గతంలో ఏడిపై ఓ ఉద్యోగి తిరగబడిన ఘటన
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 30: తిరుపతి ప్రభుత్వ సమాచార కేంద్రం ఇన్‌చార్జ్ ఏడిగా పనిచేస్తున్న మణిరాం నిరంతరం వేధిస్తున్నాడని మనస్తాపం చెందిన కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే రాంప్రసాద్ (22) సోమవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో సిబ్బంది ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జరిగింది. అక్కడ పనిచేసే సిబ్బందిలో అత్యధిక శాతం ఏడి వ్యవహరిస్తున్న తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో కూడా మణిరాం వేధిస్తున్నాడంటూ రసూల్ అనే అటెండర్ కూడా ఆయనపై దాడి చేసిన విషయం కూడా తాజాగా వెలుగుచూసింది. ఈ సంఘటనపై మణిరాంను వివరణ కోరినప్పుడు, తానెవరినీ వేధించట్లేదని, విధులు సక్రమంగా నిర్వహించాలని మాత్రమే హెచ్చరిస్తున్నానన్నారు. ఇందులో భాగంగానే తాను రాంప్రసాద్‌కు మెమో ఇచ్చినట్లు స్పష్టం చేశారు. పాత్రికేయుల పేరుతో బిల్లులు స్వాహా చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా తాను ఎప్పుడూ అలా చేయలేదని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఎస్‌ఐసిలో రాంప్రసాద్ గత మూడు సంవత్సరాలకు పైగా అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అధికారులు చెప్పిన ప్రకారం సక్రమంగా పనిచేసేవాడని గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు అభినందించారు. ఇటీవల ఏడిగా పనిచేస్తున్న చిన్న రెడ్డెన్న గత రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. దీంతో 2013 ఫిబ్రవరిలో తిరుమల ఏడిగా నియమితులైన మణిరాంకు తిరుపతి ఏడి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు డిడి బాధ్యతలను కూడా మణిరాంకు అప్పగించారు. ఈక్రమంలో జిల్లా సమాచార కేంద్రానికి సంబంధించి మణిరాం అధికార పరిధిలోకి వచ్చాయి. తిరుపతిలో ఉన్న సిబ్బందిని మణిరాం వేధిస్తున్నాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తప్పుచేయక పోయినా వేధింపుధోరణితో తనకు మెమో ఇచ్చాడని మనస్తాపం చెందిన రాంప్రసాద్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధుల్లో ఉన్న అటెండర్ అనిల్, రవి వెంటనే స్పందించి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ తాను ఏడి వేధింపులు భరించలేనని కన్నీరు మున్నీరుగా విలపించాడు. తండ్రి మరణంతో ఎస్‌ఐసిలో అటెండర్ ఉద్యోగం పొంది తల్లిని పోషించుకుంటున్నానని, 24 గంటల పనిచేస్తున్నా ఏడి వేధిస్తున్నాడని తమతో వాపోయాడని ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తం మీద సిబ్బంది చొరవతో ప్రాణపాయం తప్పినట్లయింది. ఎస్‌ఐసి చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని, ఏడి వేధింపులు తాము కూడా భరించలేకపోతున్నామని సిబ్బంది అన్నారు. వాస్తవానికి ఏడి వేధింపులు భరించలేక తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అనిల్ అనే అటెండర్ కూడా వాపోయాడు. చివరకు మరుగుదొడ్లకు కూడా తాళాలు వేసుకుని వెళతాడని సిబ్బంది ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌తో తాను సన్నిహితంగా ఉంటానని, తనను ఎవరూ ఏమీ చేసుకోలేరని బహిరంగంగానే ధీమా వ్యక్తం చేస్తుంటాడని, చిరు ఉద్యోగుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం అధికారహోదాలో ఉన్న వ్యక్తికి మంచిదికాదని అంటున్నారు. ఏదేమైనా ఏడి తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
* మాజీ ఎంపి చింతామోహన్ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 30: రాయలసీమ జిల్లాల సమగ్రాభివృద్ధిలో భాగంగా తిరుపతి కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జోరువానలో తిరుపతి కోర్టు ఆవరణలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి లక్నో రాజధానిగా ఉన్నప్పటికి ఆ రాష్ట్రంలో అల్హాబాద్‌లో హైకోర్టు ఉందని, కేరళ రాష్ట్రంలో త్రివేండ్రం రాజధానిగా ఉండగా, కొచ్చిన్‌లో హైకోర్టు నడుస్తోందని తెలిపారు. అదే తరహాలో నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ తుళ్లూరు కేంద్రంగా అమరావతి నూతన రాజధాని ఏర్పాటైన నేపధ్యంలో తిరుపతి కేంద్రంగా రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తిరుపతి పుణ్యక్షేత్రం సుమారు 63 సంవత్సరాల క్రితమే రాజధాని కావాలసి ఉందని, నాటి పెద్ద మనుషుల కారణంగా కర్నూలుకు తరలివెళ్లిందన్నారు. తాజాగా విభజన నేపధ్యంలో తిరుపతి రాజధాని అయ్యే అవకాశం ఉంటే గుంటూరుకి తరలించారన్నారు. 135మంది దళితులను ఒకేసారి ఊచకోతకోసి వారి తలలను వేలాడదీసిన ప్రాంతంగా తుళ్లూరు చరిత్రకెక్కిందని గుర్తు చేశారు. ఈప్రాంతంలో కాలుమోపిన ఎన్టీఆర్, నాదెండ్ల తదితరులు తమ పదవులను కోల్పోయారన్నారు. శపించబడ్డ ప్రాంతంగా చరిత్రకెక్కిన తుళ్లురును రాజధాని ప్రాంతంగా ఎంపిక చేయడం మంచిది కాదన్నారు. యుపిఏ ప్రభుత్వం 120 కోట్లతో తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావించి పునాదిరాయి వేస్తే ఆ ఆసుపత్రిని కూడా గుంటూరుకి తరలించాలని చూస్తున్నారన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదనను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎర్రచందనం అక్రమరవాణా, హత్యలు, దోపిడీలు, చోరీలు వంటి అసాంఘిక కార్యక్రమాలను నివారించవచ్చన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తే అక్కడ న్యాయమూర్తులకు అవసరమైన వౌలిక వసతులు కూడా తిరుపతిలో అందుబాటులో ఉన్న విషయాన్ని ఈసందర్భంగా ప్రస్తావించారు. చింతామోహన్ చేపట్టిన ఈ దీక్షకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, న్యాయవాదులు ముక్కుసత్యవంతుడు, రవి, రాజగోపాల్, గొట్టు సుబ్రమణ్యం, ఇరుగు గురుస్వామి, రాజమాణిక్యం, లక్ష్మణ ఆచారి, క్రాంతిచైతన్య, సూరాసాయిరెడ్డి, విజయ్‌కుమార్, చెరువు ఉదయ్‌కుమార్, ఆనంద్, పిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీదేవి, నాయకులు ప్రభాకర్, డాక్టర్ పట్ట్భా, సుబ్రమణ్యం, శాంతి, సావిత్రమ్మ, అమ్ములమ్మ, తేజ, చాముండి, గుర్రమ్మ తదితరులు మద్దతు తెలిపారు.

దళితులకు రక్షణ కల్పించలేని మంత్రి రావెల రాజీనామా చేయాలి
* మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య డిమాండ్
తిరుపతి, నవంబర్ 30: రాష్ట్రంలో దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదని, ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి రావెల కిశోర్‌బాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. రావెల కిషోర్‌బాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని తెలిపారు. తిరుపతిలోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహం నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థినులను నలుగురు యువకులు నిర్బంధించడం ఇందుకు పరాకాష్ట అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 13 సంఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేయాలన్నారు. దళితుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారి సంఘాలు, ప్రభుత్వ అధికారులు మిలాకతై ఆక్రమించుకుంటున్నారన్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి దళితులను వారి భూముల నుంచి తరిమేస్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని సంక్షేమ గృహం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమై, వరంగల్‌లో నిర్బంధానికి గురైన సంఘటనలో సాంఘిక సంక్షేమశాఖ డిడిని వెంటనే సస్పెండ్ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సిఎంకు, డిజిపికి ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్న మాలమహానాడు నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, బెదిరించడం దారుణమన్నారు. వెంటనే ఆ కేసులు ఎత్తివేయాలని, ఉద్యమకారులకు రక్షణ కల్పించాలని మాలమహానాడు డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దళితులకు శ్మశాన స్థలాలు కూడా లేవని, వెంటనే శ్మశాన స్థలాలు కేటాయించాలని, ఉత్తరాంధ్రలో బాక్సైట్ తవ్వకాలను నిషేధిస్తూ జిఒ నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని చెంగయ్య డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఓబులేసు, ప్రధాన కార్యదర్శి లేడి అబ్బారావు, కార్యదర్శి బేడాం సుబ్బరాయుడు, వై.ప్రసాదరావు, రవీంద్ర, కొప్పాల మురళి, పంచా రాంబాబు, వెంకటముని, సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సెరికల్చర్ ఏడి ఆత్మహత్యాయత్నం
* ఉన్నతాధికారుల వేధింపులే కారణం
బి.కొత్తకోట, నవంబర్ 30: హర్సిలీహిల్స్‌లో అనంతపురం సెరికల్చర్ ఏడి భగీరధరెడ్డి సోమవారం మధ్యాహ్నం గాలీబండ లోయలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం సెరికల్చర్ ఏడిగా పనిచేస్తున్న భగీరధరెడ్డి సోమవారం మధ్యాహ్నం వేసవి విడిది అయిన హార్సిలీహిల్స్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 33 సంవత్సరాలు తర్వాత పదోన్నతులు కల్పిస్తున్న నేపథ్యంలో భగీరధరెడ్డికి పదోన్నతి విషయంలో ఆ శాఖ అధికారులతో విభేదాలు ఏర్పడ్డాయి. అయితే పదోన్నతి కోసం నిరీక్షిస్తున్న భగీరధరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. భగీరధరెడ్డి పదోన్నతికి అర్హత ఉన్నప్పటికీ కొందరు అధికారులు కల్పించడం లేదని మానసిన వేదనకు గురయ్యాడు. తన శాఖ కార్యాలయానికి ఆదివారం రెండు రోజులు సెలవు కావాలని లేఖ రాసి వచ్చినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం గాలిబండపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే చెట్టుకు తగులుకోవడంతో ప్రాణభయంతో కేకలు వేశాడు. గమనించిన స్థానికులు, హోంగార్డు ఫయాజ్, టూరిజం మహేంద్ర, స్థానికులు సంతోష్ తదితరులు కలిసి రక్షించారు.

బావిలో జారి పడి రైతు మృతి
పూతలపట్టు, నవంబర్ 30 : బావిలో మునిగిన మోటారు కోసం దిగిన రైతు బావిలో జారిపడి మృతి చెందిన సంఘటన మూర్తిగానూరులో చోటుచేసుకుంది. ఎస్సై మురళీమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వావిల్‌తోట పంచాయతీలోని మూర్తిగానూరు గ్రామానికి చెందిన వాసు (42) ఆదివారం అదే గ్రామానికి చెందిన రైతు బావిలో మునిగిపోయిన మోటార్‌ను దారం కట్టి లాగేందుకు ప్రయత్నించాడు. అయితే జారిపడి బావిలో ఉన్న బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. బావిలో పడినట్లు గుర్తించిన గ్రామస్థులు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని బావిలో ఉన్న నీటిని బయటకు వదిలారు. రోప్‌ల ద్వారా బావిలోకి దిగిన సిబ్బంది బురదలో కూరుకుపోయిన వాసు మృతదేహాన్ని బయటికి తీశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చింటూను కఠినంగా శిక్షించాలంటూ కఠారి అనుచరుల ధర్నా
* కోర్టు ఎదుట, గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో
చిత్తూరు, నవంబర్ 30 : చిత్తూరు నగర మేయర్ దంపతులు కఠారి అనురాధ, కఠారి మోహన్‌లను హత్య చేయడంలోప్రముఖ పాత్ర పోషించాడని భావిస్తున్న చింటూను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కఠారి అనుచరులు, బంధువులు, అభిమానులు సోమవారం చిత్తూరు కోర్టు ఎదుట, నగరంలోని గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. చింటూ చిత్తూరు కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడని తెలుసుకున్న కఠారి కుమార్తె హేమలత, ఆమె బంధువులు, అనుచరులు పెద్దఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. అప్పటికే చింటూ న్యాయమూర్తి వద్ద ఉండటంతో కోపోద్రిక్తులైన వారు కోర్టులోకి దూసుకొచ్చి, చింటూను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. అలా కుదరని పక్షంలో బహిరంగంగా ఉరి తీయడం, లేదా ఎన్‌కౌంటర్ వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆవేశంగా ఊగిపోయారు. పరిస్థితులు చేజారిపోతుండటంతో డిఎస్పీ లక్ష్మీనాయుడు కలగజేసుకుని ఆందోళనకారులను బయటకు పంపించి కోర్టు ప్రధాన గేటును మూయించి వేశారు. అప్పటికీ శాంతించని కఠారి అనుచరవర్గం కోర్టు ముందే బైఠాయించి దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. ఈ క్రమంలో చిత్తూరు-తిరుపతి రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మరో రహదారిపై వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద ఆందోళన:
కస్టడీ నిమిత్తం చింటూను కోర్టు నుంచి తీసుకెళ్లిన అనంతరం కఠారి వర్గీయులు స్థానిక గాంధీ సర్కిల్ వద్ద మరోసారి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం ర్యాలీగా ఎస్పీ బంగ్లాకు వెళ్లి చింటూకు తగు శిక్ష పడేలా చూడాలని ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.

తిరుమలలో భారీ వర్షం
* జలమయమైన లోతట్టు ప్రాంతాలు
* పెరిగిన చలి తీవ్రత
* ఇబ్బందులు పడుతున్న భక్తులు
తిరుమల, నవంబర్ 30: తిరుమలలో సోమవారం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి ఓ మోస్తరుగా వర్షం ప్రారంభమై రానురాను బలపడుతూ సోమవారం అర్ధరాత్రి వరకు జోరున వర్షం కురిసింది. దీనికి తోడు ఈదురుగాలులు వీచడంతో చలితీవ్రత పెరిగి, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా తిరుమల్లోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో భక్తులు రోడ్డు దాటేందుకు వాహన రాకపోకలు సాగేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలికి చేరే భక్తులు వర్షంలో తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది భక్తులు వర్షం కారణంగా గదులకే పరిమితమయ్యారు. తిరుమలను పొగమంచు కప్పేయడంతో ఘాట్ రోడ్డులో వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్విరామంగా వర్షం కురుస్తుండటంతో వాణిజ్య సముదాయాల వెలుపల ఉన్న దుకాణాలన్నీ మూతపడ్డాయి. తిరుమల రెండో కనుమ మార్గంలో వర్షం కారణంగా మరోసారి బండరాళ్లు జారిపడవచ్చని భావించిన టిటిడి ప్రతి కిలోమీటరుకు ఇద్దరు సిబ్బందిని నియమించి భక్తులను అప్రమత్తం చేస్తూ వాహనాలను అనుమతిస్తున్నారు.

స్థానిక ఆలయాల్లో కొప్పెర హుండీలు ఏర్పాటు చేయాలి
* అధికారులకు టిటిడి ఇఓ ఆదేశం
తిరుపతి, నవంబర్ 30: తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో టిటిడి పరిధిలోని అన్ని ఆలయాల్లో 2016 జనవరి 1వ తేదీ నుంచి కొప్పెర హుండీలు ఏర్పాటు చేయాలని టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడి పరిపాలనాభవనంలో సీనియర్ అధికారులతో సోమవారం ఇఒ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఇల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిపై వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించుకొని పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుమల్లోని కల్యాణకట్టలు, సత్రాలు, పిఏసిల్లో గీజర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేలూరులోని టిటిడి పాఠశాలకు సంబంధించి మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. టిటిడిలో ఎల్‌ఇడి బల్పుల వినియోగానికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, సలహాదారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెఇఒ పోల భాస్కర్, సివిఎస్‌ఓ డి.నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.